ఉత్తరాఖండ్: 'స్కూల్లో వంట చేసే ఉద్యోగం నాకు తిరిగి ఇవ్వాలి...' అదే ఈ సమస్యకు పరిష్కారమని చెప్పిన దళిత భోజనమాత

సునీతా దేవి

ఫొటో సోర్స్, Rajesh Dobriyal

ఫొటో క్యాప్షన్, సునీతా దేవి
    • రచయిత, రాజేష్ డోబ్రియాల్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో దళిత మహిళ సునీతా దేవి వండిన భోజనాన్ని తినడానికి కొందరు విద్యార్థులు నిరాకరించారు. దాంతో, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఈ సంఘటనపై స్థానిక మీడియాలో అనేక రిపోర్టులు వచ్చాయి. ఈ కేసు ప్రపంచం దృష్టికి వెళ్లినప్పటికీ, తనకు ఉద్యోగం తిరిగి వచ్చేవరకు ఈ సమస్య పరిష్కారం అయినట్టు కాదని ఆమె అంటున్నారు.

"ఎస్‌డీఎం వచ్చారు. ఈ సమస్య పరిష్కరించండి అని చెప్పి వెళ్లిపోయారు. సునీతకు న్యాయం చేస్తాం' అన్నారు. నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? వందేళ్లల్లో జరుగుతుందా? నాకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి. అప్పుడే న్యాయం జరిగినట్టు లెక్క. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అయినట్టు" అని సునీత బీబీసీతో అన్నారు.

చంపావత్‌లోని సుఖిధాంగ్‌లో ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు (భోజనమాతగా) షెడ్యూల్ కులానికి చెందిన సునీతా దేవిని నియమించారు. దళిత మహిళ వండిన భోజనం చేయమని స్కూల్లో ఉన్న జనరల్ కేటగిరీ విద్యార్థులు నిరసన తెలిపారు. గ్రామస్థులు కూడా ఇందుకు మద్దతు తెలుపడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో, సునీత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కానీ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటోంది.

ఈ కారణంగానే శనివారం సెలవు అయినా కూడా అధికారులు సుఖీధాంగ్‌కు వెళ్లి స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

సునీతా దేవి

ఫొటో సోర్స్, Rajesh Dobriyall/BBC

'వివాదం పరిష్కారం అయిపోయినట్టే'

తనక్‌పూర్ ఎస్‌డిఎం హిమాంశు కఫల్తియా, సిఈఓ ఆర్‌సీ పురోహిత్, ఎస్పీ దేవేంద్ర పించా, సిఓ అశోక్ కుమార్, తహసీల్దార్ పింకీ ఆర్య, ప్రాథమిక విద్యాశాఖ డిఈఓ సత్యన్నారాయణ, బిఈఓ అన్షుల్ బిష్త్ శనివారం పాఠశాలలో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు.

ఈ భేటీ అనంతరం, వివాదం సద్దుమణిగిందని అధికారులు చెప్పారు.

"అగ్రవర్ణాలను, దళితులను కూడా ఈ మీటింగ్‌కు పిలిచారు. కానీ, నా అభిప్రాయాలు ఎవరూ అడగలేదు. ఉద్యోగం కోల్పోయినవారి ఆలోచనలు కూడా వినాలి కదా. అలా అనొచ్చా, అనకూడదా అని నన్నూ అడగాలి కదా. నన్నెవరూ అడగలేదు" అంటూ సునీత ఈ మీటింగ్ గురించి చెప్పుకొచ్చారు.

"పైగా, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, నువ్వేమీ మాట్లాడవద్దు అని నాకు చెప్పారు. వాళ్లు నన్ను అడగలేదు కానీ నేను నా అభిప్రాయం చెప్పాను. నన్ను మళ్లీ ఉద్యోగంలో తీసుకోవాల్సిందే లేదంటే ఈ సమస్య పరిష్కారం కాదు. నేను అంగీకరించను అని చెప్పాను."

అధికారుల ఎదుట 'మా పిల్లలు ఆమె వండిన ఆహారం తినరు' అని స్థానికులు స్పష్టం చేశారని సునీత చెప్పారు.

"ఎస్‌డీఎం సాబ్ నిలబడి ఉన్నారు. అప్పుడు, వెనుక నుంచి అమ్మలు మాట్లాడుతూ, 'మా ఇంట్లో దేవుళ్లు ఉన్నారు. మా పిల్లలు ఆమె వంట తినరు ' అని చెప్పారు. చూడండి, మీ ముందే ఎలా చెబుతున్నారో అని నేను ఎస్‌డీఎంతో అన్నాను. 'జరిగిందేదో జరిగింది.. ఈ సమస్య తీరిపోతుంది ' అని ఆయన అన్నారు."

తనకు కచ్చితంగా ఆ ఉద్యోగం ఇవ్వరని సునీత అంటున్నారు.

"ఇప్పుడు వాళ్లంతా (అగ్రకులాలు) అందరం కలిసి భోజనం చేస్తాం అంటున్నారు. ఎందుకంటే విషయం చాలా పెద్దదైందని వాళ్లకు అర్థమైంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కానీ, మొదట వాళ్లే అన్నీ చేశారు. వాళ్లే వార్తాపత్రికల్లో నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. ఈమెను కచ్చితంగా తొలగిస్తామని చెప్పారు. ఏది ఏమైనా గెలుపు మాదే అని వీళ్లకు తెలీదు. ఇప్పుడు వీళ్లకి అర్థమైంది. కానీ, సమస్య పరిష్కారం అవ్వలేదే. సోమవారం స్కూలు తెరుస్తారు. నన్ను డ్యూటీకి పిలవొచ్చు. అందరూ నా చేతి భోజనం తిన్నప్పుడే సమస్య పరిష్కారం అయినట్టు."

మధ్నాహ్న భోజనం

ఫొటో సోర్స్, Rajesh Dobriyall/BBC

'నాకు జరిగిన అవమానం మాటేమిటి?'

ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా సునీత భావిస్తున్నారు.

"నేను దళిత మహిళనని, నా చేత్తో భోజనం చేయమని అన్నారు. దాని మాటేమిటి? ఊరు ఊరంతా నన్ను అవమానించారు. నువ్వెలా ఇక్కడకు వచ్చావని నిలదీశారు. కులం పేరుతో నిందించారు. ఆ అవమానాల మాటేమిటి? అందరూ కలిసి మెలిసి జీవించాలని, సుఖదుఃఖల్లో ఊరివాళ్లే ఆసరాగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. 3,000 రూపాయల ఉద్యోగాన్ని నా నుంచి లాక్కున్నారు. వీళ్లేం నా కష్టసుఖాలు చూస్తారు?" అని ఆమె వాపోయారు.

శనివారం జరిగిన సమావేశం తరువాత కూడా సునీతకు భోజనమాత ఉద్యోగం తిరిగి ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించలేదు.

అయితే, భోజనమాత రిక్రూట్‌మెంట్ ప్రక్రియను విచారించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ కమిటీలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఒక అధికారి, ఒక గెజిటెడ్ అధికారి, ఒక మహిళా అధికారి ఉంటారని తెలిపారు. నియామక ప్రక్రియపై నిబంధనల ప్రకారం విచారణ జరుగుతుంది.

చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్‌సీ పురోహిత్

ఫొటో సోర్స్, RAJESH DOBRIYALL/BBC

ఫొటో క్యాప్షన్, చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్‌సీ పురోహిత్

విద్యాశాఖ విచారణ

ఈ అంశంలో మునుపటి దర్యాప్తు నివేదికను బిఈఓ అన్షుల్ బిష్త్ అందించారని ఈ సమావేశానికి హాజరైన చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్‌సీ పురోహిత్ బీబీసీతో చెప్పారు.

సునీతా దేవికి ముందు భోజనమాతగా పనిచేసిన శకుంతలా దేవికి 60 ఏళ్లు నిండడంతో పదవీవిరమణ చేయాలన్న ప్రతిపాదనకు బీఈఓ ఆమోదం తెలుపకుండానే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. కాబట్టి ఆమె పదవీవిరమణ నిబంధనల ప్రకారం జరుగలేదని పై నివేదికలో వెల్లడించారు.

ఆ ఉద్యోగం సునీతా దేవికి ఇవ్వాలనే ప్రతిపాదన పాస్ అయిందిగానీ బీఈఓ ఆమోదం పొందలేదు. కాబట్టి అదీ నిబంధనల ప్రకారం జరుగలేదు.

ప్రిన్సిపాల్ ప్రేమ్ సింగ్ ఆదేశాల మేరకు సునీత డిసెంబర్ 13 నుంచి ఈ ఉద్యోగానికి హాజరవుతున్నారు. కానీ, ఆమెకు ఎలాంటి అపాయింట్ మెంట్ లెటర్ రాలేదు. దాంతో డిసెంబర్ 20 వరకు మాత్రమే పని చేయగలిగారు.

అగ్రవర్ణాల విద్యార్థులు ఆమె చేతి భోజనాన్ని నిరాకరించడంతో, ఆమెను విధుల నుంచి తొలగించారు. దాంతో ఈ వివాదం వార్తాపత్రికలకెక్కింది.

కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ పూర్తిగా దర్యాప్తు జరిపిన తరువాతే సునీత ఉద్యోగంపై నిర్ణయం తీసుకుంటామని ఆర్‌సి పురోహిత్ చెప్పారు.

ఉత్తరాఖండ్

ఫొటో సోర్స్, Rajesh Dobriyall/BBC

'పిల్లల్లో వివక్ష బీజాలు నాటొద్దు'

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రదీప్ తమ్టా కూడా శనివారం సాయంత్రం చంపావత్ చేరుకున్నారు.

"అక్కడి అధికారులు, భోజనమాత, ప్రజాప్రతినిధులు, స్థానికులందరితో మాట్లాడి విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాను" అని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

"ఇలాంటి అంశాల వల్ల మన జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తానికి చెడ్డపేరు వస్తోందని ఆ శాఖ అధికారులకు చెప్పారు. కులవివక్షతో చిన్నారుల మనసులను వారి తల్లిదండ్రులే కలుషితం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలేం నేర్చుకుంటారు? సమాజ నిర్మాణం ఎలా ఉంటుంది? కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న పిల్లల మనసుల్లో వివక్ష బీజాలు నాటుతున్నారు."

"భోజన మాతగా సునీతా దేవి నియామకం అన్ని నిబంధనల ప్రకారం జరిగితే, ఆమెను ఎందుకు విధుల నుంచి తొలగించారని నేను అధికారులను ప్రశ్నించాను. విద్యాశాఖ ఆమోదం తెలుపడంలో జాప్యం జరిగితే అది సునీత తప్పెలా అవుతుంది? సునీతా దేవికి ఎందుకు శిక్షపడాలి?" అని ప్రదీప్ తమ్టా అన్నారు.

ఉత్తరాఖండ్

ఫొటో సోర్స్, Rajesh Dobriyall/BBC

'అగ్రకుల మహిళ చేతి వంట తినం'

ఈ సంఘటన జరిగిన తరువాత స్కూల్లోని దళిత విద్యార్థులందరూ ఏకమై అగ్రవర్ణ భోజనమాత చేతి భోజనం తినబోమని నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకున్న తరువాత సునీతా దేవికి బదులు విమలేష్ ఉప్రేతి ) వంట వండితే విద్యార్థులు తింటారా లేదా అనేది అనుమానమే.

'దిల్లీలో భోజనమాత ఉద్యోగం చేయను'

తన ఉద్యోగం వదులుకోనని, ధర్నాకు దిగుతానని సునీతా దేవి స్పష్టం చేశారు.

దిల్లీ ప్రభుత్వం సునీతకు ఉద్యోగం ఇస్తానని ప్రకటించిన వార్త ఆమెకు చేరింది. కానీ, దానికి సంబంధించి అధికారిక సమాచరమేమీ ఆమెకు అందలేదు.

"దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగం వస్తే తప్పక చేస్తాను. కానీ, భోజనమాత ఉద్యోగం చేయను. మా కుటుంబంలో అయిదుగురు ఉంటారు. 3,000 రూపాయల జీతం ఎలా సరిపోతుంది? దిల్లీలో ఇంటి అద్దె ఏడు ఎనిమిది వేలు ఉంటుంది. మూడు వేలతో అక్కడ నెట్టుకురాలేను. దిల్లీ ప్రభుత్వం వేరే ఉద్యోగం ఏదైనా ఇస్తే చేస్తాను" అని సునీత అన్నారు.

వీడియో క్యాప్షన్, కులవివక్షకు ఎదురు నిలిచి దళిత బాలికలకు చదువు నేర్పిన జైబాయ్ చౌదరి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)