కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్: గోరటి వెంకన్న ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి పురస్కారం

గోరటి వెంకన్న

ఫొటో సోర్స్, Gorati Venkanna

ఫొటో క్యాప్షన్, గోరటి వెంకన్న

కేంద్ర సాహిత్య అకాడమీ 2021కి గాను 20 భాషల్లో గురువారం అవార్డులు ప్రకటించింది. కవితల విభాగంలో తెలుగు కవి గోరటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది.

వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

కవితల విభాగంలో మవాడీ గహాయి(బోడో), సంజీవ్ వెరెంకర్(కొంకణి), హృషీకేశ్ మాలిక్(ఒడియా), మీథేశ్ నిర్మొహీ(రాజస్థానీ), బిందేశ్వరీప్రసాద్ మిశ్ర్(సంస్కృతం), అర్జున్ చావ్లా(సింధి)లకు పురస్కారాలు దక్కాయి.

కథా రచయితలు రాజ్ రాహీ(డోగ్రీ), కిరణ్ గురవ్(మరాఠీ), ఖలీద్ హుసేన్(పంజాబీ), నిరంజన్ హంస్డా (సంతాలీ), అంబాయి(తమిళం)కి పురస్కారాలు వరించాయి.

నవలా రచయితలు అనురాధా శర్మ పుజారీ(అస్సామీ), నమితా గోఖలే(ఇంగ్లిష్)లకు అవార్డులు దక్కాయి.

జీవిత చరిత్రల విభాగంలో కన్నడ రచయిత డీఎస్ నాగభూషణకు, స్వీయచరిత్రల విభాగంలో జార్జ్ ఒనక్కూర్ మళయాలం, నాటక విభాగంలో బెంగాలీ రచయిత బ్రాత్య బసు, హిందీ రచయిత దయా ప్రకాశ్ సిన్హాలకు అవార్డులు ప్రకటించారు.

విమర్శ విభాగంలో వాలీ మొహ్మద్ అసీర్ కాస్తవారీ(కశ్మీరీ), ఐతిహాసిక కవిత్వంలో చబీలాల్ ఉపాధ్యాయ(నేపాలీ) పురస్కారాలు గెలుచుకున్నారు.

సాహిత్య అకాడమీ లోగో

ఫొటో సోర్స్, SahityaAkademi

తంగుళ్ల గోపాల్‌కు ‘యువ పురస్కారం’

సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2021 తెలుగులో తంగుళ్ల గోపాల్‌కు లభించింది.

ఆయన రాసిన కవితల పుస్తకం ‘దండకడియం’కు ఈ అవార్డు దక్కింది.

ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారం తెలుగులో దేవరాజు మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు?’ నాటకానికి దక్కింది.

గోరటి వెంకన్న

ఫొటో సోర్స్, Gorati venkanna

‘పాలమూరు గోరింక’

పాత మహబూబ్‌నగర్ జిల్లాలో (ప్రస్తుతం నాగర్‌కర్నూలు జిల్లా) గౌరారంలో 1963లో వెంకన్న జన్మించారు.

చిన్నప్పటి నుంచి పాటలంటే మక్కువ ఉన్న వెంకన్న ప్రకృతి, సామాజిక సమస్యలపై సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటలు రాశారు.

అనేక సినిమాలకూ ఆయన పాటలు రాశారు.

‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’.. ‘జై బోలో జై బోలో అమరవీరులకు జై బోలో’ వంటి ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై మెదులుతుంటాయి.

పల్లెప్రజలతో సంబంధంమున్న, ప్రకృతిలో భాగమైన అనేక అంశాలపై ఆయన పాటలు రాశారు.

గోరటి వెంకన్న

ఫొటో సోర్స్, Gorati Venkanna

సంత, కొంగ, తుమ్మచెట్టు వంటి నిత్య జీవితంలో కనిపించే అంశాలపైనా మంచి పాటలు రాశారు వెంకన్న.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన రాసిన పాటలు ‘ధూం ధాం’ వంటి వేదికలపైన, ర్యాలీలలోనూ గాయకులు, ఉద్యమకారుల నోటి వెంట వినిపించేవి.

భైరాగి తత్వాలు కూడా వెంకన్న నోటి నుంచి ఎన్నో వినిపిస్తాయి.

ప్రస్తుతం వెంకన్న తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)