విద్యుత్ కాంతి వలన ఆకాశం కలుషితమవుతోందా?

నిద్ర మీద, ఆరోగ్యం మీద ఈ కృత్రిమ వెలుగు ప్రభావం చూపుతుందని తెలిసింది

ఫొటో సోర్స్, PATRICK LANDMANN/SCIENCE PHOTO LIBRARY

ఫొటో క్యాప్షన్, నిద్ర మీద, ఆరోగ్యం మీద ఈ కృత్రిమ వెలుగు ప్రభావం చూపుతుందని తెలిసింది
    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కృత్రిమ కాంతిని సృష్టించే సాధనాలు రాత్రి పూట ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాయని పది రాత్రుల పాటు ప్రతీ రోజూ అర్ధరాత్రి 1.30 నిమిషాలకు చేసిన ఒక ప్రయోగం తేల్చింది.

అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని టక్సన్ నగరంలో పది రోజుల పాటు ఒకే సమయానికి 14,000 వీధి దీపాల కాంతిని తగ్గించి ఈ ప్రయోగం చేశారు.

"మొత్తం కాంతిలో వీధి దీపాల నుంచి ఎంత మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయో తెలుసుకునేందుకు శాటిలైట్ ను వాడాం" అని భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్టోఫర్ కైబా చెప్పారు.

మన నిద్ర మీద, ఆరోగ్యం మీద ఈ కృత్రిమ వెలుగు ప్రభావం చూపుతుందని తెలిసింది.

"ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండే సమయంలో చాలా విద్యుత్ శక్తిని ఆదా చేయవచ్చని కైబా చెప్పారు. ఆయన పాట్స్‌డాం జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్‌లో పని చేస్తున్నారు.

అంతరిక్షం నుంచి వెలువడే కాంతిపై చేసిన ప్రయోగం గురించి ఒక పత్రం లైటింగ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమయింది. కృత్రిమ కాంతి చాలా వరకు భూమిపై ఉండే ఒక ప్రాంతానికో, భవనానికో వెలుగు ఇచ్చే బదులు అంతరిక్షంలోకి వెళ్లి వృధా అవుతోందని ఈ పత్రం చెబుతోంది. అయితే ఈ కాంతి కేవలం వీధి దీపాల నుంచి మాత్రమే జనించటం లేదని ఈ పత్రం చెబుతోంది.

టక్సన్ నగరంలో విద్యుత్ కాంతులు

ఫొటో సోర్స్, CHRISTOPHER KYBA

"మనం అంతరిక్షానికి ప్రయాణం చేసే చాలా కాంతి వనరులను వృధా చేస్తాం. దీని వలన ఎవరికీ మేలు జరగదు" అని కాంతి కాలుష్యం గురించి టెడ్ ప్రసంగం చేసిన యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ఖగోళ శాస్త్రవేత్తగా పని చేస్తున్న ప్రొఫెసర్ కెల్సి జాన్సన్ అన్నారు.

కాంతులీనే ప్రకటనల బోర్డులు, ఫ్లడ్ లైట్లు, విద్యుత్ అలంకరణ చేసిన భవనాలు, పార్కింగ్ స్థలాల్లో, స్టేడియాల్లో వెలిగించిన లైట్లు హానికారకమైన ఉద్గారకాలు వెలువడటానికి కారణమని డాక్టర్ కైబా వివరించారు .

విధాన కర్తలకు, కాంతి కాలుష్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఉద్యమకారులకు ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ కాంతి కాలుష్యానికి కేవలం ఇవి మాత్రమే కారకాలు కాదు. రాత్రి పూట ఎటువంటి లైట్లు వెలిగించాలో, ఎంత కాంతివంతంగా వెలిగించాలో నిర్ణయించడానికి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

కాంతులీనే ప్రకటనల బోర్డులు , ఫ్లడ్ లైట్లు, విద్యుత్తలంకరణ చేసిన భవనాలు, పార్కింగ్ స్థలాల్లో, స్టేడియంలలో వెలిగించిన లైట్లు హానికారకమైన ఉద్గారకాలు విడుదల చేస్తాయి.

ఫొటో సోర్స్, KYBA

ఫొటో క్యాప్షన్, కాంతులీనే ప్రకటనల బోర్డులు , ఫ్లడ్ లైట్లు, విద్యుత్ అలంకరణ చేసిన భవనాలు, పార్కింగ్ స్థలాల్లో, స్టేడియాల్లో వెలిగించిన లైట్లు హానికారకమైన ఉద్గారకాలు విడుదల చేస్తాయి

‘నిజమైన ఆకాశాన్ని ఎప్పటికీ చూడలేరు’

ఈ ఉద్గారకాలు వెలువడటానికి అనేక కారకాలు ఉండటం వలన ఈ కృత్రిమ కాంతి వలన ఎంత మొత్తంలో శక్తి వృధా అవుతుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం. కానీ, సరైన లక్ష్యం, రక్షణ లేకుండా కాంతిని వినియోగించటం వలన 35 శాతం కృత్రిమ కాంతి వృధా అవుతోందని ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ చెబుతోంది.

అంటే ఒక్క అమెరికాలోనే సుమారు 19,500 కోట్ల రూపాయిలు (3 బిలియన్ డాలర్లను) ఆకాశాన్ని కాంతివంతం చేసేందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పవచ్చు.

ఇలాంటి నగరాల్లోని కాంతి వలన ఈ భూమి మీద అత్యధిక మంది ప్రజలు సహజంగా కాంతులీనే ఆకాశాన్ని చూడలేరు. ఇది కొన్ని వలస పక్షులు, కీటకాలు, జంతువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

ఇలా వృధా అవుతున్న కాంతి మనకి నక్షత్రాలతో ఉన్న అనుబంధాన్ని నాశనం చేస్తుందని ప్రొఫెసర్ జాన్సన్, ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు కాస్త తాత్వికంగా చెబుతారు.

"ఇది మనం ప్రపంచాన్ని చూసే విధానం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది" అని అనుకుంటున్నాను".

"నేటి తరం పిల్లలు నిజమైన ఆకాశాన్ని ఎప్పటికీ చూడలేరనే విషయం నా హృదయాన్ని కలచి వేస్తోంది" అని ఆమె అన్నారు.

ఇది కనీసం 80 శాతం ప్రపంచ జనాభాకి వర్తిస్తుందని 2016 లో జరిగిన ఒక అధ్యయనం తెలిపింది.

స్లోవేనియా లో విద్యుత్ కాంతి ఆదా అయ్యే విధంగా అలంకరించిన చర్చి
ఫొటో క్యాప్షన్, స్లోవేనియా లో విద్యుత్ కాంతి ఆదా అయ్యే విధంగా అలంకరించిన చర్చి

చాకచక్యంగా కాంతి వినియోగం

ఈ కాంతి స్థాయిలను తగ్గించేందుకు చట్టాన్ని తెచ్చిన స్లోవేనియాలో విద్యుత్ కాంతితో అలంకరించిన ఒక చర్చి ఈ సమస్యను ఎంత సులభంగా పరిష్కరించవచ్చో నిరూపించింది.

ఒక లైటింగ్ కంపెనీ ఆ చర్చిని విద్యుత్తును ఆదా చేసే విధంగా అలంకరించింది. దాంతో విద్యుత్ వినియోగం 96 శాతం తగ్గిపోయింది. 1.6 కిలోవాట్లు విద్యుత్తు వినియోగం అయ్యే చోట కేవలం 58 వాట్ల విద్యుత్తు మాత్రమే వినియోగం అయింది.

అలాగే కాంతి నుంచి వెలువడే ఉద్గారకాలను కూడా ఇది తగ్గించింది. ఈ కాంతిని కేవలం చర్చిని కాంతివంతం చేసేందుకు మాత్రమే ఉండే విధంగా ఏర్పాటు చేశారు.

"చాలా మంది వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడతారు గాని కాంతి కాలుష్యం గురించి మాట్లాడరు" అని కైబా అన్నారు.

కానీ, దీని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే, మనలో చాలా మందిమి నిద్రపోయే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి విద్యుత్ ని ఉపయోగించవచ్చు.

"కొంచెం తెలివితేటలు ఉపయోగించి, దీని గురించి ఏదైనా చర్యలు తీసుకోవాలనే సంకల్పంతో మార్పు తీసుకురావొచ్చు".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)