షెడ్యూల్డు కులాల్లో రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందట్లేదా? ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్ ఎందుకు?
షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో, 1994లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, ఈదుమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం, ఆ తర్వాత, ఐదారేళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది.
ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పీఎస్ ఇప్పటికీ వర్గీకరణ కోసం పట్టుపడుతుండగా, రాష్ట్ర విభజనతో పాటు చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతికమైన అనేక పరిణామాల వల్ల ఈ అంశం ఈనాటికీ ఎటూ తేలకుండానే మిగిలిపోయింది.
అసలు వర్గీకరణ దేని కోసం?
ఈ కథ అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదలవుతుంది. ఆనాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువన్నమాట.
మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకూ ఉండొచ్చనేది ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. వృత్తి రీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి. రెల్లి కులస్థులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తుండేవారు.
అయితే, ఈ కులాలన్నీ కూడా ఊరవతల వెలివాడల్లో నివసించినవే. సమాజంలో దారుణమైన అణచివేతను, అంటరానితనాన్ని, వివక్షను అనుభవించినవే. నేటికీ అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినవే. అయినప్పటికీ, ఎస్సీల్లో కూడా 'ఎక్కువ', 'తక్కువ'లున్నాయి. ఉదాహరణకు, మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు. అలాగే, మాదిగలు కూడా కొన్ని ఉపకులాల వాళ్లను తక్కువగా చూస్తుంటారు.
ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. అయితే, ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ నిజానికి 1970 దశకంలోనే మొదలైంది. 1972 నుంచి మొదలై, ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ మాదిగ నేతలు వారిని కలవటం, ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేయడం జరుగుతూ వచ్చిందని బాలగోపాల్ 2000లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
'మాదిగల సంఖ్య ఎక్కువ.. లభిస్తున్న రిజర్వేషన్ కోటా తక్కువ'
జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ విషయంలో, మందకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం, "ఆనాటికి మాదిగలు 18 వేల ఉద్యోగాల్లో ఉండగా, వాటిలో 80-90 శాతం నాల్గో తరగతి ఉద్యోగాలే. మరోవైపు, మాలలు అన్ని రకాలవీ కలిపి 72 వేల ఉద్యోగాల్లో ఉన్నారు."
అంటే, రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం మాలలకు, దాని ఉపకులాల వారికి దక్కగా, మాదిగ, దాని ఉపకులాలకు దక్కింది కేవలం సుమారు 20 శాతమే.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి, ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్‌తో ముందుకు వచ్చింది ఎంఆర్పీఎస్.
బీసీ కులాల్లో ఇలాంటి ఏబీసీడీ విభజన ముందు నుంచే ఉంది కాబట్టి, నిజానికి, ఎంఆర్పీఎస్ లేవనెత్తిన డిమాండ్‌ను కూడా అదే దృష్టితో చూస్తూ పరిష్కరించాల్సింది. కానీ అలా జరగలేదు. అది అనేక మలుపులు తిరుగుతూ, ఈనాటికీ మాదిగలకు తీరని కలగానే మిగిలిపోయింది.

మాల మహానాడు అభ్యంతరాలు
మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై మొట్టమొదట మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్-కేటగరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుందని వారన్నారు.
పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పడ్డ మాల మహానాడు 'ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదు' అని వాదించింది. 'మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలుంటాయి. కానీ, మాలలకు ఆ అవకాశం లేదు' అని వాదించింది మాల మహానాడు.
ఇది మొత్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని కూడా విమర్శించారు. అంతేకాదు, ఇది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన ఉద్యమమని కూడా వారన్నారు. ఎందుకంటే, అప్పటికి రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా రాజకీయ సమీకరణాల్ని మార్చాలనేది ఆయన వ్యూహం అనే విమర్శ వర్గీకరణ వ్యతిరేకుల వైపు నుంచి బలంగానే వినిపించింది.
రాష్ట్ర విభజనతో కొత్త సవాళ్లు..
2014లో రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కొత్త సవాళ్లు ముందుకు వచ్చాయి. వీటిలో ప్రధానమైంది - ఈ సమస్యకున్న ప్రాంతీయ స్వభావం.
2011 జనగణన ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో కలిపి, మాదిగ జనాభా మాల జనాభాకన్నా దాదాపు 17 లక్షలు అధికం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మాలల జనాభానే ఎక్కువ. కాబట్టి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాల, మాదిగల జనాభా నిష్పత్తి ఒకే విధంగా లేదు.
మునుపటి అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధి పొందింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాలలే తప్ప తెలంగాణ మాలలు కాదు అనేది మరో వాదన. ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా, తెలంగాణలో మాలలది, మాదిగలది విద్యా, ఉద్యోగాల్లో కొంచెం అటు ఇటుగా ఒకే పరిస్థితి అన్న వాదనను బలపర్చే లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో వర్గీకరణను బలంగా కోరుకున్న మాదిగల ముందు ఇప్పుడు కొత్త సవాళ్లు తలెత్తాయి. వాటికి కొత్త పరిష్కారాలు వెదికే పరిస్థితి ముందుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
- 1983 వరల్డ్ కప్: జింబాబ్వేపై కపిల్ దేవ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు?
- SC వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
- షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ
- 2022 జనవరి 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయాలంటే గుర్తుంచుకోవాలసిన విషయాలు..
- సినిమా టికెట్ల వివాదం: నటుడు నాని ఎందుకలా స్పందించారు? మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారు?
- కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

