కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?

కొత్త సంవత్సరానికి ఒమిక్రాన్ భయం స్వాగతం పలుకుతుందా?

ఫొటో సోర్స్, UMA SHANKAR SHARMA/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, కొత్త సంవత్సరానికి ఒమిక్రాన్ భయం స్వాగతం పలుకుతుందా?
    • రచయిత, చంద్రకాంత్ లహరియా
    • హోదా, బీబీసీ కోసం....

2021 సంవత్సరం ప్రారంభం నాటికి ఇండియాలో కోవిడ్-19 రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2020 ఆగస్టు, సెప్టెంబరులో వచ్చిన మొదటి వేవ్‌ను ప్రజలు దాదాపు మర్చిపోతున్న సమయం అది.

'మేం కోవిడ్ మీద విజయం సాధించాం' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహంగా ప్రకటనలు చేస్తున్నాయి. జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కాకపోతే వ్యాక్సీన్‌లు తీసుకోవడంలో మొదట్లో అంతగా ఉత్సాహం కనిపించలేదు.

2021, మార్చి 31 నాటికి, దేశంలో ఇచ్చిన వ్యాక్సీన్‌ల కంటే, వ్యాక్సీన్ ఫ్రెండ్షిప్ స్కీమ్ కింద విదేశాలకు పంపించినవే ఎక్కువ.

మార్చి 2021 నాటికి, కోవిడ్-19 కొత్త కేసులు పెరగడం మొదలుపెట్టాయి. కోవిడ్-19 రెండో వేవ్ గురించి ప్రజారోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మార్చి 24 నాటికి, భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్‌గా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలోనే డెల్టా వేరియంట్ పేరు బయటకు వచ్చింది.

ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు?

కానీ, ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీలు కొనసాగాయి. హరిద్వార్‌లో మహాకుంభ్ జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో దేశంలో రోజువారీ కొత్త కేసులు మొదటి వేవ్‌లో నమోదైన గరిష్ట స్థాయిలను మించిపోయాయి. కానీ, రాజకీయ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలు ఆగలేదు.

ఏప్రిల్ 12న మహాకుంబ్ షాహిస్నాన్‌లో లక్షలమంది సామూహిక స్నానాలు చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు.

ఏప్రిల్ చివరి వారం వచ్చే సరికి పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కోట్లమందికి జీవితాంతం మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు మిగిలాయి.

స్కూళ్లు లేకపోవడం పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, ANANT KUMAR / EYEEM/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, స్కూళ్లు లేకపోవడం పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

డెల్టా విధ్వంసం

అస్వస్థతకు గురైన బంధువుల కోసం ఆసుపత్రుల్లో బెడ్‌‌లు సంపాదించేందుకు జనం పరుగులు పెడుతున్న దృశ్యాలు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూలో నిల్చున్న బాధితుల బంధువులు, స్నేహితుల చిత్రాలు, బ్లాక్‌ మార్కెట్‌లో మందుల అమ్మకాల వార్తలు అలజడి రేపాయి.

దహనం చేయడానికి స్థలం, కట్టెలు కూడా దొరకని దారుణ పరిస్థితులు శ్మశాన వాటికల్లో కనిపించాయి. అంత్యక్రియలు జరగడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. చితిని పేర్చే స్థలం లేక పార్కింగ్ ప్లేసులను కూడా ఉపయోగించాల్సి వచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలలో సాధారణం కంటే ఎక్కువ మరణాలను రిపోర్ట్ చేయని నగరాలు, పట్టణాలు, ఆఖరికి గ్రామాలు కూడా లేవు.

జూలై 2021 మధ్యలో నాలుగో జాతీయ సెరో సర్వే విడుదలైనప్పుడు భారతదేశంలో 67.8 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని, వారిలో చాలామంది కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకినవారేనని తేలింది.

అంతకు ముందు నిర్వహించిన మూడో సెరో-సర్వేలో దాదాపు 24 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.

భారతదేశంలోని 44% మంది ప్రజలు అంటే 2021 మొదటి ఆరు నెలల్లో దాదాపు 60 కోట్లమంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో ఎక్కువమందికి ఏప్రిల్, మే నెలల్లోనే వ్యాధి సోకింది. కొన్ని రాష్ట్రాల్లో జనాభాలోని 70-80 శాతం మందికి వ్యాధి సోకినట్లు తేలింది.

కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య దాదాపు 4,71,000 అని అధికారికంగా చెబుతున్నా, 20-50 లక్షల మంది మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వరంగల్: తరగతి గదిలో పీరియడ్స్ పాఠాలు బోధిస్తున్న టీచర్
ఏప్రిల్ మే నెలల్లో వచ్చిన సెకండ్ వేవ్ ప్రతి భారతీయుడి జీవితాన్ని ప్రభావితం చేసింది

ఫొటో సోర్స్, MUDACOM/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ మే నెలల్లో వచ్చిన సెకండ్ వేవ్ ప్రతి భారతీయుడి జీవితాన్ని ప్రభావితం చేసింది

శవాల కుప్పలు

గణాంకాలు కొన్నిసార్లు మానవీయ కోణాలను బైటపెట్టడంలో విఫలమవుతాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగానదిలో తేలియాడుతున్న మృతదేహాలు, ప్రయాగ్‌రాజ్‌లో ఇసుకలో పాతిపెట్టిన మృతదేహాలు, సెకండ్ వేక్ భయానక వాస్తవాలకు ఉదాహరణ.

భారతదేశంలోని దాదాపు ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోవిడ్-19 సెకండ్ వేవ్‌కు ప్రభావితమయ్యారు. ప్రతి కుటుంబం సొంతవారినో, సమీప బంధువులనో, స్నేహితులనో కోల్పోయింది.

ఏడాది చివరికి వచ్చేసరికి కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ వేగం పెరిగింది.

వయోజనులో సుమారు 10 శాతం మంది కనీసం ఒక డోసు టీకాను పొందారు. దేశంలో కోవిడ్ -19 ఇక లోకల్ వేరియంట్‌గా మారుతోందన్న చర్చలు నడిచాయి. అయితే కోవిడ్ -19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరిస్థితిని తలకిందులు చేసేలా ఉంది.

జాతీయ స్థాయిలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు ప్రస్తుతానికి దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే, ముంబై, దిల్లీ వంటి కొన్ని నగరాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి.

రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. జనవరి 3, 2022 నుంచి కోవిడ్-19 టీకాను 15-18 సంవత్సరాల వయస్సు పిల్లలకు కూడా ఇవ్వబోతున్నారు. జనవరి 10 నుండి ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వ్యాధులు ఉన్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు కోవిడ్ మూడో డోసును ఇస్తారు.

అయితే, 2022 లో కోవిడ్-19 పై పోరాడేందుకు భారతదేశం ఎంత వరకు సన్నద్ధంగా ఉందన్నది అసలు ప్రశ్న.

టీకాల వేగం పెరిగినా, పూర్తి డోసులు తీసుకోవాల్సిన జనాభా ఇంకా ఎక్కువగానే ఉంది.

ఫొటో సోర్స్, FILADENDRON/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, టీకాల వేగం పెరిగినా, పూర్తి డోసులు తీసుకోవాల్సిన జనాభా ఇంకా ఎక్కువగానే ఉంది.

ఒమిక్రాన్ ప్రమాదం ఎంత?

ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఇది దేశంలో మూడో వేవ్‌ సృష్టిస్తుందో లేదో చెప్పడం కష్టం. కాకపోతే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బెడ్‌లు, ఐసీయూలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. డెల్టా వేరియంట్ ఇప్పటికీ భారత దేశంలో కొనసాగుతూనే ఉందని మర్చిపోవద్దు.

ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, ప్రభుత్వాలు, ప్రజారోగ్య నిపుణులు, సిబ్బంది, సామాన్య ప్రజలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.

కోవిడ్ మహమ్మారి ఉన్నంత వరకు నిబంధనలు పాటించాలి. అంటువ్యాధిని ఎదుర్కోవటానికి అందరూ కలిసి బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది.

2021లో మహమ్మారి సమయంలో అనేక వదంతులు వ్యాపించాయి. ఇది కరోనా కంటే ఎక్కువగా నష్టాన్ని కలిగించింది. ప్రజలకు సరైన సమాచారం అందకపోవడం పెద్ద సవాలు. కొత్త సంవత్సరంలో కమ్యూనికేషన్‌ పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

పోస్ట్‌కోవిడ్ సమస్యలతో, దీర్ఘకాలికంగా కోవిడ్‌తో పోరాడుతున్న వారికి, మానసిక ఆరోగ్య సేవలను కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

అలాగే, మహమ్మారి కారణంగా పిల్లల స్కూళ్లు చాలా కాలంగా మూసేసి ఉంచారు. దీనివల్ల వారి చదువులే కాక, శారీరక, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

2022లో పిల్లల చదువులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిబంధనలను రూపొందించి పాఠశాలలో ఆరోగ్య సేవలను క్రమబద్ధీకరించాలి.

భవిష్యత్తులో దేశానికి ఎదురయ్యే ఆరోగ్యపరమైన సవాళ్లు, అంటువ్యాధుల నుంచి నేర్చుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. వీటన్నింటి గురించి ఆలోచించడానికి కొత్త సంవత్సరం సరైన సమయం.

( డాక్టర్ చంద్రకాంత్ లహరియా వృత్తిరీత్యా వైద్యుడు, పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ హెల్త్ రంగంలో పని చేస్తున్నారు )

వీడియో క్యాప్షన్, ‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)