హైదరాబాద్ కాంతి కాలుష్యంలో నెంబర్ 1 ఎలా అయ్యింది? మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? - 10 ప్రశ్నలు, జవాబులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలోకెల్లా హైదరాబాద్ నగరంలో కాంతి కాలుష్యం అత్యధికంగా ఉందని.. ''హైదరాబాద్ నగరం రాత్రి ఆకాశాన్ని కోల్పోయింద''ని అధ్యయనం ఒకటి చెబుతోంది. నగర జీవుల ఆరోగ్యాల మీద, ఇతర జీవరాశుల మీద, పర్యావరణం మీద ఈ కాలుష్యం ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆ అధ్యయనం హెచ్చరిస్తోంది.
వాయు కాలుష్యం గురించి, నీటి కాలుష్యం గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. పర్యావరణ కాలుష్యం గురించి కూడా ఎప్పుడూ చర్చిస్తూ ఉంటాం. అంత తరచుగా కాకపోయినా ధ్వని కాలుష్యం గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం.
మానవాళి అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ కాలుష్యాలు, వీటితో వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయనేది అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటు పెరుగుతూ ఉన్న కాంతి కాలుష్యం మీద పరిశోధకులు, పర్యావరణవేత్తలు ఇప్పుడు దృష్టిసారిస్తున్నారు.
ప్రపంచదేశాల్లో మిగతా కాలుష్యాల తరహాలోనే కాంతి కాలుష్యం కూడా పెరుగుతోందని, ఇది కూడా అనేక అనర్థాలకు దారితీస్తోందని వారి అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే.. ఆ వివరాలేమిటో చూద్దాం.
1. కాంతి కాలుష్యం అంటే ఏమిటి?
ఓ వందేళ్ల కిందటి వరకూ.. భూమి మీదున్న మనుషులంతా రాత్రిపూట నక్షత్రాలతో మెరిసిపోయే ఆకాశంలోకి చూసి అబ్బురపడేవాడు. ఆనందించేవారు. అన్వేషించేవారు. ఆకాశవీధిలో పరిశోధనలకూ అదే మూలం.
పాలపుంతలు, నక్షత్ర మండలాలు ఎన్నో కనుగొన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచం నలమూలలా చిన్నారులకు కనీసం రాత్రిపూట నిర్మలాకాశంలో మెరిసిపోయే తారాపథాన్ని చూసే అవకాశం లేకుండాపోయింది.
అందుకు ప్రధాన కారణం- కాంతి కాలుష్యం. రాత్రివేళల్లో కృత్రిమ కాంతిని ఉపయోగించటం విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా ఇంకా పెరిగిపోతోంది. దీనివల్ల విశ్వాన్ని వీక్షించలేకపోవటమే కాదు.. మన పర్యావరణం మీద, మన జీవావరణం మీద, మన ఆరోగ్యం మీద కూడా ఈ కాంతి కాలుష్యం చాలా ప్రతికూల ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మానవ నాగరికతలో 19వ శతాబ్దంలో విద్యుత్ బల్బును ఆవిష్కరించారు. దీంతో మన చీకటి రాత్రుల్లో వెలుతురు విప్లవం మొదలైంది. మనుషులు చేసే పనులు రాత్రిళ్లు కూడా కొనసాగటం మొదలైంది.
పారిశ్రామిక రంగం కూడా శరవేగంగా అభివృద్ధి చెందింది. అర్థరాత్రిళ్లు సైతం ఆరుబయట విందులు, వినోదాలు, విహారాలు పెరిగిపోయాయి. మానవాళి జీవన శైలి మారిపోయింది.
''వెలుతురుతో నిజంగా చాలా మంచి ప్రయోజనాలున్నాయి. కానీ, దానివల్ల అనుకోని ప్రతికూల పర్యవసానాలూ తలెత్తుతున్నాయి. అవసరం లేని చోట, అవసరం లేని సమయంలో.. అనవసరమైన, ఎలాంటి ఉపయోగం కలిగించని వెలుగు - కాంతి కాలుష్యం'' అని ఇంటర్నేషనల్ డార్క్-స్కై అసోసియేషన్ (ఐడీఏ) ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రస్కిన్ హార్ట్లీ నిర్వచించినట్లు పొలిటికో తాజా కథనంలో తెలిపింది.
అంతరిక్ష పరిశోధకులు కొందరు బృందంగా ఏర్పడి.. కాంతి కాలుష్యం మీద పోరాడేందుకు ఇంటర్నేషనల్ డార్క్-స్కై అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు.
ఈ సంస్థ..అంతరిక్ష పరిశోధకులు, పర్యావరణవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలను కలుపుకుంటూ కాంతి కాలుష్యాన్ని తగ్గించటానికి, రాత్రిపూట ఆకాశం స్వచ్ఛంగా కనిపించే చీకటి ప్రాంతాలను పెంపొందించటానికి కృషి చేస్తోంది.

ఫొటో సోర్స్, @KTRTRS/twitter
2. కాంతి కాలుష్యం ఎలా ఉంటుంది?
నగరాలలోనివసించే వారు.. రాత్రిపూట బయటకు వెళ్లి ఆకాశం వైపు చూస్తే కాంతి కాలుష్యం అంటే ఏంటో కళ్లకు కడుతుంది.
కాంతి కాలుష్యంలో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి:
గ్లేర్: కంటి చూపుకు ఇబ్బంది కలిగించే అధిక ప్రకాశం
స్కైగ్లో: జనావాస ప్రాంతాల్లో రాత్రి ఆకాశం వెలుగుతూ ఉండటం
లైట్ స్ట్రెస్‌పాస్: అనవసరమైన చోట వెలుతురు పడుతుండటం
క్లటర్: ఒకే చోటులో కళ్లుమిరిమిట్లు గొలిపేలా, గందరగోళంగా, మితిమీరిన సంఖ్యలో లైట్లు వెలుగుతుండటం
కాంతి కాలుష్యం ఓ రకమైన వెలుగుతెరను సృష్టిస్తోంది. దీనినే స్కైగ్లో (ఆకాశ ప్రకాశం) అని వ్యవహరిస్తున్నారు. ఇది నక్షత్రాలను పరిశీలించే ఖగోళ పరిశోధకులకు సమస్యాత్మకంగా మారింది.
అలాగే.. ఇళ్లు, భవనాలు, కట్టడాల వెలుపల బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే కృత్రిమ వెలుతురు చాలా వరకూ.. అవసరమైన దానికన్నా అధిక ప్రకాశవంతంగా ఉంది. అనవసరమైన ప్రదేశాలకూ ఆ వెలుతురు విస్తరిస్తోంది. విద్యుత్ దీపాల వెలుతురు పక్కలకు పోకుండా ఉంచే ఏర్పాట్లు లేవు.
ఇక అవసరం లేని ప్రాంతాల్లోనూ ప్రకాశవంతమైన లైట్లు ఏర్పాటు చేయటం కూడా విచ్చలవిడిగా సాగుతోంది.
మీరు నివసిస్తున్న ప్రాంతంలో కాంతి కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే.. వరల్డ్ అట్లాస్ డాటాతో రూపొందించిన ఇంటరాక్టివ్ మ్యాప్ (interactive map)ను కానీ, లేదంటే నాసా బ్లూ మార్బుల్ నేవిగేటర్ (NASA Blue Marble Navigator) ను కానీ చూడొచ్చు.
3. ప్రపంచంలో కాంతి కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంది?
మితిమీరిన కాంతి అనేది ఓ అంతర్జాతీయ సమస్య అని.. ప్రపంచమంతటా ప్రధానంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ కాంతి కాలుష్యం పెరిగిపోతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
భూమి మీద మానవాళిలో ఎక్కువభాగం కాంతి కాలుష్యంతో నిండిన ఆకాశం కిందే జీవిస్తున్నారు. 2016లో కృత్రిమ వెలుగులో ఆకాశపు ప్రపంచ అట్లాస్‌ను (వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ నైట్ స్కై బ్రైట్‌నెస్) రూపొందించారు.
దాని ప్రకారం ప్రపంచ జనాభాలో 80 శాతం మంది స్కైగ్లో కిందే - అంటే కృత్రిమ వెలుగులోని ఆకాశం కిందే నివసిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో అయితే 99 శాతం మంది జనానికి రాత్రిపూట సహజ కాంతిలో ఆకాశాన్ని చూడగలిగే అవకాశమే లేకుండా పోయింది.
హాంగ్ కాంగ్ నగరం భూమి మీద కాంతి కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్న నగరమని 2013లో ప్రకటించారు.
ప్రపంచంలో అత్యధిక కాంతి కాలుష్యం గల దేశం సింగపూర్ అని 2016లో అంచనా వేశారు.

ఫొటో సోర్స్, @KTRTRS/twitter
4. హైదరాబాద్‌లో కాంతి కాలుష్యం ఎంత?
భారతదేశంలోకెల్లా హైదరాబాద్ నగరంలో అత్యధిక స్థాయిలో కాంతి కాలుష్యం ఉందని.. అధ్యయనం ఒకటి చెప్తోంది. హైదరాబాద్ నగరం తన రాత్రి ఆకాశాన్ని కోల్పోయిందని భువనేశ్వర్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ శిబ ప్రసాద్ మిశ్రా తన అధ్యయనంలో పేర్కొన్నారు. నగరవాసుల ఆరోగ్యానికి ఇది ప్రమాదమని హెచ్చరించారు.
ప్రొఫెసర్ శిబ ప్రసాద్ మిశ్రా అధ్యయనం వివరాలు ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలో విద్యుత్ లైట్ల నుంచి వెలువడుతున్న కాంతి తీవ్రత 7790 µcd/m2 (యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ పర్ స్క్వేర్ మీటర్)గా ఉంది.
హైదరాబాద్ తర్వాతి స్థానంలో కోల్‌కతా (7480 µcd/m2) ఉండగా.. దేశ రాజధాని నగరం దిల్లీ మూడో స్థానం (7,270 µcd/m2)లో ఉంది. భువనేశ్వర్‌లో అతి తక్కువగా 2910 µcd/m2 కాంతి కాలుష్యమే నమోదైంది.
2014 నుంచి 2017 వరకూ దేశంలోని ఎనిమిది నగరాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను పరిశీలించి ఆయన ఈ అధ్యయనం చేశారు. హైదరాబాద్, న్యూ దిల్లీ, చెన్నై, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో 2014-17 మధ్య కాంతి కాలుష్యం 102.23 శాతం పెరిగిపోయింది.

ఫొటో సోర్స్, NASA
5. కాంతి కాలుష్యం ప్రభావాలు ఏమిటి?
భూమి 300 కోట్ల సంవత్సరాల పాటు.. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల నుంచి వచ్చే సహజ వెలుతురు, చీకట్లలో తిరుగుతూ ఉంది. కానీ గడచిన వందేళ్లలో మనుషులు సృష్టించిన కృత్రిమ వెలుతురు.. రాత్రి చీకటిని మింగేస్తోంది. ప్రకృతి సహజమైన పగలు - రాత్రి క్రమాన్ని పట్టాలు తప్పిస్తోంది. దీంతో పర్యావరణంలో సహజ సంతులనం చెదిరిపోతోంది.
''ఈ భూమి, దాని మీద నివసించే ప్రతి జీవీ.. 'పగలు - రాత్రి' అనే సహజమైన కాలచక్రంలో పరిణామం చెందుతూ వచ్చాయి. కానీ.. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల విస్ఫోటనంతో మనం దానిని మార్చేశాం'' అని హార్ట్లీ పేర్కొన్నారు.
కాంతి కాలుష్యం వల్ల.. మానవాళికి చేటుచేసే ఆరోగ్య సమస్యలు, జీవావరణ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తటంతో పాటు మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అది విపరీతమైన ఇంధన వృథా.
అవసరమైన దానికన్నా అతిగా కాంతి వినియోగం వల్ల.. ఎంతో ఇంధనం దుర్వినియోగం కావటంతో పాటు, భారీ మొత్తంలో కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయని బెర్హంపూర్‌లోని ఐఐఎస్‌ఈఆర్ పరిశోధక విద్యార్థిని తన అధ్యయనంలో చెప్పారు.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో తాజాగా ప్రచురితమైన ఆ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 520 కోట్ల యూరోలు, 2,350 కోట్ల కిలోల కార్బన్‌డైఆక్సైడ్ వృధా అవుతున్నాయని యూరోపియన్ యూనియన్ అంచనా వేసింది.
''భారతదేశంలో 2.70 కోట్లకు పైగా వీధి దీపాలు ఉన్నాయి. దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 30 నుంచి 35 శాతం విద్యుత్ ఈ వీధి దీపాలకే ఖర్చవుతోంది. దేశంలో కాంతి కాలుష్యంలో 43 శాతం వీధి దీపాలు, హైవేల మీద లైట్లే కారణం'' అని ఆమె తన అధ్యయనంలో చెప్పారు.
6. మన ఆరోగ్యంపై కాంతి కాలుష్యం ప్రభావం ఏమిటి?
మానవులు పగలూ రాత్రీ అనే సహజమైన వెలుగు చీకట్ల క్రమంలో పరిణామం చెందారు. కానీ కృత్రిమ కాంతి విస్తరించటంతో ఇప్పుడు మనలో చాలా మందికి నిజమైన చీకటి రాత్రులంటే ఏమిటో తెలియకుండా పోయింది.
మన జీవగడియారం రాత్రి - పగలు చక్రానికి అనుగుణంగా తయారైంది. మన నిద్ర, మెలకువ స్థితులను ఆ గడియారం నిర్వహిస్తుంది. ఆ గడియారాన్ని కృత్రిమ కాంతి దెబ్బతీస్తోంది.
మనం రాత్రిపూట ఎక్కువ మోతాదులో కృత్రిమ వెలుగులో ఉంటే.. మన శరీరాల్లో జీవగడియారాన్ని నియంత్రించే మెలటోనిన్ విడుదలపై ప్రభావం పడుతుంది. ఇది అనేక అనారోగ్యాలకు, క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బులకూ దారితీస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.
కాంతి కాలుష్యం పెరుగుతుండటం వల్ల హైదరాబాద్ నగరవాసులు నిద్రలేమి, కుంగుబాటు, స్థూలకాయం, షుగర్ తదితర అనారోగ్యాలకు లోనవుతున్నారని ప్రొఫెసర్ శిబ ప్రసాద్ మిశ్రా అధ్యయనం వెల్లడించింది.
కాంతి కాలుష్యం వల్ల కంటి చూపు కూడా దెబ్బతింటోందని.. పాదచారులు, వాహనచోదకులు ప్రయాణించే సమయంలో అధిక కాంతి వల్ల చూపులో స్పష్టత కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Fabrice Coffrini/AFP/Getty Images
7. జంతువుల మీద కాంతి కాలుష్యం ప్రభావం ఎలా ఉంది?
కృత్రిమ కాంతి మానవాళికే కాదు జంతువులు, పక్షులు తదితర జీవరాశుల మీద కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రొఫెసర్ శిబ ప్రసాద్ మిశ్రా అధ్యయనం చెప్తోంది.
సీజన్‌ను బట్టి, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఒక చోటు నుంచి మరోచోటుకు వలసపోయే సమయంలో.. ప్రకాశవంతమైన కాంతి కారణంగా పక్షులు దారి తప్పుతున్నాయని వివరించింది.
''కప్పలు సంయోగానికి ముందు పాడటం ఆపేశాయి'' అని ప్రొఫెసర్ మిశ్రా వెల్లడించారు.
జంతువుల్లో కూడా ఆయా కాలాలను బట్టి వాటి శరీరాల్లో మార్పులు జరిగేలా చేసే పని మెలటోనిన్‌దే. ''ఊలు జంతువుల్లో బొచ్చు పెరగటం లేదా ఊడటం, సంయోగానికి శరీరం సిద్ధం కావటం వంటివి ఈ హార్మోన్ వల్లే జరుగుతాయి. కృత్రిమ కాంతి వల్ల ఈ హార్మోన్ విడుదలలో మార్పులు వస్తున్నాయి'' అని బెర్లిన్‌లోని లీబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఎకాలజీ అండర్ ఇన్లాండ్ ఫిషరీస్ చెందిన పరిశోధకులు సిబిల్ ష్క్రోయెర్ చెప్పారు. ఆమె కాంతి కాలుష్యం మీద అధ్యయనం చేస్తున్నారు.
''ఈ మార్పులు ప్రాణాంతకం కాదు కానీ.. దృఢత్వాన్ని తగ్గిస్తాయి. జంతు సమూహాలు బయటి ప్రభావాలను తట్టుకునే సామర్థ్యాలు తగ్గిపోతాయి. దాని ఫలితంగా జీవజాతులు బలహీనపడతాయి. మరింత బలహీనంగా ఉన్న జీవులు అంతరించిపోతాయి'' అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
కాంతి కాలుష్యానికి, పురుగుల జనాభా తగ్గిపోవటానికి సంబంధాలున్నాయని పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఈ పరిణామం ఆహార గొలుసుల మీద దారుణ ప్రభావం చూపే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్‌లో వీధి దీపాలు ఉన్న ప్రాంతాలు, లేని ప్రాంతాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. దీపాల వెలుగులోని వీధుల్లో మోత్ కాటర్‌పిల్లర్ జనాభా 52 శాతం తగ్గిపోయినట్లు గుర్తించారు. మోత్ కాటర్‌పిల్లర్లు వీధి దీపాల వెలుతురుకు ఆకర్షితమై తమ గూళ్లలోంచి బయటకు రావటమే దానికి కారణమని తెలుసుకున్నారు.
8. కాంతి కాలుష్యం సమస్యకు పరిష్కారాలేమిటి?
కాంతి కాలుష్యం ప్రతి మనిషి మీదా ప్రభావం చూపుతోంది. అయితే.. ఈ కాలుష్యంపై అవగాహన, ఆందోళనలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.
సహజ ప్రకృతిని పునరుద్ధరించటానికి కృషిచేస్తున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. కాంతి కాలుష్యం అనే సమస్యను ప్రభుత్వాలు, విధానకర్తలు పెద్దగా పట్టించుకోవటం లేదని ఉద్యమకారులు చెప్తున్నారు.
ఈ సమస్యకు.. డార్క్-స్కై ఉద్యమకారులు పలు పరిష్కారాలు సూచిస్తున్నారు. హైవేల మీద లైట్ల ఏర్పాటును నిషేధించటం మొదలుకుని.. ఎల్‌ఈడీ లైట్ల రంగును నియంత్రించటం వరకూ ఇందులో ఉన్నాయి.
విద్యుత్ దీపాలు అవసరమైనదానికన్నా ఎక్కువ ప్రకాశవంతంగా లేకుండా ఉండేలా చూడటానికి.. వాటి వెలుతురు స్థాయిలపై నియంత్రణ విధిస్తూ చట్టాలు చేయాలని ష్క్రోయెర్ సూచిస్తున్నారు.
దీపాల వెలుగు.. వెలుతురు అవసరం లేని ప్రాంతాల మీద పడటాన్ని సాధ్యమైనంత తగ్గించటానికి లైట్ షీల్డులను ఉపయోగించటం కూడా తప్పనిసరి చేయాలని ఆమె చెప్తున్నారు.
విద్యుత్ లైటు రంగు మీద కూడా దృష్టి పెట్టాలంటారామె. తెల్లటి ఎల్‌ఈడీ లైట్లను.. ప్రస్తుతం అత్యంత పర్యావరణ హితమైన లైట్లుగా పరిగణిస్తున్నారు. కానీ ఈ లైట్లలో నీలి వెలుతురు చాలా అధికంగా ఉంటుంది. అది చాలా జీవజాతుల మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది.
తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుతురునిచ్చే ఎల్‌ఈడీ లైట్లు.. ఇంధనం ఆదా చేయటం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని చెబుతున్నప్పటికీ.. వాటివల్ల మానవాళికి కలిగే ముప్పును గుర్తించడం లేదని ప్రొఫెసర్ శిబప్రసాద్ మిశ్రా తన అధ్యయనంలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. వచ్చే వసంత కాలంలో జరగబోయే కాప్15 అంతర్జాతీయ జీవవైవిధ్య వేదికలో చర్చించటానికి ఉద్దేశించిన తొలి ముసాయిదాలో.. ''జీవవైవిధ్యానికి, జీవావరణ వ్యవస్థలకు, మానవ ఆరోగ్యానికి హాని చేయని స్థాయిలకు కాంతి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కృషి చేయాలి'' అంటూ యూరోపియన్ యూనియన్ సూచించింది.

ఫొటో సోర్స్, NASA
9. కాంతి కాలుష్యాన్ని మనం ఎలా తగ్గించొచ్చు?
చాలా రకాల కాలుష్యాల తరహాలోనే కాంతి కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చునని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ దిశగా కృషి చేయవచ్చునని నిపుణులు చెప్తున్నారు.
ఎవరి ఇంట్లో వారు రాత్రి పూట కాంతి వినియోగాన్ని తగ్గించటం మొదలు.. పలు చర్యలు పాటించవచ్చునని సూచిస్తున్నారు. అవేమిటంటే...
- అవసరమైనపుడు, అవసరమైన చోట మాత్రమే లైటు ఉపయోగించటం
- భద్రత కోసం అవసరమైతే మోషన్ డిటెక్టర్ లైట్లు, టైమర్లను ఏర్పాటు చేసుకోవచ్చు
- ఆరుబయట ఉన్న లైట్లన్నిటికీ సరైన షీల్డులు ఏర్పాటు చేయటం
- ఇంట్లో వెలుతురు అనవసరంగా బయటకు ప్రసరించకుండా తలుపులు, కర్టెన్లు వంటివి మూసి ఉంచటం
10. ఇంటి కోసం ఎటువంటి బల్బులు ఎంచుకోవాలి?
ముఖ్యంగా రాత్రిపూట నీలి కాంతి (బ్లూ లైట్)లో ఉండటం మరింత ఎక్కువ హానికరమని నిపుణులు చెప్తున్నారు.
అయితే.. బయటి ప్రాంతాల్లో ఉపయోగించే ఎల్‌ఈడీ లైట్లలో చాలా వరకూ ఎక్కువ మోతాదులో నీలి కాంతిని విడుదల చేస్తున్నాయని ఈ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇక కంప్యూటర్ స్క్రీన్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు కూడా మితిమీరిన స్థాయిలో నీలి కాంతిని వెదజిమ్ముతున్నాయి.
పాత కాలపు ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బులతో పోలిస్తే.. ఫ్లొరొసెంట్ లైట్ బల్బులు, ఎల్‌ఈడీ లైట్లు ఉపయోగించే విద్యుత్ చాలా తక్కువ. అందువల్ల ప్రపంచమంతా విద్యుత్, ఇంధన పొదుపు కోసం ఎల్‌ఈడీ లైట్లను వాడాలని నిర్ణయించింది. కానీ.. ఈ ఎల్‌ఈడీ లైట్ల వల్ల ఇంధనం ఆదా అవుతున్నప్పటికీ.. అవి విడుదల చేసే కాంతిలో నీలి కాంతి చాలా ఎక్కువగా ఉంటోందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు చెప్తున్నారు.
ఇంట్లో నీలి వెలుతురును తగ్గించటానికి.. సరైన లైట్ బల్బును ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ వంటి పరికరాల్లో.. స్క్రీన్ వెలుగును రోజులో సమయానికి అనుగుణంగా మార్చే కలర్ టెంపరేచర్ యాప్‌ను ఉపయోగించవచ్చు.
అన్ని సీఎఫ్ఎల్, ఎల్‌ఈడీ లైట్ బల్బుల ప్యాకేజింగ్ మీద.. వాటి వాటి కలర్ టెంపరేచర్ ఎంత ఉందో చూడొచ్చు.
కలర్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే.. అందులో నీలి కాంతి ఎక్కువగా ఉంటుందని అర్థం. అటువంటి లైట్లను సాయంత్రం తర్వాత ఎక్కువగా ఉపయోగించకపోవటం మంచిది.
కలర్ టెంపరేచర్ 3000K కానీ, అంతకన్నా తక్కువగానే ఉంటే అందులో నీలి కాంతి మోతాదు తక్కువగా ఉంటుంది. ఇటువంటి లైట్ బల్బులు మనుషులకు, పర్యావరణానికి తక్కువ హానికరం.
ఇవి కూడా చదవండి:
- గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజ్ ఎవరు, ఆయన గతంలో ఏం చేసేవారు
- ‘నేను దేశం విడిచి ఎలా పారిపోయానంటే’ - నాలుగు నెలల తరువాత బయటపెట్టిన అష్రాఫ్ ఘనీ
- డిసెంబర్ 31 రాత్రి ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలు చేస్తే కరోనా వ్యాపిస్తుందా
- షెడ్యూల్డు కులాల్లో రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందట్లేదా? ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్ ఎందుకు?
- చిలకలూరుపేట బస్సు దహనం (1993) కేసు: 23 మంది మృతికి కారణమైన దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే...
- ‘‘నా కొడుకు కడుపులో బుల్లెట్ దించారు.. ఛాతీపై తన్నారు’’- అస్సాం దరంగ్ జిల్లా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలు జరిగి మూడేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
- చుండూరు మారణకాండ: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో విసిరేసిన కేసు ఏమైంది?
- ఉన్నావ్ ఘటన: బాలికల మృతికి కారణం ఏంటి?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













