ఉన్నావ్: పొలంలో టీనేజీ బాలికల శవాలు: Newsreel

ఫొటో సోర్స్, AFP
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన పొలంలో 13, 16 సంవత్సరాల దళిత అమ్మాయిల మృత దేహాలు లభించాయి.
అదే ప్రదేశంలో కనిపించిన మరో 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు అమ్మాయిల మృత దేహాలు బుధవారం లభించినట్లు వారి కుటుంబాలు చెబుతున్నాయి. పెద్ద అమ్మాయిలు ఇద్దరూ అక్కా చెల్లెల్లు కాగా, 13 సంవత్సరాల బాలిక వారి బంధువు.
వారి కాళ్లు, చేతులు వాళ్ల దుస్తులతోనే కట్టేసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
బుధవారం మధ్యాహ్నం పశువులకు దాణా తీసుకొచ్చేందుకు ముగ్గురు బాలికలు పొలానికి వెళ్లారు. వారు చాలా సేపటి వరకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కోసం వెతకడం మొదలు పెట్టినట్లు వారి కుటుంబ సభ్యులు చెప్పారు.
అయితే, ఆ అమ్మాయిలు విష ప్రయోగం వలన మరణించి ఉంటారని ఒక సీనియర్ పోలీసు అధికారి అన్నారు.
వారి నోటి నుంచి ఏదో తెల్లని ద్రవం వచ్చిందని, అది విషం బారిన పడిన లక్షణమని డాక్టర్లు చెబుతున్నారు. "ఈ సంఘటనలో అందరి సాక్ష్యాలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం" అని పోలీస్ సూపరింటెండెంట్ సురేష్ రావు చెప్పారు.
ఈ అమ్మాయిలు దళిత కుటుంబాలకు చెందినవారు.
మహిళలపై లైంగిక వేధింపుల కేసులతో ఉన్నావ్ జిల్లా వార్తల్లో ఉంది.
సామూహిక అత్యాచారం జరిగిందనే కేసు విచారణ నిమిత్తం 2019లో కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ల ఉన్నావ్ మహిళపై దుండగులు దాడికి పాల్పడి, ఆమెకు నిప్పు అంటించారు. ఆ తరువాత ఆమె తీవ్ర గాయాలతో మరణించారు. 2019లో నమోదైన అత్యాచార కేసులో ఉన్నావ్‌కు చెందిన బీజేపీ నాయకుడు జైలుకెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్ స్కూల్స్‌లో అమ్మాయిలకు ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులు
న్యూజీలాండ్‌లోని అన్ని స్కూళ్లలో అమ్మాయిలకు నెలసరి సమయంలో పేదరికం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు జూన్ నుంచి ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నెలసరి సమయంలో టాంపన్లు, శానిటరీ ప్యాడ్‌లు వాడే ఖర్చు భరించలేక కొంత మంది అమ్మాయిలు తరగతులకు హాజరు కాలేకపోతున్నట్లు అధికారులు గుర్తించారు.
గత సంవత్సరం దేశంలోని 15 పాఠశాలల్లో ఈ ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేసే పైలట్ కార్యక్రమం నిర్వహించారు.
"జనాభాలో సగం మంది జీవితాలలో అతి సాధారణమైన విషయం కారణంగా యువత చదువును కోల్పోకూడదు" అని న్యూ జీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ అన్నారు.
నెలసరి సమయంలో వాడాల్సిన ఉత్పత్తులకు అయ్యే ఖర్చు భరించలేక న్యూజీలాండ్ లో ప్రతీ 12 మందిలో ఒకరు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని ఆర్డర్న్ చెప్పారు. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారిలో జరుగుతోంది.
నెలసరి ఉత్పత్తులను ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పేదరికం సమస్యపై దృష్టి సారించి, స్కూలుకు హాజరయ్యే వారి సంఖ్యను పెంచాలని చూస్తున్నట్లు ఆమె చెప్పారు. దీని ద్వారా పిల్లల పై సానుకూల ప్రభావాన్ని కలుగచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ పథకం కోసం న్యూజీలాండ్ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి 2024 సంవత్సరం వరకు 130 కోట్ల 94 లక్షల 55 వేల రూపాయిల ఖర్చు అవుతుంది. గత సంవత్సరం శానిటరీ ఉత్పత్తులు కావల్సిన వారందరికీ ఉచితంగా పంపిణీ చేసి ప్రపంచంలోనే తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. ఇంగ్లాండ్లో కూడా గత సంవత్సరం నుంచి అన్ని ప్రాధమిక, సెకండరీ స్కూళ్లలో పీరియడ్ ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో కూడా స్కూళ్లలో ఉచితంగా పీరియడ్ ఉత్పత్తులను ఇవ్వాలని చట్టాలను జారీ చేశారు.
ఉత్తర కొరియా ఒక క్రిమినల్ సిండికేట్‌గా మారిందన్న అమెరికా

ఫొటో సోర్స్, DoJ
ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలు, బ్యాంకుల నుంచి 130 కోట్ల డాలర్ల (సుమారు 9,400 కోట్ల రూపాయిలు) సొమ్మును చోరీ చేసి అపహరించిన నేరానికి గాను అమెరికా ముగ్గురు ఉత్తర కొరియా పౌరుల పై అభియోగాలను నమోదు చేసింది.
దీనితో పాటు ఈ ముగ్గురు అతి ప్రమాదకరమైన క్రిప్టో కరెన్సీ ప్రోగ్రాంలను ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. వీరిని ఇంకా నిర్బంధంలోకి తీసుకోలేదు.
వీరితో పాటు మరో కెనడా-అమెరికా పౌరుడిపై కూడా మనీ లాండరింగ్ అభియోగం నమోదు చేశారు.
వీరంతా 2017లో జరిగిన వాన్నాక్రై (Wannacry) సైబర్ దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దాడి వల్ల యూకె లో వైద్య రంగానికి చెందిన కంప్యూటర్ సేవలు జాతీయ స్థాయిలో దెబ్బ తిన్నాయి.
"ఉత్తర కొరియా ఒక క్రిమినల్ సిండికేట్ గా మారిందని" అమెరికా జాతీయ భద్రత విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ డెమెర్స్ ఈ అభియోగాలను ప్రకటిస్తూ అన్నారు. వీరిలో ఒక నిందితుడు పార్క్ జిన్ హోక్ రెండేళ్ల క్రితం 2014లో సోనీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్ కి సంబంధించిన హ్యాకింగ్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముగ్గురు నిందితులు పార్క్, జోన్ చాంగ్ హోక్, కిమ్ II నేర పూరిత కుట్ర, వైర్ ఫ్రాడ్, బ్యాంకు ఫ్రాడ్ చేసినందుకు గాను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరంతా ఉత్తర కొరియా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన రికనాయిసెన్స్ జనరల్ బ్యూరో కోసం పని చేస్తున్నారని అమెరికా న్యాయశాఖ తెలిపింది. "ఉత్తర కొరియాలో నేర నిర్వాహకులు తుపాకీలకు బదులు కీ బోర్డులను వాడి బస్తాల కొద్దీ డబ్బులకు బదులు క్రిప్టో కరెన్సీ డిజిటల్ వాలెట్లను దొంగలిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకు దొంగలుగా తయారయ్యారు" అని డెమెర్స్ చెప్పారు. ఈ ముగ్గురు నిందితులు ఉత్తర కొరియాలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ఉత్తర కొరియా తన పౌరులను నేర విచారణ కోసం అమెరికాకు అప్పగించదు.

ఇవి కూడా చదవండి:
- ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ సాగిన పోరాటంలో పోలీసు కాల్పులకు 32 మంది మృతి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా సాధించుకున్నారంటే
- మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?
- ‘‘బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్‌ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









