ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను రష్యా అంతరిక్షంలోకి ప్రయోగించిందా?

శాటిలైట్ మ్యాప్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా ఉపగ్రహ విధ్వంసక ఆయుధం వంటిది ఒకటి అంతరిక్షంలోకి ప్రయోగించిందని బ్రిటన్, అమెరికాలు ఆరోపించాయి.

“రష్యా తాజాగా ప్రయోగించిన వస్తువు, నిజానికి కక్ష్యలో తిరిగే ఉపగ్రహ విధ్వంసక ఆయుధంలా కనిపిస్తోంది” అని అమెరికా చెప్పింది.

ఆ దేశ రక్షణ శాఖ మాత్రం "రష్యా అంతరిక్ష వస్తువులను చెక్ చేయడానికి మేం ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం" అని చెప్పింది.

రష్యా ఉపగ్రహ కార్యకలాపాల గురించి అమెరికా ఇంతకు ముందు కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

“రష్యా ఆయుధం లాంటి ఏదో వస్తువును లాంచ్ చేయడానికి, తమ ఉపగ్రహాన్ని పరీక్షించడం చూస్తుంటే మాకు ఆందోళనగా ఉంది” అని బ్రిటన్ డైరెక్టరేట్ ఆఫ్ స్పేస్ చీఫ్ కూడా ఒక ప్రకటన జారీ చేశారు.

"దీనివల్ల అంతరిక్షంలో శిథిలాలు పేరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అవి ప్రపంచమంతా ఆధారపడుతున్న ఉపగ్రహాలు, అంతరిక్ష వ్యవస్థ మొత్తానికీ పెనుముప్పుగా మారవచ్చు” అని బ్రిటన్ డైరెక్టరేట్ ఆఫ్ స్పేస్ చీఫ్, ఎయర్‌వైస్ మార్షల్ హార్వే స్మిత్ ఒక ప్రకటన జారీ చేశారు.

“ఇక ముందు ఇలాంటి పరీక్షలు చేయకుండా సంయమనంతో ఉండాలని, అంతరిక్షంలో బాధ్యతాయుత వైఖరిని ప్రోత్సహించడానికి, బ్రిటన్, మిగతా మిత్రదేశాలతో కలిసి పనిచేయడం కొనసాగించాలని మేం రష్యాను కోరుతున్నాం” అన్నారు.

రష్యా అంతరిక్షంలో శాటిలైట్ టెస్ట్ చేసిందని బ్రిటన్ మొదటిసారి ఆరోపించినట్లు బీబీసీ రక్షణ ప్రతినిధి జొనాథన్ బేల్ చెప్పారు.

రష్యా నుంచి ప్రమాదాన్ని అంచనావేయడంలో బ్రిటన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బ్రిటన్ నిఘా వర్గాలు, భద్రతా కమిటీ ఒక రిపోర్టు ఇచ్చిన కొన్ని రోజులకే ఇది జరిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

స్పేస్ వార్ వస్తుందా?

ఈ ఘటన తర్వాత అంతరిక్షంలో ఆయుధాల కోసం కొత్త రేస్ మొదలవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఉపగ్రహాలను అంతరిక్షంలో ఆయుధాల్లా ఉపయోగించే టెక్నాలజీపై మరికొన్ని దేశాలూ పరిశోధనలు చేస్తున్నాయి.

రష్యాకు చెందిన ఇదే ఉపగ్రహం గురించి 2018లోనే తాము ఆందోళన వ్యక్తం చేశామని అమెరికా చెప్పింది. ఈ ఏడాది కూడా దానిపై ప్రశ్నించిన అమెరికా, ఇటీవల రష్యా ప్రయోగించింది అమెరికా శాటిలైట్‌కు దగ్గరగా వెళ్తోందని ఆరోపించింది.

రష్యా అంతరిక్షంలో ఒక ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని పరీక్షించింది అనడానికి ఇదే ఆధారం అని అమెరికా స్పేస్ కమాండ్ చీఫ్ జనరల్ జె.రేమండ్ అన్నారు.

రష్యా శాటిలైట్ ద్వారా కక్ష్యలో ఒక కొత్త వస్తువును లాంచ్ చేసిందని ఆయన చెప్పారు.

“అంతరిక్ష ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు, దానిని పరీక్షించేందుకు రష్యా వరుస ప్రయత్నాలు చేస్తోంది అనడానికి ఇది ఆధారం. ఈ చర్యలు అంతరిక్షంలో అమెరికా, దాని మిత్రదేశాల ఉపగ్రహాలను ప్రమాదంలోకి నెట్టడానికి ఆయుధాలను ఉపయోగించే రష్యా సైనిక సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయి. అన్నారు.

రష్యా ఏం అంటోంది?

ప్రత్యేకమైన చిన్న ఉపకరణంతో తమ ఉపగ్రహాన్ని పరిశీలించినట్లు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. తమ పరిశీలక ఉపగ్రహాల్లోని ఓ ఉపగ్రహం ఈ పని పూర్తిచేసినట్లు వెల్లడించింది.ఈ చర్యలతో తాము ఎలాంటి అంతర్జాతీయ చట్టాలనూ ఉల్లంఘించలేదని పేర్కొంది.''తాజా పరిణామాన్ని అమెరికా, బ్రిటన్ వక్రీకరించాలని ప్రయత్నిస్తున్నాయి. అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు, దానికి తగిన నిధుల సమీకరణ లాంటి తమ చర్యలను సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి''''రష్యా అంతరిక్ష కార్యకలాపాలే లక్ష్యంగా చేసే దుష్ప్రచారాల్లో ఇది కూడా భాగమని మేం భావిస్తున్నాం''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)