వందన కటారియా ఇంటి దగ్గర కులవివక్ష వ్యాఖ్యల వివాదం ఏంటి, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

వందనా కటారియా

ఫొటో సోర్స్, ALEXANDER HASSENSTEIN/GETTY IMAGES

    • రచయిత, ధృవ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన తర్వాత, క్రీడాకారిణి వందనా కటారియా ఇంటి బయట కొందరు కులం పేరుతో గొడవ చేశారు.

హరిద్వార్ పోలీసులు ఈ ఘటనలో ఓ వ్యక్తిని ఎస్సీ/ఎస్టీ చట్టం కింద అరెస్టు చేశారు.

ఈ ఘటనలో వాస్తవాలను పరిశీలించేందుకు మేం వందనా కటారియా ఇంటికి వెళ్లాం.

రోషనాబాద్ గ్రామంలో అల్పాదాయ వర్గాలు నివసించే ఒక ప్రాంతంలో ఇరుకైన వీధిలో వందన కుటుంబం నివసిస్తోంది.

ఆమె ఇంటికి నడిచే వెళ్లాలి. అక్కడి ఇరుకైన సందుల్లో వాహనాలు వెళ్లలేవు. వందన ఇల్లు చేరుకోవాలంటే, మెయిన్ రోడ్డుపై కారు నిలిపి ఒక 300 మీటర్లు దూరం లోపలికి నడవాలి.

వందనా కటారియా ఇంటి అడ్రస్ చెప్పమంటే చాలామంది తమకు తెలీదన్నారు. ఎలాగోలా మేమే వందన ఇంటికి చేరుకున్నాం.

వందనా కటారియా తల్లి

ఫొటో సోర్స్, DHRUV MISHRA

ఫొటో క్యాప్షన్, వందనా కటారియా తల్లి

నిజంగా టపాకాయలు కాల్చారా?

"సాయంత్రం 5 గంటలైంది. మేం మ్యాచ్ చూస్తున్నాం. టపాకాయలు పేలుతున్న శబ్దం వినిపించింది. కిందకి వెళ్లి చూశాం. ఏం జరిగిందని అడిగితే టపాకాయలు కాలుస్తున్నారని చెప్పారు" అని వందన తల్లి చెప్పారు.

వందన తల్లి రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. మాతో ఎక్కువసేపు మాట్లడడానికి ఆమె నిరాకరించారు.

"మేమందరం టీవీలో మ్యాచ్ చూస్తున్నాం. మాతో పాటు మీడియావాళ్లు కూడా ఉన్నారు. ఇండియా మ్యాచ్ ఓడిపోగానే మా ఇంటి దగ్గర్లో ఉన్న వేరే ఇంటి ముందు టపాసులు కాల్చడం మొదలెట్టారు. ఆ శబ్దం విని, ఎవరు కాలుస్తున్నారో చూసి రమ్మని మా పెద్దన్నయ్య పంపించారు" అంటూ వందన అన్నయ్య లఖన్ సింగ్ చెప్పుకొచ్చారు.

"మేం కిందకు వెళ్లి చూసేసరికి అక్కడ చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. వీళ్లిలా టపాసులు కాలుస్తున్నారు కదా, వీళ్లను ఏం చేయాలి అని కొందరు మమ్మల్ని అడిగారు. తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకు వచ్చారు. ఏం జరుగుతోందో చెప్పాం. విక్కీ పాల్ (అసలు పేరు విజయ్‌ పాల్) అనే వ్యక్తిని పోలీసులు తమతో తీసుకెళ్లారు."

వందనా కటారియా ఇల్లు

ఫొటో సోర్స్, DHRUV MISHRA

ఫొటో క్యాప్షన్, వందనా కటారియా ఇల్లు

రెండోవైపు వాదన

విజయ్ పాల్ ఇల్లు వందన కటారియా ఇంటికి 40 మీటర్ల దూరంలో ఉంది. మేం అక్కడకు వెళ్లేసరికి ఆయన అక్క, చెల్లెలు ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. వాళ్లు భయంతో తలుపులు తీయలేదు. మీతో కొంచెం మాట్లాడాలని అడిగితే వాళ్లు ఒప్పుకోలేదు.

"మీరు వందన ఇంటి నుంచి రావడం మేం చూశాం. మీతో మేం మాట్లాడం" అని విజయ్‌పాల్ చిన్న చెల్లెలు మాతో అన్నారు.

కొంతసేపైన తర్వాత విజయ్ పాల్ అక్క మాతో మాట్లాడడానికి అంగీకరించారు.

"కావాలని మా తమ్ముడిని ఇందులో ఇరికిస్తున్నారు. ఇంతకుముందు కూడా మా తమ్ముడితో వందన సోదరులు గొడవపడ్డారు. కొట్టుకున్నారు కూడా" అంటూ గొడవల వీడియోలు కొన్ని మాకు చూపించారు.

తమ వాదన ఏంటో తెలుసుకోవడానికి మీడియా వాళ్లు ఎవరూ తమ ఇంటికి రాలేదని ఆమె అన్నారు.

"అందరూ వందన ఇంటికి వెళతారు. అటు నుంచి అటే వెళిపోతారు. ఏం జరిగిందని మమ్మల్ని ఎవరూ అడగరు" అన్నారు.

వందనా కటారియా కుటుంబం

ఫొటో సోర్స్, DHRUV MISHRA

ఫొటో క్యాప్షన్, వందనా కటారియా కుటుంబం

విజయ్ పాల్ తల్లి కవితా పాల్ అప్పుడే కోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చారు.

"ఆరోజు మా అబ్బాయికి ఒంట్లో బాలేదు. జ్వరం, దగ్గుతో లోపల మంచం మీద పడుకుని ఉన్నాడు. అప్పుడే మా మేడ మీద టపాకాయలు కాలుస్తున్న శబ్దం వినిపించింది. మేము పరిగెత్తుకుని వెళ్లి చూసాం. విజయ్‌పాల్ వాళ్ల నాన్నకు అదే విషయం చెబుతున్నా. ఇంతలో పోలీసులు వచ్చి మా అబ్బాయిని తీసుకెళ్లారు. ఏ ఘటనలోనైనా ఇంత త్వరగా పోలీసులు రావడం మీరెప్పుడైనా చూశారా?" అని కవితా పాల్ అన్నారు.

మీకు తెలీకుండా మీ ఇంటి మేడ మీదకి వచ్చి టపాకాయలు ఎవరు కాల్చగలరు? అని మేం ఆమెను అడిగాం.

"మా ఇళ్ల డాబాలు పక్కపక్కనే ఉంటాయి. వందన కుటుంబంతో మాకు పాత గొడవలు ఉన్నాయి. మా కుటుంబాల మధ్య మరిన్ని గొడవలు రేపాలనే ఉద్దేశంతో కూడా వేరే ఎవరైనా ఆ పని చేసుండవచ్చు" అని ఆమె అన్నారు.

చుట్టుపక్కల వాళ్లతో కూడా మేం ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నించాం. కానీ, ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాలేదు.

వందనా కాటరియా సోదరుడు

ఫొటో సోర్స్, DHRUV MISHRA

ఫొటో క్యాప్షన్, వందనా కాటరియా సోదరుడు

కులం పేరుతో తిట్టారా?

ఈ ఘటనలో విజయ్ పాల్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కులం పేరుతో నిందించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.

"ఇందులో ఎస్సీ/ఎస్టీ చట్టం అనే మాటే లేదు. కులం ప్రస్తావనే లేదు. కొందరు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. సమస్య కేవలం టపాసులు కాల్చడం గురించే" అని వందన సోదరుడు లఖన్ చెప్పారు.

అయితే, కులం పేరుతో నిందించారని వందన పెద్దన్నయ్య చంద్రశేఖర్ కటారియా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) స్వయంగా ఈ విషయాన్ని బీబీసీకి ధ్రువీకరించారు.

పోలీసులేం చెబుతున్నారు?

"వందనా కటారియా సోదరుడు చంద్రశేఖర్ లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగానే సెక్షన్ 504 (ప్రొవొకేషన్ యాక్ట్) కింద, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని హరిద్వార్ ఎస్ఎస్‌పీ సెంథిల్ అవుదై కృష్ణ రాజ్ ఎస్ చెప్పారు.

కులం పేరుతో నిందించారా లేదా అని మేం చంద్రశేఖర్‌ను అడిగాం.

"మేం దళితులం. ఈ విషయం అందరికీ తెలుసు. మేం మా కులాన్ని మార్చుకోలేం. కులం పేరుతో తిట్టారని, అవమానించారని నేనే కాదు, అక్కడున్న చాలామంది చెబుతారు. కావాలంటే వెళ్లి వాళ్లనే అడగండి. 'వందనా కటారియా ముర్దాబాద్' అంటూ నినాదాలు చేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మాతో ఏం శత్రుత్వం?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హరిద్వార్ ఎస్ఎస్‌పి సెంథిల్ కృష్ణరాజ్ ఎస్

ఫొటో సోర్స్, DHRUV MISHRA

ఫొటో క్యాప్షన్, హరిద్వార్ ఎస్ఎస్‌పి సెంథిల్ కృష్ణరాజ్ ఎస్

పాత గొడవలు, ఇరువైపులా నినాదాలు

"వాళ్లు బయట నుంచి వచ్చారు. ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు. మేం ఎవరికీ భయపడం, ముజఫర్‌నగర్ నుంచి వచ్చాం, అక్కడ ఏం చేశామో, ఇక్కడా అదే చేస్తాం అని వాళ్లు చెప్పుకుంటారు. నన్ను చంపేస్తామని కూడా బెదిరించారు" అని చంద్రశేఖర్ చెప్పారు.

మరోవైపు, తాము కుల ప్రస్తావనే తీసుకురాలేదని, వందన సోదరులే తమ కులం పేరు చెప్పి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారని కవితా పాల్ అంటున్నారు.

అయితే, వందన కజిన్ ఒకాయన మాత్రం విజయ్ పాల్ ఇంటి బయట నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నారు. అలాంటి వీడియో కూడా ఒకటి చూపించారు.

దళిత సంఘాల మద్దతు

వివిధ దళిత సంఘాలకు చెందిన వ్యక్తులు వందన ఇంటికి వెళ్లి మాట్లాడి వస్తున్నారు. కొందరు వందనా కటారియాకు మద్దతుగా పోస్టర్లు పట్టుకుని కనిపించారు.

టపాసులు కాల్చినవారిపై దేశద్రోహం, ఎన్ఎస్ఏ కింద కేసులు పెట్టి శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

హరిద్వార్‌లోని జబ్రేరా నుంచి బీజేపీ ఎమ్మెల్యే దేశరాజ్ కర్న్‌వాల్ వందన కుటుంబంతో మాట్లాడడానికి వచ్చారు. ఆయన కూడా అలా చేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని కోరారు.

"ఇది చాలా విచారకరమైన సంఘటన. దారుణం. కానీ, ఈ కేసులో సరైన విచారణ జరగాలి. అమాయకుడికి శిక్ష పడకూడదు. నేరస్థుడు తప్పించుకోకూడదు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)