ఉన్నావ్‌ ఘటన: అమ్మాయి ఫోన్ నంబర్ ఇవ్వనందుకే అలా చేశానంటున్న నిందితుడు- గ్రౌండ్ రిపోర్ట్

ఉన్నావ్‌లో బబురహా గ్రామం

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బబురహా గ్రామంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించిన ఇద్దరు బాలికల అంత్యక్రియలు అదే గ్రామంలో జరిగాయి.

మూడో బాలిక కాన్పూర్ రిజెన్సీ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బబురహా గ్రామం పోలీసుల దిగ్బంధంలో ఉంది.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. వారిలో ఒకరు మైనర్. ఒక బాలికను ఫోన్ నంబర్ అడిగితే ఆమె ఇవ్వలేదని, దాంతో ఆ అమ్మాయిలకు పురుగుల మందు కలిపిన నీళ్లు ఇచ్చానని ప్రధాన నిందితుడు వినయ్ అంగీకరించినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

అయితే, అంతకుముందు గురువారం ఉన్నావ్ జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు బాలికల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. కానీ రిపోర్టులో వారి మరణానికి స్పష్టమైన కారణాలేవీ కనిపించలేదు.

"ఇద్దరు బాలికల శరీరాలపై బయట లేదా లోపల గాయాలయినట్లు ఎలాంటి గుర్తులూ కనిపించలేదు. వారి మృతికి స్పష్టమైన కారణం ఏదీ తెలియలేదు" అని ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ హితేష్ చంద్ర చెప్పారు.

విష ప్రయోగం వల్లే బాలికలు చనిపోయారా అనేది రసాయన పరీక్షలు చేయకుండా చెప్పడం కష్టం అని ఉన్నావ్ డిప్యూటీ సీఎంఓ డాక్టర్ తన్మయ్ కక్కడ్ బీబీసీతో అన్నారు.

కలెక్టర్‌కు కుటుంబ సభ్యుల దరఖాస్తు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, కలెక్టర్‌కు కుటుంబ సభ్యుల దరఖాస్తు

మరోవైపు, "ఘటనాస్థలంలో నురుగు లభించింది. దానిని బట్టి బాలికలు బహుశా విషం తాగడం వల్లే చనిపోయి ఉంటారని అనుకోవచ్చు" అని ఘటన తర్వాత మాట్లాడిన ఉన్నావ్ ఎస్పీ సురేష్ కులకర్ణి అన్నారు.

ఘటన జరిగిన తర్వాత రోజు చనిపోయిన బాలికల్లో ఒకరి తండ్రి అసోహా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు పెట్టారు.

చనిపోయిన బాలికల మెడకు దుపట్టా చుట్టి ఉందని, ఇద్దరి నోటి నుంచి నురుగు వస్తోందని ఎఫ్ఐఆర్‌లో కూడా రాశారు.

మూడో బాలిక కూడా అలాంటి పరిస్థితుల్లోనే కనిపించింది.

ఇద్దరు బాలికల శవాలకు పోస్టుమార్టం జరిగిన తర్వాత, అధికారులు వాటిని గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం ఇద్దరికీ అంత్యక్రియలు చేశారు.

మొదట గురువారం బాలికల శవాలను ఖననం చేసేందుకు అధికారులు జేసీబీని కూడా పిలిపించారు. కానీ, గ్రామంలో కొంతమంది, కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో జేసీబీని తిప్పి పంపేశారు.

అసోహా పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, అసోహా పోలీస్ స్టేషన్

బాలికలది ఒకే కుటుంబం

బబురహా గ్రామం పోలీసుల దిగ్బంధంలో ఉంది. గ్రామంలోని రోడ్డులో మూడు చోట్ల బారికేడ్లు పెట్టారు.

మీడియా వాళ్లను కూడా ఐడీ కార్డు చూశాకే బారికేడ్లు దాటి వెళ్లడానికి అనుమతించారు.

ఉన్నావ్ డీఎం రవీంద్ర కుమార్, ఆనంద్ కులకర్ణితోపాటూ లఖ్‌నవూ పరిధి ఐజీ లక్ష్మీ సింగ్ కూడా పగలంతా అక్కడే ఉన్నారు.

ముగ్గురు బాలికలు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు కజిన్స్. వారి వయసు 13, 16 ఏళ్లు. ఇక మూడో బాలిక వరుసకు ఇద్దరికీ మేనత్త అవుతుంది. వీరిలో 16 ఏళ్ల బాలిక సజీవంగా ఉంది. సీరియస్‌గా ఉన్న ఆమెకు కాన్పూర్‌లో చికిత్స కొనసాగుతోంది.

"ఆ బాలిక పరిస్థితి మెరుగుపడింది. కానీ, బంధువులు మాత్రం ఆమెను కాన్పూర్ నుంచి దిల్లీలోని ఏదైనా మంచి ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. ఆ బాలిక చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెబుతూ ఉన్నావ్ కలెక్టర్ ఆ ఆస్పత్రి నిర్వాహకులకు లెటర్ కూడా ఇచ్చారు" అని ఐజీ లక్ష్మీ సింగ్ చెప్పారు.

మృతుల బంధువుల్లో ఆగ్రహంతో ఉన్న ఒక మహిళ బీబీసీతో మాట్లాడారు. "ఆ అమ్మాయి అయినా బతికుందా, లేక చనిపోయిందా అని కూడా మాకు తెలియడం లేదు. తీసుకొస్తున్నప్పుడే ఆమె పరిస్థితి ఘోరంగా ఉంది. తనను వేరే ఎక్కడైనా చేర్పించాలని మేం అడుగుతూనే ఉన్నాం. కానీ పోలీసులు మా మాట వినలేదు. వారికి ఘటన గురించి తెలుసు. తను కూడా చనిపోతే, మా పిల్లలకు ఏం జరిగిందో, ఇదంతా ఎవరు చేశారో మాకు ఏదీ తెలీకుండా పోతుంది" అన్నారు.

ఘటనాస్థలం

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, ఘటనాస్థలం

గ్రామంలో పోలీసు బలగాల మోహరింపు

ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామం అంతటా పోలీసు బలగాలను భారీగా మొహరించారు. రాజకీయ పార్టీల నేతలు కూడా గుమిగూడారు.

"పశువులకు గడ్డి కోసుకొచ్చేందుకు బాలికలు పొలాల్లోకి వెళ్తుంటారు. గ్రామంలో మిగతా అమ్మాయిలు కూడా గడ్డి కోసం వెళ్తుంటారు. కానీ ఎప్పుడూ ఎలాంటి ఘటనా జరగలేదు. వాళ్లకు గ్రామంలో ఎవరితోనూ ఎలాంటి గొడవలు కూడా లేవు" అని గ్రామంలోని దయారామ్ అనే వృద్ధుడు బీబీసీతో చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన ఒక మృతురాలి సోదరుడు ముగ్గురూ మొదట్లో స్కూలుకు వెళ్లేవారు. కానీ, లాక్‌డౌన్‌తో స్కూళ్లు మూసేయడంతో అందరూ ఇప్పుడు ఇళ్లలోనే ఉంటున్నారని అన్నారు.

"మా చెల్లి 10వ తరగతి చదువుతోంది. చనిపోయిన ఇంకో బాలిక మా అన్న కూతురు. వాళ్ల అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నేను, మా అన్న ఇద్దరం కూలిపనులకు వెళ్తాం. ఇదంతా ఎలా జరిగిందో, ఎవరు చేశారో మాకు ఏం అర్థం కావడం లేదు" అని చెప్పారు.

బాధితురాలి ఇల్లు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఇంట్లో వాళ్లు ఏం చెబుతున్నారు?

మేం ఆ ఇంట్లోకి వెళ్లి మంచం మీద కూర్చుని ఏడుస్తున్న మృతురాలి తల్లితో మాట్లాడబోయాం. అంతలోనే, యూనిఫాం మీద నేమ్ ప్లేట్ లేని ఒక మహిళా పోలీస్, ఆమె చేయి పట్టుకుని, ఏం మాట్లాడవద్దు అని చెప్పారు.

మా వెనక ఉన్న నేమ్ ప్లేట్ లేని ఒక పోలీస్ అధికారి, వాళ్ల మాటలు రికార్డ్ చేయద్దని మా కెమెరామెన్‌కు పదే పదే చెబుతూవచ్చారు. అయినా, మేం మృతురాలి తల్లి, ఆమె వదినతో మాట్లాడాం.

చనిపోయిన బాలిక తల్లి బీబీసీతో మాట్లాడుతూ.. "ముగ్గురూ ఎప్పుడూ కలిసి వెళ్తుంటారు. ఏం జరిగిందో ఏం చెప్పాలి? మా అమ్మాయిలపై ఏదో జరగరానిది జరిగింది. మా ఆయన్ను, పిల్లలను అందరినీ పోలీసులు తీసుకెళ్లిపోయారు. మా ఇల్లంతా తనిఖీ చేశారు. కాగితాలు, లెటర్లు అన్ని వస్తువులూ ఎత్తుకెళ్లారు. మా ఇంట్లో వాళ్లు ఏమైపోయారో కూడా మాకు తెలియడం లేదు" అన్నారు.

మేం మాట్లాడుతున్న సమయంలోనే మహిళా పోలీస్ అధికారి ఆమెతో అక్కడ్నించి వెళ్లాలని, లోపలికి వెళ్లమని చెప్పారు.

మరోవైపు, బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఉన్నావ్ కలెక్టర్‌కు ఒక లేఖ కూడా రాశారు. ఈ కేసును సిట్‌తో దర్యాప్తు జరిపించాలని, కుటుంబ సభ్యులకు పరిహారం ఇప్పించాలని, కాన్పూర్‌లో చికిత్స పొందుతున్న బాలికను దిల్లీలోని ఎయిమ్స్‌కు షిఫ్ట్ చేయాలని అందులో కోరారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.