ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుంది: సోము వీర్రాజు - BBC NewsReel

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్ఘాటించారు.
ఆయన సోమవారం రాజధాని ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన 64 వేల ప్లాట్లు కేటాయించేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ నిర్ణయించిందని.. దానికి తగ్గట్టుగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో శాశ్వత కార్యాలయం నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
రాజధాని కోసం భూములిచ్చిన 29,000 మంది రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మిగిలిన 9,000 ఎకరాలు అభివృద్ధి చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు.
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే తామే చేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ విషయం పలుమార్లు స్పష్టం చేశామని, కానీ మీడియా కథనాల వల్ల రైతుల్లో అపోహలు కలిగాయని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో బీజేపీ చెప్పిన దానికి కట్టుబడి ఉంటుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున రాజధాని అభివృద్ధి కోసం చేయాల్సినంత చేశామన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి తమ వద్ద బ్లూ ప్రింట్ ఉందని చెప్పారు.
రాజధానిని తరలిస్తున్నామని ప్రకటన చేసినా ఎయిమ్స్ కట్టకుండా ఆపలేదన్నారు. రూ. 1,800 కోట్లతో ఎయిమ్స్‌ని అద్భుతంగా నిర్మించామన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం రూ. 600 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
డిజైన్ ఇన్‌స్టిట్యూట్ కూడా కేంద్రం నిర్మిస్తోందన్నారు. రైతులు వాటిని గుర్తించాలని కోరారు. క్యాపిటల్ గెయిన్స్ సహా కేంద్రం నుంచి చేయాల్సినదంతా చేస్తున్నామన్నారు.
అమరావతి రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని, ఉద్యమిస్తున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీకేఎస్ నేతలు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారిపడ్డ జో బైడెన్.. కాలి ఎముకకు ఫ్రాక్చర్

ఫొటో సోర్స్, DELAWARE HUMANE ASSOCIATION
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్‌కు కాలు ఎముక ఫ్రాక్చర్ అయ్యింది.
తన పెంపుడు కుక్కల్లో ఒకటైన 'మేజర్'తో శనివారం ఫుట్‌బాల్ ఆడుతూ జారి పడటంతో ఆయన గాయపడ్డారు.
దీంతో ముందు జాగ్రత్తగా డెలావెర్‌లోని నెవార్క్‌లో ఓ ఆర్థోపెడిస్ట్ దగ్గరికి ఆయన వెళ్లారు.
ప్రాథమికంగా తీసిన ఎక్స్-రేల్లో ఎముకలో పగులు వచ్చినట్లు బయటపడిందని, సీటీ స్కాన్ తీయగా కుడి పాదంలోని రెండు చిన్న ఎముకల్లో సన్నని పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించామని బైడెన్ వ్యక్తిగత వైద్యుడు కెవిన్ ఓకానర్ చెప్పారు.
కొన్ని వారాల పాటు కాలికి దన్నుగా ఉండే బూట్లను (వాకింగ్ బూట్స్) బైడెన్ ధరించాల్సి రావొచ్చని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, DELAWARE HUMAN ASSOCIATION
బైడెన్ గాయపడ్డ విషయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. 'త్వరగా కోలుకోండి' అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవలే బైడెన్‌కు 78 ఏళ్లు నిండాయి. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. అతిపెద్ద వయసులో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు.
బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది దృష్టి ఉంది. ప్రత్యర్థులు కూడా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు తగినంత ఆరోగ్యంగా ఆయన ఉన్నారని ఏడాది క్రితం ఆయన వ్యక్తిగత వైద్యుడు ప్రకటించారు.
బైడెన్‌కు మేజర్‌తో పాటు చాంప్ అనే మరో కుక్క కూడా ఉంది. ఈ రెండు త్వరలో బైడెన్‌తోపాటు వైట్ హౌజ్‌లో అడుగుపెట్టనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: చంద్రబాబు సహా 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఫొటో సోర్స్, TDP
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు సభలో గందరగోళం ఏర్పడింది. నివర్ తుఫాన్ బాధితుల సహాయం విషయంపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పట్టుబట్టడం వివాదానికి దారితీసింది.
చివరకు సభ నుంచి 13 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు. ఆ తర్వాత మార్షల్స్ సహాయంతో ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించారు.
శాసనసభ సమావేశాల తొలి రోజు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇటీవల చనిపోయిన పలువురు నేతలకు నివాళి అర్పించారు. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని నిర్ణయించారు. 21 అంశాలపై చర్చకు అంగీకరించారు.
ఆ తర్వాత అసెంబ్లీలో పంచాయితీ రాజ్ సవరణ చట్టం-2020 చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. 'పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే, వారు దాన్ని వెనక్కి పంపించారు. ఆ తర్వాత మళ్లీ వారు నో చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు, వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారు. ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నాం' అని చెప్పారు.
దానిపై టీడీపీ సభ్యులు చర్చ లేకుండా బిల్లు ఆమోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల వాకౌట్ తర్వాత బిల్లు ఆమోదం పొందింది.
అనంతరం భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం అంశంపై చర్చను చేపట్టారు. ఆసందర్భంగా అధికార పక్షం నుంచి మంత్రి కన్నబాబు సహా పలువురు నేతలు మాట్లాడారు.
తమకు కూడా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు సహా టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయినప్పటికీ స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి దానికి నిరాకరించారు. దాంతో గందరగోళం ఏర్పడింది. వాగ్వాదం జరిగింది.
చివరకు చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా సభలోనే నేల మీద బైఠాయించారు. వారిని స్పీకర్ వారించినా వెనక్కి తగ్గకపోవడంతో చివరకు చంద్రబాబుతో కలిపి టీడీపీ నేతలందరినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సభలో వ్యవసాయరంగం పరిస్థితులపై చర్చ సాగింది.
సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల జాబితా
నారా చంద్రబాబు నాయుడు (ప్రతిపక్ష నేత-కుప్పం)
కె. అచ్చెన్నాయుడు (టెక్కలి)
గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమహేంద్రవరం రూరల్)
పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)
నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
ఏలూరిసాంబశివరావు (పర్చూరు)
బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం)
వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట)
అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
మంతెన రామరాజు (ఉండి)
డోలా బాల వీరాంజనేయస్వామి (కొండెపి)
వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ తూర్పు)
ఆదిరెడ్డి భవానీ (రాజమహేంద్రవరం సిటీ)

జో బైడెన్ మీడియా టీమ్‌లో అందరూ మహిళలే

ఫొటో సోర్స్, Getty Images
దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతో నిండిన మీడియా బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం వెల్లడించింది.
ఈ బృందానికి బైడెన్ మాజీ డిప్యూటీ కమ్యూనికేషన్ డైరెక్టర్ కేట్ బెడింగ్ ఫీల్డ్ నాయకత్వం వహిస్తారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా ఉన్న జెన్ పాస్కీ.. ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
తాము అధికారంలోకి వస్తే నియామకాల్లో అమెరికాలోని భిన్నత్వానికి ప్రాధాన్యమిస్తామని బైడెన్ గతంలో అన్నారు.
"వైట్‌హౌస్ మీడియా బృందం మొత్తానికి మహిళలకే బాధ్యతలు ఇచ్చామని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అనుభవజ్జులైన వీరంతా నిబద్ధతతో వ్యవహరించి దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తారని భావిస్తున్నాను" అని బైడెన్ ఓ ప్రకటనలో అన్నారు.
మరోవైపు ఇద్దరు మహిళా అధికారులు సైమన్ శాండర్స్, ఆష్లే ఎస్టినే కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మీడియా సహాయకులుగా పని చేయనున్నారు.
ప్రెస్ ఆఫీస్ నియామకాలకు సెనెట్ ఆమోదం అవసరం లేదు.

అగ్నిపర్వతం పేలుతుందని తెలిసినా టూరిస్టులను ఎందుకు తీసుకెళ్లారు?

ఫొటో సోర్స్, Getty Images
అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉందని తెలిసినా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరించిన 10 కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై న్యూజీలాండ్ ప్రభుత్వం అభియోగాలు మోపింది.
గత ఏడాది డిసెంబర్ 9న న్యూజీలాండ్‌లోని వైట్ ఐలాండ్ (వాకారీ ద్వీపం)లోని అగ్నిపర్వతం పేలి 22మంది టూరిస్టులు మరణించారు.
రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉన్నా టూరిస్టులను ఆ ప్రాంతానికి తీసుకెళ్లినందుకు మొత్తం 13మంది మీద న్యూజీలాండ్ వర్క్ అండ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం అభియోగాలు మోపారు.
ఈ అభియోగాలు రుజువైతే దీనికి బాధ్యులైన సంస్థలకు 1.5 మిలియన్ న్యూజీలాండ్ డాలర్లు (సుమారు రూ.7కోట్ల 44 లక్షలు), వ్యక్తిగత భద్రతను విస్మరించినందుకుగాను ముగ్గురు వ్యక్తులకు 3 లక్షల న్యూజీలాండ్ డాలర్ల (సుమారు రూ.22 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉంది.
వైట్ ఐలాండ్‌లోని అగ్నిపర్వతం 2011 నుంచి క్రియాశీలంగా ఉండగా, 2019లో ప్రమాద ఘటన జరగడానికి కొద్దివారాల ముందు అది మరింత యాక్టివ్‌గా మారిందని, ఏ క్షణంలోనైనా పేలుడు జరగవచ్చంటూ అధికారులు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
అయితే ఈ అగ్నిపర్వతం ఉన్న ద్వీపాన్ని నిర్వహిస్తున్న ఓ టూరిస్టు కంపెనీ నింబధనలకు విరుద్ధంగా ఆ ప్రాంతానికి యాత్రికులను చేరవేసింది. ప్రమాద సమయంలో ఆ ద్వీపంలో 47మంది యాత్రికులు ఉన్నారు. వారిలో 22మంది మరణించారు.
ఇవి కూడా చదవండి:
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- వాయుకాలుష్యం: తనకేమైందో ఏంటో తెలియకుండానే చనిపోయిన చిన్నారి
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








