గెడ్డం శ్రీను మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
పశ్చిమగోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో ఆరు నెలల కిందట అనుమానాస్పద రీతిలో చనిపోయిన దళిత యువకుడు గెడ్డం శ్రీను మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
ఇంతకుముందు.. తన కుమారుడుది ముమ్మాటికీ హత్యే అంటూ మృతుని తండ్రి బుల్లయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 30 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పోలీసులు రాజకీయ కారణాలతో కేసును నీరుగారుస్తున్నారని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టంలోని పలు సెక్షన్లతో పాటు, హత్య కేసుగా తిరిగి నమోదు చేసినప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని చెప్పారు. గెడ్డం శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేసును మూసివేస్తున్నారని నివేదించారు.
అయితే.. మృతుడు పురుగుల మందు తాగి చనిపోయాడని, అతడిని హత్య చేశారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రభుత్వం వాదించింది.
ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. గెడ్డం శ్రీను మృతదేహానికి ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించింది. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి నిర్దేశించింది.
కేసు పూర్వాపరాలివీ...
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గెడ్డం శ్రీను గత అక్టోబర్ 6వ తేదీన అనుమానాస్సద స్థితిలో మరణించారు. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యేనని శ్రీను తల్లిదండ్రులు వాదిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని ఓ చిన్న గ్రామం మలకపల్లిలో అరుంధతి పేటలో మాదిగ కులస్తులు గెడ్డం బుల్లయ్య, వెంకాయమ్మ నివాసముంటున్నారు. వారు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
వారి ఏకైక కుమారుడు గెడ్డం శ్రీను గత అక్టోబర్ 6వ తేదీన అనుమానాస్సద స్థితిలో మరణించారు. వేరొక రైతు పొలంలో నెల జీతానికి పాలేరుగా పని చేస్తున్న శ్రీను ఆ పొలంలోనే నగ్నంగా పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
పోస్టుమార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసులు ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. శ్రీను తల్లిదండ్రులు మాత్రం అది హత్యేనని వాదిస్తున్నారు. తమ కుమారుడిని చంపినవారిని అరెస్ట్ చేసి, తమను ఆదుకోవాలంటూ మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు.

యజమానుల మీదే అనుమానం
తమ కొడుకుని యజమానులే చంపేశారని, ఏం జరిగిందో తెలియకుండానే తమ కొడుకును తమకు దూరం చేశారని గెడ్డం శ్రీను తండ్రి బుల్లయ్య ఆరోపిస్తున్నారు.
"మా కొడుకు ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాడు. ఎప్పుడూ వివాదాల్లో లేడు. చదువు ఆపేసి కొన్నాళ్లుగా కూలీ పనులు చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం కొమ్మిరాజు ముత్యాలరావు వద్ద పాలేరుతనానికి చేరాడు. ఏడాదికి రూ. 1,50,000 జీతం ఇస్తామని చెప్పారు. అడ్వాన్సుగా రూ. 30,000, ఆ తర్వాత రూ.10,000 ఇచ్చారు. ఉదయాన్నే రైతు ఇంటికి వెళ్లి గేదె పాలు తీయడం, అంతా శుభ్రం చేసి పొలానికి వెళ్లి పనిచేయడం, మళ్లీ సాయంత్రం గేదె పాలు పితకడం వంటి పనులు చేసేవాడు. కానీ ఏం జరిగిందో తెలియకుండానే మా బిడ్డను చంపేశారు. అరటితోటలో వాడి మృతదేహం మీద ఆనవాళ్లు తొలగించేశారు. పోలీసులు రాకముందే అంతా కడిగేశారు. పంచనామా కూడా చేయకుండా పోస్ట్ మార్టమ్ కోసం తరలించేశారు" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
గెడ్డం శ్రీను హత్యపై పూర్తి విచారణ చేసి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ బుల్లయ్య, వెంకాయమ్మ కొన్ని నెలలుగా దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదు ఆధారంగా అరెస్టులు చేయాలని వారు కోరుతున్నారు.
ఆధారాలు లేవు...
గెడ్డం శ్రీను మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తాళ్లపూడి సబ్ ఇన్‌స్పెక్టర్ కట్టా వెంకట రమణ జనవరి మొదట్లో బీబీసీకి తెలిపారు. ఈ కేసులో విచారణను ప్రస్తుతం నర్సాపురం డీఎస్పీ చూస్తున్నట్టు వివరించారు.
"అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం మాకు సమాచారం అందగానే వెళ్ళాం. అరటితోటలో మృతదేహం ఉంది. పూర్తి నగ్నంగా ఉండడం గమనించాం. దూరంగా బట్టలున్నాయి. మృతదేహం పక్కనే పురుగు మందు డబ్బా ఉంది. అంతా అనుమానంగా ఉండడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. మృతుడి తండ్రి కూడా ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించాం. పోస్టుమార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను బట్టి మృతుడు పురుగుల మందు తాగడంతో మరణించినట్టు తేలింది. అయితే యజమానులే గెడ్డం శ్రీనును హత్య చేశారని ఆయన తండ్రి ఫిర్యాదులో రాశారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అరెస్టులు చేయలేదు" అంటూ ఎస్సై వివరించారు.

ఎలాంటి చర్యలూ తీసుకోలేదు
దళిత యువకుడు గెడ్డం శ్రీను మృతిపై పలు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసనలు చేపట్టాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. కానీ కేసు మాత్రం కొలిక్కిరాలేదు.
ఈ కేసులో విచారణ తప్ప ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కొమ్మిరాజు ముత్యాలరావు, కొమ్మిరాజు సత్యన్నారాయణ మీద ఫిర్యాదులు చేసినా, వారిపై ఆరోపణలకు ఆధారాలు లేవంటూ పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పోలీసులను ఆదేశించారు.
అక్టోబర్ 28న మలకపల్లిలో బాధితులను పరామర్శించిన తరువాత ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అక్కడే తక్షణ చర్యల కోసం ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ తరువాత కేసు విచారణను తాళ్లపూడి ఎస్సై నుంచి నర్సాపురం డీఎస్పీకి బదిలీ చేశారు. బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో ఆయన విచారణ జరిపారు. కానీ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఈ కేసు విచారణ వివరాల కోసం డీఎస్పీని బీబీసీ గతంలో పలుమార్లు సంప్రదించింది. కానీ ఆయన మాత్రం స్పందించడానికి నిరాకరించారు. కేసు పురోగతి వివరాలు కూడా వెల్లడించానికి సిద్ధపడలేదు.
'బట్టలు తీసేసి ఆత్మహత్య చేసుకుంటారా?'
"పోలీసుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. కానీ ఎవరైనా బట్టలు పూర్తిగా తీసేసి ఆత్మహత్యకు పాల్పడతారా? ఆత్మహత్య కోసం పురుగుల మందు తాగితే వాంతులు చేసుకోవాలి కదా. అలాంటి ఆనవాళ్లు ఎందుకు లేవు? శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి? వీటన్నింటికీ సమాధానాలు చెప్పాలి కదా. కానీ కేసు మాత్రం తాత్సార్యం చేస్తున్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. నెల రోజుల్లోగా అనుమానితులను అరెస్ట్ చేసి , నివేదించాలని కోర్టు తెలిపింది" అంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వివరించారు.
గెడ్డం శ్రీనుది హత్యేనని, కానీ దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని హర్షకుమార్ ఇంతకుముందు బీబీసీతో అన్నారు. మూడు నెలల కిందటే కేసులో అనుమానితుల గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నది అర్థం కావడం లేదన్నారు.

ఫొటో సోర్స్, BBC/shankar
'చంపేసి కేసు లేకుండా చేశారు'
తమ బిడ్డను చంపేసి, కేసు లేకుండా చేస్తున్నారని గెడ్డం శ్రీను తల్లి వెంకాయమ్మ చెబుతున్నారు. గెడ్డం శ్రీను కాల్ డేటా బయటపెట్టాలని కోరారు. తమకు ఆధారంగా నిలవాల్సిన కన్న కొడుకుని కోల్పోయిన తర్వాత తమకు దిక్కెవరని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందుకే, ఎంతకాలమైనా దీక్షలు కొనసాగిస్తున్నామని ఆమె బీబీసీతో అన్నారు.
"అధికార, విపక్ష నేతల పాత్ర మీద కూడా సందేహాలున్నాయి. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఎస్సీ వర్గానికి చెందిన నేత. కానీ, ఎస్సీ యువకుడి మరణానికి కారణాలు కనుక్కోలేకపోతున్నారు. కేసు విచారణ వేగవంతం చేయాలి. ఎస్సీలను చంపేసిన తర్వాత కూడా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలున్నాయి. మృతదేహం మీద దెబ్బలు సందేహాలకు కారణం. కొన ఊపిరితో ఉండగా బలవంతంగా పురుగుల మందు నోట్లో పోస్తే దాని ప్రభావం ఫోరెన్సిక్ నివేదికలో కనిపిస్తుంది. అయినా దానిని పోలీసులు పరిగణలోకి తీసుకుని కేసు విచారణలో జాప్యం చేయడానికి రాజకీయ కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి" అంటూ కులవివక్ష వ్యతిరేక పోరాటం సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో కోర్టు ఆదేశాల విషయంలో పోలీసులు కాలయాపన చేస్తుండడం విచారకరమని మాల్యాద్రి బీబీసీకి తెలిపారు.
ఏపీ హైకోర్టులో పోలీసు శాఖ తరుపున అఫిడవిట్ దాఖలు చేసినట్టు కొవ్వూరు సీఐ కేవీ రమణ గతంలో బీబీసీకి తెలిపారు.
గెడ్డం శ్రీను మృతికి సంబంధించి తాళ్లపూడి పీఎస్‌లో 266/2021గా కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 174గా కేసు విచారణ సాగుతోందని ఎస్సై వెంకట రమణ తెలిపారు.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతులు కొమ్మరాజు ముత్యాలరావు, సత్యన్నారాయణ సోదరులను వివరాల కోసం బీబీసీ సంప్రదించింది. తమకు సంబంధంలేదని, ఈ విషయంలో మాట్లాడేందుకు సిద్ధంగా లేమని వారు తెలిపారు.
మృతదేహం మీద కొన్ని చోట్ల స్వల్ప గాయాలుండడం, నగ్నంగా మృతదేహం దొరకడం, పురుగుల మందు తాగితే కనీసం వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా లేకపోవడంతో హత్య అనే అనుమానాలకు ఆస్కారమిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోలీసులు మాత్రం ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ ఆధారంగా దీన్ని ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. దాంతో కేసు కొలిక్కి రావడంలేదు. మృతుడి కుటుంబం మాత్రం దీక్షలను కొనసాగిస్తోంది.
ఈ కేసులో పురోగతి లేకపోవటంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. గెడ్డం శ్రీను మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
- హేమలతా లవణం: నేరస్థుల ఊరుగా పేరున్న స్టూవర్ట్ పురాన్ని మార్చేసిన మహిళ
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- వందన కటారియా ఇంటి దగ్గర కులవివక్ష వ్యాఖ్యల వివాదం ఏంటి, అసలేం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- గోరఖ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో దళిత బాలిక మృతిపై అనుమానాలు
- కారంచేడు దాడికి 36 ఏళ్లు: 'చుట్టూ చేరి కర్రలతో కొట్టారు... మమ్మల్ని తగలబెట్టాలని చెత్త అంతా పోగేశారు'
- హిందువులు, సిక్కుల వరుస హత్యలతో వణుకుతున్న కశ్మీర్, లోయను వదిలి పారిపోతున్న మైనార్టీ కుటుంబాలు
- కర్నాటక: 'ఇక్కడ అగ్ర కులాల వారికే హెయిర్ కటింగ్ చేస్తాం' అంటూ దళితులను కొట్టారు
- ఉన్నావ్ ఘటన: బాలికల మృతికి కారణం ఏంటి?
- భీమా కోరెగావ్ కేసులో సాక్ష్యాధారాలను 'ప్లాంట్' చేశారన్న వాషింగ్టన్ పోస్ట్
- ఆదోని ‘కుల అహంకార’ హత్య: ‘మా నాన్న, పెదనాన్న కలిసి నా భర్తను చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











