తెలంగాణలో ఒమిక్రాన్: ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలతో కరోనా వ్యాపిస్తుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మేం మాస్కులు కళ్లకు పెట్టుకోమనలేదు. కళ్లతో సినిమా చూడండి. ముక్కూ, నోటికి మాస్కు వేసుకోండి''... ఒమిక్రాన్ కేసులు, థర్డ్ వేవ్ ప్రకటన నేపథ్యంలో సినిమాల గురించి ప్రశ్నించినప్పుడు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస రావు చెప్పిన సమాధానం ఇది.
కొత్త సంవత్సర వేడుకల గురించి కూడా ఆయన మాట్లాడారు.
''ఎంజాయ్ చేయండి, పార్టీలకు వెళ్లండి. కానీ జాగ్రత్తలు తీసుకోండి. కొత్త సంవత్సర వేడుకలు మీ కుటుంబ సభ్యులు మధ్యలో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కొత్త ఏడాది వేడుకల తరువాత లక్షణాలు వస్తే కుటుంబం బాధ పడాలి కాబట్టి. ఒకవేళ హోటెళ్లు, పబ్బులు, రెస్టారెంట్లలో బహిరంగంగా వేడుకలు చేసుకునే వారు, ఎంతో కొంత భౌతిక దూరం పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మాస్కు కూడా ధరించడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే ఇబ్బందుల్లో పడాలి.'' అన్నారు శ్రీనివాస రావు.
పార్టీలు, పబ్బుల్లో భౌతిక దూరం సాధ్యం కాదు కదా అని విలేకర్లు ప్రశ్నిస్తే, అందుకే తాము రెండు వ్యాక్సీన్లు వేసుకున్న వారినే అనుమతిస్తున్నాం అని చెప్పారు.
అంటే రెండు వ్యాక్సీన్లు వేసుకున్న వారు పార్టీలకు వెళ్లొచ్చా అని ప్రశ్నిస్తే, శుభ్రంగా వెళ్లొచ్చు అంటూ సమాధానం ఇచ్చారు శ్రీనివాస రావు.
‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీల వల్ల కరోనా వస్తుందా అన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. ''నాకు తెలిసి డ్రంకన్ డ్రైవ్ కి డిస్పోజబుల్ స్ట్రా వాడతారు. ప్రతి ఒక్కరికీ మారుస్తారు. కాబట్టి దాని వల్ల కరోనా రాదు.'' అన్నారు శ్రీనివాస రావు.
‘లాక్ డౌన్ అవసరం లేదు’''రెండేళ్ల నుంచి మనల్ని మనం కట్టేసుకున్నాం. జాగ్రత్తగా ఉండాలని. ఇప్పుడు మనల్ని మనం లాక్ చేసుకు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. ఈ రెండేళ్ల నుంచి కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలిసింది. అనుభవం వచ్చినపుడు ఎదుర్కుంటాం కానీ, ఎందుకు దాక్కుంటాం? జీవానాధారం ముఖ్యం. రెక్కాడితే కానీ డొక్కాడని కోట్లాది మంది ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచించాలి. మరింత సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో రెండేళ్ల నుంచి నేర్చుకున్నాం. కొన్ని జాగ్రత్తలు చిన్నవి తీసుకోండి. మాస్కు పెట్టుకోండి. అన్ని పనులు చేసుకోండి. భౌతిక దూరం కొంచెం పాటించండి.'' అన్నారు డా. శ్రీనివాస రావు.

ఇది థర్డ్ వేవ్ ప్రారంభం
ప్రస్తుతం మూడో వేవ్ ప్రారంభ దశ నడుస్తోందని చెప్పారు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు. ఎవరూ భయపడక్కర్లేదు. కానీ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలన్నారు ఆయన.
రాబోయే రెండు నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమని, గతంలో ఎన్నడూ చూడనన్ని కేసులు పెరుగుతాయని ఆయన చెప్పారు.
రెండు వేవ్ లలో వచ్చిన అనుభవంతో మూడో వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు.ఈ నూతన సంవత్సరం, సంక్రాంతిలే థర్డ్ వేవ్ ప్రారంభం అని వ్యాఖ్యానించిన ప్రజారోగ్య డైరెక్టర్, వచ్చే నాలుగు వారాలూ ముక్కూ నోరూ కట్టిపారేయాలని చెప్పారు.
థర్డ్ వేవ్ ఒక ఆశీర్వాదం
''థర్డ్ వేవ్ ఒమిక్రాన్ ని ఒక బ్లెస్సింగ్ (ఆశీర్వాదం) లాగా తీసుకోవాలి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గస్. ఇది కోవిడ్ కి అంతం. ముగింపు. వచ్చే ఆరు నెలల్లో దాదాపు కోవిడ్ కి పూర్తి విముక్తి దొరకబోతోంది. కాబట్టి అందరమూ సమర్థంగా ఎదుర్కుందాం.
ప్రస్తుతం తెలంగాణలో నమోదయిన 62 ఒమిక్రాన్ కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవు. ఇప్పుడు ట్రాకింగ్, కంటైన్మెంట్ అవసరం లేదు. కమ్యూనిటీలోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మిమ్మల్ని మీరు కాపాడుకోండి. త్వరలో ఒమిక్రాన్ లెక్కలు ఆపేస్తాం. రెండు వారాల క్రితం మొదటి ప్రమాదం హెచ్చరిక చేశాను. ఇప్పుడు రెండో ప్రమాదం హెచ్చరిక చేస్తున్నాను. మూడో హెచ్చరిక నేను చేయక్కర్లేదు మీకు తెలుస్తుంది.'' అన్నారు శ్రీనివాస రావు.
90 శాతంలో లక్షణాలు లేవు, కానీ..
ఈసారి వస్తోన్న కేసుల్లో 90 శాతం కేసుల్లో వ్యాధి లక్షణాలు లేవని ఆయన చెప్పారు. లక్షణాలు లేని వారు భయపడక్కర్లేదన్నారు శ్రీనివాస రావు.
''వారు భయపడక్కర్లేదు. వ్యాధి లక్షణాలు ఉన్న పది శాతం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ పది శాతం కేసులు మాత్రం లక్షల్లో ఉంటాయి. కాబట్టి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకుని ఐసోలేట్ అవ్వాలి. మాస్కు పెట్టుకోవాలి.'' అన్నారాయన. ఇక విదేశాల నుంచి వచ్చే వారిలో ఏ దేశం వారంటూ ప్రత్యేకంగా లెక్కలు చూడడం లేదని చెప్పారు.
ఒమిక్రానా కాదా అని చూడొద్దు
ఒమిక్రాన్ అయినా డెల్టా అయినా మరొక వేరియంట్ అని అది కోవిడ్ గానే చూడాలి తప్ప, దాన్ని వేరియంట్ గా చూడొద్దన్నారు శ్రీనివాస రావు.
జీనోమ్ సీక్వెన్స్ చేసే పరీక్ష కేంద్రాలు దేశంలో 56 మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు జీనోమ్ సీక్వెన్స్ కోసం డబ్బు వృథా చేసుకోవద్దు. ఏ వేరియంట్ అయినా చికిత్స ఒకటే.
ఒకేసారి లక్షలాది కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వేరియంట్ కి కఠిన జాగ్రత్తలు అవసరం లేదు. కేసుల స్పైక్ తక్కువ డామేజ్ తో చూస్తాం. మన దగ్గర 60 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారాయన.ఇవి కూడా చదవండి:
- గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్
- బహిరంగంగా అవమానిస్తే ప్రజల్లో మార్పు వస్తుందా? కరోనా నిబంధనలు అతిక్రమించినవారిని వీధుల్లో ఊరేగించాలా
- ‘నేను దేశం విడిచి ఎలా పారిపోయానంటే’ - నాలుగు నెలల తరువాత బయటపెట్టిన అష్రాఫ్ ఘనీ
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









