ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో భూకంప కేంద్రం, 9 నెలల్లో 1,545 సార్లు భూ ప్రకంపనలు

భూకంపాలు
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఇటీవల పదే పదే భూప్రకంపనలు నమోదవుతున్నాయి. పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో నీట మునిగిన నిర్వాసిత గ్రామం వెళ్లటూరు దానికి కేంద్రంగా మారింది. దీని ప్రభావం అటు ఏపీలోని సరిహద్దు గ్రామాలతో పాటు ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాలపై పడుతోంది.

ఈ ఏడాది జనవరి 26న రెక్టార్ స్కేల్‌పై అత్యధికంగా 4.6 తీవ్రతతో ఇక్కడ భూకంపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్ వరకూ ప్రకంపనల ప్రభావం పడినట్లు అధికారులు ధ్రువీకరించారు.

పదే పదే భూమి లోపలి నుంచి ధ్వనులు రావడం, ప్రకంపనలు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలంలో మూడు చోట్ల భూకంప నమోదు యంత్రాలు ఏర్పాటు చేశారు. జాతీయ భూగర్భ పరిశోధనా సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) అధికారులతో పాటు ప్రభుత్వ సిబ్బంది కూడా ఆయా గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపాల తీవ్రత ఎలా ఉంటుంది? దానికి కారణాలు ఏమిటి? అనే విషయాలపై స్థానికుల్లో పలు అపోహలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది.

భూకంపాలు

భవనాలకు బీటలు

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూ ప్రకంపనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ప్రజలు కూడా దాదాపుగా అలవాటు పడినట్టు కనిపిస్తోంది. కానీ ఒక్కోసారి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కలత చెందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ కొన్ని ఇళ్లు స్వల్పంగా బీటలువారాయి. ప్రభుత్వ కార్యాలయాలపైనా భూకంపాల తాకిడి కనిపిస్తోంది. మల్లారెడ్డిగూడెం పంచాయతీ కార్యాలయం ప్రారంభించి రెండేళ్లు గడిచేలోగా భూకంపాల ప్రభావానికి గురయ్యింది. ఇప్పటికే కొన్ని గోడలు బీటలు వారి కనిపిస్తున్నాయి.

ఈ భూ ప్రకంపనలకు చింతలపాలెం మండలంలోని వెళ్లటూరు కేంద్రంగా ఉంది. ఆ గ్రామాన్ని ఆనుకుని పదే పదే ప్రకంపనలు వస్తున్నట్టు ఎన్‌జీఆర్‌ఐ అధికారులు నిర్ధారించారు. కొన్ని నెలల క్రితం ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపించే రీతిలో భూప్రకంపనలు వచ్చినట్టు వారు చెబుతున్నారు. ఆ సమయంలో నిద్రలో ఉండగా మంచం మీద నుంచి కింద పడ్డామని స్థానికుడు ఎం రాంబాబు బీబీసికి తెలిపారు.

''రాత్రి వేళల్లో ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నాయి. ఆ సమయంలో ఏం జరుగుతుందో మొదట్లో తెలిసేది కాదు. నేనైతే మంచం మీద నుంచి కింద పడ్డాను. చాలా భయం వేసింది. పదే పదే ఇంటిలోని వస్తువులన్నీ కింద పడిపోతున్నాయి. భూమిలో నుంచి రకరకాల ధ్వనులు వస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో మాకు తెలియడం లేదు. మొదట్లో పులిచింతల ప్రాజెక్ట్ వల్ల ఇలా జరిగిందని అంతా చెప్పేవారు. మరికొందరు సమీపంలోని సున్నపురాయి గనుల్లో బ్లాస్టింగ్ వల్ల కూడా అన్నారు. కానీ బ్లాస్టింగ్ రాత్రి పూట జరగదు కాబట్టి ఏం జరుగుతుందోననే భయంతో బతుకుతున్నాం. అధికారులు ఎవరూ రాలేదు. కనీసం ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయలేదు''అని ఆయన వాపోయారు.

భూకంపాలు
ఫొటో క్యాప్షన్, పాశం మహాలక్ష్మి

భయంతోనే బతుకుతున్నాం..

గత ఏడాది డిసెంబర్ తర్వాత భూమి లోపలి నుంచి ఏవో ధ్వనులు వస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత జనవరి మొదటి నుంచి ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నేటికీ ఇంకా వాటి తీవ్రత కనిపిస్తోందని వారు చెబుతున్నారు. పొలం పనులకు వెళ్లినా, ఊరు వెళ్లినా ఇంట్లో ఏమవుతుందోననే భయం వెంటాడుతోందని వెళ్లటూరికి చెందిన పాశం మహాలక్ష్మి వివరించారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ నిత్యం భయంతోనే గడుపుతున్నామని తెలిపారు.

''పగలు, రాత్రి తేడా లేదు. ఎప్పుడు భూ ప్రకంపనలు వస్తాయో తెలియదు. పిల్లలు పెద్దోళ్లు అంతా వణికిపోతున్నారు. భూమి కంపిస్తుండడంతో కంటి మీద కనుకు కూడా లేని రోజులున్నాయి. జూన్ వరకూ ఈ ప్రభావం ఎక్కువగా ఉండేది. చాలా రోజులు ఇళ్లల్లోనే మేం నిద్రపోలేదు. ఏమో ఏం జరుగుతుందోననే భయపడి అంతా ఆరుబయట గడిపేవాళ్లం. రెండు నెలలుగా ఈ ప్రభావం కొంచెం తగ్గింది. అప్పుడప్పుడు ఒళ్లు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ గతంలో వచ్చినట్టుగా పెద్ద భూకంపాలు రావడం లేదు. పులిచింతల ప్రాజెక్ట్ అంతా నీటితో నిండి ఉండడం వల్ల రావడం లేదని కొందరు అంటున్నారు''అని ఆమె వివరించారు.

భూకంపాలు

ప్రాజెక్ట్‌పై ప్రజల్లో అనుమానాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులిచింతల సాగు నీటి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. 2013లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. తొలిసారిగా 2019లో ఇక్కడ పూర్తి స్థాయి నీటిమట్టం చేరింది. వరుసగా రెండో ఏడాది కూడా పూర్తిగా నీరు చేరినట్లు కనిపిస్తోంది. భూకంపాలకు కేంద్రంగా ఉన్న వెళ్లటూరు ఓ నిర్వాసిత గ్రామం. ఆ ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురయిన ప్రాంతం నుంచి తరలివచ్చిన వారంతా ప్రస్తుతం వేరే చోట ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు.

''పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిగా నిండిన తర్వాత మళ్లీ క్రమంగా నీటి మట్టం తగ్గిన తరుణంలో గత ఏడాది డిసెంబర్ నుంచి భూమి నుంచి ధ్వనులు వినిపించడం, ప్రకంపనలు రావడం తగ్గింది. దీంతో ప్రాజెక్ట్ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉందని అంతా భావిస్తున్నాం''అని స్థానికుడు బి సంపత్ బీబీసీతో అన్నారు.

''మా ప్రాంతంలో సున్నపు బట్టీలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చుట్టుపక్కల ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ నిర్మించారు. దానికోసం చాలా కాలంగా బ్లాస్టింగ్ జరుగుతోంది. కానీ ఎన్నడూ ఇలాంటి ప్రకంపనలు రాలేదు. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తికావడంతో 36 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ ఉంచారు. ఆ నీటిని క్రమంగా కిందకి తరలించిన తర్వాత మాత్రమే ఈ ప్రకంపనలు కనిపిస్తుండడంతో అందరికీ అదే అభిప్రాయం ఉంది. అధికారులు నామమాత్రంగా స్పందించారు. ఒకసారి వచ్చి వెళ్లారు తప్ప ప్రజల్లో అపోహలు తొలగించే పని చేయకపోవడంతో స్థానికుల్లో ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి'' అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భూకంపాలు

మరికొన్నాళ్లు ఇలానే..

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగే ప్రమాదం ఉందని ఎన్‌జీఆర్‌ఐ అంచనా వేస్తోంది. భూమి లోపల 5 నుంచి 7 కిలోమీటర్ల లోపల వచ్చిన మార్పుల కారణంగా ప్రకంపనలు నమోదవుతున్నట్టు నిర్ధరణ అయిందని ఎన్‌జీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్ట్ నగేష్ తెలిపారు.

''సహజంగా భారతదేశ భూ ఫలకం ఏటా 5 సెంటి మీటర్ల మేర ఉత్తరం వైపు కదులుతూ ఉంటుంది. దాని ప్రభావంతో భూగర్భంలో పలకల మధ్య ఒత్తిడి ఏర్పడుతుంది''అని ఆయన వివరించారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద కూడా సీస్మిక్ మీటర్లు ఏర్పాటు చేసి భూకంపాల తీవ్రతను గమనిస్తున్నట్టు వెల్లడించారు.

''జనవరి 26 నాడు ప్రకంపనల తీవ్రత 4.6గా నమోదైంది. ఆ తర్వాత వచ్చిన భూకంపాలన్నీ సూక్ష్మ భూకంపాలే. ఇప్పటికే యంత్రాలు ఏర్పాటు చేసి 9 నెలలుగా పర్యవేక్షణ చేస్తున్నాం. రియల్ టైం లో భూ ప్రకంపనలు రికార్డ్ చేస్తున్నాం. ఇప్పటి వరకూ 1,545 సార్లు ప్రకంపనలు రికార్డ్ అయ్యాయి. 4 నుంచి 5 కిలోమీటర్ల విస్తారంలో ఇవి సంభవిస్తున్నాయి. పల్నాడు బేసిన్‌లో రాతి పొరలు మట్టితో తయారయ్యాయి. ఈ ప్రాంతంలో గతంలో కూడా భూంకపాలు వచ్చాయి. ఇంట్రాప్లేట్ ఎర్త్ క్వేక్‌గా వీటిని పరిగణిస్తున్నాం. రాతిపొరలు కలిసే చోట తరుచుగా భూకంపాలు వస్తాయి. పల్నాడు బేసిన్‌లో అవి కొనసాగవచ్చని భావిస్తున్నాం''అని ఆయన తెలిపారు.

భూకంపాలు

ప్రాజెక్ట్ కారణమని నిర్ధారణకు రాలేం..

భూకంపాల తీవ్రత కొనసాగే అవకాశం ఉండడంతో ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసినట్టు ఎన్‌జీఆర్‌ఐ చెబుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో తగు జాగ్రత్తలు అవసరం అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తరచూ నమోదవుతున్న సూక్ష్మ భూకంపాల వల్ల ఎటువంటి నష్టం లేదని చెబుతున్నారు.

రెక్టార్ స్కేల్‌పై 5.5 దాటిన తర్వాత మాత్రమే కొంత నష్టం వస్తుందని, 6.5 దాటితే భవనాలకు కూడా ప్రమాదం ఉంటుందని ఎన్‌జీఆర్‌ఐ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్న భూకంపాలు ఆ స్థాయిలో లేకపోవడంతో ముప్పు లేదని భావిస్తున్నట్టు చీఫ్‌ సైంటిస్ట్ నగేష్ వివరించారు.

''సున్నపురాయి మైనింగ్ మూలంగా భూకంపాలు వస్తున్నాయనే అభిప్రాయంలో నిజం లేదు. మైనింగ్ కోసం చాలా చిన్నపాటి పేలుళ్లు జరుగుతాయి. పైగా భూ ఉపరితలం మీద కొద్దిపాటి లోతులోనే సున్నపురాయి తీస్తారు. కానీ భూకంపాలు 5 కిలోమీటర్ల లోపల సంభవిస్తుంటాయి. మా రికార్డుల ప్రకారం ఫిబ్రవరిలో అత్యధిక సార్లు భూకంపాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే వెళ్లటూరు వెళ్లి స్థానికుల ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశాం. వారిలో అవగాహనను పెంచేందుకు కృషి చేశాము. చిన్న చిన్న భూకంపాలు వస్తూనే ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశాం. కృష్ణా, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు నివేదికలు ఇచ్చాం. పులిచింతల విషయంలో మరో రెండేళ్ల పాటు పరిశోధనలు చేస్తే తప్ప నిర్ధారణకు రాలేం. ప్రాజెక్ట్ నీటితో నిండిన తర్వాత ప్రకంపనలు పెరుగుతున్నాయనే అంశంపై అధ్యయనం కొనసాగుతుంది''.

ప్రకంపనలు స్వల్ప భూకంపాలుగానే ఇప్పటివరకు నిర్ధారణ జరగడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఎలాంటి ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన మాత్రం కనిపిస్తోంది. భూకంపాల తాకిడి కొనసాగుతుందని ఎన్‌జీఆర్ఐ చెబుతున్న తరుణంలో.. ఈ ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలను అప్రమత్తం చేయడం, నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)