పోలండ్‌లో కొత్త అబార్షన్ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు - NewsReel

పోలండ్ అబార్షన్ చట్టాలు

ఫొటో సోర్స్, Reuters

పోలండ్‌లోని కొత్త అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యాచారం జరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇంకా వావి వరసలు పాటించకపోవడం వల్ల గర్భం ధరించినప్పుడు మాత్రమే అబార్షన్‌లకు అనుమతిస్తూ, మిగతా అన్ని రకాల గర్భస్రావాలను నిషేధిస్తూ పోలండ్‌లోని ఓ కోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

గత ఏడాది చట్టబద్ధంగా జరిగిన అబార్షన్లలో 98% కడుపులో బిడ్డ సరిగా ఎదగని కారణంగా చేసినవే. తాజా చట్టాలతో అలాంటి అబార్షన్‌లపై కూడా వేటు పడింది.

యూరప్‌లో కఠినమైన అబార్షన్ చట్టాలున్న దేశాల్లో పోలండ్ ఒకటి. ఈ దేశంలో ప్రతి ఏటా దాదాపు 2,000 చట్టబద్ధమైన అబార్షన్లు జరుగుతుంటాయి. అయితే, చట్ట విరుద్ధంగా లేదంటే విదేశాల్లోనో జరిగే అబార్షన్ల సంఖ్య 2 లక్షల కన్నా ఎక్కువే ఉంటుందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

కొత్త చట్టానికి వ్యతిరేకంగా పోలండ్‌లోని పోజ్నాం, వార్సా, క్రకోవ్ తదితర పట్టణాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కఠినతరమైన లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

"ఈ దేశంలో మహిళలకు గౌరవం లేదు. మా మాట ఎవరూ వినడం లేదు" అని గిడ్నియాలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 34 ఏళ్ల మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఫెడరేషన్ ఫర్ విమెన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్' హెడ్ క్రిస్టీనా కస్పురా, "దేశ జనాభాలో సగానికి సగం ఉన్న మహిళలకు ఇది చాలా అవమానకరం. దీన్ని మేం మరిచిపోలేం" అని ఏఎఫ్‌పీతో అన్నారు.

అమెరికాలో ఒకే రోజు 83 వేల కొత్త కోవిడ్ కేసులు... సెకండ్ వేవ్ మొదలైందా?

అమెరికాలో కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఒకే రోజులో ఎన్నడూ లేనంతగా పెరిగింది. శుక్రవారం నాడు 83,010 కొత్త కేసులు నమోదయినట్లు కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ తెలిపింది. రోజువారీ కేసుల సంఖ్యలో ఇది కొత్త రికార్డు.

దేశంలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అమెరికా సర్జన్ జెనరల్ జెరోమ్ ఆడమ్స్ హెచ్చరించారు. అయితే, మెరుగైన చికిత్స విధానాల మూలంగా మరణాల రేటు తగ్గుతోందని ఆయన తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా, ఉత్తరార్థ గోళంలోని దేశాలకు ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని హెచ్చరించింది.

"రాబోయే కొన్ని నెలలు మరీ కీలకంగా కనిపిస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రమాదం అంచున ఉన్నాయి" అని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియెసస్ విలేఖరులతో అన్నారు.

కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా దాదాపు 85 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జూలై 17న ఒకే రోజు 76,842 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటి కేసుల సంఖ్య ఈ రికార్డును దాటేసింది. జూలై తరువాత మళ్లీ ఈ నెలలో అత్యధికంగా ఒకే వారంలో 4,44 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.

అంతేకాకుండా, గత ఆరు రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, రోజుకు 2,000 పైచిలుకు మరణాలు సంభవించిన ఏప్రిల్ నెలతో పోల్చితే ఇప్పుడు కరోనా మృతుల సంఖ్య చాలా తక్కువే ఉంది.

ప్రధానంగా నార్త డకోటా, మోంటానా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)