గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహరాజ్ ఎవరు, ఆయన గతంలో ఏం చేసేవారు

ధర్మసంసద్‌లో గాంధీని తిడుతూ కాళీచరణ్ ప్రసంగించారు.

ఫొటో సోర్స్, CG KHABAR/BBC

ఫొటో క్యాప్షన్, ధర్మసంసద్‌లో గాంధీని తిడుతూ కాళీచరణ్ ప్రసంగించారు.
    • రచయిత, నితిన్ సుల్తానే
    • హోదా, బీబీసీ మరాఠీ

రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మ సంసద్‌‌లో మహాత్మా గాంధీని దుర్భాషలాడిన కాళీచరణ్ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఈ నెల 17-19 తేదీల మధ్య హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో సాధుసంతుల వివాదాస్పద ప్రకటనల గొడవ సద్దుమణగక ముందే, రాయ్‌పూర్‌ ధర్మసంసద్ మరో కొత్త వివాదాన్ని సృష్టించింది.

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మ సంసద్ వీడియో వైరల్‌గా మారింది. అందులో అకోలాకు చెందిన కాళీచరణ్ మహారాజ్ అనే సాధువు మహాత్మా గాంధీని దుర్భాషలాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

గాంధీని దూషించడంతపాటు, ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేను కాళీమహారాజ్ ప్రశంసించడం ఈ వీడియోలో ఉంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి కొందరు చప్పట్లు కొడుతూ కనిపించారు.

ధర్మసంసద్‌లో మాట్లాడుతున్న కాళీచరణ్ మహరాజ్

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్, ధర్మసంసద్‌లో మాట్లాడుతున్న కాళీచరణ్ మహరాజ్

ఎవరీ కాళీచరణ్ మహారాజ్ ?

కాళీచరణ్ మహారాజ్ ‘శివతాండవ స్త్రోత్రం’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా ఆయన మొదటిసారి చాలామందికి పరిచితమయ్యారు. ఆయన అసలు పేరు అభిజిత్ సరాగ్.

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జన్మించిన ఆయన ప్రస్తుతం శివాజీ నగర్‌లోని భావసర్ పంచబంగ్లా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన బాల్యమంతా అకోలాలోనే గడిచిందని స్థానిక జర్నలిస్టు ఉమేశ్ అకేలా వెల్లడించారు.

కాళీచరణ్ మహారాజ్ ఎంత వరకు చదివారు అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. ఎనిమిదో తరగతి వరకు చదివారని కొందరు స్థానికులు చెప్పారు. ఆయన ఎప్పుడూ తన చదువుకు సంబంధించిన విషయాలు బయటకు చెప్పేవారుకాదని వారు వెల్లడించారు.

''నాకు చదువు మీద ఆసక్తి లేదు. ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు. బలవంతంగా స్కూలుకు పంపిస్తే ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చేది. అందరూ నన్ను ప్రేమిస్తుంటారు. నాకు మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరిగింది. ఆధ్యాత్మికత వైపు మళ్లాను'' అని ఓ ఇంటర్వ్యూలో కాళీచరణ్ వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, చీరకట్టి కర్రసాము చేస్తూ.. ఔరా అనిపిస్తున్న పాలకుర్తి ZPTC టాలెంట్ చూశారా..

ఎన్నికల్లో ఓటమి

కాళీచరణ్ మహారాజ్ యువకుడిగా ఉన్న సమయంలో ఇండోర్ వెళ్లారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఇండోర్‌లోని భయ్యూజీ మహారాజ్ అనే గురువు దగ్గర శిష్యరికం చేశారు. కొన్నాళ్లకు భయ్యూజీ ఆశ్రమాన్ని వదిలి అకోలాకు తిరిగి వచ్చారు.

‘‘కాళీచరణ్ 2017లో తిరిగి అకోలా వచ్చారు. మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు’’ అని జర్నలిస్ట్ ఉమేష్ అకేలా తెలిపారు.

అభిజిత్ సరాగ్ నుంచి కాళీచరణ్‌గా మారడం వెనక ఆసక్తి కరమైన కథ ఉందని చెబుతారు కాళీమహరాజ్. ఓసారి కాళీకా దేవి తనకు దర్శనమివ్వడమే కాక, పెను ప్రమాదం నుంచి కాపాడిందని ఆయన చెప్పుకొంటారు.

''ఓ ప్రమాదంలో నా కాళ్లు విరిగిపోయాయి. ఆ సమయంలో కాళీమాత నాకు కనిపించింది. ఆమె నా కాలిని తాకగానే అవి మళ్లీ మామూలు అయ్యాయి'' అని కాళీ చరణ్ చెబుతుంటారు.

ధర్మసంసద్‌లో సాధు సంతులు

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

ఫొటో క్యాప్షన్, ధర్మసంసద్‌లో సాధు సంతులు

''ఇది చాలా తీవ్రమైన ప్రమాదం. కానీ నేను శస్త్రచికిత్స చేయించుకోలేదు. నా కాలికి రాడ్ పెట్టాల్సిన అవసరం రాలేదు. ఇది నిజంగా అద్భుతం. నేను కాళీమాతను చూడగలిగాను. ఆమె భక్తుడినయ్యాను'' అన్నారాయన.

''రాత్రిపూట కూడా నేను కాళీమాత పేరును జపిస్తుంటానని మా అమ్మమ్మ చెప్పేది. అందుకే నేను కాళీమాతను పూజించడం ప్రారంభించాను. నాకు మతం పట్ల ఆసక్తి ఏర్పడింది. కాళీ మాత బిడ్డగా మారిపోయాను'' అని వివరించారు కాళీ చరణ్. తన గురువు అగస్త్య మహర్షి అని చెప్పుకొంటారు కాళీచరణ్.

15 ఏళ్ల వయసులో తాను అగస్త్య మహామునిని కలిశానని చెబుతుంటారు కాళీ చరణ్. ఎర్రటి దుస్తులు ధరించాల్సిందిగా అగస్త్య మహర్షి తనను ఆదేశించారని వెల్లడించారు. అయితే, తాను రుషిని కాదంటారాయన.

''మునులు మేకప్ చేసుకోరు. కానీ, నాకు డిజైన్‌లు ఉన్న దుస్తులు ఇష్టం. బొట్టుపెట్టుకుంటాను, షేవ్ చేసుకుంటాను. కాబట్టి, నేను రుషిని కాను'' అన్నారు కాళీచరణ్.

ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో కొందరు సాధువులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఫొటో సోర్స్, BBC/VARSHA SINGH

ఫొటో క్యాప్షన్, ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో కొందరు సాధువులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

వీడియోలు వైరల్

2020 జూన్‌లో వైరల్ అయిన ఓ వీడియో ద్వారా కాళీచరణ్ వెలుగులోకి వచ్చారు. ఆయన శివతాండవ స్త్రోత్రాన్ని పఠిస్తూ కనిపిస్తారు. దీనికి కోట్ల వ్యూస్ వచ్చాయి.

ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌కు సంబంధించి కాళీచరణ్ సంచలన ప్రకటనలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మోసపూరిత సంస్థ అని, అందులోని నిపుణులు మోసగాళ్లని ఆరోపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సీన్ కంపెనీలతో కుమ్మక్కై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, తద్వారా వ్యాక్సీన్ అమ్మకాలను పెంచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.

మరణించిన కోవిడ్ రోగుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదని, వారి కిడ్నీలు, కళ్లు తీసేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కానీ, వాటికి ఎలాంటి రుజువులు ఆయన చూపలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాళీచరణ్ మహారాజ్ పై చర్యలు

మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత, మత సామరస్యానికి భంగం కలిగించినందుకు కాళీచరణ్ మహరాజ్‌పై కేసు నమోదైంది. ఆయనను మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

''మహాత్మాగాంధీని విమర్శించడం ద్వారా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఎవరైనా విజయం సాధిస్తారనుకుంటే అది వారి భ్రమ మాత్రమే'' అని అంతకు ముందు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)