అరుంధతీరాయ్: 'బీజేపీ ఒక నియంత పార్టీ, మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఫాసిజం వైపు నడిపిస్తోంది'

భారతీయ ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్

భారతీయ ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ 'ద వైర్' న్యూస్ వెబ్‌సైట్ కోసం కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు.

హిందూ జాతీయవాదం అనే ఆలోచన విభజనపూర్వకమైనదని, దీన్ని దేశప్రజలు విజయవంతం కానివ్వరని ఆమె అన్నారు.

ఈ ఇంటర్వ్యూలో అరుంధతీ రాయ్, బీజేపీని నియంత పార్టీగా అభివర్ణించారు. ఏదో ఒక రోజు ఈ దేశ ప్రజలు, బీజేపీని వ్యతిరేకిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

''భారత ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఈ చీకటి అగాధం నుంచి దేశం బయటపడుతుందని నేను నమ్ముతున్నా'' అని ఆమె వ్యాఖ్యానించారు.

పారిశ్రామికవేత్తలకు మోదీ అభిమాన నాయకుడని ఆమె చెప్పారు. ''మోదీకి ఇష్టమైన పారిశ్రామికవేత్తల్లో ఒకరు, సంపద విషయంలో మరో పారిశ్రామికవేత్తను వెనక్కి నెట్టారు. అదానీ సామ్రాజ్య విలువ 88 బిలియన్ డాలర్లు (రూ. 6.63లక్షల కోట్లు). అంబానీ ఆస్తుల విలువ బహుశా 87 బిలియన్ డాలర్లు (రూ. 6.55 లక్షల కోట్లు). గత ఏడాది కాలంలో భారత ప్రజలంతా పేదరికం, ఆకలి, నిరుద్యోగంతో సతమతవుతుంటే... అదానీ మాత్రం సంవత్సరకాలంలో 51 బిలియన్ డాలర్లు (రూ. 3.84 లక్షల కోట్లు) ఆర్జించారు'' అని ఆమె వివరించారు.

''మోదీ వచ్చాక, దేశంలో అంతరాలు బాగా పెరిగిపోయాయి. భారత జీడీపీలోని 25 శాతం సంపద, దేశంలోని కేవలం 100 మంది ప్రజల వద్దే ఉంది. 'దేశాన్ని నలుగురే నడిపిస్తున్నారు. అందులో ఇద్దరు అమ్ముతున్నారు, మరో ఇద్దరు కొంటున్నారు. ఈ నలుగురూ గుజరాత్‌కు చెందినవారే' అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక రైతు సరిగ్గా వ్యాఖ్యానించారు'' అని ఆమె తెలిపారు.

''నౌకాశ్రయాలు, గనులు, మీడియా, ఇంటర్నెట్, పెట్రోకెమికల్స్ ఇలా చాలా అంశాలపై అంబానీ, అదానీలే గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు. రాహుల్ గాంధీ... ధనిక భారత్, పేద భారత్ అంటూ మాట్లాడతారు. ఓవైసీ... భారత్ పట్ల తన ప్రేమ, ద్వేషం గురించి చర్చిస్తారు. కానీ, ఈ గుత్తాధిపత్యం గురించి మాట్లాడరు'' అని ఆమె వివరించారు.

అరుంధతీరాయ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను పరిగణించడాన్ని అరుంధతీ రాయ్ ప్రశ్నించారు. ''మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన న్యాయ స్థానాలు, మీడియా, నిఘా సంస్థలు, సైన్యం, విద్యాసంస్థలు ఇలా ప్రతీదాంట్లో ఎక్కడో ఒకచోట హిందు జాతీయవాద భావజాలం ప్రభావం కనబడుతోంది.''

''పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), వ్యవసాయ చట్టాలు, ఆర్టికల్ 370 రద్దు... ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలు. వీటివల్ల లక్షలాది ప్రజల జీవితాలు ప్రభావితమయ్యాయి.''

''ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో)ను ప్రధాని దుర్వినియోగం చేస్తున్నారు. దేశ ప్రజలను బీజేపీ అయోమయంలోకి నెట్టినట్లు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలంతా దేశమంటే, బీజేపీ అని అనుకుంటున్నారు. బీజేపీని నిందిస్తే దేశాన్ని విమర్శించినట్లు భావిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. దేశంలో నెమ్మదిగా ప్రజాస్వామ్యం నాశనం అవుతోంది'' అని ఆమె చెప్పుకొచ్చారు.

భారత్, సెక్యులర్ రాజ్యం నుంచి హిందూ దేశంగా మారుతుందా?

ఈ ప్రశ్నకు అరుంధతీ రాయ్, ''చాలా మతపరమైన కార్యక్రమాల్లో ముస్లింలపై మారణహోమానికి హిందువులంతా ఆయుధాలు పట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపునిచ్చినవారిలో ప్రధాన నిందితుడైన యతీ నరసింహానందకు ఇటీవలే బెయిల్ కూడా లభించింది. ప్రభుత్వాలు మాత్రమే కాదు న్యాయస్థానాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ఈ దేశంలో కవులు, రచయితలు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు జైల్లోనే మగ్గుతారు. కానీ బహిరంగంగా మారణహోమానికి పిలుపునిచ్చేవారికి మాత్రం బెయిల్ దొరుకుతుంది'' అని అన్నారు.

అరుంధతీరాయ్

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు నిర్ణయాలను ప్రశ్నించిన అరుంధతి, ''ఇప్పుడు హిజాబ్ వివాదం గురించి చూద్దాం. ఈ విషయంలో కోర్టులు కొన్ని రోజులు హిందువులకు అనుకూలంగానే వ్యవహరించాయి. తరగతి గదుల్లో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించాలా? వద్దా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ ప్రధానమంత్రి, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి మెడ చుట్టూ కాషాయ వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నారు? ఈ ప్రభుత్వం, దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే దిశగా తీసుకెళ్తోంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు'' అని ఆమె అన్నారు.

మూక దాడుల గురించి మాట్లాడిన ఆమె ఈ విషయంలో మనం అమానవీయంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఇలాంటి కులవ్యవస్థ ఉన్న ప్రతీ దేశాన్ని అమానవీయ దేశంగానే పరిగణించాలి అని చెప్పారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న చోట హింసకు తావిచ్చినట్లే అని పేర్కొన్నారు.

నియంతృత్వ దేశంగా భారత్ మారిందా?

''భారత్, ఫాసిస్ట్ దేశంగా మారిందని నేను అనట్లేదు. కానీ ఈ ప్రభుత్వం, దేశాన్ని ఫాసిజం వైపు నడిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఇదే దిశలో నడుస్తోంది'' అని ఆమె చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

'' ఈ ప్రక్రియలో వారు విజయవంతం అవుతారని నేను అనుకోవట్లేదు. కానీ మనం ఈ దశను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మన దేశం, ఫాసిస్ట్ దేశంగా మారే దశలోనే ఉంది. కానీ చివరకు దేశ ప్రజలంతా కలిసి ఈ ప్రయోగాన్ని విఫలం చేస్తారు. ఇప్పటికంటే ఈ భయం రెండేళ్ల క్రితం మరింత ఎక్కువగా ఉండేది. కానీ, రైతుల ఆందోళన వంటి పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా భారత ప్రజలు పోరాడుతున్నారు.''

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

''నియంత రాజ్యంగా మారే ప్రమాదం కచ్చితంగా తగ్గింది. కానీ 2022 ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం... మతహింసను ప్రోత్సహించడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, గెలిచిన ప్రభుత్వం మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మోదీ మెరుపులు ఏదో ఒకరోజు చీకటిలోకి వెళ్తాయని నేను అనుకుంటున్నా. అది ఏ రోజైనా జరుగవచ్చు'' అని ఆమె వివరించారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)