దేశంలో రాజకీయాల కారణంగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగామి కథ

సెర్గీ క్రికలేవ్ 312 రోజులు అంతరిక్షంలో గడిపారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెర్గీ క్రికలేవ్ 312 రోజులు అంతరిక్షంలో గడిపారు
    • రచయిత, కార్లోస్ సెరానో
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

ఆయన పేరు సెర్గి క్రికలేవ్. రష్యాకు చెందిన వ్యోమగామి. ఆ దేశం అంతరిక్షంలో ఏర్పాటు చేసిన 'మిర్' స్పేస్‌ స్టేషన్‌లో మరమ్మతులు చేయడానికి వెళ్లారు. తీరా పని పూర్తి చేసుకుని, తిరిగి వద్దామనుకుంటే ప్రభుత్వం నుంచి పిడుగులాంటి వార్త వినిపించింది. ‘‘నిన్నిప్పుడు కిందికి తీసుకురాలేం. నువ్వక్కడే ఉండు’’ అన్నది ఆ వార్త సారాంశం.

‘మిర్’ అంతరిక్ష కేంద్రం నుండి సెర్గీ క్రికలేవ్ ప్రపంచం మొత్తాన్ని చూడగలిగారు. కానీ, తన దేశంలో జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం అంత ఎత్తు నుంచి కూడా చూడలేకపోయారు.

అది మే 18, 1991. ఐదు నెలల మిషన్‌లో భాగంగా సోయజ్ అంతరిక్ష నౌక ఎక్కి క్రికలేవ్ ‘మిర్’ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సోవియట్ యూనియన్‌కు చెందిన మరో శాస్త్రవేత్త అనతోలీ ఆర్టెబార్‌స్కీ, బ్రిటిష్ శాస్త్రవేత్త హెలెన్ షెర్మాన్‌లు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు.

కజక్‌స్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆయన ప్రయాణించాల్సిన రాకెట్‌ను ప్రయోగించారు. భూకక్ష్యలో తొలి ఉపగ్రహాన్ని, తొలి జీవి (లైకా అనే కుక్క)ని, తొలి మానవుడి (యూరిగగారిన్)ని పంపడానికి ఈ కేంద్రాన్నే ఉపయోగించారు. అంతరిక్ష రంగంలో అమెరికాపై రష్యా పై చేయి సాధించడంలో ఈ కేంద్రం పాత్ర కీలకం. 'మిర్' స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో సోవియట్ శక్తికి చిహ్నంగా నిలిచింది.

క్రికలేవ్ ఒక సాధారణ మిషన్‌లో అంతరిక్షానికి వెళ్లారు. స్టేషన్‌లోని కొన్ని భాగాలను సరిచేసి మెరుగుపరచడం ఆయన బాధ్యత. కానీ, అంతరిక్షంలో ఆయన తన పని చేసుకుపోతుండగా, ఇక్కడ భూమి మీద, ఆయన దేశంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి.

క్రికలేవ్ అంతరిక్షంలో ఉండగానే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. దీంతో, అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన క్రికలేవ్ చాలా నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

గతంలో ఆయన అంతరిక్షంలో గడిపిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది. పది నెలలపాటు అంతరిక్షంలో ఉన్నారాయన. వెళ్లే ముందు ప్రశాంతంగా కనిపించిన తన దేశం, తాను తిరిగి వచ్చేనాటికి ప్రపంచ పటం నుంచే మాయమైంది.

ఈ మిషన్ కారణంగా క్రికలేవ్‌ 'సోవియట్ యూనియన్ చివరి పౌరుడు'గా గుర్తింపు పొందారు.

కజకిస్తాన్ బైకనూర్ కాస్మోడ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కజకిస్తాన్ బైకనూర్ కాస్మోడ్రోమ్

మాట్లాడే వ్యోమగామి

సెర్గీ క్రికలేవ్ 1958లో సోవియట్ యూనియన్‌లోని లెనిన్‌గ్రాడ్ నగరంలో జన్మించారు. తర్వాత దాని పేరు సెయింట్ పీటర్స్‌బర్గ్‌గా మారిపోయింది. 1981లో లెనిన్‌గ్రాడ్ మెకానికల్ ఇనిస్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు క్రికలేవ్. నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత వ్యోమగామి అయ్యారు.

1988లో ఆయన నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న 'మిర్' స్పేస్ స్టేషన్‌కు మొదటిసారి వెళ్లారు. ప్రస్తుతం క్రికలేవ్.. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ విభాగానికి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

1991 మే నెలలో క్రికలేవ్ తన రెండో అంతరిక్ష యాత్ర చేశారు. ''క్రికలేవ్‌ అంతరిక్ష కేంద్రం రేడియో ద్వారా భూమిపై ఉన్న సాధారణ వ్యక్తులతో మాట్లాడేవారు. ఈ కారణంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు" అని అంతరిక్ష యాత్రల హిస్టోరియన్ కాథలిన్ లూయిస్ అన్నారు.

క్రికలేవ్ అంతరిక్షంలో అంత సుదీర్ఘ సమయాన్ని ఎలా గడిపారన్న విషయాన్ని వివరిస్తూ '' ఆయన తన రేడియో ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయిన వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆ విధంగా ఆయన ప్రపంచంతో అనధికారిక సంబంధాలను ఏర్పరచుకున్నారు'' అని లూయిస్ చెప్పారు.

''స్పే‌స్‌స్టేషన్‌ నుంచి ఆయన రేడియోలో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండేవారు'' అని వివరించారాయన.

వీడియో క్యాప్షన్, సూర్యుడికి సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక

క్రికలేవ్‌‌తోపాటు మరో సోవియట్ వ్యోమగామి అలెగ్జాండర్ వోల్కోవ్ కూడా అంతరిక్షంలో ఉన్నప్పటికీ, క్రికలేవ్ మాత్రమే చివరి సోవియట్ పౌరుడిగా గుర్తింపు పొందారని లూయీస్ అన్నారు.

1990, 1991 మధ్య సోవియట్ యూనియన్‌లో భాగమైన అన్ని రిపబ్లిక్‌లు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. అదే సమయంలో, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బాచెవ్ తన సుప్రసిద్ధ పాలసీ 'పెరిస్త్రోయికా' ద్వారా దేశాన్ని ఆధునికీకరించే పనిలో ఉన్నారు. కమ్యూనిస్టు విధానాలకు విరుద్ధంగా దేశాన్ని పెట్టుబడిదారీ విధానానికి దగ్గరగా తీసుకువచ్చారు.

అనేక కంపెనీల ఆర్థిక శక్తిని వికేంద్రీకరించారు, ప్రైవేటు వ్యాపారాలకు తెరలేపారు.

ఈ ప్రక్రియ పట్ల కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 1991 ఆగస్టు 19, 21 తేదీల మధ్య, కమ్యూనిస్ట్ పార్టీలోని ఓ బలమైన వర్గం గోర్బచేవ్‌‌పై తిరుగుబాటుకు ప్రయత్నించింది.

ఆ తిరుగుబాటు విఫలమైనా, సోవియట్ యూనియన్‌‌కు తీవ్ర నష్టం కలిగించింది.

సెర్గీ క్రికలేవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెర్గీ క్రికలేవ్

'భార్య కూడా నిజం చెప్పలేదు'

గోర్బచేవ్ తన దేశంపై నియంత్రణ కోల్పోతున్న సమయంలో క్రికలేవ్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్ధిక సంక్షోభం కారణంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆయనకు ఆదేశాలు అందాయి.

ఓ డాక్యుమెంటరీ కోసం 1993లో ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ''ఏం జరుగుతోందో మాకు తెలియ లేదు. మాకు వచ్చిన ఆదేశాలను బట్టి మేం పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం'' అని చెప్పారు.

రష్యాలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి క్రికలేవ్ పాశ్చాత్య దేశాల వారితో మాట్లాడటానికి ప్రయత్నించారని లూయీస్ చెప్పారు. ఎందుకంటే అప్పట్లో తన అధికారులుగానీ, తన దేశీయులుగానీ, అక్కడేం జరుగుతుందో వివరించే సాహసం చేయలేదు. 'అంతా బాగానే ఉంది' అనేమాటే వినిపించేది.

ఆఖరికి క్రికలేవ్ భార్య ఎలీనా తెరెఖినా కూడా నిజాలు చెప్పలేదు. ఆమె సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్‌లో రేడియో ఆపరేటర్‌గా పనిచేస్తుండేవారు. ''నేను బాధాకరమైన విషయాలు ఆయనకు చెప్పకుండా తప్పించుకునేదాన్ని'' అని తెరెఖినా బీబీసీ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సోవియట్ యూనియన్ రాకెట్ ప్రయోగం

ఫొటో సోర్స్, RUSSIAN ARCHIVES, BBC

ఫొటో క్యాప్షన్, సోవియట్ యూనియన్ రాకెట్ ప్రయోగం

నెరవేర్చాల్సిన బాధ్యతలు

క్రికలేవ్ అంతరిక్షంలో తన మిషన్‌ను కొనసాగించడానికి అంగీకరించారు. కానీ, అది అంత సులభం కాదని ఆయనకు తెలుసు. ''నాకు తగినంత స్థైర్యం ఉందా, నన్ను నేను సిద్ధం చేసుకోగలనా అన్న ప్రశ్నలకు అప్పట్లో నా దగ్గర సమాధానాలు లేవు'' అన్నారాయన.

క్రికలేవ్, వోల్కోవ్ ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ, వారు అలా చేస్తే, అంతరిక్ష కేంద్రం ఖాళీ అవుతుంది. ‘‘ఇది బ్యూరోక్రాటిక్ సమస్య," అని లూయిస్ అన్నారు. స్టేషన్‌ను వదిలేసి రమ్మనడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు. కానీ, మరో వ్యోమగామిని పంపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు.

అదే సమయంలో, రష్యా ప్రభుత్వం కజకిస్తాన్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, క్రికలేవ్‌ను రిలీవ్ చేయడానికి కజకిస్తాన్‌కు చెందిన కాస్మోనాట్‌ను పంపుతామని చెప్పింది. కానీ, కజకిస్తాన్‌లో క్రికలేవ్‌కు ఉన్నంత అనుభవంగల వ్యోమగామి ఎవరూ లేరు. మరో వ్యోమగామిని సిద్ధం చేయడానికి టైమ్ పట్టింది.

ఇదే సమయంలో క్రికలేవ్ అంతరిక్షంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను అధిగమించారు. అయితే, దాని గురించి పూర్తి సమాచారం నేటికీ అందుబాటులో లేదు. నాసా ప్రకారం, అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.

గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల మజిల్ మాస్, బోన్ మాస్ గతి తప్పడంతోపాటు రోగ నిరోధక శక్తిలో మార్పు వస్తుంది. ఒంటరిగా ఉండటం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. అయితే, అంతరిక్ష కేంద్రంలో ఉండడం తన కర్తవ్యమని తనకు ఎప్పుడూ గుర్తుండేదని క్రికలేవ్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?
మిర్ స్పేస్ సెంటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిర్ స్పేస్ సెంటర్

క్రికలేవ్‌ స్థానం భర్తీ కాలేదు.

1991 అక్టోబర్‌లో ముగ్గురు కొత్త వ్యోమగాములు 'మిర్' అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. కానీ వారిలో ఎవరూ క్రికలేవ్ స్థానానికి తగిన శిక్షణ పొందలేదు. 1991 అక్టోబర్ 25న, కజకిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. దీంతో క్రికలేవ్ స్థానంలో వెళ్లాల్సిన వ్యోమగామిని పంపే కాస్మోడ్రోమ్ నియంత్రణ రష్యా చేయిదాటిపోయింది.

1991, డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. అదే రోజున, గోర్బచేవ్ అనారోగ్యంతో రాజీనామా చేశారు. ఇది సోవియట్ యూనియన్ పతనాన్ని సంపూర్ణం చేసింది.

సోవియట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయింది. క్రికలేవ్‌ను అంతరిక్షంలోకి పంపిన దేశం సోవియట్ యూనియన్ నుంచి రష్యాగా మారింది. క్రికలేవ్ పుట్టిన, చదువుకున్న నగరం పేరు కూడా సెయింట్ పీటర్స్‌బర్గ్‌‌గా మారిపోయింది.

సోవియట్ యూనియన్ పతనమయ్యే నాటికి మిఖాయిల్ గోర్బచేవ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోవియట్ యూనియన్ పతనమయ్యే నాటికి మిఖాయిల్ గోర్బచేవ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

క్రికలేవ్ తిరిగి వచ్చాక...

తన దేశంలో అనేక పరిణామాలు జరుగుతుండగా, భూమివైపు చూస్తూ, తన సహచరులు ప్లే చేస్తున్న పాటలు వింటూ, రేడియోలో అనేకమందితో మాట్లాడుతూ గడిపారు సెర్గీ క్రికలేవ్. 1992, మార్చి 25న క్రికలేవ్, వోల్కోవ్‌లిద్దరూ భూమికి తిరిగి వచ్చారు. ఈ విధంగా, క్రికలేవ్ 312 రోజులు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 5 వేలసార్లు చక్కర్లు కొట్టారు.

"తిరిగి నేల మీదకు రావడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా మేము ఇబ్బంది పడినప్పటికీ, మానసిక భారం నుండి విముక్తి పొందాం. ఇది సంతోషకరమైన క్షణం అని నేను చెప్పను, కానీ బాగుంది" అన్నారాయన.

ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా క్రికలేవ్ తన రెండో సాహసానికి సిద్ధమయ్యారు. 2000 సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన బృందంలో ఆయన కూడా సభ్యుడు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ( ఐఎస్ఎస్) అంతరిక్షంలో కొత్త శకానికి నాంది పలికింది. దేశాల మధ్య పాత సంఘర్షణలను వదిలేసి, విశ్వరహస్యాల అన్వేషణలో దేశాల మధ్య సహకారానికి ఒక మోడల్‌గా నిలిచింది.

వీడియో క్యాప్షన్, జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)