ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, pib.gov.in
ప్రధాని మోదీ కొత్త కారు ధర విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని అధికార వర్గాలు ఖండించినట్లు 'ఆంధ్రజ్యోతి' స్పష్టం చేసింది.
''ప్రధాని కాన్వాయ్‌లో కొత్తగా చేర్చిన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-650 గార్డ్ కారు ధర రూ.12 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా.. అధికార వర్గాలు మాత్రం ధర అందులో మూడో వంతు మాత్రమే ఉంటుందని చెబుతున్నాయి.
పైగా ప్రతీ రెండేళ్లకోసారి ప్రధాని కాన్వాయ్‌లో కార్లను మార్చడం సాధారణమేనన్నాయి. ఇంతకుముందు ఉపయోగించి బీఎండబ్ల్యూ కారు తయారీని జర్మనీ సంస్థ నిలిపివేసిందని తెలిపాయి.
కాగా, అత్యంత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ కారును ప్రధాని భద్రత ను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎంపిక చేసింది.
ఎలాంటి ప్రమాదం జరిగినా ఇందులో ప్రయాణించే వారికి హాని జరగని విధంగా డిజైన్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక సేఫ్టీ రేటింగ్ అయిన వీఆర్-10 రేటింగ్ దీని సొంతం. కారు బాడీని పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్‌తో తయారు చేయడంతో సమీపంలో ఎంతటి శక్తివంతమైన పేలుడు జరిగినా, మిలిటరీ రైఫిళ్లతో బుల్లెట్ల వర్షం కురిపించినా ఇందులోని వారికి రక్షణ లభిస్తుంది.
ఇక ఫ్యూయల్ ట్యాంక్‌కు ప్రత్యేకమైన పదార్థంతో పూత పూసి ఉంటుంది. దీంతో కారు లోపల ఏవైనా మంటలు వ్యాపించినా ట్యాంక్ వాల్వ్‌లు మూసుకుపోతాయి.
ఎవరైనా విషవాయువుతో దాడి చేస్తే.. లోపలికి స్వచ్ఛమైన గాలి అందేలా ఏర్పాటు ఉంటుంది. 650 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఆరు లీటర్ల వీ12 ఇంజన్ మెర్సిడెజ్ మేబ్యాచ్ సొంతం.
దీనికి 360 డిగ్రీల కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. కాగా, తాను సన్యాసిగా చెప్పుకొనే మోదీ.. ఖరీదైన సన్యాసిగా మారారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ వ్యాఖ్యానించారు.
రూ.8 వేల కోట్ల విమానం, రూ.20 కోట్ల కారులో తిరుగుతూ, రూ.2 వేల కోట్ల విలువైన ఇంట్లో ఉంటున్నారని విమర్శించారు. కొవిడ్ వల్ల ప్రజలు ఉపాధి లేక అల్లాడుతుంటే ప్రధాని ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం అవసరమా? అని ప్రశ్నించినట్లు'' ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, vangaveeti radha krishna/fb
వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడం చారిత్రక తప్పిదం: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
వంగవీటి రాధా టీడీపీలో చేరి చారిత్రక తప్పిదం చేశారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నట్లు 'సాక్షి' పేర్కొంది.
''ఒంగోలులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా, రంగా కుటుంబంపై సీఎం వైఎస్ జగన్‌కు, తమకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు.
తనను హత్య చేసేందుకు నెల కిందట రెక్కీ నిర్వహించారని రాధా ప్రకటన చేయడంతో ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించిందని చెప్పారు.
గన్‌మెన్లను వద్దనుకోవడం రాధా వ్యక్తిగతమని పేర్కొన్నారు. రాధా చేసిన రెక్కీ ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు.
చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాధా ఇప్పటికైనా టీడీపీలో కొనసాగడంపై పునరాలోచించుకోవాలని ఒక మిత్రుడిగా తాను సూచిస్తున్నానని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/tdp.ncbn.official
వంగవీటి రాధా హత్యకు కుట్ర..
తన హత్యకు కుట్ర జరుగుతోందని వంగవీటి రాధా కృష్ణ వెల్లడించిన నేపథ్యలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం లేఖ రాశారు.
రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. దోషులకు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
వంగవీటి రాధాకృష్ణతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పంపిన గన్‌మెన్‌లను తిరస్కరించడం సరికాదని ఆయన సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని, పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలిసిందని'' సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP/GETTYIMAGES
విదేశాలకు వెళ్లిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవం ముగియగానే.. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వల్పకాల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు ‘ఈనాడు’ తెలిపింది.
''ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడిస్తూ... 'రాహుల్ గాంధీ వ్యక్తిగత పనులపై స్వల్పకాల విదేశీ పర్యటనకు వెళ్లారు. భాజపా, దాని మిత్ర పక్షాలు మీడియాలో అనవసరమైన పుకార్లు పుట్టించొద్దు' అని వ్యాఖ్యానించారు.
జనవరి 3వ తేదీన పంజాబ్‌లోని మోగాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఆయన సకాలంలో చేరుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి’’ అని ఈనాడు రాసుకొచ్చింది.
పత్తికి రికార్డు రేటు..క్వింటాలు రూ. 9000
తెలంగాణ రాష్ట్రంలో గత రెండ్రోజుల్లో అత్యధికంగా క్వింటాల్ పత్తి రూ.8,800 నుంచి రూ.9 వేలకు అమ్ముడుపోయినట్లు 'వెలుగు' పేర్కొంది.
''ఇట్లనే డిమాండ్ ఉంటే రానున్న రోజుల్లో రూ.10 వేలు పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం మార్కెట్లో మంగళ, బుధవారాల్లో గరిష్టంగా క్వింటాల్ పత్తి రూ.9 వేలు పలికింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు.
రైతులు మొత్తం 6,318 బస్తాలను మార్కెట్కు తీసుకురాగా.. కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ బిడ్డింగ్‌లో వ్యాపారులు పోటీ పడ్డారు.
తేమ ఆధారంగా రూ.7 వేలు మొదలుకొని రూ.9 వేల వరకు పెట్టారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లోనూ గత మూడ్రోజులు పత్తికి మంచి రేటు వచ్చింది.
సోమ, మంగళవారాల్లో గరిష్టంగా రూ.8,515, రూ.8,715 పలుకగా.. బుధవారం రూ.8,800లకు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. మార్కెట్ కు రోజూ దాదాపు 6 వేల క్వింటాళ్లకు పైగా పత్తి వస్తోంది.
మంగళవారం వరకు 3,56,690 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక మహబూబాబాద్ లో క్వింటాల్ పత్తికి గరిష్టంగా రూ.8,891, పెద్దపల్లిలో రూ.8,833, గజ్వేల్‍లో రూ.8,819, జమ్మికుంటలో రూ.8,800, ఆదిలాబాద్‍లో రూ.8,520 పలికినట్లు'' వెలుగు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








