అన్నవరం ప్రసాదం ఎందుకంత రుచిగా ఉంటుంది... ఏమిటా రహస్యం?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
సహజంగా ఆలయాల్లో ప్రసాదం పేరుతో పులిహార, దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తూ ఉంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ఆలయం అందుకు భిన్నం.
తిరుపతి లడ్డూలాగే, అన్నవరం ప్రసాదంగా ఇది ప్రసిద్ధి చెందింది. మళ్లీ మళ్లీ తినాలనిపించే ఆ ప్రసాదం నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అన్నవరం ప్రసాదం అంత రుచిగా ఉండడానికి కారణాలేంటి అని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.
ప్రసాదం వెనుక రకరకాల కథలు
అన్నవరం పేరు చెప్పగానే చాలామందికి సత్యనారాయణ స్వామి వ్రతాలు గుర్తుకొస్తాయి. కొత్త జంటలతో కళకళలాడే పెళ్లి మండపాలు కనిపిస్తాయి. అవన్నీ ఎంత సుప్రసిద్ధమో, అన్నవరం దేవస్థానం వారు విక్రయించే ప్రసాదం కూడా అంతే ప్రసిద్ధం. కేవలం పవిత్రం, పుణ్యం అనే నమ్మకంతోనే కాదు, దాని రుచిని ఆస్వాదించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.
గోధుమ నూకతో ఈ ప్రసాదాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు, ఎవరు ప్రారంభించారు అన్న విషయంలో అధికారులకు సైతం పూర్తి స్పష్టత లేదు. సంప్రదాయంగా వస్తోంది, అందరికీ నచ్చుతోంది కాబట్టి ఈ ప్రసాదాన్ని కొనసాగిస్తున్నట్టు అన్నవరం దేవస్థానం పరిపాలనా అధికారి వేండ్ర త్రినాథరావు బీబీసీకి తెలిపారు.

''తరతరాలుగా ఇదే ప్రసాదంగా ఉంది. స్వామి వారికి గోధుమలతో తయారుచేసిన పదార్ధాలతో చేసిన నైవేథ్యం సమర్పించడం ఆచారం. దానినే భక్తులు చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా పెద్ద మొత్తంలో ప్రసాదం తయారీకి ఏర్పాట్లు చేశాము. దాతల సహాయంతో కొత్తగా సాంకేతిక సదుపాయాలు కల్పించి తయారీ వేగంగా సాగేందుకు ఏర్పాట్లు చేశాము'' అని త్రినాథరావు వెల్లడించారు.
గతంలో కట్టెల పొయ్యి మీద ప్రసాదం సిద్ధం చేసేవారమని, ఏటా 1 కోటీ 50 లక్షల ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు. 150 గ్రాములుండే ఈ ప్రసాదాన్ని అన్నవరం మీదుగా ప్రయాణం చేసే వారు కూడా కొనుక్కుని వెళ్తుంటారని త్రినాథరావు చెప్పారు.

ఉత్తరాది సంప్రదాయం
గోధుమలతో చేసిన నైవేద్యం ఈ రూపంలోనే ఎందుకు చేస్తున్నారనే దానిపై అన్నవరం వాసుల్లో ఆసక్తికర ప్రచారం సాగుతోంది.
''1900 సంవత్సరానికి పూర్వం బ్రిటీష్ కాలంలో అన్నవరం మీదుగా రైల్వే లైన్ నిర్మాణమయ్యింది. కోల్‌కతా, చెన్నై మధ్య ప్రధాన రోడ్డు, రైలు మార్గాలు అన్నవరం మీదుగా వెళుతుంటాయి. రైలుకట్ట నిర్మాణంలో ఉత్తరాది కూలీలు పనిచేసేవారు. వారంతా గోధుమలతో చేసిన ఆహారం స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి వారి ఆహార పదార్థాల్లో ఒకటైన ఈ రకమైన వంటకాన్ని నేర్చుకున్న స్థానికులు, స్వామి వారికి నైవేధ్యంగా పెట్టడం ప్రారంభించారు'' అని స్థానికుడైన ఎం.శివకుమార్ బీబీసీతో చెప్పారు.

''గోధుమ నూకకి పంచదార, నెయ్యి జోడించడంతో వచ్చిన రుచి అందరికీ నచ్చడంతో దానినే ప్రసాదంగా ఇవ్వడం మొదలైంది. తర్వాత కాలంలో ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లడం, అన్నవరం దేవస్థానానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడంతో ఈ ప్రసాదం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని మా పూర్వీకులు చెబుతుండేవారు'' అని శివ కుమార్ వివరించారు.
అయితే, ఈ వాదనతో ఆలయ ప్రధాన అర్చకులు ఏకీభవించడం లేదు. సత్యనారాయణ వ్రతం గురించి స్కంధ పురాణంలోని రేవాధ్యాయంలో ఈ ప్రసాదం గురించి ప్రస్తావించినట్టు అన్నవరం దేవస్థాన ప్రధాన అర్చకుడు కోట శ్రీనివాస్ బీబీసీతో అన్నారు. అరటిపండు, నెయ్యి, పాలు, గోధుమ ఆయనకు ప్రీతిపాత్రమైనవిగా పేర్కొన్నట్టు ఆయన వివరించారు. ఉత్తరాది కూలీల ద్వారా ఈ ప్రసాదం వెలుగులోకి వచ్చిందనే వాదనలో వాస్తవం లేదని ఆయన తోసిపుచ్చారు.

ప్రసాదం ఎలా తయారు చేస్తారు?
అన్నవరం వీర వెంకట సత్యన్నారాయాణ స్వామి దేవస్థానంలో ప్రధానంగా రెండు రకాల ప్రసాదం ఉంటుంది. అందులో అందరికీ తెలిసింది గోధుమ నూకతో చేసిన ప్రసాదం ఒకటి కాగా, రెండోది బంగీ ప్రసాదం అని ఉంటుంది. ఇది రవ్వతో చేసి, వ్రతం ఆచరించే వారికి అందిస్తారు. ఎక్కువమంది మాత్రం గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
ప్రస్తుతం భూతాదిగా పిలిచే ప్రసాదం తయారీ యూనిట్ లో సుమారు 20 కళాయిల్లో నిత్యం ఈ ప్రసాదం వండుతూ ఉంటారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్, రవాణా కోసం 68 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
వారంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ప్రసాదం తయారీ ప్రారంభిస్తారు. సాధారణ రోజుల్లో కనీసంగా 100 కుళాయిలు, యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలకు పైగా ప్రసాదం వండుతామని హెడ్ కుక్ మధుబాబు బీబీసీకి తెలిపారు.
''గోదావరి పుష్కరాల సమయంలో 270 కుళాయిలు చేశాం. ఇది రికార్డు. ఈ కార్తీక సోమవారం నాడు కూడా అంతే చేయాల్సి వచ్చింది. ఒక్కో కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారవుతుంది. ఇదే ప్రసాదం మేము మరోచోట చేసినా ఈ రుచి రాదు. మాలో చాలామంది కొండ దిగువను ఇదే ముడిపదార్థాలతో ప్రయత్నించాము. కానీ రుచి మారిపోయింది. ఇంత రుచి కేవలం కొండపైన ఆలయ ప్రాంగణంలో మాత్రమే వస్తుంది. అందుకే దీనికి అంత ప్రాధాన్యత'' అన్నారు మధుబాబు.

రుచిని కలిగించే నాలుగు పదార్థాలు
అన్నవరం ప్రసాదం తయారీకి ప్రధానంగా గోధుమ నూక, పంచదార, నెయ్యి, యాలకుల పొడి వాడుతారు. ఒక్కో కళాయికి 15 కిలోల గోధుమ నూక, 30 కిలోల పంచదార, 6 కిలోల ఆవు నెయ్యి వాడతారు. 80 కిలోల ప్రసాదం తయారవుతుంది. దాని మీద 150 గ్రాముల యాలకుల పొడి చల్లుతారు.
మొదట నీళ్లు బాగా మరిగించి, అందులో గోధుమ నూక వేస్తారు. ఆ తర్వాత పంచదార వేసి రంగు మారే వరకూ ఉడికిస్తారు. చివరిలో నెయ్యి వేసి కలుపుతారు.
అన్నవరం ప్రసాదం తయారీకి వాడేది కేవలం నాలుగు పదార్థాలే అయినా, రుచి మాత్రం చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ ప్రసాదం ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి దూర ప్రాంతాలకు సైతం తీసుకెళుతూ ఉంటారు. ప్యాకింగ్ కోసం కేవలం విస్తరాకులు మాత్రమే వాడడం అన్నవరం ప్రసాదంలో మరో ప్రత్యేకత.
"హైదరాబాద్ లో ఉన్నప్పుడు బంధువులు తీసుకొస్తే తిన్నాం. ఈ ప్రసాదం మళ్లీ ఎప్పుడు తిందామా అని ఎదురు చూశాం. పెళ్లి తర్వాత వ్రతం కోసం వచ్చాము. ఇప్పుడు రుచి చూడగానే చాలా ఆనందంవేసింది. ఎలా తయారు చేస్తారో గానీ రుచి చాలా బాగుంటుంది'' అని హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సానబోయిన అనూష బీబీసీతో అన్నారు.
''అన్నవరం అనగానే ప్రసాదమే గుర్తుకొస్తుంది'' అన్నారామె.

పెరిగిన ప్రసాదం తయారీ
నేషనల్ హైవే-16 పై వెళ్లే వారి కోసం అన్నవరం బైపాస్ రోడ్డులో ఓ కౌంటర్ ప్రారంభించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసాదం విక్రయిస్తున్నారు. ఇక మెట్ల మార్గాన్ని ఆనుకుని కొండ దిగువన ఉన్న కౌంటర్‌లో సుదీర్ఘకాలంగా ప్రసాదం విక్రయాలు సాగుతూ ఉన్నాయి. కొండపైనే కూడా కౌంటర్లలో ఈ ప్రసాదం అమ్మకాలను దేవస్థానం కొనసాగిస్తోంది.
ప్రసాదం కోసం డిమాండ్ పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా తయారీ యూనిట్ సామర్థ్యం పెంచారు. మ్యానువల్ పద్ధతిలో కాకుండా సెమీ ఆటోమేటిగ్ గా మార్చేశారు. దాని ఫలితంగా కొంత సులువుగా ప్రసాదం తయారీ సాగుతోందని వంట నిపుణులు చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో అన్నవరం ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఈవో త్రినాథరావు బీబీసీకి తెలిపారు. ప్రసాదం విక్రయం ద్వారా ఆలయానికి పెద్ద మొత్తంలో ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. ప్రసాదం నాణ్యతకు అనుగుణంగా మూల పదార్థాలను నిత్యం పర్యవేక్షిస్తూ ఆలయ విశిష్టతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
అన్నవరం ప్రసాదం గోధుమ నూకలతో తయారుచేయడం వెనుక అసలు కారణాలపై భిన్నమైన వాదనలున్నప్పటికీ ఆ ప్రసాదం రుచి విషయంలో మాత్రం అందరిదీ ఒకటే అభిప్రాయం.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
- భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉంటాయి, ఇప్పటికే ఆయుధాలన్నీ సిద్ధమయ్యాయా?
- బైడెన్-పుతిన్ ఫోన్ సంభాషణ: ఉక్రెయిన్‌పై ఆంక్షలు పెంచితే సమస్యలు తప్పవని హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు
- హైదరాబాద్ నగరం 'రాత్రి ఆకాశాన్ని ఎలా మిస్సవుతోంది, కాంతి కాలుష్యం అంటే ఏమిటి? - 10 ప్రశ్నలు, జవాబులు
- ‘‘నా కొడుకు కడుపులో బుల్లెట్ దించారు.. ఛాతీపై తన్నారు’’- అస్సాం దరంగ్ జిల్లా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలు జరిగి మూడేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
- చుండూరు మారణకాండ: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో విసిరేసిన కేసు ఏమైంది?
- ఉన్నావ్ ఘటన: బాలికల మృతికి కారణం ఏంటి?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













