OLA, UBER క్యాబ్స్ రైడ్ బుక్ చేయడం ఎందుకు కష్టమవుతోంది?
ఈ మధ్య ఓలా లేదా ఉబర్‌లో రైడ్ బుక్ చెయ్యగానే క్యాన్సిల్ అయినట్లు మెసేజ్ వస్తోంది. చాలా రోజుల కిందట కొద్ది మందికి, ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న అనుభవం ఇది.
ఉబర్, ఓలా రైడ్ బుక్ చేయడం ఎందుకు కష్టమవుతోంది?
గతంలో బుక్ చెయ్యగానే ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చే ఆటోలు, క్యాబ్‌లు ఇప్పుడు రావడం లేదు.
ఓలా, ఉబర్ లేదంటే మరో యాప్... క్యాబ్ బుక్ చేశాక ఓ ఫోన్ కాల్.. మీరు ఎక్కడకు వెళ్లాలని డ్రైవర్ ప్రశ్న. లొకేషన్ చెప్పగానే సారీ సర్ అనడం. రైడ్ క్యాన్సిల్ చేయడం. డ్రాప్ లొకేషన్ చెప్పిన తర్వాత మరో ప్రశ్న... మీరు ఎలా పే చేస్తారు? ఆన్‌లైనా లేక క్యాషా.. ఆన్ లైన్ అనగానే రైడ్ క్యాన్సిల్. ఇప్పుడు పెరుగుతున్న ట్రెండ్ ఇది.
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, ఆఫీస్... డెస్టినేషన్ ఏదైనా కావొచ్చు. క్యాబ్ బుక్ చేస్తూ ఉంటే క్యాన్సిల్ అవుతూ ఉంటుంది.
టైమ్ గడిచే కొద్దీ టెన్షన్. క్యాబ్ దొరికితే సరి, లేదంటే రూపాయి ఎక్కువైనా ఇచ్చి మరో వాహనాన్ని మాట్లాడుకోవాల్సిందే.
ప్రస్తుతం హైదరాబాద్, దిల్లీ, బెంగళూర్ వంటి నగరాల్లో క్యాబ్ కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్య ఇది.
ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలలో ఓలా, ఉబర్‌ను ట్యాగ్ చేస్తూ చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు.
నా కొలీగ్స్ ఇంటి నుంచి ఆఫీసుకు రావాలన్నా తిరిగి ఇంటికి పోవాలన్నా రోజూ ఎదురయ్యే సమస్యే ఇది.
డ్రైవర్స్ డ్రాప్ లొకేషన్ ఎందుకు అడుగుతున్నారు?
కస్టమర్లు క్యాబ్ బుక్ చేస్తే దగ్గర్లో ఉన్న డ్రైవర్లకు రైడ్ రిక్వెస్ట్ వెళుతుంది.
రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు డ్రైవర్లకు డ్రాప్ లొకేషన్ తెలియదు.
రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తరవాత కస్టమర్ లొకేషన్, ఫోన్ నెంబర్ వారికి తెలుస్తుంది. అంతేకానీ డ్రాప్ లొకేషన్ ఏమిటో వారికి తెలియదు.
అందుకే కస్టమర్లకు ఫోన్ చేసి క్యాబ్ డ్రైవర్స్ ఎక్కడకు వెళ్లాలని అడుగుతున్నారు.
డ్రాప్ లొకేషన్ అడిగి ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు?
డ్రాప్ లొకేషన్ చెప్పగానే కొందరు డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. డ్రాప్ లొకేషన్ బాగా దూరంగా ఉన్నా లేక ఆ రూట్‌లో ట్రాఫిక్ హెవీగా ఉన్నా అటు రావడానికి వారు ఇష్టపడటం లేదు.
ట్రాఫిక్‌లో చిక్కుకొని పోవడం వల్ల మైలేజీ పడిపోవడంతోపాటు టైం కూడా వృథా అవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు.
ఓలా లేదా ఉబర్ తీసుకునే కమీషన్ పోగా తమకు వచ్చే నాలుగు రూపాయల్లో మెజారిటీ ఇంధనానికే పోతోందని, తమకు ఏమీ మిగలడం లేదని వారు అంటున్నారు.
ఇక కొన్ని ప్రాంతాల్లో కొత్త రైడ్స్ అంత సులభంగా దొరకవని, అందువల్ల కూడా క్యాన్సిల్ చేస్తున్నామనేది డ్రైవర్ల మాట.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎందుకు రామంటున్నారు?
హైదరాబాద్‌లో ఉండే వాళ్లకు మరొక సమస్య ఉంది. కొందరు క్యాబ్ డ్రైవర్లు ఎయిర్‌పోర్ట్‌కు రావడానికి నిరాకరిస్తున్నారు.
ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రైడ్స్ దొరకడం లేదని ఉబర్ డ్రైవర్ సిద్ధుల సత్యం చెబుతున్నారు.
అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ఇతర ట్యాక్సీలు, క్యాబ్ పాయింట్స్ ఉండటం వల్ల తమకు పని దొరకడం లేదని ఆయన అంటున్నారు.
డ్రైవర్లు క్యాష్ ఎందుకు అడుగుతున్నారు?
సాధారణంగా క్యాబ్ అగ్రిగేటర్లు వారానికొకసారి డ్రైవర్లకు పేమెంట్స్ చేస్తుంటాయి.
కానీ తమకు ఇంధనం కోసం లేదా ఇంట్లో ఖర్చుల కోసం రోజువారీగా ఎంతో కొంత డబ్బు కావాలి కాబట్టి తాము క్యాష్ అడుగుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు.
అయితే ఓలా ఇప్పుడు డెయిలీ పేమెంట్స్ చేస్తున్నట్లు కొందరు బీబీసీతో అన్నారు.
నన్ను రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నారు?
ఈ మధ్య నా కొలీగ్ ఈస్ట్ దిల్లీ నుంచి సెంట్రల్ దిల్లీకి క్యాబ్ బుక్ చేశాడు. రైడ్ ఫేర్ రూ.200. డ్రైవర్ ఫోన్ చేసి ఆ డబ్బులు నాకివ్వండి... నేను మిమ్మల్ని డెస్టినేషన్ దగ్గర దింపేస్తాను అన్నారు.
కాకపోతే యాప్‌లో రైడ్ క్యాన్సిల్ చేయాలన్న డ్రైవర్ రిక్వెస్ట్ చేశారు. ఇలా ఎందుకంటే ఓలా లేదా ఉబర్‌కు ఇచ్చే కమీషన్ బాధ తప్పుతుందని.
ఓలా లేదా ఉబర్ ఒక్కో రైడ్‌కు 30శాతానికి పైగా కమీషన్ వసూలు చేస్తున్నాయని చెబుతున్నారు డ్రైవర్లు.
అంటే మీరు రైడ్‌కు వంద రూపాయలు పే చేస్తే... అందులో డ్రైవర్ చేతిలోకి వెళ్లేది 70 రూపాయలే.
డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేయమని అడిగేది అందుకే. ఇలా చేయడం వల్ల ఆ డబ్బులు నేరుగా డ్రైవర్‌కే వెళ్తాయి. క్యాబ్ అగ్రిగేటర్‌కు కమీషన్ ఇవ్వాల్సిన పని ఉండదు.
తద్వారా నెలకు ఎంతో కొంత అదనంగా సంపాదించుకోవచ్చని డ్రైవర్లు చెబుతున్నారు.
‘పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా ఫేర్ పెంచడం లేదు’
ఇంధన ధరలు మండుతున్నా క్యాబ్ అగ్రిగేటర్లు తమకిచ్చే వాటా పెంచడం లేదని ఓలా డ్రైవర్ బీఎం బాబు అన్నారు.
కరోనా తర్వాత క్యాబ్ డ్రైవర్ల పరిస్థితులు దారుణంగా మారాయని, టీకా తీసుకున్న వారికి రూ.5,000 ఇస్తామని చెప్పినా ఇంత వరకూ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
రోజంతా కష్టపడి మూడు వేల రూపాయలు సంపాదిస్తే అందులో తమకు మిగిలేది వెయ్యి రూపాయలేనని చెబుతున్నారు.
ఒక డ్రైవర్ రైడ్ బుక్ చేసి రూ.500 సంపాదిస్తే అందులో వారికి వచ్చేది రూ.345 మాత్రమే. మిగతా రూ.155 సర్వీస్ ప్రొవైడర్ కమిషన్ టీడీఎస్, కాల్ డేటా ఖర్చుల కింద పోతాయి.
చాలా మంది డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేయడానికి ఇది కూడా మరో కారణంగా చెబుతున్నారు.
పీక్ టైమ్, వర్షాలు కురిసినప్పుడు సర్జ్ ప్రైసింగ్ లాంటి సమయాల్లోనే తమకు గిట్టుబాటు అవుతుందని క్యాబ్ డ్రైవర్లు అంటున్నారు.
'డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు'
ఓలా, ఉబర్ సంస్థ ఏదైనా కావచ్చు. క్యాబ్ డ్రైవర్లకు సంఘటితమైన సంస్థ ఏదీ లేదు.
ఎక్కడికక్కడ కొంతమంది డ్రైవర్లు వాట్సప్, టెలిగ్రామ్ లో గ్రూపులుగా ఏర్పడి కష్టాలు, సమస్యల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నట్లు టీసీపీఎ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు.
కోవిడ్ తర్వాత రైడ్లు లేక.. క్యాబ్ లు నడవక ఆదాయం పడిపోవడంతో తనకు తెలిసిన ఏడుగురు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన బీబీసీతో అన్నారు.
'జనవరి నుంచి జీఎస్టీ బాదుడు'
జనవరి 1 2022 నుంచి క్యాబ్ సర్వీసుల మీద ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధిస్తోంది.
ఇది కూడా క్యాబ్ డ్రైవర్లకు వచ్చే ఆదాయం నుంచి చెల్లించాల్సి రావచ్చేమో అనేది క్యాబ్ డ్రైవర్ల ఆందోళన.
కోవిడ్ సమయంలో తమకు సంస్థ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
కోవిడ్ కు ముందు హైదరాబాద్ లో లక్షకు పైగా క్యాబ్ లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 60వేలకు తగ్గిపోయినట్లు తెలంగాణ సెక్యూరిటీ క్యాబ్ ప్రొగ్రెసివ్ అసోసియేషన్ అధ్యక్షుడురాచమల్ల సత్యనారాయణ చెప్పారు.
ఉబర్, ఓలా ఏమంటున్నాయ్?
డ్రైవర్లు పదేపదే క్యాన్సిల్ చేయకుండా వారికి ముందుగానే డెస్టినేషన్ తెలిసేలా చేస్తున్నామని ప్రకటించాయి.
కస్టమర్ క్యాష్ ఇస్తారా లేక ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారా అనేది కూడా ముందుగానే డ్రైవర్‌కు చెబుతామని ఓలా అంటోంది. తద్వారా డ్రైవర్‌కు ఇష్టమైతే రైడ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు లేదంటే లేదు.
కస్టమర్‌ను పిక్ చేసుకోవాల్సిన లోకేషన్ దూరంగా ఉంటే అందుకు కూడా డబ్బులు చెల్లించే మోడల్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటోంది ఉబర్.
రైడ్లను మాటిమాటికి క్యాన్సిల్ చేయకుండా డ్రైవర్లకు ఇన్‌సెంటివ్స్ కూడా ఇస్తున్నామంటోంది ఆ సంస్థ.
అయితే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ను కస్టమర్లు అర్థం చేసుకోవాలని ఆ సంస్థలు కోరుతున్నాయ్.
ఒకోసారి కారులో సరిపడా ఫ్యూయెల్ ఉండదు లేదా ఏదైనా రిపేర్ వచ్చి బండి ఆగిపోవచ్చు. హెవీ ట్రాఫిక్‌లో ఇరుక్కు పోవచ్చు... ఇలాంటప్పుడు మరొక దారి లేక డ్రైవర్లు రైడ్స్ క్యాన్సిల్ చేస్తుంటారని సంస్థలు చెబుతున్నాయ్.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్‌తో కరోనా సునామీ వస్తోంది - డబ్ల్యూహెచ్ఓ
- స్టాలిన్ క్రూర పాలనను ప్రపంచానికి చెప్పిన చరిత్రకారుడు.. జైల్లో పెట్టిన పుతిన్ ప్రభుత్వం
- అంతరించిపోతున్న అరుదైన మంచినీటి చేప.. ఇలా కాపాడుతున్నారు..
- సయాజీ లక్ష్మణ్ శీలం: మహారాష్ట్ర అసెంబ్లీకి తొలి స్పీకర్ తెలుగు వ్యక్తే..
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)