చుండ్రు పోవడం ఎలా, తెలుసుకోవాల్సిన 5 విషయాలు

చుండ్రు పోవడం ఎలా,

ఫొటో సోర్స్, Getty Images

డాండ్రఫ్ లేదా చుండ్రు. ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ చుండ్రు సమస్య పోయినట్లే పోయి మళ్లీ మళ్లీ వస్తుంటుంది.

డాండ్రఫ్ ముఖ్యంగా ఒక ఫంగస్ వల్ల వస్తుందనేది తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు.

చుండ్రు దాదాపు మనందరి చర్మంపై సహజంగానే ఉంటుంది. కానీ, మనలో దాదాపు సగం మందికి ఇదొక సమస్యగా మారుతుంది.

వారిలో కూడా మూడింట ఒక వంతులో ఈ సమస్య ఏ స్థాయికి చేరుతుందంటే, చుండ్రు వల్ల వారికి బయటకు వెళ్లాలంటేనే కష్టమైపోతుంది.

చెప్పాలంటే డాండ్రఫ్ సమస్య అనేది చాలా మామూలు సమస్య. కానీ, పది మందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇది మనల్ని సిగ్గుపడాల్సిన పరిస్థితిలో పడేస్తుంది.

చుండ్రు సమస్య

ఫొటో సోర్స్, Getty Images

1. డాండ్రఫ్‌కు భయపడాలా...

చుండ్రు వల్ల బయట ఏవైనా కార్యక్రమాలకు వెళ్లడం, ఎవరినైనా కలవడం లాంటివి తగ్గించేశామని చాలా మంది చెబుతుంటారు. ఎందుకంటే చుండ్రు వల్ల వారికి అది ఇబ్బందిగా ఉంటుంది.

కానీ, చుండ్రుకు అంతగా భయపడాల్సిన అవసరంలేదు. దీనిని వదిలించుకోడానికి కొన్ని ప్రభావవంతమైన పద్ధతులు ఉన్నాయి.

మన వెంట్రుకల్లో డాండ్రఫ్‌కు ప్రధానంగా మాలాసిజియా గ్లోబోసా అనే ఫంగస్ కారణం అవుతుంది.

మన చర్మం, వెంట్రుకల్లో సహజంగా ఉన్న నూనెను ఈ ఫంగస్ పీల్చేసుకుంటుంది. కానీ, అదే సమయంలో ఈ ఫంగస్ ఓలెయిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల మన తలపైన దురద పెట్టడం మొదలవుతుంది.

ఈ ఫంగస్ కొంతమందిలో రోగనిరోధక స్పందనను కూడా అడ్డుకుంటుంది. దాంతో తలపైన చర్మం పొడిబారిపోయి పొక్కులు రావడం మొదలవుతుంది.

వీడియో క్యాప్షన్, కురులు, గోళ్లకు ఇదే బలమైన ఆహారం

2. చుండ్రు నుంచి ఉపశమనం ఎలా...

సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు ఈ పరిస్థితిని నియంత్రించడానికి సాయం చేసినా, వాయు కాలుష్యం ఈ చుండ్రును మరింత ఘోరంగా మారుస్తుంది.

ఇలాంటి సమయంలో చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి తలకు నూనె రాయడం అనేది అస్సలు మంచిది కాదు.

మాలాసెజియా గ్లోబోసా అనే ఫంగస్ మన జుట్టు, చర్మంలో సహజంగా ఉన్న నూనెను పీల్చేస్తుంది. అందుకే తలకు పెట్టిన నూనెను కడిగేయడం, లేదా శుభ్రం చేసుకోవడం అనేది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే, కొన్ని రసాయనాల సాయంతో చుండ్రును వదిలించుకోవచ్చు. వీటిలో అత్యంత ప్రభావంతమైనది యాంటీ-ఫంగల్ కెమికల్ మైకోనాజోల్, కెటోకానాజోల్.

కొన్ని షాంపూల్లో కెటోకానాజోల్ ఉపయోగిస్తున్నారు. కానీ మైకోనాజోల్ మాత్రం ప్రస్తుతం స్కిన్ క్రీమ్‌లా అందుబాటులో ఉంది.

అయితే, జంతువుల కోసం అందుబాటులో ఉన్న కొన్ని షాంపుల్లో మైకోనాజోల్ కెమికల్ ఉంటుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: 20 ఏళ్లలోపే తెల్ల జుట్టు వస్తోందా?

3. యాంటీ ఫంగల్ షాంపూ...

అయితే, యాంటీ ఫంగల్ షాంపూల ప్రభావం కొంత కాలం తర్వాత మీకు తగ్గినట్లు అనిపించవచ్చు. అందుకే చుండ్రు వదిలించుకోడానికి మీరు అప్పుడప్పుడూ వేరే ప్రత్యామ్నాయాలు ఉపయోగించాల్సి ఉంటుంది.

కోల్ టార్ షాంపూ చర్మం టర్నోవర్ ప్రక్రియను నెమ్మది చేస్తుంది. దీనితోపాటూ తలపై పొక్కులు రాకుండా ఉపశమనం పొందడానికి సాలిసిలిక్ యాసిడ్‌ ఉన్న షాంపూ ఉపయోగించవచ్చు.

అయితే, జింక్ లేదా సెలేనియం ఉన్న షాంపూలు కూడా ఫంగస్‌ను అడ్డుకోవడానికి సాయం చేస్తాయి.

పరిశోధకులు మాలాసెజియా జెనెటిక్ కోడ్‌ను సీక్వెన్స్స్ చేశారు. దీని సాయంతో ఈ ఫంగస్‌ను వదిలించుకోడానికి మరింత ప్రభావవంతమైన మందులను అభివృద్ధి చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న క్యాన్సర్ బాధితురాలు

4. డాండ్రఫ్‌కు కారణం..

డాండ్రఫ్ అనేది ఒక సాధారణ చర్మం స్థితి. మామూలుగా ముదురు రంగులో ఉండే చుండ్రు పొక్కులు జుట్టులో స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ సమస్య మరింత తీవ్రం అయితే, డాండ్రఫ్ భుజాలపై కూడా కనిపిస్తుంది.

ఆ పరిస్థితిలో మనకు నెత్తిన పొడిబారినట్లు అనిపిస్తుంది. దురద కూడా ఉండవచ్చు.

పరిశుభ్రంగా లేకపోవడం వల్ల చుండ్రు పెరగడం ఉండదు. అయితే, మీరు మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోకపోతే డాండ్రఫ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఒత్తిడి వల్ల, చలి వాతావరణంలో చుండ్రు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

వీడియో క్యాప్షన్, ‘నా జుట్టే నా కిరీటం’ - దక్షిణాఫ్రికాలో ఉద్యమం

5. చుండ్రు తీవ్రం అయితే...

చుండ్రు తీవ్రంగా ఉంటే మనం ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉపయోగించడం అనేది అత్యంత సులభమైన, మంచి పద్ధతి.

యాంటీ డాండ్రఫ్ షాంపూల్లో మనకు చాలా రకాల బ్రాండ్స్ లభిస్తాయి. ఈ కింది రసాయనాలు ఉన్న షాంపూలు ఉపయోగించి చుండ్రు వదిలించుకోవచ్చు.

  • జింక్ పైరీథియోన్
  • సాల్సిలిక్ యాసిడ్
  • సెలీనియం సల్ఫైడ్
  • కెటోకానాజోల్
  • కోల్ టార్

చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటే దాదాపు ఒక నెల పాటు యాంటీ-డాండ్రఫ్ షాంపూ ఉపయోగించి చూడాలి.

మీరు కావాలంటే ఒకటి కంటే ఎక్కువ యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉపయోగించి చూడవచ్చు. దాని వల్ల ఏ షాంపూ మీ చుండ్రు వదిలించడానికి బాగా పనిచేస్తోందో మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)