Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. దేశంలో మూడో స్థానం

omicron

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మంగళవారం నాలుగు కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. ఈసారి, ఒమిక్రాన్ బాధితుడికి చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు కూడా ఈ వైరస్ సోకింది.

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు మంగళవారం గుర్తించారు. అలాగే, హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్ కూడా ఒమిక్రాన్ బారిన పడ్డారు.

దేశంలో దిల్లీ, మహారాష్ట్ర తరువాత తెలంగాణలోనే అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం తెలంగాణలో 24 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 54 కేసులు, దిల్లీలో 57 కేసులు నిర్ధరణ అయ్యాయి.

తెలంగాణ తరువాత కర్ణాటకలో అత్యధికంగా 19 కేసులు నమోదు అయ్యాయి.

మంగళవారం తెలంగాణలో నిర్ధారణ అయిన కేసులలో ఇద్దరు సోమాలియా నుంచి రాగా, ఒకరు సూడాన్ నుంచి వచ్చారు. సూడాన్, సోమాలియా రెండూ ఒమిక్రాన్ హై రిస్క్ దేశాల జాబితాలో ఉన్నాయి.

మంగళవారం మొత్తం 726 మంది విదేశాల నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వీరిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌ సోకినట్లు గుర్తించారు. అయితే, వీరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో లేదో తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపారు.

omicron

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇప్పటివరకు నిర్ధరణ అయిన 24 ఒమిక్రాన్ కేసులలో నలుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చారు.

వీరంతా కెన్యా, సోమాలియా, బ్రిటన్, ఘనా, టాంజానియా, దోహా, అబుదాబి లాంటి దేశాల నుంచి వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాదు వచ్చినవారు.

ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 3,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారానికి 172 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణ రాష్టంలో ఇప్పటివరకు సుమారు 2.73 కోట్ల మంది వ్యాక్సీన్ మొదటి డోసు తీసుకోగా, 1.67 కోట్ల మంది రెండు డోసులూ తీసుకున్నారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, 99 శాతం మొదటి డోసు తీసుకున్నారు.

తిరుపతిలో కూడా ఒమిక్రాన్

తిరుపతిలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో వైద్యులు ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు.

ఆమె స్వాబ్‌‌ను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఆ రిపోర్ట్‌లో ఆమెకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఈ మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి కారులో తిరుపతి చేరుకున్నారు.

ఆమెతో సన్నిహితంగా ఉన్న వారితో పాటు ఆమె బంధువులు అందరికీ కూడా ఒమిక్రాన్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినట్టుగా వైద్య అధికారులు తెలిపారు.

omicron

ఫొటో సోర్స్, GETTY IMAGES

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 213 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా దేశ రాజధాని దిల్లీలో 57, మహరాష్ట్రలో 54 కేసులు, తెలంగాణలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ భయంతో పలు రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కర్ణాటక ప్రభత్వం ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది.

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరిగితే విద్యా సంస్థలను మళ్లీ మూసివేయాలని వారి ప్రభుత్వం ఆలోచిస్తోంది.

పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఆంక్షలు విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

క్రిస్మస్, న్యూ ఇయర్ బహిరంగ కార్యక్రమాలకు దిల్లీలో అనుమతి లేదు

క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలపై దిల్లీ విపత్తు నిర్వహణ శాఖ నిషేధం విధించింది. దిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో దిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో దిల్లీలోనే అత్యధికంగా 57 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)