గోరఖ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌‌లో దళిత బాలిక మృతదేహం, హత్యే అంటున్న కుటుంబం

దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్శిటీ

ఫొటో సోర్స్, PUNEET SRIVASTAVA/DHIRENDRA GOPAL

ఫొటో క్యాప్షన్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్శిటీ
    • రచయిత, పునీత్ శ్రీవాస్తవ, ధీరేంద్ర గోపాల్
    • హోదా, బీబీసీ కోసం

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్శిటీ క్యాంపస్‌లో బీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతున్న ప్రియాంక అనుమానాస్పద రీతిలో మరణించారు.

చనిపోయిన మూడు రోజుల తరువాత భారీ పోలీసు బలగాల మధ్య ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఎస్ఎస్‌పీతో సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

కూతురి మరణంపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని, నష్ట పరిహారం ఇవ్వాలని, రెండోసారి శవపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రియాంక తండ్రి వినోద్ కుమార్ తెలిపారు.

తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వినోద్ కోరినవన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చిన తరువాతే ప్రియాంకకు అంత్యక్రియలు జరిపారు.

పరిహారం ఏ రూపంలో ఉంటుంది, ఎలా చెల్లిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా లేనప్పటికీ, ఈ కేసులో మరోసారి దర్యాప్తు చేయనున్నారు.

"ప్రియాంక కుటుంబం వ్యక్తం చేసిన అనుమానాలన్నింటిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. వారి అనుమానాల ఆధారంగా హత్య కేసు నమోదు చేశాం. కానీ, శవ పరీక్షలో ఆమెది ఆత్మహత్య అని తేలింది. కానీ, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు, పోస్టుమార్టం వీడియోను ఐదుగురు వైద్యుల బృందం మళ్లీ పరిశీలిస్తుంది. సీఎమ్‌ఓ డాక్టర్ సుధాకర్ పాండే ఈ ఐదుగురు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు" అని గోరఖ్‌పూర్ ఎస్‌ఎస్‌పీ పి. దినేష్ కుమార్ తెలిపారు.

ప్రియాంక తండ్రి వినోద్ ఫిర్యాదుతో హోం సైన్స్ డిపార్ట్‌మెంట్ అధిపతి (హెచ్ఓడీ)తో సహా మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తన కూతురికి న్యాయం జరగాలని, నిందితుడికి తగిన శిక్ష పడాలని కోరుతూ వినోద్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తన కూతురు ఆత్మహత్య చేసుకోలేని, ఇది కచ్చితంగా హత్యేనని ఆయన అంటున్నారు.

ప్రియాంక కేసులో రెండోసారి దర్యాప్తు చేసేందుకు అంగీకరించిన పోలీసులు

ఫొటో సోర్స్, PUNEET SRIVASTAVA/DHEERENDRA GOPAL

ఫొటో క్యాప్షన్, ప్రియాంక కేసులో రెండోసారి దర్యాప్తు చేసేందుకు అంగీకరించిన పోలీసులు

'మా అమ్మాయి ప్రియాంక చాలా తెలివైన పిల్ల'

పాదరీ బజార్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శివపూర్ సహ్బాజ్‌గంజ్ బస్తీ సోమవారం పోలీసులతో నిండిపోయింది. వీధుల్లో ప్రజల కన్నా పోలీసులే ఎక్కువగా కనిపించారు.

అంత్యక్రియల తరువాత ప్రియాంక ఇంటి దగ్గర విషాదం అలుముకుంది.

సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వినోద్ కుమార్‌కు నలుగురు పిల్లలు. అందరిలోనూ చిన్నదైన ప్రియాంక చాలా తెలివైనదని, బీఎస్సీ హోం సైన్ చదివే ఆమె ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేదని వినోద్ తెలిపారు.

"మా అమ్మాయికి ఏ ఇబ్బందీ రాకూడదని మా ఖర్చులు తగ్గించుకుని మరీ ఆమెను చదివిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

శనివారం ఉదయం సుమారు 8.30కు ప్రియాంక సోదరుడు మనీశ్ తన చెల్లిని పరీక్ష రాయించడానికి యూనివర్సిటీకి తీసుకెళ్లారు. గేటు దగ్గర ఆమెను విడిచిపెట్టి వెనక్కి వచ్చేశానని చెప్పారు.

మధ్యాహ్నం సుమారు 12కు అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ నుంచి వినోద్ కుమార్‌కు కాల్ వచ్చింది. యూనివర్సిటీలో హోం సైన్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్ రూమ్‌లో ప్రియాంక మృతదేహం ఉందని ఆయనకు చెప్పారు.

ఆ వార్త విన్న వినోద్ వెంటనే యూనివర్సిటీ చేరుకున్నారు. కూతురి మృతదేహన్ని చూసి షాక్ అయ్యారు.

యువతి తండ్రి

ఫొటో సోర్స్, PUNEET SRIVASTAVA/DHEERENDRA GOAPAL

ఫొటో క్యాప్షన్, యువతి తండ్రి వినోద్

ప్రియాంకది ఆత్మహత్య కాదంటున్న కుటుంబం

ప్రియాంక ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేమని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. తమ కుమార్తెది హత్యేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పోలీసులు, యూనివర్సిటీ అధికారులు మాత్రం దీనిని ఆత్మహత్యగానే పరిగణిస్తున్నారు.

"మా అమ్మాయి చేతికున్న వాచీ కనిపించడం లేదు. తన చెప్పులు కూడా కొంచెం దూరంలో పడి ఉన్నాయి. బట్టలకంతా మట్టి ఉంది. అవన్నీ చూస్తుంటే అనుమానంగా ఉంది. మా అమ్మాయిని చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది" అని వినోద్ అన్నారు.

వినోద్ వివరాల ప్రకారం యువతి తలకు దెబ్బ తగిలిన గుర్తు కూడా ఉంది.

ఆదివారం గోరఖ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తమకు న్యాయం చేయాలని, నేరస్థులకు శిక్ష పడేలా చూడమని ప్రియాంక కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. న్యాయవిచారణ జరిగేలా చూస్తామని ఆయన వారికి మాటిచ్చారు.

గోరఖ్‌పూర్ యూనివర్సిటీ కాంపస్

ఫొటో సోర్స్, PUNEET SRIVASTAVA/DHIRENDRA GOPAL

ఫొటో క్యాప్షన్, గోరఖ్‌పూర్ యూనివర్సిటీ హోం సైన్స్ విభాగం

విచారణకు సహకరిస్తామన్న హోం సైన్స్ విభాగం

ఇందులో ఎలాంటి కుట్రా లేదని, విద్యార్థులు కేకలు పెట్టడంతో తాను, మిగతా సిబ్బంది స్టోర్ రూమ్‌వైపు వెళ్లామని హోం సైన్స్ విభాగం చైర్‌ పర్సన్ డాక్టర్ దివ్యరాణి సింగ్ తెలిపారు.

"యూనివర్సిటీ అధికారులకు వెంటనే సమాచారం అందించాం. పోలీసులను పిలిపించాం. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. విచారణకు మేం పూర్తిగా సహకరిస్తాం" అని ఆమె అన్నారు.

విశ్వవిద్యాలయం కూడా న్యాయవిచారణ జరపనుంది

ప్రియాంక కేసులో నలుగురు సభ్యుల న్యాయవిచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కమిటీలో ఒక మాజీ న్యాయమూర్తి, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, ఇద్దరు సీనియర్ అధికారులు ఉంటారని, ప్రియాంక కేసులో పూర్తి దర్యాప్తు నిర్వహించి, నివేదిక తయారుచేస్తారని యూనివర్సిటీ తెలిపింది.

గోరఖ్‌పూర్ యూనివర్సిటీ కాంపస్‌లో యువతి మృతి

ఫొటో సోర్స్, PUNEET SRIVASTAVA/DHIRENDRA GOPAL

న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు

సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించింది.

"ప్రియాంకది ఆత్మహత్య కాదని ఆధారాలు చెబుతున్నాయి. దళిత విద్యార్థికి న్యాయం జరిగేదాకా మా పార్టీ తరపున ఆందోళన చేస్తాం" అని గోరఖ్‌పూర్ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడునగీనా ప్రసాద్ సాహ్ని అన్నారు.

ప్రియాంకకు న్యాయం లభించేలా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

సోమవారం యూనివర్సిటీ బయట నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసన ప్రదర్శనల్లో పలు సంఘాలు పాల్గొన్నాయి.

అయితే, పోలీసులు వారిని చెదరగొట్టారు. యూనివర్సిటీ గేటు బయట భారీగా బలగాలను మోహరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)