ఆఫర్లు: భారీ డిస్కౌంట్ల వెనుక మతలబు ఏమిటి? వీటిని మనం నమ్మవచ్చా?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆఫర్లతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం తదితర ఆన్‌లైన్ ఈ-కామర్స్ వేదికలు హోరెత్తిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు ఇలా అన్నింటిపైనా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్లను తెరపైకి తీసుకొస్తున్నాయి.
మరోవైపు ఎక్స్ఛేంజీ స్కీమ్‌లు, కార్టులపై ప్రత్యేక డిస్కౌంట్లు, జీరో ఇంట్రెస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫర్లను ఈ-కామర్స్ సైట్లు అందిస్తున్నాయి. దిగ్గజ బ్రాండ్లైన యాపిల్, సామ్‌సంగ్, ఎల్‌జీ ఉత్పత్తులనూ వీటిపై అందుబాటులో ఉంచుతున్నాయి.
ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజరేటర్లు, మైక్రోవేవ్ అవెన్లు ఇప్పటికే స్టాక్ అయిపోయాయని, ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌లు మాత్రమే తీసుకుంటున్నాని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇవి నిజమేనా? ఈ వార్తల్లో నిజమెంత?
ఇవే చివరి 24 గంటలు, ఇవే చివరి 12 గంటలు అంటూ ఇస్తున్న ఆఫర్లతో వినియోగదారులకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది? అసలు ఈ ఆఫర్లను నమ్మవచ్చా? సంస్థల ప్రతినిధులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Science Photo Library
విపరీతంగా పెరిగిన కొనుగోళ్లు
తాజా ఆఫర్ల నడుమ కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో సేల్స్ పెరిగాయని అమెజాన్ తెలిపింది. మరోవైపు గతంలో కొనుగోళ్లు పతాకస్థాయికి పెరిగినప్పుడు ఆరు రోజుల్లో జరిపిన విక్రయాలు గత రెండు రోజుల్లోనే పూర్తయ్యాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
మరోవైపు చిన్నచిన్న వ్యాపారుల విక్రయాలూ ఊపందుకుంటున్నాయి. కరోనావైరస్ లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన వారి షోరూమ్‌లు మళ్లీ కళకళలాడుతున్నాయి.
దసరాతో మొదలయ్యే ఈ ఆఫర్లు దీపావళి వరకు కొనసాగుతుంటాయి. నెల రోజులపాటు కొనసాగే ఈ పండగ సీజన్‌లోనే చాలా కంపెనీలు 40 శాతం వరకు ఆదాయాన్ని అర్జిస్తాయి. ఇదే విషయాన్ని సామ్‌సంగ్, సోని, షయామీ లాంటి సంస్థలు ఇప్పటికే ధ్రువీకరించాయి.
మరోవైపు ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలను ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీ లేని అడ్వాన్సులు, ఎల్‌టీసీ క్యాష్ వోచర్లు తదితర పథకాలు దీనిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, GAURAV
ఆఫర్లను నమ్మొచ్చా?
20 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తామంటు వస్తున్న ప్రకటనలు నమ్మొచ్చా? నిజంగానే ఇంత డిస్కౌంట్లు ఇస్తారా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
''డిస్కౌంట్లు ఇచ్చే మాట వాస్తవమే. అయితే, ఇందులో చాలా మతలబులు ఉంటాయి. ముందుగా ప్రోడక్ట్స్ ధరను పెంచుతారు. ఆతర్వాత డిస్కౌంట్ల రూపంలో కోత విధిస్తారు''అని సిమాంటిక్స్3లో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అభిషేక్ భట్ వ్యాఖ్యానించారు.
2019 పండుగ సీజన్‌లో ఆఫర్ల డేటాను సిమాంటిక్స్3 విశ్లేషించింది. ఆఫర్ ప్రైజ్, లిస్ట్ ప్రైజ్, డిస్కౌంట్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేందుకు సంస్థ ఓ ప్రత్యేక టూల్‌ను కూడా అభివృద్ధి చేసింది. లిస్ట్ ప్రైజ్‌నే స్టిక్కర్ ప్రైజ్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
ఉదాహరణగా డెల్ ఇన్‌స్పిరాన్ 15.6'' ల్యాప్‌టాప్ ధరను వారు విశ్లేషించారు. ఒక రోజులోనే లిస్ట్ ప్రైజ్ 120 డాలర్లు పెరగడాన్ని వారు గమనించారు. అనంతరం 30 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. మొత్తంగా అయితే అక్కడ డిస్కౌంట్ 10 శాతమేనని వారు తేల్చారు.

ఫొటో సోర్స్, Getty Images
''మేం మూడు అతిపెద్ద ఈ-కామర్స్ సైట్లలో ప్రోడక్ట్స్‌ను విశ్లేషించాం. సగటున లిస్ట్ ప్రైజ్ 25 శాతం వరకు పెరుగుతున్నట్లు గుర్తించాం''అని డేటా సైంటిస్ట్ ఆశిష్ శుక్లా వివరించారు.
''ఆఫర్ల విషయంలో తొందరపడకూడదు. చివరి 48 గంటలు.. చివరి 24 గంటలు అని వారు చెబుతారు. అయితే మనం ఆ ప్రకటనలను చూసి మోసపోకూడదు. దసరా ఆఫర్ పోతే.. ధన్‌తేరాస్ ఆఫర్ వస్తుంది. ఆ తర్వాత దిపావళి.. క్రిస్మస్.. న్యూ ఇయర్ ఇలా వస్తూనే ఉంటాయి''
''ముఖ్యంగా ఉచితం, డిస్కౌంట్ అనే పదాలు వినిపించేటప్పుడు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎవరూ దేన్నీ ఉచితంగా ఇవ్వరు. ఆ ఆఫర్‌ను మనం కోల్పోతామనే భావనను కలిగేంచేందుకు అమ్మకందారులు ప్రయత్నిస్తారు.''
''కొన్నిసార్లు ఇంత మొత్తం కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని చెబుతారు.. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి దీనిలో లాభం చేకూరొచ్చు. కానీ స్వల్ప మొత్తాల్లో కొనుగోలు చేసేవారికి దీనితో చేటు జరిగే అవకాశముంది. ఆఫర్ పేరుతో మీ దగ్గర ఉండే డబ్బులన్నీ ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది. ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి. అన్నింటినీ బేరీజు వేసుకోవాలి''అని ఆశిష్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కార్డుల మాటేమిటి?
ఆఫర్లలో ప్రధానంగా వినిపించేది నో కాస్ట్ ఈఎంఐ. అంటే ఎలాంటి వడ్డీ లేకుండానే వాయిదాల రూపంలో మొత్తాన్ని చెల్లించే అవకాశం కింద ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం. వినియోగదారులను ఆకర్షించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని అభిషేక్ అన్నారు.
''ఈ విషయంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. నో కాస్ట్ ఈఎంఐలో మూడు రకాలు ఉంటాయి. వీటిలో మొదటిది మనం సాధారణ ధరకే వస్తువులు కొనాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ వడ్డీని మనకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తారు. రెండోది వడ్డీని ప్రోడక్ట్స్‌కే కలిపేస్తారు. మూడోది విక్రయానికి నోచుకోకుండా పడివుండే వస్తువులను ఈ విధానం కింద వదిలించుకుంటారు''.
''అయితే, కొన్నిసార్లు కొన్ని సంస్థలు, బ్యాంకులతో కుదుర్చుకున్న అంగీకారాల్లో భాగంగా ఆ ప్రత్యేక కార్డుపై కొంత డిస్కౌంట్ వస్తుంటుంది. ఇలాంటి ఆఫర్లను కొంతవరకు నమ్మొచ్చు''.
కొన్నిసార్లు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను చూసి.. వినియోగదారులు తాము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువకు వస్తువులు కొనుగోలు చేస్తారని, ఫలితంగా తర్వాతి నెలల్లో ఆర్థిక ఇబ్బందుల పాలిట పడతారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ధరలు పెంచితే తెలిసిపోతుందిగా
ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్లతో పోటీగా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ షోరూమ్‌లూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలతోపాటు కొన్ని పరికరాలను ఉచితంగానూ ఇస్తున్నాయి.
అయితే, డిస్కౌంట్ల కోసం ధరలు పెంచుతారన్న వార్తలను విశాఖపట్నంలో గీతా ఎలక్ట్రో మార్ట్స్ యజమాని వినోద్ కడిసింగి తోసిపుచ్చారు. ''ధరలు పెంచితే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్లు ఉంటాయి. వారు నెట్‌లో ఐటమ్ పేరు కొట్టిన వెంటనే పూర్తి వివరాలు వచ్చేస్తాయి''అని ఆయన అన్నారు.
''ఆరు నెలల నుంచీ మా షోరూంలో ఎలాంటి విక్రయాలు జరగలేదు. పండగ నేపథ్యంలో లక్కీ డ్రాల పేరుతో ఆఫర్లు పెట్టాం. దీనిలో నగదు, ఎలక్ట్రానిక్ వాహనాలు, పరికరాలను బహుమతిగా పెట్టాం. పండుగ రోజే డ్రా తీస్తాం. అదే రోజు విజేతలకు బహుమతులు అందిస్తాం''.
''ఇదివరకటి స్థాయిలో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలూ మా దగ్గర అమ్ముడు పోవడం లేదు. వచ్చే కస్టమర్లు మాకు ఆన్‌లైన్‌లో ఈ ఆఫర్ ఉంది.. ఆ ఆఫర్ ఉందని చెబుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు భారీగా కొనుగోలు చేయడం వల్ల ఆఫర్లు ఇవ్వగలుగుతాయి. మేం అంత మొత్తంలో కొనుగోలు చేయలేం కదా.. పైగా డిస్కౌంట్లలో చాలా మతలబులు ఉంటాయి''అని ఆయన అన్నారు.
డిస్కౌంట్‌లు ఇచ్చేందుకు స్టిక్కర్ ప్రైజ్‌లో మార్పులు చేస్తారన్న వాదనను ఫ్లిప్‌కార్ట్ కార్పొరేట్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ శీతల్ సింగ్ తోసిపుచ్చారు. ''లేదు.. లేదు.. ఆ వార్తల్లో నిజం లేదు. డిస్కౌంట్ల కోసం స్టిక్కర్ ప్రైజ్‌లో ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి మార్పులు చేయదు''అని ఆమె అన్నారు.
మరోవైపు ఈ విషయంపై అమెజాన్‌ను కూడా బీబీసీ సంప్రదించింది. అయితే ఎలాంటి స్పందనా రాలేదు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
- ‘నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- భారత రత్న జాబితాలో దక్షిణాది వారికి తగిన ప్రాముఖ్యం లభించటం లేదా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో భూకంప కేంద్రం, 9 నెలల్లో 1,545 సార్లు భూ ప్రకంపనలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








