ఇమ్రాన్‌ఖాన్: 'అవినీతి, లైంగిక నేరాలే ఇస్లాంకు అసలైన సవాళ్లు' అని పాక్ ప్రధాని ఎందుకు అన్నారు

ఇంటర్నెట్ కారణంగా యువత పెడదోవ పడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇంటర్నెట్ కారణంగా యువత పెడదోవ పడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

నానాటికీ పెరిగిపోతున్న అవినీతి, లైంగిక నేరాలు ముస్లిం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

''రియాసత్-ఎ-మదీనా, సొసైటీ అండ్ ఎథికల్ రివైవల్' అనే అంశంపై ప్రపంచంలోని అగ్రశ్రేణి ముస్లిం పండితులు సమక్షంలో జరిగిన ఓ సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ రెహ్మతుల్-లిల్-అలమీన్ అథారిటీ (ఎన్‌ఆర్‌ఏఏ) ఈ సదస్సును నిర్వహించింది.

ప్రవక్త జీవిత సందేశాన్ని ప్రజలకు ఎలా అందించాలో పరిశోధించడానికి గత ఏడాది అక్టోబర్‌లో ఇమ్రాన్ ఖాన్ ఈ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

సోషల్ మీడియా ప్రభావం నుండి యువతను రక్షించడం, వారిలో విశ్వాసం, మతపరమైన విలువలను తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం పై ఈ చర్చలో పాల్గొన్న పలువురు మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, జిన్నా టవర్ గుంటూరులో ఎందుకుంది?

''సమాజంలో రెండురకాల నేరాలున్నాయి. మొదటిది అవినీతి, రెండోది లైంగిక నేరం. మన సమాజంలో లైంగిక నేరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అత్యాచారం, పిల్లలపై లైంగిక వేధింపుల సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిలో కేవలం ఒక శాతం ఘటనలలోనే కేసులు నమోదయ్యాయి'' అన్నారు ఇమ్రాన్‌ ఖాన్.

''మిగిలిన 99% కేసులకు వ్యతిరేకంగా సమాజం పోరాడాలని నేను నమ్ముతున్నాను. అవినీతి విషయంలో కూడా అంతే. అవినీతిని సమాజం తిరస్కరించాలి'' అంటూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ''మీ నాయకులు భ్రష్టులైతే, వారు అవినీతిని ఆమోదయోగ్యంగా మారుస్తారు'' అన్నారాయన.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ 2019లో లండన్‌ వెళ్లిపోయారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ 2019లో లండన్‌ వెళ్లిపోయారు

నవాజ్ షరీఫ్పై కేసులేంటి?

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ 2019 నవంబర్ నుంచి లండన్‌లో ఉంటున్నారు. ఆయన చికిత్స కోసం నాలుగు వారాల పాటు లండన్ వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు గతంలో అనుమతించింది. 2018 జులైలో అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్, ఆయన కూతురు మరియం, అల్లుడు ముహమ్మద్ సఫ్దర్‌లు దోషులుగా తేలారు.

అల్-అజ్జియా స్టీల్ మిల్స్ కేసులో దోషిగా తేలిన తర్వాత 2018 డిసెంబర్‌లో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే రెండు కేసులలో ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతోపాటు చికిత్స నిమిత్తం లండన్ వెళ్లేందుకు కూడా అనుమతి లభించింది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ దివాలా తీస్తుందా

యువత-ఆధునికత

ముస్లిం యువత ఇంటర్నెట్‌లో అసభ్యకరమైన విషయాలను నిరోధించాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో అన్నారు.

ఈ సెమినార్‌కు హాజరైన ముస్లిం పండితులు ఆధునికత వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవటానికి ముస్లిం దేశాలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

''ప్రస్తుతం ప్రపంచం ముఖ్యంగా యువకులకు మరింత అనిశ్చితంగా, చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది'' అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇస్లామిక్ స్టడీస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ హుస్సేన్ నాసర్ అన్నారు.

పాశ్చాత్య శక్తులు ఇస్లాం పట్ల నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఇది మతంపై దాడి అని అన్నారు.

అవినీతి అనేది కుళ్లిపోయిన యాపిల్ లాంటిదని అమెరికాకు చెందిన షేక్ హంజా యూసుఫ్ అనే ముస్లిం పండితుడు వ్యాఖ్యానించారు. అవినీతి సమాజాన్ని నాశనం చేస్తుందన్నారు. అవినీతి వల్ల ప్రజలపైనా, సమాజంపైనా ఎలాంటి ప్రభావం ఉంటుందో ఖురాన్‌లో కూడా చెప్పారని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

ఇస్లాంలో స్త్రీలు, పిల్లలను చూసుకునే బాధ్యత పురుషులపై ఉంది. మహిళలను గౌరవించడం యువతకు నేర్పాలని ఆయన ఉద్ఘాటించారు.

''మొబైల్‌లో లభ్యమయ్యే సమాచారం నేటి యువతకు అతి పెద్ద సవాల్‌'' అని కేంబ్రిడ్జి ముస్లిం కాలేజ్ డీన్ డాక్టర్ అబ్దల్ హకీమ్ మురాద్ అభిప్రాయపడ్డారు.

''మతాల మధ్య సాంస్కృతిక చర్చల అవసరం ఎంతో ఉంది. దాని ద్వారానే సమాజంలో సుస్థిరత నెలకొంటుంది'' అని మలేషియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉస్మాన్ బకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

''మనం ప్రపంచీకరణ, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. యువతపై ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువగా ఉంది'' అని యూఏఈ ఫత్వా కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా బిన్ బయా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)