భీమా కోరెగావ్ కేసులో సాక్ష్యాధారాలను 'ప్లాంట్' చేశారన్న వాషింగ్టన్ పోస్ట్

భీమా కోరెగావ్ కేసులో అరెస్టైన నిందితులు
ఫొటో క్యాప్షన్, భీమా కోరెగావ్ కేసులో అరెస్టయిన నిందితులు
    • రచయిత, మయూరేష్ కన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మహారాష్ట్ర పుణెలోని భీమా కోరెగావ్‌లో 2018లో జరిగిన హింస కేసు దర్యాప్తు, అరెస్టులకు సంబంధించి వచ్చిన ఒక కొత్త రిపోర్ట్ అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచింది.

అమెరికాలోని ఒక సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్ష రిపోర్ట్ ఆధారంగా అమెరికా ప్రముఖ వార్తా పత్రిక 'ద వాషింగ్టన్ పోస్ట్' ఈ కేసులో అరెస్టైన ఒకరికి వ్యతిరేకంగా ఆధారాలు 'ప్లాంట్' చేశారని చెప్పింది.

పుణెలో జరిగిన హింస కేసులో చాలామంది వామపక్ష కార్యకర్తలు, మేధావులను అరెస్ట్ చేశారు.

భీమా కోరెగావ్‌లో అంగ్లేయుల మహార్ రెజిమెంట్, పీష్వా సైన్యం మధ్య జరిగిన యుద్ధంలో మహార్ రెజిమెంట్ గెలిచింది. దళితులు ఎక్కువగా ఉన్న ఆ సైన్యం విజయం 200వ వార్షికోత్సవం సందర్భంగా ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి.

ఈ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఎల్గార్ పరిషద్‌ సంస్థకు చెందిన చాలామంది సభ్యులను, ప్రముఖ దళిత, మానవ హక్కుల కార్యకర్తలను వేరు వేరు సమయాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అరెస్ట్ చేశారు.

వారిపై 'ప్రధానమంత్రి హత్యకు కుట్ర', 'దేశ ఐక్యత, సమగ్రతను విచ్ఛిన్నం' చేయడానికి ప్రయత్నించడం లాంటి తీవ్రమైన అభియోగాలు మోపారు. వీరందరూ ఇప్పుడు జైళ్లలో ఉన్నారు.

'ది వాషింగ్టన్ పోస్ట్' రిపోర్ట్ ప్రకారం మసాచుసెట్స్‌లో ఉన్న ఆర్సనల్ కన్సల్టింగ్ ల్యాబ్ తన పరిశోధనలో దళిత హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ల్యాప్‌టాప్‌పై సైబర్ దాడి జరిగిందని ఒక నిర్ధరణకు వచ్చింది.

ఆ ల్యాబ్ రిపోర్టుల ప్రకారం ఒక మాల్‌వేర్(వైరస్) ద్వారా ఆ ల్యాప్‌టాప్‌లోకి చాలా డాక్యుమెంట్స్ పెట్టారు. వాటిలో వివాదిత డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ హత్య కుట్ర కోసం రోనా విల్సన్ ఆయుధాలు సేకరణ గురించి చర్చించారనేది కూడా ఉంది.

అయితే, విల్సన్ ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ దర్యాప్తు ఏజెన్సీ పరిశీలించినపుడు, అందులో ఎలాంటి వైరస్ ఉన్నట్టూ ఆధారాలు దొరకలేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రతినిధి వాషింగ్టన్ పోస్ట్‌కు చెప్పారు.

ఈ కేసులో ఎవరెవరిని నిందితులుగా చేర్చారో, వారికి వ్యతిరేకంగా తగిన ఓరల్, డాక్యుమెంటల్ ఎవిడెన్సులు ఉన్నాయని ఎన్ఐఏ ప్రతినిధి పత్రికతో అన్నారు.

రోనా విల్సన్
ఫొటో క్యాప్షన్, రోనా విల్సన్

కేసులో కొత్త మలుపు

వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించిన తర్వాత రోనా విల్సన్, మిగతా నిందితుల లాయర్లు ముంబయి హైకోర్టులో పిటిషన్ వేశారు. విల్సన్‌పై ఉన్న ఆరోపణలన్నీ రద్దు చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో ఐదుగురు నిందితుల తరపు లాయర్ అయిన మిహిర్ దేశాయి బీబీసీతో దీనిపై మాట్లాడారు.

"మేం పూర్తిగా ఈ విచారణనే రద్దు చేయించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే, దేనిని ప్రధాన ఆధారంగా చూపించి ఈ కేసులు నమోదయ్యాయో, అదే ఇప్పుడు 'ప్లాంటెడ్' అని నిరూపితం అవుతోంది. మేం డాక్యుమెంట్స్ 'ప్లాంట్' చేయడంపై కూడా స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నాం. మొత్తం ప్రక్రియలో డాక్యుమెంట్లు ప్లాంట్ చేయడం గురించి ఎందుకు దర్యాప్తు జరగలేదు. ప్రాసిక్యూషన్ దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు" అన్నారు.

రోనా విల్సన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ కాపీ పొందడంలో ఆయన లాయర్ మిహిర్ విజయవంతం కాగలిగారు.

"మేం 2019 డిసెంబర్‌లో కోర్టుకు దరఖాస్తు చేసి, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అన్నిటి క్లోన్ కాపీలు డిమాండ్ చేశాం. కోర్టు ఆదేశాలతో వాటిని మాకు అందించారు" అన్నారు.

కోర్టు ద్వారా తమకు అందిన వస్తువుల ఫోరెన్సిక్ పరీక్షల కోసం రోనా విల్సన్ తరఫు న్యాయ ప్రతినిధులు అమెరికా బార్ అసోసియేషన్ సాయం కోరినట్లు హైకోర్టు పరిధిలో దాఖలైన పిటిషన్లను బట్టి తెలుస్తోంది.

అమెరికా బార్ అసోసియేషన్ వారు ఆర్సనల్ కన్సల్టింగ్‌ను సంప్రదించేలా చేసింది. ఈ కంపెనీ గత 20 ఏళ్లుగా ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంటుంది.

భీమాకోరేగావ్

ఫొటో సోర్స్, Getty Images

రిపోర్ట్, వాదన, పిటిషన్

ఆర్సనల్ కన్సల్టింగ్ రిపోర్టును ఉటంకిస్తూ రోనా విల్సన్ ల్యాప్‌టాప్‌లో మొదటి డాక్యుమెంట్‌ను ఆయనను అరెస్ట్ చేయడానికి 22 నెలల ముందే ప్లాంట్ చేశారని న్యాయవాదులు తమ పిటిషన్‌లో చెప్పారు.

"ఒక హ్యాకర్ నెట్‌వైర్ అనే మాల్‌వేర్(వైరస్)ను ఉపయోగించాడు. దాని ద్వారా మొదట పిటిషనర్(విల్సన్) మీద నిఘా పెట్టాడు. తర్వాత మాల్‌వేర్ ద్వారా దూరం నుంచే, దానిలో చాలా ఫైళ్లు వేశాడు. వాటిలో కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టిన 10 డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక ఫోల్డర్‌లో పెట్టి, దానిని హిడెన్ మోడ్‌( కనిపించకుండా)లో ఉంచాడు. 22 నెలలపాటు హ్యాకర్ అప్పుడప్పుడూ పిటిషనర్ ల్యాప్‌టాప్‌లో అతడికి తెలీకుండానే వాటిని ప్లాంట్ చేశాడు" అని ఆ పిటిషన్‌లో చెప్పారు.

ల్యాబ్ రిపోర్ట్ గురించి కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. విల్సన్ ల్యాప్‌టాప్‌ను చాలాసార్లు రిమోట్లీ(దూరం నుంచి) నియంత్రించారని చెప్పారు.

భీమా కోరేగావ్ కేసు

అయితే, ఈ సైబర్ దాడి చేసింది ఎవరు, అతడికి ఏదైనా సంస్థతో లేదా విభాగంతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం ఆర్సనల్ కన్సల్టింగ్ రిపోర్టులో చెప్పలేదు.

ఉత్తర అమెరికాలో మాల్‌వేర్‌కు సంబంధి ముగ్గురు స్వతంత్ర నిపుణులతో ఈ రిపోర్ట్‌ను తనిఖీ చేయించారని, వారందరూ ఈ రిపోర్ట్ బలంగా ఉందని చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ తన రిపోర్టులో తెలిపింది.

"2016లో తీవ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయిన టర్కీకి చెందిన ఒక జర్నలిస్టును ఆర్సనల్ కన్సల్టింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విడుదల చేశారు. ఆయనతోపాటూ అరెస్ట్ చేసిన మిగతా నిందితులను కూడా విడుదల చేశారు" అని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో చెప్పింది.

2018లో భీమా కోరెగావ్‌లో హింస జరిగిన తర్వాత పుణె పోలీసులు చాలా మంది వామపక్ష కార్యకర్తలు, మేధావుల ఇళ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వారి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, మిగతా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

వారి దగ్గర లభించిన డాక్యుమెంట్లను కోర్టుల్లో ఆధారాలుగా ప్రవేశపెట్టిన పోలీసులు, నిందితుల వెనుక నిషేధిత మావోయిస్టు సంస్థ హస్తం ఉందని చెప్పారు.

రోనా విల్సన్, వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా సహా 14 మందికి పైగా సామాజిక కార్యకర్తలను ఈ కేసులో అరెస్ట్ చేశారు. మొదట పుణె పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు ఇప్పుడు ఎన్ఐఏ దగ్గర ఉంది.

వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై ఎన్ఐఏ స్పందన తెలుసుకోడానికి ఎన్ఐఏ ప్రతినిధి, ప్రభుత్వ లాయర్లను బీబీసీ సంప్రదించింది. కానీ, ఎలాంటి సమాధానం లభించలేదు. వారి నుంచి స్పందన రాగానే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)