మనిషి, మొసళ్ల యుద్ధం - ఇరాన్‌లో మొసళ్లకు ఆహారమవుతున్న పిల్లలు, అవయవాలు కోల్పోతున్న పెద్దలు

సియాహౌక్
ఫొటో క్యాప్షన్, సియాహౌక్
    • రచయిత, సర్బాస్ నజారీ
    • హోదా, బీబీసీ న్యూస్

అది ఆగస్ట్ నెల.. మిట్టమధ్యాహ్నం వేళ 70 ఏళ్ల గొర్రెల కాపరి సియాహౌక్ తన ఇంట్లో నేల మీద పడుకుని ఉన్నారు. ఆయన కుడిచేతికి తీవ్ర గాయం కావడంతో విపరీతమైన బాధను అనుభవిస్తున్నారు.

అంతకు రెండు రోజుల ముందే సియాహౌక్ చెరువు నుంచి నీరు తెచ్చుకునేందుకు వెళ్లినప్పుడు నీటిలోని మొసలి ఎగిరి ఆయన చేతిని నోటితో పట్టుకుంది.

ఈ మొసళ్లను ఇరాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో గాండో అని పిలుస్తారు.

‘నీటి కోసం వెళ్లినప్పుడు నేను మొసలిని గమనించలేదు’’ అంటూ సియాహౌక్ తనకు ఎదురైన ప్రాణాంతక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఒడిశాలోని కేంద్రపరా వాసుల జీవితం దినదిన గండం

మొసలి తన చేతిని పట్టుకున్నాక అతి కష్టం మీద తన మరో చేతిలోని ప్లాస్టిక్ సీసాను దాని దవడల్లో కూరి దాన్నుంచి తప్పించుకుని బయటపడినట్లు సియాహౌక్ చెప్పారు.

మొసలి నుంచి తప్పించుకున్నా తీవ్ర రక్తస్రావం కావడంతో సియాహౌక్ స్పృహ కోల్పోయి అరగంట పాటు అక్కడే పడిపోయారు.

దీంతో సియాహౌక్ కాపలా కాసే గొర్రెల మంద ఆయన లేకుండానే ఊరిలోకి వెళ్లడంతో ఊళ్లోవాళ్లు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి కాపాడారు.

బలోచి పిల్లలు మొసళ్ల దాడులకు గురవుతున్నారు.
ఫొటో క్యాప్షన్, బలోచి పిల్లలు మొసళ్ల దాడులకు గురవుతున్నారు.

ప్రాణాంతకం

సియాహౌక్‌‌కు ఎదురైన అనుభవం ఈ ప్రాంతంలోని చాలామందికి ఎదురైంది.

ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులను ఎక్కువగా పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు. మొసళ్ల కాటుకు గురై గాయాల పాలైన బలూచ్ పిల్లల గురించి ఇరాన్ మీడియాలో చాలాసార్లు కదిలించే శీర్షికలు కనిపిస్తుంటాయి.

2016లో 9 ఏళ్ల అలీ రెజాను మొసలి మింగేసింది. 2019 జులైలో పదేళ్ల హవా అనే బాలిక మొసలి దాడిలో తన కుడి చేతిని పోగొట్టుకుంది. ఆ బాలిక బట్టలుతికేందుకు చెరువుకు వెళ్లగా మొసలి ఆమె చేతిని పట్టుకుని నీటిలోకి లాగింది. అక్కడ ఉన్నవారు మొసలితో పోరాటం చేసి బాలికను రక్షించగలిగారు.

ఇరాన్‌లో తీవ్రమైన నీటి కొరత కారణంగానే మొసళ్ల దాడుల్లో ప్రజలు గాయపడుతున్నారు. నీటి కొరత వల్ల మొసళ్లకు ఆవాసాలు తగ్గిపోతున్నాయి. దీంతో వాటికి ఆహార కొరతఏర్పడుతోంది. ఆకలితో ఉన్న మొసళ్లు నీటి దగ్గరకు వచ్చిన మనుషులను తమ ఆహారంగా భావించి దాడి చేస్తున్నాయి.

గాండో మొసళ్లు ఇరాన్‌తో పాటు, భారత ఉపఖండంలోనూ కనిపిస్తాయి. వీటిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేర్చింది. గాండోల మొత్తం జనాభాలో 5 శాతం.. అంటే సుమారు 400 గాండోలు ఇరాన్‌లోనే ఉన్నాయి.

వీటిని పరిరక్షించేందుకు, వీటి బారి నుంచి మనుషులను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ పర్యావరణ శాఖ చెబుతోంది. ఇటీవల కాలంలో కొన్ని విషాదకర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో చిత్తశుద్ధి మాత్రం కనిపించటం లేదు. ఇరాన్ లో గాండోలు ఎక్కువగా ఉండే బహు కలాత్ నది దగ్గర ఎక్కడా ప్రమాద హెచ్చరికలు కనిపించవు.

గాండో (మొసళ్ళు)
ఫొటో క్యాప్షన్, గాండో (మొసళ్ళు)

ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు చేపట్టకపోవడంతో, కొంత మంది స్వచ్ఛంద సేవకులు ఆ మొసళ్ల దాహం, ఆకలి తీర్చి వాటిని రక్షించేందుకు ముందుకొస్తున్నారు.

బహు కాలాత్ గ్రామంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న మాలిక్ దినార్‌తో నేను మాట్లాడాను.

"ఈ మొసళ్ళకు నీరు సరఫరా చేసేందుకు నేను నా తోటలో మొక్కలను చంపేశాను" అని చెప్పారు. ఆయన తోటలో ఒకప్పుడు అరటి, నిమ్మ, మామిడి విరివిగా పండేవి.

ఆయన ఇంటి దగ్గర్లో ఉన్న నదిలో కొన్ని వందల మొసళ్లు ఉన్నాయి. వాటికి ఆయన కోడిమాంసం ఆహారంగా వేస్తుంటారు.

ఆ ప్రాంతంలో ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల కారణంగా కప్పల వంటి ప్రాణుల సంఖ్య తగ్గి మొసళ్లకు ఆహార కొరత ఏర్పడింది.

"ఇటు రండి" అంటూ మాలిక్ దినార్ ఆ మొసళ్లను పిలుస్తూ ఉంటారు. నన్ను మాత్రం దూరంగా ఉండమని చెప్పారు.

నేను చూస్తుండగానే.. కన్ను మూసి తెరిచే లోపు ఆయన ఇచ్చిన చికెన్ తినేందుకు రెండు మొసళ్లు బయటకు వచ్చాయి.

మాలిక్ దినార్
ఫొటో క్యాప్షన్, మాలిక్ దినార్

"నీరు లేకుండా ఎవరు తకగలరు?"

"బలూచిస్తాన్‌లో నీటి కొరత కొత్త విషయమేమి కాదు. జులైలో ఇంధన నిల్వలు విరివిగా ఉన్న ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో దారుణమైన నిరసనలు చోటు చేసుకున్నాయి.

నవంబరులో ఇస్‌ఫహాన్ నగరంలో ఎండిపోయిన జాయంద రౌడ్ నదీ ప్రాంతంలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.

ఇరాన్‌లో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. దీని ప్రభావం బలూచిస్తాన్ పై విధ్వంసకరంగా ఉండొచ్చు.

అక్కడ బట్టలు ఉతుక్కుంటున్న కొందరు మహిళలతో మాట్లాడాను.

బట్టలుతుక్కుంటున్న మహిళలు
ఫొటో క్యాప్షన్, బట్టలుతుక్కుంటున్న మహిళలు

"ఇక్కడ నీళ్లు రావడానికి కొళాయి గొట్టాలు ఉన్నాయి కానీ, నీరు లేదు" అని 35 సంవత్సరాల మాలిక్ నాజ్ చెప్పారు

స్నానం గురించి అడిగినప్పుడు ఆమె భర్త ఒక కృత్రిమమైన నవ్వు నవ్వి పక్కింట్లో ఉన్న ఒకామె ఉప్పు నీటి తొట్టెలో తన కొడుకుకు స్నానం చేయిస్తుండటాన్ని చూపించారు.

ఐదుగురు పిల్లల తండ్రి ఉస్మాన్, ఆయన కజిన్ నౌషెర్వాన్ కూడా మాతో మాట్లాడారు.

వారు పాకిస్తాన్‌కు పెట్రోల్ రవాణా చేసి, అక్కడ దానిని కాస్త ఎక్కువ డబ్బుకు అమ్మి జీవనోపాధి సాగిస్తున్నారు.

"మా వృత్తిలో చాలా సవాళ్లున్నాయి" అని నౌషెర్వాన్ అన్నారు. కానీ, ఇక్కడ పని లేకపోవడం కంటే సవాళ్ళను స్వీకరించడమే ఉత్తమం" అని అన్నారు.

ఫిబ్రవరిలో ఇంధనాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారి పై ఇరాన్ సరిహద్దు దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సుమారు 10 మంది మరణించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు సాధారణంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇరాన్ పాలకులకు భద్రత గురించి ఆందోళన ఉంది.

బలోచి పిల్లలు
ఫొటో క్యాప్షన్, బలోచి పిల్లలు

"మా బాధ పట్ల వారు కావాలనే దృష్టి సారించడం లేదు. నన్ను నమ్మండి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాము" అని ఉస్మాన్ చెప్పారు. కానీ, తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని బలూచిస్తాన్ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

ఉస్మాన్‌తో పాటు మరెంతో మందికి నిరుద్యోగం కంటే కూడా ఇక్కడ నెలకొన్న నీటి కొరత మరింత పెద్ద సమస్య. ఒకప్పుడు ఈ మొసళ్ళతో వాళ్ళు శాంతియుతంగా సహజీవనం చేశారు.

"మేం ప్రభుత్వం నుంచి సహాయం ఆశించటం లేదు. వారు మాకు పళ్లెంలో ఉద్యోగాలను వడ్డించి ఇవ్వనక్కరలేదు" అని నౌషెర్‌వాన్ చెప్పారు.

"మేం ఎడారిలో దొరికే రొట్టె ముక్కలతో బతకగలం. కానీ, నీరు జీవితానికి ఆధారం. అది లేకుండా మేము బతకలేం. నీరు లేకుండా ఎవరు మాత్రం బతకగలరు?"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)