ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?

ఒమిక్రాన్ వేరియంట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. ఓవైపు వరుస పండుగలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయించాయి.

తెలంగాణాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా స్థానికులే లాక్‌డౌన్‌కి సిద్ధమయ్యారు. దాంతో నైట్ కర్ఫ్యూ అమలులోకి రాబోతోందనే ప్రచారం మొదలయ్యింది. సోషల్ మీడియాలో కరోనా ఆంక్షల చుట్టూ ప్రచారం సాగుతోంది.

omicron

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. తొలుత విజయనగరం, ఆ తర్వాత తిరుపతిలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ, విశాఖలో కూడా మరో రెండు కేసులు ఒమిక్రాన్‌గా నిర్ధారించారు. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ బారిన పడిన వారంతా విదేశాల నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వారే కావడం విశేషం.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళకు ఈనెల 19న కరోనా పాజిటివ్‌ ప్రకటించారు. శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించిన తర్వాత అక్కడ దానిని ఒమిక్రాన్‌ గా నిర్ధరణ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన ఆమె ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడకు చేరుకున్నారు. అక్కడ నుంచి స్వస్థలానికి వెళ్లారు. ఆమె భర్త, పిల్లలకు మాత్రం ఆ రోజు చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఆమెకు పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లో ఉన్నారు.

అంతకుముందు 15వ తేదీన దుబాయ్ నుంచి విశాఖ వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్ధరణ అయ్యింది. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచారు. ఆరోగ్యం స్థిరంగానే ఉందని ప్రకటనలో తెలిపారు.

ఇప్పటి వరకు 53 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి రాగా వారిలో 9 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

తెలంంగాణా హైకోర్టు ఆదేశాలు

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని చెబుతూనే, జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

గురువారం నాటికి రాష్ట్రంలో 38 మంది కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలున్నట్టు నిర్ధారించారు. 648 మంది ప్రయాణీకులు తెలంగాణాకి చేరుకోగా వారిలో 70 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అందులో దాదాపు సగం మందికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది.

అదే సమయంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో ప్రజలు స్థానిక యువత చొరవతో 10 రోజుల లాక్ డౌన్ కి స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటుగా ఆయన భార్య, తల్లికి కూడా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. బాధితుడు ఈనెల 20న గల్ఫ్ ప్రాంతం నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు.

కేంద్రం మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి

ఒమిక్రాన్ వైరస్ విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చోట కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సమీక్ష నిర్వహించి నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

కరోనా పరీక్షల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటినా, స్థానిక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ 40 శాతం దాటినా ఆయా ప్రాంతాల వారీగా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

14రోజులకు తగ్గకుండా కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగించాలని సూచనలు చేసింది.

భారీ సమూహాలను నియంత్రించాలని, అవసరమైన పక్షంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు చూడాలని సూచించింది.

వ్యాక్సినేషన్ ఉధృతం చేయాలని, ఇతర ముందస్తు ఏర్పాట్లకు పూనుకోవాలి అంటూ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఏపీ సచివాలయం

నియంత్రణలోనే ఉందని చెబుతున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన కొన్ని నెలలుగా కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఢాక్టర్ హైమావతి తెలిపారు. ప్రస్తుతం ఆంక్షల విషయం పరిశీలనలో లేదని, ప్రజలను మాత్రం అప్రమత్తం చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

"23వ తేదీ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 135 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా 1326 మాత్రమే ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. పుకార్లు నమ్మాల్సిన అవసరం లేదు".

"ఎయిర్ పోర్టులు సహా విదేశాల నుంచి వచ్చే వారి కోసం అన్ని చోట్లా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. పూర్తి స్థాయి పరీక్షలు చేస్తున్నాం. అనుమానితులందరినీ సకాలంలో గుర్తించేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాము. ఇప్పటి వరకూ కేవలం నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. కాబట్టి ఆందోళన అవసరం లేదు" అని ఢాక్టర్ హైమావతి బీబీసీతో అన్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పండుగలు, ఇతర వేడుకల సమయంలో పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు పైబడిన వారిలో 98 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందని ఆమె వివరించారు.

తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు

అప్రమత్తంగానే ఉన్నామంటున్న తెలంగాణా అధికారులు

కేంద్రం మార్గదర్శకాలు, తెలంగాణా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగానూ చర్యలు తీసుకుంటోందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జి శ్రీనివాస్ తెలిపారు.

"రాష్ట్రంలో ఈనెల 23న మొత్తం 177 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఆంక్షల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అవసరమైన పక్షంలో అన్ని చర్యలు తీసుకుంటాం" అంటూ ఆయన బీబీసీకి తెలిపారు.

ఇప్పటికే సమీప కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు అనుమతి లేదని ప్రకటించారు. ఇక క్రిస్మస్ నుంచే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ సహా వివిధ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి తీవ్రత ప్రమాదకరంగా లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆంక్షలు అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)