ఒమిక్రాన్: 'జీవితం కోల్పోవడం కంటే... ఒక ఈవెంట్ రద్దు చేసుకోవడం మంచిది': డబ్ల్యూహెచ్ఓ చీఫ్

డబ్ల్యుహెచ్ఓ చీఫ్

కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచమంతా వ్యాపిస్తుండడంతో, అది మరింత వ్యాపించకుండా ప్రజలు సెలవు దినాల్లో కొన్ని వేడుకలను రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.

"జీవితం కోల్పోవడం కంటే, ఒక ఈవెంట్‌ను రద్దు చేసుకోవడం మంచిది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాటిని రద్దు చేయడం లేక వాయిదా వేసుకోవడం మంచిది" అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్‌ అద్నామ్‌ గెబ్రియేసస్‌ అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తోందనడానికి ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

కొత్త వేరియంట్‌ వ్యాపించకుండా నియంత్రించడానికి ఫ్రాన్స్, జర్మనీ సహా వివిధ దేశాలు కోవిడ్ ఆంక్షలు, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నెదర్లాండ్స్‌లో క్రిస్మస్ సందర్భంగా కఠిన లాక్‌డౌన్ విధించారు.

అమెరికాలో లాక్‌డౌన్ విధించడం గురించి తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆలోచించడం లేదని ఆదివారం వైట్‌హౌస్ ఆదివారం చెప్పింది.

"క్రిస్మస్ సందర్భంగా ప్రయాణాలు చేయడం వల్ల పూర్తిగా టీకా వేసుకున్నవారిలో కూడా ఒమిక్రాన్ వ్యాపించవచ్చు" అని అమెరికా ప్రముఖ సంక్రమణ వ్యాధి నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ఇంతకు ముందు హెచ్చరించారు.

స్పెయిన్, ఫిన్‌లాండ్, చాద్, లెబనాన్ సహా 8 దేశాలకు ప్రయాణించవద్దని సీడీసీ, స్టేట్ డిపార్ట్‌మెంట్ అమెరికన్లకు సూచించింది. అమెరికాలోని కోవిడ్ వేరియంట్లలో ఇప్పుడు ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ఇంగ్లండ్‌లో కొత్త నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అయితే, ఏ ఆంక్షలు విధిస్తారనేది ఆయన ప్రకటించలేదు.

కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌ దగ్గర నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసినట్లు మేయర్ సాదిక్ ఖాన్ చెప్పారు.

ఒమిక్రాన్ వేరియంట్

ఫొటో సోర్స్, Getty Images

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను మొదట నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. డబ్ల్యుహెచ్ఓ దీనిని ఆందోళకరమైన వేరియంట్‌గా వర్గీకరించింది.

ఈ మహమ్మారి వల్ల మనమంతా బాధపడుతున్నాం. మన కుటుంబం, స్నేహితులతో గడపాలని మనమందరం అనుకోవాలి. సాధారణ స్థితి రావాలని మనం కోరుకుందాం అన్నారు.

"దీన్ని వేగంగా చేయడానికి మార్గం.. మనల్ని, ఇతరులను రక్షించడానికి నేతలు, ప్రజలు మనందరం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే, కొన్ని సందర్భాల్లో ఈవెంట్లు రద్దు చేయడం లేదా వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత బాధపడడం కంటే ఇప్పుడు వాటిని రద్దు చేసుకుని, ఆలస్యంగా జరుపుకోవడం మంచిది" అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సోమవారం బ్రీఫింగ్‌లో అన్నారు.

"వచ్చే ఏడాది మధ్య నాటికి ప్రపంచంలోని ప్రతి దేశం 70 శాతం మంది జనాభాకు టీకా వేసేలా చూసుకోవడం ద్వారా 2022లో ఈ మహమ్మారిని అంతం చేయవచ్చు" అని ఆయన చెప్పారు.

2019లో ఈ మహమ్మారి వ్యాప్తికి కారణమైనదని భావిస్తున్న చైనా కోవిడ్‌కు సంబంధించిన డేటా, సమాచారంతో ముందుకు రావాలని ఆయన అన్నారు.

"మూలాలు తెలిసేవరకూ మనం దీనిని కొనసాగించాలి. మరింత కష్టంగా ముందుకు వెళ్లాలి. ఎందుకంటే, భవిష్యత్తులో మనం మెరుగ్గా చేయాలంటే, ఇప్పుడు జరిగినదాని నుంచి నేర్చుకోవాలి" అని తెలిపారు.

మరోవైపు "ప్రాథమిక ఆధారాలను బట్టి ఒమిక్రాన్ గత వేరియంట్లతో పోలిస్తే, అంత ప్రమాదకరమైన వేరియంట్ కాదని నిర్ధరించడం అవివేకమే అవుతుంది" అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ సోమవారం అన్నారు.

ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో, అన్ని ఆరోగ్య వ్యవస్థలూ ఆ ఒత్తిడికి గురికాబోతున్నాయని ఆమె హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)