Bulli Bai: హైదరాబాద్‌లోనూ ‘బుల్లీ బాయి’ బాధితులు.. 67 ఏళ్ల ముస్లిం మహిళ ఫిర్యాదు

ఖలీదా పర్వీన్

ఫొటో సోర్స్, Khalida Parveen

ఫొటో క్యాప్షన్, సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముస్లిం మహిళలను కించపరుస్తూ.. వారి ఫొటోలను యాప్‌లో ఉంచి వేలంపాటలో పాల్గొనాలని యూజర్లను కోరుతున్న ‘బుల్లీ బాయి’ యాప్‌‌పై హైదరాబాద్‌లోనూ కేసులు నమోదవుతున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన హక్కుల కార్యకర్త ఖలీదా పర్వీన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ.... ‘ఇప్పటివరకు 112 మంది మహిళల ఫోటోలు ఈ యాప్‌లో పెట్టారు. సమాజంలో తమ గొంతు వినిపించే ముస్లిం మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. నా ఫోటో కూడా అందులో పెట్టారని తెలియడంతో సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. హైదరాబాద్ పోలీసులపై నాకు నమ్మకం ఉంది. అయేషా మెహనాజ్ అనే హైదరాబాద్ పాత్రికేయరాలి ఫోటో కూడా ఈ యాప్‌లో పెట్టారు’’ అన్నారు.

'బుల్లీ బాయి కేసులో 21 ఏళ్ల యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. విద్వేష జ్వాలలు ఎంత వ్యాపించాయో చూడండి. ముస్లింల పేరుతో బీజేపీ, ఆ ముఠా అంధభక్తుల జీవితాలను కూడా నాశనం చేస్తోంది. ఇదంతా కేవలం అధికారం కోసమే. పాపం ఈ యువకుడికి ఇదంతా అర్థమైతే నేరస్థుడయ్యేవాడు కాదు'' అని ఖలీదా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఖలీదా పర్వీన్

ఫొటో సోర్స్, Twitter/KhalidaParveen

అసలు బుల్లీబాయి, సుల్లీ డీల్స్ ఏమిటి?

'బుల్లీ బాయి' అనే యాప్ గిట్‌హబ్ అనే ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది.

సోషల్ మీడియా యూజర్ల వివరాల ప్రకారం దీన్ని ఓపెన్ చేయగానే.. ముస్లిం మహిళల ముఖాలను బుల్లీ బాయి అనే పేరుతో చూపిస్తుంది.

ట్విటర్‌లో చురుగ్గా ఉండే మహిళల ఫొటోలు, పేర్లను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఆ మహిళల ఫొటో కింద బుల్లీ బాయి అని రాస్తారు. ఈ యాప్ ద్వారా సదరు మహిళలతో డీల్ చేసుకోవచ్చని అందులో చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, బుల్లీ బాయి యాప్ వివాదం ఏంటి?

నివేదికల ప్రకారం గిట్‌హబ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాం. ఇది యూజర్లు అప్లికేషన్ క్రియేట్ చేయడానికి, షేర్ చేసుకోడాన్ని అనుమతిస్తుంది. గిట్‌హబ్‌లో ఎవరైనా వ్యక్తిగత లేదా సంస్థ పేరుతో యాప్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి తోడు మనం ఆ యాప్‌ను గిట్‌హబ్ మార్కెట్ ప్లేస్‌లో అమ్మవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు.

ఈ తరహా యాప్ ఇదే మొదటిది కాదు. గత ఏడాది జులైలో సుల్లీ డీల్స్ అని ఇలాంటి యాప్ వచ్చింది. అప్పట్లో ఆ యాప్‌పై చర్యలు తీసుకోమని దిల్లీ, ముంబయి పోలీసులకు ఫిర్యాదులు అందినప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి మహిళలను టార్గెట్ చేస్తున్నారు?

సమస్యలపై గొంతు విప్పే ముస్లిం మహిళల ఫోటోలు ఈ యాప్‌లో పెడుతూ వారిని వేలంలో పాడుకోమని ఈ యాప్ యూజర్లను కోరుతోంది.

దిల్లీలో ఇస్రత్ అరా అనే మహిళా జర్నలిస్ట్ ఫోటోలు కూడా ఇందులో పెట్టారు. ఆమె దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని తల్లి ఫోటో కూడా ఇందులో పెట్టారు . ఆవిడ 2016 నుంచి కనిపించడం లేదు.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన చాలదు.. వెంటనే అరెస్టులు జరగాలి: అసదుద్దీన్

ఈ యాప్ వల్ల ముస్లిం మహిళలకు కలుగుతున్న ఇబ్బందులపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

అయేషా మెహనాజ్ అనే హైదరాబాద్ జర్నలిస్ట్ తన ఫొటో ఈ యాప్‌లో పెట్టారని ఆగ్రహిస్తూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్‌పై స్పందించిన అసదుద్దీన్.... బుల్లీబాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘కేవలం ఒక ఎఫ్ఐఆర్ సరిపోదు . నేరస్తులను అరెస్ట్ చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డిలను కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)