1971 భారత్-పాక్ యుద్ధం: పారిపోవడానికి ఎత్తులు వేసిన పాక్ యుద్ధఖైదీలకు చుక్కలు చూపిన భారత సైన్యం

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ సైన్యం 1971 డిసెంబర్ 16న భారత సైన్యం ముందు లొంగిపోయింది.
నాలుగు రోజుల తర్వాత జనరల్ నియాజీ, ఆయన సీనియర్ సహచరులు మేజర్ జనరల్ రావ్ ఫర్మాన్ అలీ, అడ్మిరల్ షరీఫ్, ఎయిర్ కమోడోర్ ఇనాముల్ హక్, బ్రిగేడియర్ బాకిర్ సిద్దిఖీలను కోరిబు విమానంలో కలకత్తా తీసుకెళ్లారు.
నియాజీ తన పీఆర్వో సిద్దిక్ సాలిక్‌ను ఢాకాలోనే వదిలేయకూడదని అనుకున్నారు. దాంతో ఆయన్ను ఫర్మాన్ అలీ నకిలీ ఏడీసీగా మార్చేసి కలకత్తాకు తీసుకెళ్లారు.
జనరల్ సగత్ సింగ్ వీరందరినీ ఢాకా విమానాశ్రయంలో వదలడానికి వచ్చారు. అందరినీ ఫోర్ట్ విలియమ్ లివింగ్ క్వార్టర్స్‌లో ఉంచారు.
లొంగిపోయినప్పుడు మొదటి పత్రాల్లో టైమ్ తప్పుగా ఉండడంతో, జనరల్ జాకబ్ సరెండర్ పత్రాలను మళ్లీ టైప్ చేయించారు.
నియాజీ, జనరల్ ఆరోరా వాటిపై మళ్లీ సంతకాలు చేశారు. ఆ తరువాత ప్రారంభంలో జరనల్ జాకబ్ నియాజీ ఆయన సహచరులను చాలా లోతుగా విచారించారు.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
పాకిస్తాన్ జనరల్ ఎఎకే నియాజీ తన ఆత్మకథ 'ద బిట్రేయల్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్'లో ఆ వివరాలన్నీ రాశారు.
"మమ్మల్ని అప్పుడే కొత్తగా నిర్మించిన ఒక మూడంతస్తుల భవనంలో ఉంచారు. అది చాలా శుభ్రంగా ఉండేది. మేం ఒక గదిని డైనింగ్ రూంగా మార్చాం. మా ఆహారం అంతా భారత్‌కు చెందిన వంటవాళ్లు చేసేవారు. కానీ వాటిని మా ఆర్డర్లీ మాకు వడ్డించేవాడు. మేం అక్కడ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, వ్యాయామం చేస్తూ టైంపాస్ చేసేవాళ్లం"
"ఒక రోజు నేను మాపై పర్యవేక్షణకు నియమించిన భారత అధికారి కల్నల్ ఖారాతో మా మేజర్ జనరల్ జమ్‌షెడ్ ఎక్కడ అని అడిగాను. ఆయన ఢాకాలో పాలనాపరమైన కార్యాల్లో మాకు ఇంకా సాయం చేస్తున్నారు అని ఖారా నాకు చెప్పారు. కానీ, జమ్‌షెడ్‌ను ఢాకాలో ఉంచకుండా కలకత్తాలోని ఒక జైల్లో ఏకాంత నిర్బంధంలో ఉంచారని నాకు తర్వాత తెలిసింది" అని రాశారు.
వీఐపీ యుద్ధ ఖైదీలను కలకత్తా నుంచి జబల్పూర్ షిఫ్ట్ చేశారు. నియాజీ, ఆయన సహచరులను జబల్పూర్‌లోని శిబిరం నంబర్ 100కు తీసుకెళ్లారు.
భారత అధికారులు మేజర్ జనరల్ రావ్ ఫర్మాన్ అలీని కలకత్తాలోనే ఉంచి, విచారించాలని భావించారు. కానీ, నియాజీ దానికి ఒప్పుకోలేదు.
నిజానికి భారత సైనికులకు ఫర్మాన్ అలీ ఆఫీసులో ఆయన చేతిరాతతో ఉన్న ఒక పేపర్ దొరకడంతో వారు ఆయన్ను విచారించాలని అనుకున్నారు. ఆ పేపర్‌లో "గ్రీన్ లాండ్ విల్ బీ పెయింటెడ్ రెడ్"(ఆకుపచ్చ భూమికి ఎర్ర రంగు వేస్తాం) అని ఉంది.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
నియాజీ ఆత్మకథలో ఆనాటి ఘటనలు
"మమ్మల్ని బాచిలర్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో ఉంచారు. ప్రతి అధికారికీ అటాచ్డ్ బాత్రూం ఉన్న ఒక బెడ్ రూమ్ ఇచ్చారు. ఒక కామన్ లివింగ్ రూమ్, దానికి ఎదురుగా ఒక వరండా ఉండేది. అక్కడ చాలా గదులు చాలా ఉండడంతో మేం ఒక గదిని నమాజు చేసుకోడానికి, మరో గదిని మెస్‌లా మార్చుకున్నాం".
మాకు రోజూ ఒకేలాంటి భోజనం పెట్టేవారు. అన్నం, చపాతీలు, కూరలు, పప్పు. అప్పుడప్పుడు మాంసం కూడా పెట్టేవారు. మా క్యాంప్‌కు నాలుగు వైపులా ముళ్ల కంచె ఉంది. ఒక సెంట్రీ అల్సేషియన్ కుక్కతో 24 గంటలూ మాపై నిఘా పెట్టేవాడు. క్యాంపు బయట మా భద్రత కోసం భారత సైనికుల ఒక మొత్తం బెటాలియన్ ఉండేది. మొత్తానికి క్యాంప్ స్టాఫ్ మాతో చాలా బాగా ప్రవర్తించేవారు.
యుద్ధ ఖైదీలను చూసుకోడానికి జనరల్ షాబేగ్ సింగ్‌ను నియమించారు.
యుద్ధ ఖైదీల క్యాంపులో నమాజుకు జనరల్ అన్సారీ నేతృత్వం వహించేవారు. జెనీవా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం ఖైదీలుగా ఉన్న పాకిస్తాన్ అధికారులను ప్రతి నెలా రూ.140 వేతనం ఇచ్చేవారు. వారు ఆ డబ్బును పుస్తకాలు, పెన్నులు, పేపర్లు రోజువారీ వస్తువులు కొనుక్కోడానికి ఉపయోగించేవారు.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
మార్కెట్ నుంచి వాళ్లకు అవసరమైన వస్తువులు కొనుక్కొచ్చి ఇవ్వడానికి అక్కడ ఒక భారత హవల్దార్‌కు డ్యూటీ కూడా వేశారు.
కొన్ని రోజులకు ఆ శిబిరం చుట్టూ భారత సైనికులు ఒక గోడ కట్టడం మొదలుపెట్టారు. జనరల్ నియాజీ దాన్ని వ్యతిరేకించడంతో, లోపల మీరున్నట్లు బయటి నుంచి ఎవరూ కనిపెట్టకుండా ఉండాలనే ఇలా చేస్తున్నట్లు సైనికులు ఆయనకు చెప్పారు.
"పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని చంపడానికి ఇద్దరిని పంపించిందని అధికారులు నాకు చెప్పారు. నాతో మాట్లాడిన జనరల్ పాడా తను దిల్లీలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లినపుడు కలకత్తాలో జంషెద్ అనే వ్యక్తి పట్టుబడ్డాడని, జనరల్ నియాజీని చంపడానికి, మరో వ్యక్తితో కలిసి తను భారత్ వచ్చినట్లు అతడు వారికి చెప్పినట్లు నాతో అన్నారు" అని నియాజీ రాశారు.
"కొన్ని రోజుల తర్వాత జనరల్ పాడా స్థానంలో మేజర్ జనరల్ షాబేగ్ సింగ్‌ను క్యాంపులో నియమించారు. ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. భారత్‌లో సిక్కుల పట్ల సరిగా ప్రవర్తించడం లేదని ఆయన నాతో అనేవారు. ఖలిస్తాన్ మ్యాప్ నాకు చూపించింది ఆయనే. అందులో మొత్తం తూర్పు పంజాబ్‌ను కూడా చేర్చారు. తర్వాత 1984లో భారత సైనికులు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించినపుడు ఆయన జర్నైల్ సింగ్ భిండ్రావాలేతో కలిసి పోరాడుతూ చనిపోయారు" అన్నారు.

ఫొటో సోర్స్, ROLI BOOKS
సొరంగం తవ్వి పారిపోవాలని ప్రణాళిక
కొన్ని రోజుల తర్వాత కల్నల్ హకీమ్ అర్షద్ ఖురేషీ(మేజర్ జనరల్ అయ్యారు), ఆయన సహచరులను డిసెంబర్ 21న బస్సుల్లో భారత్ తీసుకొచ్చారు.
రోడ్డు, రైలు మార్గాన ప్రయాణించిన తర్వాత వారందరినీ రాంచీలోని యుద్ధఖైదీల శిబిరం నంబర్ 95కు తీసుకొచ్చారు. వారు అక్కడికి వచ్చినప్పటి నుంచే క్యాంప్ నుంచి పారిపోయే ప్రణాళికలు వేయడం మొదలెట్టారు.
సరిగ్గా అదే రోజున భారత కమాండెంట్ ఆ క్యాంప్‌లో పర్యటిచారు. శిబిరాన్ని సరిగా మెయింటైన్ చేయడం లేదని చాలా ఆగ్రహించారు.
మేజర్ జనరల్ హకీమ్ అర్షద్ ఖురేషీ తన '1971 ఇండో-పాక్ వార్ ఎ సోల్జర్స్ నరేటివ్'లో ఆనాటి ఘటనల గురించి రాశారు.
"కమాండెంట్ వెళ్లిపోయిన తర్వాత మేం భారత జేసీఓతో మాకు పార, పలుగు ఇవ్వాలని, ప్రతి బ్యారక్ ముందు పూల మొక్కలు నాటడానికి పాదులు చేస్తామని చెప్పాం. అలా చేస్తే, ఈసారి కమాండెంట్ వచ్చినపుడు సంతోషిస్తారని అన్నాం. దాంతో మాకు ఆ రెండూ ఇచ్చారు".
"మేం పగలంతా తోటపని చేసి, రాత్రిళ్లు సొరంగం తవ్వేవాళ్లం. మొదట్లో మేం తవ్విన మట్టినంతా ఒక బారక్ ఫాల్స్ సీలింగ్ మీద దాచాం. కానీ ఒక రోజు ఆ సీలింగ్ మట్టి బరువుకు కుప్పకూలింది. దాంతో ఆ మట్టినంతా మంచాల కింద చల్లడం మొదలెట్టాం".
"సొరంగం చివరి దశకు చేరగానే, క్యాంపు లోపల, బయట రెండు వైపులా భారత కరెన్సీ జమ చేయడం మొదలెట్టాం. భారత సైనికుల సాయంతో మా బంగారు ఉంగరాలు, వాచీలు, మిగతా విలువైన వస్తువులన్నీ అమ్మేసి బాగా డబ్బు కూడబెట్టాం" అని రాశారు.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
భారత సైనికులకు తెలిసిన గుట్టు
కానీ, పాకిస్తాన్ సైనికులు ఆ సొరంగం నుంచి పారిపోవాలనుకున్న రోజు, అధికారులు యుద్ధ ఖైదీలు అందరూ క్యాంప్ మధ్యలోకి రావాలని ఆదేశించారు.
క్యాంప్ చుట్టుపక్కల ఉన్న వాచ్ టవర్స్ మీద సాయుధ సైనికుల సంఖ్యను కూడా పెంచారు. క్యాంప్ కమాండర్ కల్నల్ హావుజే ఒక యుద్ధ ఖైదీ పడక దగ్గరికి వెళ్లి అతడి మంచం కింద ఉన్న కట్టెలు తీయాలని చెప్పారు.
ఆ తర్వాత ఆయన నేలమీద కప్పిన దానిని తీసి చూడగానే, అక్కడ లోతైన గొయ్యి కనిపించింది. దాంతో ఆయన పాకిస్తానీ యుద్ధ ఖైదీలందర్నీ ఒక చోట నిలబెట్టి ప్రసంగించారు.
శిబిరం నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం పాకిస్తాన్ యుద్ధ ఖైదీల కర్తవ్యం, కానీ అదే విధంగా అది జరగకుండా చూడడం భారత సైనికుల కర్తవ్యం అన్నారు. మిగతా యుద్ధ ఖైదీలకు శిక్ష పడకుండా ఉండాలంటే, ఆ ప్రయత్నం ఎవరు చేశారో వారు ఒక మంచి సైనికుడుగా ముందుకు వచ్చి నేరం ఒప్పుకోవాలని సూచించారు,

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
సొరంగం తవ్వినందుకు శిక్ష
ఆ తర్వాత తమకు ఏ శిక్ష విధించారో మేజర్ జనరల్ ఖురేషీ తన పుస్తకంలో రాశారు.
"ఆ పని చేసింది మేమేనని మాలో 29 మంది దానిని మాపై వేసుకోడానికి నిర్ణయించుకున్నాం. నిజానికి మాతో ఉన్న మా సహచరుడు ఎవరో మాకు ద్రోహం చేశాడు. సొరంగం గురించి భారత సైనికులకు చెప్పేయడంతో పాటు, దానిని ఎక్కడి వరకూ తవ్వామో కూడా ఉప్పందించాడు. సాయంత్రం మాకు దానికి శిక్ష విధించారు. మాకు ఇచ్చిన మంచాలు, మా వ్యక్తిగత సామాన్లు అన్నీ వెనక్కి తీసుకున్నారు."
"హాల్లో అందరితో కలిసి కూర్చుని భోంచేసే సౌకర్య లేకుండా చేశారు. మేం తిన్న తర్వాత తిరగడానికి బయటకు వెళ్లకుండా, ఏధైనా తెప్పించుకోకుండా నిషేధం విధించారు. రోజులో చాలాసార్లు మా అటెండెన్స్ తీసుకునేవారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్ నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కొన్ని రోజుల తర్వాత పారిపోడానికి ప్రయత్నించిన యుద్ధ ఖైదీలను క్యాంప్ నంబర్ 95 నుంచి క్యాంప్ నంబర్ 93కు షిఫ్ట్ చేశారు. కానీ, అక్కడ కూడా వారిని చాలా తక్కువ రోజులు ఉంచారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY PRESS
కొందరు యుద్ధఖైదీలను ఆగ్రా తీసుకెళ్లారు
1972 జూన్ 20న మిగతా యుద్ధ ఖైదీలందరూ చూస్తుండగా తమకు సంకెళ్లు వేసి ఒక ట్రక్కులో ఎక్కించి రైల్వే స్టేషన్ తీసుకెళ్లారని మేజర్ జనరల్ అర్షద్ ఖురేషీ తన పుస్తకంలో రాశారు.
"అలా పారిపోడానికి ప్రయత్నించే సాహసం చేయకండి.. అని వాళ్లందరినీ హెచ్చరించాలని చూశారు. మమ్మల్ని ఒక రైలు బోగీలో కూచోపెట్టారు. దాన్ని బయట నుంచి కూడా లాక్ వేయవచ్చు. రైలు బోగీలో బాత్రూం ఉంది. కానీ, భద్రతా కారణాలతో దాని తలుపును తీసేశారు. మా చేతులకు సంకెళ్లతోపాటూ కాళ్లకు కూడా గొలుసులు కూడా వేశారు."
"తింటున్నప్పుడు కూడా మా చేతులకు సంకెళ్లు అలాగే ఉండేవి. సంకెళ్లతో తినడమే ఒక శిక్షలా ఉండేది. మేం తినే దానికంటే ఎక్కువ అన్నం మా బట్టలపై పడుతుండేది. మేం బోగీలో ఉన్న మిగతా అందరి ముందూ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ టాయిలెట్ పేపర్, చేతులు కడుక్కోడానికి నీళ్లు గానీ ఉండేవి కావు. ఇంతలో హఠాత్తుగా నాకు ప్రపంచ ఎనిమిదో వింత తాజ్ మహల్ కనిపించింది. అంటే, మేం ఆగ్రా చేరుకున్నాం. ఆరోజు 1972 జూన్ 21. భారత్‌లో సుదీర్ఘమైన, అత్యంత వేడిగా ఉండే పగలు.

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM
డాక్టర్‌లా జైలు నుంచి పారిపోయిన పాక్ కెప్టెన్
ఆగ్రా జైలు అప్పట్లో భారత్‌లో అత్యంత కట్టుదిట్టమైన జైలు. అక్కడ దాదాపు 200 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను ఉంచారు. భారత జైల్లో జనరల్ ఖురేషీకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పారిపోవాలని ప్రయత్నించడంతో ఆయన శిక్ష ఎదుర్కుంటున్నారు.
కానీ, మరో పాకిస్తాన్ అధికారి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా పారిపోగలిగారు. కెప్టెన్ రియాజుద్దీన్ హక్ అనారోగ్యం సాకుతో యుద్ధ ఖైదీల ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఒక రోజు డాక్టర్ల తెల్ల కోటు, మెడలో స్టెతస్కోపు వేసుకుని ఆస్పత్రి నుంచి విజయవంతంగా పారిపోగలిగారు.
అలాగే కెప్టెన్ షుజాత్ అలీ కూడా నడుస్తున్న రైల్లోంచి దూకి స్వదేశానికి పారిపోయారు. కానీ, దానికి ప్రతీకారంగా భారత సైనికులు మరో యుద్ధ ఖైదీ మేజర్ నసీబుల్లాను కాల్చి చంపారు.

ఫొటో సోర్స్, BHARATRAKSHAK.COM
యుద్ధఖైదీలకు పాకీజా సినిమా చూపించారు
ఈ ఘటనలను పక్కన పెడితే, పాకిస్తానీ యుద్ధ ఖైదీలతో భారత్ చాలా బాగా ప్రవర్తించిందనే విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌కే సిన్హా తన 'చేంజింగ్ ఇండియా స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్' పుస్తకంలో ఆనాటి విషయాలు రాశారు.
ఆ యుద్ధ ఖైదీలతో మాట్లాడ్డానికి భారత్‌లోని కొందరు సీనియర్ ముస్లిం పౌరులను, సైనికాధికారులను పిలిపించేవాళ్లం. వారికోసం ముషాయిరాలు, సినిమా షోలు ఏర్పాటు చేసేవాళ్లం. మేం పాక్ యుద్ధ ఖైదీలకు 'పాకీజా', 'సాహిబ్ బీబీ ఔర్ గులామ్' సినిమాలు కూడా చూపించాం. అవి వాళ్లకు చాలా బాగా నచ్చాయి".
"రుడ్కీలో పాకిస్తాన్, భారత అధికారుల మధ్య మేం క్రికెట్ మ్యాచ్ కూడా ఏర్పాటు చేశాం. వాషింగ్టన్ పోస్ట్ ప్రతినిధి ఒకరు ఆ క్యాంపులో పర్యటించారు. ప్రపంచంలో ఎక్కడా యుద్ధ ఖైదీలను ఇంత బాగా చూసుకోలేదని రాశారు. అది భారత ఆర్మీకి ఒక పెద్ద ప్రశంస లాంటిది" అన్నారు.

ఫొటో సోర్స్, MANAS PUBLICATION
పాక్ యుద్ధఖైదీలకు బ్యారక్, భారత సైనికుల కోసం గుడారాలు
జనరల్ శామ్ మానెక్ షా జీవిత చరిత్ర రాసిన జనరల్ దీపేందర్ సింగ్ కూడా అదే విషయం చెప్పారు.
"పాకిస్తానీ యుద్ధఖైదీలతో భారత్ చాలా బాగా చూసుకుంది. భారత సైనికులకు ఎలాంటి బట్టలు, సరుకులు ఇచ్చేవారో వారికి కూడా అలాంటివే ఇచ్చేవారు. యుద్ధం ముగిశాక పాకిస్తానీ యుద్ధ ఖైదీలను బ్యారక్స్‌లో ఉంచితే, భారత సైనికులు మాత్రం బయట గుడారాల్లోనే గడిపారు. పాకిస్తాన్ యుద్ధ ఖైదీలకు బ్యారక్స్‌లో నీళ్లు వచ్చేవి, కూలర్, ఫ్యాన్లు కూడా ఉండేవి. కఠిన పరిస్థితుల్లో మమ్మల్ని మాత్రం బయట గుడారాల్లో ఎందుకు ఉంచుతున్నారని భారత సైనికులు ప్రశ్నించినపుడు వాళ్లకు సర్ది చెప్పడానికి మేం చాలా కష్టపడ్డాం".
ముస్లింలకు ప్రత్యేకం అయిన రోజుల్లో శామ్ మానెక్ షా ప్రతి పాకిస్తానీ యుద్ధఖైదీకి శుభాకాంక్షల సందేశం పంపించేవారు.
పాకిస్తాన్ యుద్ధఖైదీలను భారత్ విడిచిపెట్టడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని జనరల్ నియాజీ తన పుస్తకంలో రాశారు.
"భారత్ యుద్ధఖైదీల కడుపు నింపడంతోపాటూ, తక్కువ మొత్తమే అయినప్పటికీ, వారికి వేతనం కూడా ఇచ్చేది. అప్పట్లో అది ఆ దేశానికి చాలా భారంగా మారింది" అన్నారు.

ఫొటో సోర్స్, NATRAJ PUBLICATION
28 నెలల తర్వాత నియాజీ విడుదల
చివరికి విడుదలయ్యే రోజు వచ్చింది. జనరల్ నియాజీని జబల్పూర్ రైల్వే స్టేషన్లో పాకిస్తాన్ వెళ్లే ఒక ప్రత్యేక రైల్లో కూర్చోబెట్టారు.
1974 ఏప్రిల్ 30న ఉదయం ఆ రైలు వాఘా సరిహద్దు చేరుకుంది. పాకిస్తాన్‌లోకి ప్రవేశించడానికి ముందు ఆయనకు ఇండియన్ ఆర్మీ అధికారులు టీ ఇచ్చారు. భారత్ జైల్లో ఆయన 28 నెలలు గడిపారు.
పాకిస్తాన్ సరిహద్దుకు అవతల ఆయన స్వాగతం కోసం షామియానాలు వేశారు. అక్కడ ఏం జరిగిందో నియాజీ చెప్పారు.
"నేను సరిహద్దు దాటినపుడు ఒక బ్రిగేడియర్ అంజుమ్ నాకు సెల్యూట్ చేసి, మీరు ప్రెస్ ముందు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని చెప్పారు. తర్వాత ఆయన ఒక దీర్ఘ చతురశ్రాకార కార్డ్ బోర్డ్ ముక్క తీసి దానిపై నంబర్ 1 అని రాశారు. ఫొటో తీయడానికి వీలుగా దీనిని మీ చాతీ మీద అతికించుకోండని నాతో అన్నారు"
"యుద్ధ ఖైదీలుగా ఉన్న మిగతా జనరళ్లను కూడా ఇలాగే ఫొటోలు తీశారా? అని నేను అతడిని అఢిగాను. దానికి అతను నవ్వుతూ లేదన్నాడు. జనరల్ టిక్కా ఆదేశాల ప్రకారమే మేం ఇలా చేస్తున్నామని చెప్పారు. నాకు కోపం వచ్చింది. నా కోపం నషాళానికి అంటకముందే నువ్విక్కడ నుంచి వెళ్లు.. నేను అంజుమ్‌తో అన్నాను" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- 1983 వరల్డ్ కప్: జింబాబ్వేపై కపిల్ దేవ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
- ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేస్తున్నారు.. ఎవరేమంటున్నారు?
- SC వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
- షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ
- 2022 జనవరి 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయాలంటే గుర్తుంచుకోవాలసిన విషయాలు..
- కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









