ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య: ఇంటర్వ్యూ మధ్యలో మైక్ తీసేశారు.. రికార్డింగ్ ఆపేయమన్నారు..

కేశవ్ ప్రశాద్ మౌర్య

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించారని ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బీబీసీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో భిన్న అంశాలపై రిపోర్టర్ అనంత్ ఝన్నేతో మౌర్య మాట్లాడారు.

హరిద్వార్‌లో ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించినప్పుడు మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్వ్యూను ఆయన మధ్యలోనే ఆపేశారు. అంతేకాదు ఈ వీడియోను డిలీట్ చేయించాలని భద్రతా సిబ్బందికి ఆయన సూచించారు.

వీడియో క్యాప్షన్, యూపీ డిప్యూటీ సీఎం: ఇంటర్వ్యూ మధ్యలో మైక్ తీసేశారు.. రికార్డింగ్ ఆపేయమన్నారు..

ప్రతిపక్షమే లక్ష్యంగా..

ఇంటర్వ్యూ మధ్యలో ఆపేయడానికి ముందు, కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

అనంత్: బీజేపీ తరహాలో ఇతర పార్టీలకి సరిపడా నిధులు రావడం లేదు. ఎన్నికల సంఘం తమకు డబ్బులు ఇవ్వాలని ఎస్పీ నాయకుడు అఖిలేశ్ సింగ్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు. దీనిపై మీరేమంటారు?

మౌర్య: 2017లానే 2022లోనూ సమాజ్ వాదీ పార్టీకి ఓటమి తప్పదు. గూండా రాజ్, అల్లర్ల రాజ్, మాఫియా రాజ్, అవినీతిని ప్రజలు ఎన్నటికీ సహించరు. వారికి ఓటమి ముందే రాసిపెట్టి ఉంది. అందుకే ముందుగానే ధైర్యం చేసి ఆయన ఓటమిని అంగీకరించారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి

అనంత్: మాఫియా గురించి మీరు ప్రచారంలో చెబుతున్నారు. ముఖ్యంగా అతీఖ్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీ, ఆజం ఖాన్‌ల గురించి చెబుతున్నారు. కానీ వికాస్ దూబే గురించి ఎందుకు మాట్లాడటం లేదు?

మౌర్య: సాధారణ ప్రజలు ఎవరిని చూసి భయపడుతున్నారు? రాజకీయాల్లో నేర చరితులు అంటే ఎవరి పేర్లు గుర్తుకు వస్తాయి? మీరే చెప్పండి. మీరు చెబుతున్న వికాస్ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆ ప్రశ్నకు పోలీసులే సమాధానం ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, మత మార్పిళ్లకు కారణాలు ఏమిటి? కర్ణాటక బిల్లుపై వివాదం ఎందుకు?

అనంత్: ఈ సారి అఖిలేశ్ యాదవ్ మథుర నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు?

మౌర్య: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతోంది. దీని గురించి మాట్లాడాలని మేం విపక్షాలకు పిలుపునిస్తున్నాం. కానీ వారు పారిపోతున్నారు. జనాలకు ముఖాలు కూడా చూపించలేకపోతున్నారు. ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎవరినీ వదిలిపెట్టరు.

ధర్మ సంసద్

ఫొటో సోర్స్, BBC/VARSHA SINGH

ధర్మ సంసద్‌పై ప్రశ్న, ఆగ్రహం

అనంత్: హరిద్వార్‌లో ఇటీవల జరిగిన ధర్మ సంసద్ వేదిక నుంచి కొందరు హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. అలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ప్రోత్సహించడంతో వారు మరింత ఎక్కువగా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మేం ఒక మతానికి వ్యతిరేకం కాదని మీరు ప్రజలకు హామీ ఇవొచ్చు కదా?

మౌర్య: బీజేపీ ఎవరికీ ఎలాంటి సర్టిఫికేట్లూ ఇవ్వదు. మేం సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సూత్రాన్ని నమ్ముతాం. ధర్మాచార్యులు తమ భావాలను తాము వ్యక్తం చేయొచ్చు. ఇతర మతాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు?

జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దుకు ముందు, తర్వాత వలసలు.. లాంటి అంశాలను మీరు ఎందుకు అడగరు? ప్రశ్నలన్నీ ఒకవైపు మాత్రమే ఉండకూడదు. సంసద్ సభ.. బీజేపీ సభ కాదు. అది మతాచార్యుల సభ. వారు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది వారి ఇష్టం.

వీడియో క్యాప్షన్, సెక్యులరిజం అంటే.. అన్ని మతాలను గౌరవించడం, అన్ని మతాలకు సమదూరం పాటించడం

అనంత్: ఘాజియాబాద్‌కు చెందిన యతి నరసింహానంద్, అలీగఢ్‌కు చెందిన అన్నపూర్ణ లాంటి వారు ఒకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కదా? ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు?

మౌర్య: ఎవరూ ఎలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించరు. ఏది మంచి? ఏది చెడు? ఆ వేదికపై మాట్లాడటానికి ఏది తగినది? వారే చెప్పాలి.

మీరు అసలు రాజకీయాలతో సంబంధమున్న ప్రశ్నలే అడగడం లేదు. మనం ధర్మాచార్యుల గురించి మాట్లాడేటప్పుడు కేవలం హిందూ గురువుల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం. అక్కడ ముస్లిం, క్రైస్తవ గురువులు కూడా ఉంటారు కదా?

వారు ఏం అన్నారో తెలుసుకొని ప్రశ్నలు అడగండి. మీరు సబ్జెక్టు ముందే చెప్పివుంటే, తగిన సమాధానాలు సిద్ధంచేసుకొని చెప్పేవాణ్ని.

కేశవ్ ప్రశాద్ మౌర్య

భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ విషయంలో దేశ ద్రోహం కేసుల గురించి రిపోర్టర్ అనంత్ ప్రశ్నిస్తుండగానే మౌర్య మధ్యలో కలగజేసుకుని సమాధానం ఇచ్చారు.

‘‘దేశ ద్రోహం పూర్తిగా భిన్నమైనది. దాన్ని ప్రాథమిక హక్కులతో ముడిపెట్టకండి. పాకిస్తాన్‌లో ఉంటూ ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎవరూ వదిలిపెట్టరు. అతడిని దేశ వ్యతిరేకి అనే పిలుస్తారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని మౌర్య వ్యాఖ్యానించారు.

దాదాపు పది నిమిషాల పాటు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అనంతరం కేవలం ఎన్నికలకు సంబంధించి మాత్రమే ప్రశ్నలు అడగాలని రిపోర్టర్‌కు మౌర్య సూచించారు.

అయితే, ఈ అంశాలు కూడా ఎన్నికలకు సంబంధించినవేనని రిపోర్టర్ అనడంతో మౌర్యకు కోపం వచ్చింది.

‘‘మీరు అసలు జర్నలిస్టులానే మాట్లాడటం లేదు. వేరొకరి ఏజెంట్‌లా మాట్లాడుతున్నారు’’ అని మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం మాట్లాడటం ఆపేసి, తన జాకెట్‌పై ఉన్న మైక్‌ను తీసేశారు. కెమెరాను వెంటనే ఆపేయాలని అన్నారు.

బీబీసీ రిపోర్టర్ కోవిడ్ మాస్క్‌ను కూడా మౌర్య పీకేశారు. భద్రతా సిబ్బందిని పిలిచి వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయించాలని ఆదేశించారు.

భద్రతా సిబ్బంది బలవంతంగా ఆ వీడియో డిలీట్ చేశారు. అయితే, ఆ డిలీట్ చేసిన వీడియోను కెమెరామెన్ సంపాదించగలిగారు.

ఆ వీడియోలో మౌర్య తన జాకెట్‌ను తీసేసి, కెమెరా స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పడం కనిపిస్తోంది.

ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రికి బీబీసీ ఫిర్యాదు చేసింది. ఈ వార్త రాసే సమయానికి వారి నుంచి మాకు ఎలాంటి స్పందనా రాలేదు.

వీడియో క్యాప్షన్, ఈ కులం ఏంటి? ఈ మతం ఏంటి? వీటిని వదిలేసుకుంటే పోలా.. అని మీకెప్పుడైనా అనిపించిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)