వాయుకాలుష్యం: తనకేమైందో ఏంటో తెలియకుండానే చనిపోయిన చిన్నారి

ఎల్లా జీవితంతో చాలా పోరాడారు

ఫొటో సోర్స్, ROSAMUND ADOO KISSI DEBRA

ఫొటో క్యాప్షన్, ఎల్లా జీవితంతో చాలా పోరాడారు
    • రచయిత, క్లెయిర్ మార్షల్
    • హోదా, ఎన్విరాన్‌మెంట్ ప్రతినిధి

"ఆరోగ్యంగా, చలాకీగా ఉండే నా కూతురు ఎల్లా అకస్మాత్తుగా అనారోగ్యం బారినెందుకు పడింది? 10 సంవత్సరాల క్రితం రోగం బారిన పడినప్పటి నుంచి ఇవే ప్రశ్నలు. పాపకు ఉబ్బసం, మూర్ఛ ఎందుకు వచ్చేవో అర్థం కాలేదు" అని ఆమె తల్లి రోసామండ్ అడూ కిస్సి డెబ్రా చెప్పారు.

భవిష్యత్తులో ఆమెకు సమాధానం దొరకవచ్చు. కానీ, ఆమె చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

"ఈ స్థితినుంచి నేను బయటకు ఎలా వస్తానో తెలియదు. కానీ, నేను నా కూతురికి తానెందుకు అనారోగ్యం బారిన పడిందో తెలుసుకుంటానని మాటిచ్చాను, తెలుసుకున్నాను" అని రోసామండ్ చెప్పారు.

రోసామండ్ కుమార్తె అనారోగ్య సమస్యలతో బాధపడిన మూడు సంవత్సరాల కాలాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె ఎన్నిసార్లు అనారోగ్యం బారిన పడిందో కూడా ఆమె లెక్క మర్చిపోయారు.

"ఎల్లా కనీసం 30 సార్లు అనారోగ్యం బారిన పడి ఉంటారు. లండన్‌లో 5 హాస్పిటళ్లలో ఆ పాపకు చికిత్స ఇప్పించారు. కనీసం నాలుగుసార్లు వెంటిలేటర్ పై ఉంచారు. ఆ సమయంలో ఆమెతో మాట్లాడుతూ ఉండమని డాక్టర్లు చెప్పేవారు" అని రోసామండ్ చెప్పారు.

ఎల్లా ఫిబ్రవరి 2013లో మరణించారు. ఆ చిన్నారి తీవ్ర శ్వాసకోశ సమస్యలతో మరణించినట్లు డెత్ సర్టిఫికెట్ చెబుతోంది. కానీ ఎల్లా గాలిలో ఉన్న ఏదో పదార్థం వల్లే అనారోగ్యానికి గురైనట్లు 2014లో జరిగిన ఒక విచారణ నివేదిక తెలిపింది. ఆ పదార్థం ఏమిటో తెలుసుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నానని రోసామండ్ చెప్పారు.

ఎల్లాకు మేధస్సు ఉపయోగించి ఆడే చెస్ లాంటి ఆటలంటే ఆసక్తి ఉండేది.

ఫొటో సోర్స్, ROSAMUND ADOO KISSI DEBRA

ఫొటో క్యాప్షన్, ఎల్లాకు మేధస్సు ఉపయోగించి ఆడే చెస్ లాంటి ఆటలంటే ఆసక్తి ఉండేది.

రోసామండ్ లండన్‌లోని ఓ స్కూలులో పనిచేస్తున్నారు. ఆమె మానసిక శాస్త్రం, తత్వశాస్త్రం బోధించేవారు. ఎల్లా చాలా తెలివైన అమ్మాయి అని చెప్పారు. రోసామండ్ పిల్లలు ముగ్గురూ లండన్ ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ల్యూషమ్‌లో పుట్టి పెరిగారు. ఎల్లా అందరి కంటే పెద్ద అమ్మాయి. మిగిలిన కవలలకు ఇప్పుడు 13 సంవత్సరాలు.

వాళ్లు ఇప్పటికీ ఎల్లా గదిని ఆ చిన్నారికి నచ్చినట్లే ఉంచారు. ఎల్లాకు పైలట్ కావాలనే ఆసక్తి ఉండేది. ఆమె గది గోడలు ఆకాశం రంగులో ఉండి గోడలకు విమానాల బొమ్మలు అతికించి ఉంటాయి. వీరంతా కలిసి చిన్నారి సమాధి దగ్గరకు వెళ్లి ఎల్లాను గుర్తుచేసుకుంటూ ఉంటారు.

"ఎల్లా చదువులో ఎప్పుడూ ముందుండేది. 9 ఏళ్లకే 14 సంవత్సరాల పిల్లలు చదవగలిగేంత స్థాయి ఉండేది. ఎల్లా మరణానికి కొన్ని వారాల ముందు జేన్ ఐర్ కవిత్వాన్ని ఆస్వాదిస్తూ ఉండేది" అని రోసామండ్ చెప్పారు.

"ఎల్లాకు మేధస్సు ఉపయోగించి ఆడే చెస్ లాంటి ఆటలంటే ఆసక్తి ఉండేది. కనీసం12 రకాల సంగీత వాయిద్యాలను వాయించేది. స్విమ్మింగ్ కూడా బాగా చేసేది. ఎల్లాకు చదవడం రాయడం చాలా సహజంగా వచ్చింది. ఎవరైనా పిల్లలు రాయడం, చదవడంలో ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేసేది కూడా" అని రోసామండ్ చెప్పారు.

"ఎల్లా హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా అచేతన స్థితిలోకి వెళ్లడానికి ఇష్టపడేది కాదు. తన చేతికున్న సెలైన్ బాటిల్ తీసేసి, బ్యాండేజి వేసుకుని డాక్టర్ల అనుమతితో స్కూలుకు వెళ్లేది. స్కూలు అవ్వగానే తనను నేను హాస్పిటల్లో దించేదాన్ని" అని రోసామండ్ చెప్పారు.

"ఎల్లా జీవితంతో చాలా పోరాడింది. ఆ చిన్న వయసులో ఆమె పోరాడిన తీరు నాకు స్ఫూర్తి నిచ్చింది.

నేనెందుకు అనారోగ్యంతో ఉన్నానమ్మా అని నన్ను పదే పదే అడిగేది. ఆ మాటలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి" అని అన్నారు.

వారుండే ఇంటికి వెళ్లే దారి లండన్‌లో ఎప్పుడూ కిక్కిరిసి ఉండే రహదారుల్లో ఒకటి. ఎల్లాకు 7 ఏళ్లున్నపుడు 2010లో మొదటిసారి ఆమెకు ఉబ్బసం ఉన్న విషయం తెలిసింది.

"ఓరోజు స్కూలు పర్యటన కోసం ఓ స్మారక చిహ్నం సందర్శనకు వెళ్లాం. అక్కడ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత.. నేనింక ఎక్కలేను అని ఎల్లా చెప్పింది. అందరి తల్లుల్లాగే నేను కూడా నీకు జలుబే కదా... పర్వాలేదు ఎక్కు అన్నాను. తను ఎలాగోలా కష్టపడి మెట్లు పూర్తిగా ఎక్కేసింది. ఇప్పటికీ అది తలచుకుంటే నాకు గుండె ద్రవించుకుపోతుంది" అని రోసామండ్ బాధపడుతూ చెప్పారు.

కానీ, ఎల్లా ఇంటికి తిరిగి వస్తుండగా రైల్లో నిద్రపోయింది. కొన్ని రోజులకు పొగ తాగేవారిలా దగ్గడం మొదలు పెట్టింది.

మరికొన్ని రోజుల్లోనే మొదటిసారి ఎల్లా కోమాలోకి వెళ్లిపోయింది.

"ఆ తర్వాత 28 నెలలు ఎలా గడిచాయో ఎవరూ ఊహించలేరు. ఎల్లాకు సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎపిలెప్సి పరీక్షలు చేసి, చివరకు ఉబ్బసానికి చికిత్స చేశారు" అని రోసామండ్ చెప్పారు.

ఎల్లాకి మొదట్లో తన అనారోగ్యమేమిటో అర్థం కాలేదు. కానీ, కాలం గడిచే కొద్దీ తనకు అర్థమైంది.

"తను ఎంత బాధపడిందో తలచుకుంటే నాకు కన్నీళ్లాగవు. ఆ రోజులను నా జ్ఞాపకాల నుంచి తుడవలేను" అని రోసామండ్ చెప్పారు.

"చాలా సార్లు అర్థరాత్రిలో మూర్ఛ వచ్చేది. అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయేది. అంబులెన్సు వచ్చేవరకు కృత్రిమంగా ఊపిరి అందించేందుకు ప్రయత్నించేదాన్ని" అని చెప్పారు.

"ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడూ ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను" అని ఆమె అన్నారు.

"ఎల్లా ఒకసారి ఇంటెన్సివ్ కేర్‌లో ఉండగా డాక్టర్లు వచ్చి.. మేం చేయాల్సినదంతా చేశాం. ఇక తను పోరాడాల్సిందే అని చెప్పేశారు. ఆ సమయంలో తన బెడ్ పక్కన కూర్చోవడం తప్ప ఒక తల్లిగా మరేమీ చేయలేని నిస్సహాయత నాది. డాక్టర్లు తనతో మాట్లాడుతూ ఉండమని చెప్పేవారు. తన అనారోగ్యం గురించి ఎల్లాకు ఎలా చెప్పానో నాకే తెలియదు. ఆ తర్వాతెప్పుడూ నేను తనతో ఆ విషయం గురించి మాట్లాడలేదు" అని రోసామండ్ చెప్పారు.

ఎల్లాఇంటికి వెళ్లే దారి లండన్లో ఎప్పుడూ కిక్కిరిసి ఉండే రహదారుల్లో ఒకటి

ఫొటో సోర్స్, PHIL COOMES

ఫొటో క్యాప్షన్, ఎల్లాఇంటికి వెళ్లే దారి లండన్లో ఎప్పుడూ కిక్కిరిసి ఉండే రహదారుల్లో ఒకటి

ఎల్లా ఆఖరు రోజు ఎలా గడిచింది?

"ఆ రోజు వాలెంటైన్స్ డే. నేను బీతోవెన్ ప్రేమలేఖలు చదివి వినిపించాను.

ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. అదే నేను ఆఖరుసారి అంబులెన్సు కోసం కాల్ చేయడం. అంబులెన్సులో పాపకు మూర్ఛ వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. కానీ ఫిబ్రవరి 15న ప్రాణాలు కోల్పోయింది."

"ఆమె అంత్యక్రియల్లో బీతోవెన్ ప్రేమలేఖను ఆఖరిసారి చదివాను. మళ్లీ నేను ఆ లేఖ తీసి చూడలేదు. నేను చూడలేను" అని రోసామండ్ అన్నారు.

రోసామండ్ తన కూతురు శరీరంలో బొటన వేలి నుంచి తల వరకు అన్ని శాంపిళ్లు తీసుకోమని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్‌ను అడిగారు. అలా ఎందుకు చేశారో ఆమెకూ తెలియదు.

ఆమెకు న్యాయ సలహా లభించింది. తన బాధను వినేవారందరితో ఆమె మాట్లాడారు. ఆమెకు సహాయం చేయగలరు అనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. 2015లో ప్రభుత్వ సలహాదారు, ఉబ్బసం, వాయు కాలుష్య నిపుణుడు ప్రొఫెసర్ స్టీఫెన్ హొల్గేట్... ఎల్లా గురించి ఓ వ్యాసం చదివి రోసామండ్‌ను కలిశారు.

రోసామండ్ ఎల్లా శరీరం నుంచి సేకరించిన టిష్యూ నమూనాలను స్టీఫెన్‌కు అందించారు. దాంతో ఎల్లా ఉబ్బస తీవ్రత అర్థం చేసుకోవడానికి ఆయనకు వీలు కలిగింది.

ఆయన సమాచారాన్నంతటినీ పరిశీలించి ఎల్లా అనారోగ్యానికి, వారి ఇంటి దగ్గర్లో గాలిలో ఉండే నైట్రోజన్ డయాక్సైడ్, కొన్ని హానికారక విష వాయువులే కారణమని తేల్చారు. వాయు కాలుష్యం అంత తీవ్ర స్థాయుల్లో లేకుండా ఉండి ఉంటే ఎల్లా మరణించి ఉండేది కాదని ఆయన తీర్మానించారు.

"ఆ నివేదిక చదవగానే నాకు చాలా కోపం వచ్చింది. మాకు ఇక్కడి వాయు కాలుష్యం గురించి ఎవరూ చెప్పలేదు. మేం కేవలం వైద్య పరంగానే పరిష్కారాలు వెతుక్కున్నాం. కానీ, ఇది పర్యావరణానికి సంబంధించినది. నా మిగిలిన ఇద్దరు పిల్లల్లో ఎవరు దగ్గినా భయం వేస్తోంది" అని రోసామండ్ అన్నారు.

ఇప్పుడు జరగబోయే విచారణ అన్ని ఆధారాలను పరిశీలిస్తుంది. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర, స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలో కూడా పరిశీలిస్తుంది.

బ్రిటన్‌లో వాయు కాలుష్యానికి దీర్ఘ కాలం పాటు గురై ప్రతి ఏటా 30,000 మంది మరణిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.

కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్క మరణానికి వాయు కాలుష్యం కారణం అని నేరుగా ధ్రువీకరించలేదు.

ఒకవేళ వాయు కాలుష్యానికి గురై ఎల్లా మరణించినట్లు నిరూపణైతే, ఇది ప్రపంచంలో ఓ పెను మార్పు తీసుకునివచ్చే అంశం కావాలని రోసామండ్ ఆశిస్తున్నారు.

యూరోపియన్ కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 2 ప్రజలకు జీవించే హక్కును ఇస్తోంది. అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకునేందుకు ఎల్లా కేసు ఓ దిక్సూచి కాగలదు.

"కనిపించకుండా చంపేసే ఈ హంతకుడు, చట్టపరంగా కూడా కనిపించకుండా దాక్కున్నారు" అని రోసామండ్ లాయర్ జోసెలిన్ కాక్బర్న్ చెప్పారు.

ఇప్పుడు విచారణ దీనిని విస్మరించనివ్వదు

ఈ హడావిడి అంతా ముగిశాక, మీడియా ఇంటర్వ్యూలు పూర్తయ్యాక, లాయర్లు ఇంటికి వెళ్లాక, ఏం జరుగుతుంది?

రోసామండ్ జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఎక్కడికీ పోదు. ఎల్లా తిరిగి రాదు.

రోసామండ్ తను నివసిస్తున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్తారా? తన పిల్లలతో మాట్లాడతానని రోసామండ్ చెప్పారు. ఇప్పుడామె పూర్తి స్థాయి ఉద్యమకర్తగా మారారు. వేరే ఇంటికి మారే పరిస్థితిలో ఉన్నామో లేదో తెలియదు కానీ, మారాల్సి వస్తే మారతామని అంటున్నారు.

చాలామంది తమ అనుభవాలను పంచుకుంటూ తనకు ఉత్తరాలు రాసేవారందిరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నారు.

"కుటుంబ సభ్యులు, స్నేహితులు తనను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని ఎల్లా అనుకుంది. ఎల్లా ఈ భూమిపై చాలా తక్కువ కాలమే ఉంది. కానీ, తనదైన ముద్రను వేసి వెళ్లిపోయింది. ఇది ఎవరికైనా జరగవచ్చనే చర్చను ముందుకు తెచ్చింది. దీనిపై నువ్వేదైనా చేయకపోతే ఇంకెంతో మంది పిల్లలు చనిపోతారు అని నా మరో కూతురు చెబుతూ ఉంటుంది" అని రోసామండ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)