కాన్పుర్: రిక్షా నడిపే ముస్లిం కూలీపై దాడి, ‘జై శ్రీరాం’అంటూ నినాదాలు చేయాలని ఒత్తిడి

కాన్పుర్

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో రిక్షా నడిపే ముస్లిం కూలీని తీవ్రంగా కొట్టిన కేసులో ముగ్గురిని గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు.

‘‘జై శ్రీరాం’’అంటూ నినాదాలు చేయాలని బాధితుడిపై ఒత్తిడి చేసినట్లు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో రెండు రోజుల నుంచీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రిక్షా కూలీని కొందరు కొడుతూ కనిపిస్తున్నారు.

బాధితుడి చుట్టూ గుమిగూడిన వారిలో కొందరు ‘జై శ్రీరాం’అని గట్టిగా చెప్పు అంటూ అరుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. దీనిలో దెబ్బలు తింటూ కనిపిస్తున్న వ్యక్తి పేరు ‘అస్రార్ అహ్మద్.’

ఈ కేసుపై కాన్పుర్ పోలీస్ కమిషనర్ అసీం అరుణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాన్పుర్‌లోని బర్రా ప్రాంతంలో అస్రార్ అహ్మద్‌పై దాడి చేసిన వారిలో ముగ్గురు ప్రధాన నిందితులను మేం అరెస్టు చేశాం. వారి పేర్లు రాజేశ్ బండ్వాలా, అమన్ గుప్తా, రాహుల్ కుమార్. ఈ ఘటనతో సంబంధమున్న మిగతావారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఆయన చెప్పారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

అసలేం జరిగింది?

ఆ వీడియోలో అస్రార్ ఏడేళ్ల కుమార్తె నిందితులను వేడుకుంటూ కనిపిస్తోంది. ‘‘మా నాన్నను వదిలిపెట్టండి’’అని ఆమె ఏడుస్తోంది. చివరగా అస్రార్‌ను పోలీసులు జీపులో తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి.

అస్రార్‌పై దాడికి జులై 9న జరిగిన ఓ ఘటనతో సంబంధముందని వార్తలు వస్తున్నాయి.

బర్రా ప్రాంతానికి చెందిన తమ కుమార్తెను కొందరు ముస్లిం యువకులు వేధిస్తున్నారని ఓ హిందూ కుటుంబం జులై 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమ కుమార్తెను మత మార్పిడి చేసుకోవాలని ఆ యువకులు ఒత్తిడి చేశారని ఆ కుటుంబం ఆరోపించింది. అయితే, దీనిపై పోలీసులు మొదట కేసు నమోదు చేయలేదు.

కానీ, జులై 31న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ త్రివేది జోక్యం చేసుకోవడంతో.. సద్దాం, సల్మాన్, ముకుల్‌లపై కేసు నమోదు చేశారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

ఫొటో క్యాప్షన్, అస్రార్ కుటుంబం

ఇంటికి వచ్చి కొట్టారు..

‘మా అమ్మాయిని రోజూ వేధించేవారు. మత మార్పిడి చేసుకోవాలని ఒత్తిడి చేసేవారు. మొదట పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. తర్వాత కేవలం వేధింపుల కింద మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు’’అని బాలిక తల్లి బీబీసీకి చెప్పారు.

ఈ కేసుతో అస్రార్‌కు కూడా సంబంధమున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం కొందరు బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు అస్రార్ ఇంటికి వచ్చారు. వీరు మాట్లాడుతుండగా.. బాలిక బంధువుల్లో ఒకరు అస్రార్‌ను బయటకు లాక్కుంటూ వచ్చి అందరిముందు కొట్టడం మొదలుపెట్టారు.

అస్రార్‌ను కొడుతున్నప్పుడు పోలీసులు చూస్తూ అక్కడే ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

అస్రార్‌ను కొట్టినవారిలో కొందరు బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే మహేశ్ త్రివేది కుమారుడికి కూడా దీనితో సంబంధముందని వార్తలు వస్తున్నాయి.

ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎఫ్‌ఐఆర్‌లో ముగ్గురి పేర్లు చేర్చారు. గురువారం సాయంత్రం వీరిని అరెస్టు చేశారు.

కాన్పుర్

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

ఫొటో క్యాప్షన్, పోలీస్ కమిషనర్ అసీం అరుణ్ ఇంటి బయట నిరసనలు

మతపరమైన ఉద్రిక్తతలు..

మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు.

‘‘ఒకవైపు జులై 12న తనను వేధించారని అస్రార్ భార్య ఖురేషా బేగం కేసు పెట్టారు. మరోవైపు జులై 31న తమ కుమార్తెను వేధిస్తున్నారని, మత మార్పిడికి ఒత్తిడి కూడా చేస్తున్నారని బాలిక కుటుంబం కేసు పెట్టింది. రెండు కేసులనూ దర్తాప్తు చేపడుతున్నాం’’అని కాన్పుర్ డీసీపీ రవీనా త్యాగి చెప్పారు.

కాన్పుర్ డీసీపీ రవీనా త్యాగి

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

ఫొటో క్యాప్షన్, కాన్పుర్ డీసీపీ రవీనా త్యాగి

ఈ కేసుల విషయంలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బజ్‌రంగ్ దళ్ జిల్లా కన్వీనర్ దిలీప్ సింగ్ బజ్‌రంగి ఆరోపించారు. ‘‘పోలీసులు న్యాయం చేయకపోతే, మా సోదరులు, సోదరీమణులు ఇలా చిత్ర హింసలకు గురికావడాన్ని మేం చూస్తూ ఊరుకోం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు పోలీస్ కమిషనర్ అసీం అరుణ్ ఇంటి బయట గురువారం రాత్రి కొందరు బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అస్రార్‌పై దాడి కేసులో ముగ్గురుని అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)