సయాజీ లక్ష్మణ్ శీలం: మహారాష్ట్ర అసెంబ్లీకి తొలి స్పీకర్‌ తెలుగు వ్యక్తే..

సయాజీ సీలం

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, సయాజీ లక్ష్మణ్ శీలం
    • రచయిత, పరాగ్ పాఠక్, ప్రజక్తా పోఠ్
    • హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధులు

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఒక కొలిక్కి రాలేదు. ఈ అంశంపై గవర్నర్, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ కెరీర్ గురించి తెలుసుకుందాం.

శాసన సభ సమావేశాలు జోరుగా జరుగుతున్నప్పటికీ, శాసన సభ స్పీకర్ ఎన్నిక మాత్రం జరగలేదు.

శాసస సభ సభ్యునిగా, చైర్మన్‌గా, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా సయాజీ శీలం సామాజిక రంగంలో చురుగ్గా, శ్రద్ధగా పనిచేశారు.

విద్య, మాదక ద్రవ్యాల నిషేధం, సహకార ఉద్యమం, క్రీడా సంస్థలు వంటి అంశాల్లో వెనుకబడిన వర్గాల కోసం అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన చేసిన పనులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

తెలుగు మాట్లాడే వ్యక్తి అయిన శీలం, ముంబయి సమూల అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. ఆయన చాలా ఏళ్ల పాటు పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేశారు.

వీడియో క్యాప్షన్, స్వతంత్రం వచ్చిన 1947లో వినాయక ఉత్సవాలు ఇలా జరిగాయి

మనోహర్ కదమ్ రాసిన 'కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ ఇన్ బిల్డింగ్ ముంబై' అనే పుస్తకంలో సయాజీ శీలం కృషి గురించి వివరించారు.

శీలం బహుముఖ సహకారం

శీలం మరణానంతరం శాసనసభలో ప్రవేశ పెట్టిన సంతాప తీర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ అంతులే శీలం గురించి వివరంగా చెప్పారు.

''1896 మే 18న సయాజీరావు లక్ష్మణ్ శీలం జన్మించారు. ఆయన బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు. 1941లో ముంబై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1946 నుంచి 1949 వరకు ముంబై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు.

ముంబై నగర అభివృద్ధిలో సయాజీ సీలం కీలక పాత్ర పోషించారు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, ముంబై నగర అభివృద్ధిలో సయాజీ శీలం కీలక పాత్ర పోషించారు

ముంబై హిందీ సభ కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ముంబై ఆటోమొబైల్ ఎంప్లాయిస్ యూనియన్, ముంబై ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్‌లకు అధ్యక్షునిగా వ్యవహరించారు.

బృహన్ ముంబై నషాబండి మండల్ సభ్యుడు కూడా. నషాబండి మండల్ ప్రారంభోత్సవ వేడుకల కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు.

ముంబైలోని అనేక విద్యా సంస్థలతో ఆయనకు అనుబంధముంది. ముంబై నగర అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేశారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పని చేసిన ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. 1922 నుంచి 1946 వరకు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ కమిటీ, స్కూల్ కమిటీల్లో కూడా ఆయన సభ్యుడు. 1946లో కార్పొరేషన్‌కు రాజీనామా చేశారు. అంతకుముందు 1937-38 మధ్య కాలంలో నార్కోటిక్స్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.

ముంబై స్టేట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ బోర్డులో కూడా శీలం పని చేశారు. 1946లో ముంబై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యారు.

తిలక్ స్మారక కమిటీ కార్యదర్శిగా, హానరరీ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్స్ బాంబే సొసైటీ అధ్యక్షుడిగా, ముంబై లెజిస్లేటివ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రతినిధిగా కూడా సేవలందించారు.

1956లో తొలిసారిగా ఆయన ముంబై రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957లో ముంబై రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా, స్పీకర్‌గా నియమితులయ్యారు.

1960లో మహారాష్ట్ర ఏర్పడింది. దీంతో శీలం, మహారాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా ఘనత వహించారు. 1962 వరకు ఆయన స్పీకర్ పదవిలో ఉన్నారు.

1963లో పుదుచ్చేరి డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1968 వరకు అదే పదవిలో కొనసాగారు.

85 ఏళ్ల వయస్సులో 1980 జూలై 5న ముంబైలో ఆయన మరణించారు'' అని అంతులే చెప్పుకొచ్చారు.

కల్లోల సమయాల్లో స్పీకర్‌గా బాధ్యతలు

''కల్లోల సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా శీలం బాధ్యతలు స్వీకరించారు. 1957లో యునైటెడ్ మహారాష్ట్ర అనే అంశం తీవ్రంగా మారింది. అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య సీట్ల అంతరం కూడా పరిమితంగానే ఉండేది.''

''సభా హక్కులను కాపాడేందుకు మంత్రులకు నచ్చజెప్పడంలో ఆయన వెనకడుగు వేయలేదు. సభా నియమావళి ఏర్పాటు చేయడంలో, వాటిని పక్కాగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు'' అని పవార్ ఆయన పనిని ప్రశంసించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర అసెంబ్లీ

చార్ థాప్ ముంబైతో పాటు మహారాష్ట్ర ప్రజా జీవితంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. సామాజిక విద్యలో అగ్రగామిగా నిలిచారు. హిందీ భాషను సామాన్యులకు చేరేవేసేందుకు వార్దాలోని రాష్ట్రభాషా ప్రచార సమితిలో చాలా ఏళ్ల పాటు పనిచేశారు.

''రెజ్లింగ్ కౌన్సిల్‌లో ముఖ్యమైన పదవులు చేపట్టారు. ఈ సంస్థ అధ్యక్షుడిగా, ఆయన పట్ల ప్రజలకు ఉన్న గౌరవం, సాన్నిహిత్యాన్ని నేను చూశాను'' అని పవార్ చెప్పుకొచ్చారు.

ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా

''ముంబై నగర కాంగ్రెస్ కమిటీకి చైర్మన్‌గా శీలం ఉన్న కాలంలో, కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఓటమి పాలయ్యారు. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ శీలం తన పదవికి రాజీనామా చేశారు'' అని సంతాప కార్యక్రమంలో పవార్ గుర్తు చేసుకున్నారు.

సామాజిక సంస్థలు మార్గదర్శకుడిని కోల్పోయాయి

ఆయన మృతి సందర్భంగా నివాళులర్పించిన హషు అద్వానీ... 'అనేక సామాజిక సంస్థలు, మార్గదర్శకుడిని కోల్పోయాయి' అని వ్యాఖ్యానించారు.

''అనేక సంస్థలు ఎదగడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. శీలం మరణంతో అనేక సంస్థలు తమ పెద్ద దిక్కును కోల్పోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ, ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో భాగంగా ఉన్నప్పుడు ఆయన గణనీయంగా సేవ చేశారు'' అని అద్వానీ నివాళులర్పించారు.

''మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా శీలం ఉన్న సమయంలో, సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం కారణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతే'' అని డీబీ పాటిల్ అన్నారు.

బైకుల్లా వంతెన పేరు మార్పు

మహారాష్ట్రలో మూడు వందల ఏళ్లుగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెలుగు సమాజానికి సయాజీ శీలం మూలస్తంభంలాంటివారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా బైకుల్లా నుంచి నగ్‌పడా వరకున్న వంతెనకు ఆయన పేరును పెట్టారు. రాచెల్ లోపెజ్ రాసిన 'ముంబైవాలే: టేక్ ద హై రోడ్' అనే వార్తలో దీని గురించి ప్రస్తావించారు.

1965లో తెలుగు మాట్లాడే కమ్యూనిటీ ముంబయికి వచ్చింది. అప్పటి బాంబే ప్రావిన్సు, మరాఠాలకు చెందినది. కాలాఘాట్‌పై బ్రిటీష్ వారు పట్టు సాధించారు.

ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (గతంలో విక్టోరియా టర్మినల్), రాజాబాయి టర్మినస్ నిర్మాణంలో తెలుగు సమాజం ముఖ్య పాత్ర పోషించింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్

ఫొటో సోర్స్, PUNIT PARANJPE

ఫొటో క్యాప్షన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్

1960లో ప్రత్యేక మహారాష్ట్ర ఉద్యమ సాధనలో మరాఠీ ప్రజలకు తెలుగు కమ్యూనిటీ నుంచి మద్దతు లభించింది.

తెలుగు మాట్లాడే వారి కోసం శీలం 'తెలుగు మిత్ర' అనే బుక్‌లెట్‌ను ఎడిట్ చేశారు.

నిష్పక్షపాతం

ద్విభాషా రాష్ట్రం మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత, అసెంబ్లీ స్పీకర్‌గా సయాజీరావు నిష్పక్షపాతంగా పనిచేశారు. ఆయన కెరీర్‌లో ప్రధాన లక్షణం నిష్పక్షపాతమే.

''ప్రత్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన ప్రతీ అంశంలోనూ జాగ్రత్త తీసుకున్నారు. ఆయన్ను ఆదర్శవంతమైన స్పీకర్‌గా వర్ణించవచ్చు'' అని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ వైద్య అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)