ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అధికారమిస్తే రూ.50కే చీప్ లిక్కర్ - సోము వీర్రాజు : ప్రెస్ రివ్యూ

తమకు అధికారమిస్తే చీప్ లిక్కర్ బాటిల్ రూ.70కి.. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే రూ.50కే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చినట్లు 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.
''కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ పేరు పెట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం ప్రజా ఆగ్రహ సభలో ప్రసంగిస్తూ... కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు.
బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని, పాలనపై అవగాహన ఉన్న వ్యక్తిని సీఎం చేస్తామని మాటిచ్చారు.
జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విశాఖలో కబ్జాలు చేస్తున్నారని, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని వాపోయారు.
గ్రామ సర్పంచ్‌లకు మోదీ నిధులిస్తే ఆ డబ్బుకూడా దారి మళ్లించి జగనన్న పేరు ప్రచారం చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్.. కుదిరితే నిలువు దోపిడీయే చేస్తున్నారని బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు.
‘నీ పాలనపై నీకు నమ్మకముంటే పీకే ఎందుకు... భారతీ సిమెంట్ ధర తగ్గించు. నీ పత్రికలో ఉచితంగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి కన్నా ఇసుక తక్కువ ధరకు ఇవ్వు. లేదంటే 2024లో ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారు’ అని ఆయన హెచ్చరించారు.
తనను అన్యాయంగా వివేకా హత్య కేసులో ఇరికించారని, వాళ్లే చంపి, వాళ్లే కుట్లేసి, వాళ్లే గుండెపోటని, చంద్రబాబు వేసిన సిట్ వద్దు సీబీఐ కావాలని.. ఇప్పుడు నిజం బయట పడటంతో అరెస్టు భయం పట్టుకుందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నట్లు'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, JANARDAN MISHRA/FACE BOOK
'రూ. 15 లక్షల లోపు అవినీతి అసలు అవినీతే కాదు' - బీజేపీ ఎంపీ
సర్పంచ్‌ల అవినీతిని బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా తేలిగ్గా తీసి పారేశారని ‘నమస్తే తెలంగాణ’ వ్యాఖ్యానించింది.
రూ. 15 లక్షలలోపు అవినీతి అసలు అవినీతే కాదని, అలాంటి ఫిర్యాదులతో ఎవరూ తన వద్దకు రావద్దని స్పష్టం చేశారు.
'ప్రస్తుత సవాళ్లను అధిగమించడంలో మీడియా పాత్ర' అనే అంశంపై సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్పంచ్‌ల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు చాలా మంది తన వద్దకు వస్తున్నారని ఆయన పేర్కొంటూ, రూ. 15 లక్షలకు మించిన అవినీతి పిర్యాదులు ఉంటేనే తనను సంప్రదించాలని చెప్పారు.
ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలవాలంటే రూ. 7 లక్షలు, తర్వాతి ఎన్నికలకు మరో రూ. 7 లక్షలు అవసరమవుతాయని, ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరో రూ. లక్ష కలిపితే ఈ మొత్తం రూ. 15 లక్షలు అవుతుందన్నది పచ్చి నిజమని పేర్కొన్నారు.
కాగా, అవినీతి పట్ల జనార్దన్ మిశ్రాకు ఉన్న మక్కువకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించినట్లు’’ నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, MERCK
కోవిడ్ ఔషధం వచ్చేసింది
కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న కోవిడ్-19 ఔషధం మోల్నుపిరావిర్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు 'సాక్షి' పేర్కొంది.
''ఈ యాంటీ వైరల్ డ్రగ్‌కు అయిదు రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండడంతో సహజంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఎట్టకేలకు మోల్నుపిరావిర్ ఔషధం తయారీ, విక్రయానికి పలు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అనుమతి ఇచ్చింది.
ఔషధ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుని వాటి ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించిన ఈ సంస్థలు.. మోల్నుపిరావిర్ జనరిక్ వర్షన్ ఉత్పత్తికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. మోల్నుపిరావిర్‌ను మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ అభివృద్ధి చేశాయి.
అయిదు రోజులు వాడితే చాలు..
ప్రస్తుతానికి మోల్నుపిరావిర్ 200 ఎంజీ క్యాప్సూల్స్ ఉత్పత్తికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. మోల్నుపిరావిర్‌ను 18 ఏళ్లు పైబడి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్-19 రోగులకు వైద్యులు సిఫార్సు చేస్తారు.
ప్రత్యేకత ఏమంటే అయిదు రోజులు ఈ మందు వాడితే చాలు. ఉదయం 800 ఎంజీ, రాత్రి 800 ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రాండ్‌నుబట్టి ఒక్కో క్యాప్సూల్ గరిష్ట ధర రూ.30 నుంచి రూ.75 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.
400 ఎంజీ క్యాప్సూల్స్ తయారీకై అనుమతించాల్సిందిగా ఇప్పటికే కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ రావొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 400 ఎంజీ అందుబాటులోకి వస్తే రోగులకు పెద్ద ఉపశమనం ఉంటుందని'' సాక్షి రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, PERNI NANI
సినీ హీరో నాని.. సినిమా హాలు కౌంటరు, కిరాణా కొట్టు కౌంటరు లెక్కపెట్టే ఉంటారు: మంత్రి పేర్ని నాని
తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరికి వారుగా ఆపాదించుకుని, వారి కోసమే సినిమా టికెట్ల రేట్లను తగ్గించారనడం సరికాదని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేసినట్లు 'ఈనాడు' పేర్కొంది.
‘‘రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన సినిమా పంపిణీదారుల సంఘం నేతలతో మంగళవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'హైకోర్టు సూచనల మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ... టికెట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
పంపిణీదారులు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, సినిమా హాళ్ల యజమానులతో పాటు వివిధ వర్గాల అభ్యర్థనలను కమిటీకి అందిస్తాం.
చాలా థియేటర్లకు అనుమతులు లేవని సెప్టెంబర్‌లోనే చెప్పినా... స్పందించని వారిపైనే చర్యలు తీసుకుంటున్నాం. సినిమా టికెట్ల అంశంపై ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాత దానయ్య నాకు రెండుసార్లు ఫోన్ చేశారు. ఈ విషయాలను కమిటీ పరిశీలిస్తుంది. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ విధానం అమల్లోకి తెస్తాం' అని మంత్రి వివరించారు.
సినీ హీరో నాని ఏ ఊళ్లో సినిమా హాలు, దాని పక్కనున్న కిరాణ కొట్టు లెక్కలేశారో తెలియదని ఆయన అన్నారు.
టికెట్ ధరలపై హీరో నాని వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా... 'ఆయన బాధ్యతాయుతంగానే ప్రకటన ఇచ్చారనుకుంటా. సినిమా హాలు కౌంటరు, పక్కన కిరాణా కొట్టు కౌంటరును లెక్కపెట్టే ఉంటారు' అని మంత్రి స్పందించారు.
చెన్నైలో ఉండే సినీ హీరో సిద్ధార్థ్ ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్ల గురించి ఎందుకు మాట్లాడతారని మంత్రి నాని ప్రశ్నించారు.
'మేం విలాసంగా బతుకుతున్నామో లేదో ఆయనొచ్చి చూశారా? తమిళనాడు సీఎం స్టాలిన్, అక్కడి మంత్రులను, లేదంటే మోదీని ఉద్దేశించి మాట్లాడి ఉంటారు' అని పేర్ని నాని వ్యాఖ్యానించినట్లు’’ ఈనాడు రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
- వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- కోవిడ్-19: పెరిగిన పాజిటివిటీ రేటు, దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
- హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్
- స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ
- 2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ
- చుండ్రు పోవడం ఎలా, తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








