జోసెఫ్ స్టాలిన్ క్రూర పాలనను ప్రపంచానికి చెప్పిన చరిత్రకారుడు.. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో జైల్లో పెట్టిన పుతిన్ ప్రభుత్వం

యూరీ డిమిత్రియెవ్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరీ డిమిత్రియెవ్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది
    • రచయిత, ముండో సర్వీస్
    • హోదా, బీబీసీ న్యూస్

సోవియట్‌ యూనియన్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ సాగించిన క్రూరమైన పాలన గురించి తనకు అనేక విషయాలు తెలుసని అంటున్నారు డిమిత్రియెవ్. ఆయన గత కొన్నేళ్లుగా స్టాలిన్ పాలనా కాలంలో సాగిన అరాచకాల గురించి ప్రచారం చేస్తున్నారు.

గులాగ్ (కార్మిక శిబిరాలు)లో వేలమందిని బంధించడం నుంచి రాజకీయ హత్యల వరకు ఆయన అనేక ఆరోపణలు చేస్తున్నారు.

అయితే, గత సోమవారం రష్యాలోని పిత్రజవోడ్క్స్‌లోని ఓ కోర్టు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో యూరి డిమిత్రియెవ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

స్టాలిన్ ప్రభుత్వం జరిపిన అరాచకాలను బయటపెట్టకుండా అడ్డుకోవడానికే డిమిత్రియెవ్‌ను కుట్ర పూరితంగా జైలులో పెట్టారని ఆయన మద్దతుదారులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, భారత్ - చైనా ఘర్షణ వస్తే... రష్యా ఎటు వైపు?

2016లో అరెస్టు

2016లో డిమిత్రియెవ్ ఇంటి పై జరిపిన దాడి సందర్భంగా అధికారులు ఒక కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో లభించిన ఆధారాల ఆధారంగా ఆయనపై ''చైల్డ్ పోర్నోగ్రఫీ'' కేసు పెట్టారు.

అయితే, డిమిత్రియెవ్, ఆయన కుటుంబం ఆ ఫొటోలు తన దత్త పుత్రికవని వాదించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఒక బాలికను దత్తత తీసుకున్నామని డిమిత్రియెవ్ కుటుంబం వెల్లడించింది. దత్తత తీసుకున్న తర్వాత బాలిక పరిస్థితిని ప్రభుత్వ సంస్థకు తెలియజేయడానికి ఈ ఫొటోలను తీశామని వారు చెబుతున్నారు.

ఫొటోల్లో అశ్లీల అంశాలు ఏమీ లేవని నిపుణులు కూడా తేల్చారు. తర్వాత కోర్టు ఆయనపై అభియోగాలను కొట్టి వేసింది. అయితే, ఆ తర్వాత మరికొన్ని ఆరోపణలతో ప్రాసిక్యూషన్ అప్పీల్ చేయడంతో, ఈ అంశం మళ్లీ సుప్రీం కోర్టుకు చేరుకుంది. ఈ కేసులో ఆయనకు 13 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ప్రాసిక్యూషన్ చేసిన మరో అప్పీల్‌ పై విచారణ జరిపిన కోర్టు, శిక్షను మరో రెండేళ్లు పొడిగించింది. దీంతో డిమిత్రియెవ్‌కు 15 సంవత్సరాల శిక్ష పడినట్లైంది. రష్యాలో మొదటి మానవ హక్కుల సంఘంగా పేరున్న 'మెమోరియల్' అనే సంస్థ ట్వీట్ చేస్తూ యూరి డిమిత్రియెవ్ వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, 15 ఏళ్ల శిక్ష పడిందని పేర్కొంది.

మెమోరియల్ మానవ హక్కుల సంస్థ స్టాలిన్ శకంలోని క్రూరమైన నేరాలను బహిర్గతం చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. పుతిన్ ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించే అవకాశం ఉంది.

స్టాలిన్ పాలనా కాలంనాటి అరాచకాలపై డిమిత్రియెవ్ ఆధారాలు సేకరించారు.
ఫొటో క్యాప్షన్, స్టాలిన్ పాలనా కాలంనాటి అరాచకాలపై డిమిత్రియెవ్ ఆధారాలు సేకరించారు.

ఎవరీ యూరి డిమిత్రియెవ్ ?

ఫిన్లాండ్ సమీపంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియాలోని పిత్రజవోడ్క్స్‌ నగరంలో 1956 సంవత్సరంలో జన్మించిన యూరి డిమిత్రియెవ్‌ను సోవియట్ సైనికుడు ఒకరు దత్తత తీసుకున్నారు.

గులాగ్ (కార్మిక శిబిరం)లకు జన్మస్థలమైన సోలోవ్‌ట్స్కి ద్వీపం సమీపంలోని ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఖైదీలను ఉరితీశారు. స్టాలిన్‌ పంచవర్ష ప్రణాళిక భాగమైన వైట్ సీ ఛానల్ కాలువ తవ్వకంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అధికారిక అంచనాల ప్రకారం, ఈ కాలంలో దాదాపు 7 లక్షల మంది మరణించారు.

సోవియట్ యూనియన్ పతనం తర్వాత స్థానిక ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్నప్పుడు, డిమిత్రియెవ్‌కు స్టాలిన్ కాలం నాటి ఘటనలకు సంబంధించి అనేక పత్రాలు లభించాయి.

వీటి ఆధారంగా, మొదటి సామూహిక ఖననం జరిగిన ప్రాంతాన్ని డిమిత్రియెవ్ గుర్తించారు. ఇది స్టాలిన్ కాలంలోని గులాగ్ పేరుతో సామూహిక హత్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, తెలుగు నేలపై రష్యన్ విప్లవ ప్రభావం

ఆ తర్వాత ఆయన రష్యాలోని రెండు అతి పెద్ద గులాగ్‌ లైన సాండర్‌మోఖ్, క్రాస్నీబోర్‌ లను కనుగొనే పనిలో పడ్డారు. ఇక్కడ అనధికారిక స్మారక చిహ్నాన్ని నిర్మించడం ద్వారా బాధితులను గుర్తించే పనిని మొదలు పెట్టారు డిమిత్రియెవ్ .

తద్వారా, స్టాలిన్ శకంలోని మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేతలను ప్రపంచానికి బహిర్గతం చేసిన చరిత్రకారుడిగా, ఇటు రష్యాలో, అటు ప్రపంచ యూరి డిమిత్రియెవ్ గుర్తింపు పొందారు. పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమిత్రియెవ్ ఆ ప్రభుత్వం పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

పుతిన్ ప్రణాళికలు, స్టాలిన్ ప్రణాళికల లాగా ఉన్నాయని ఆయన విమర్శించారు. మరోవైపు క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

అరెస్టుకు ముందు, రష్యా ఇంటెలిజెన్స్‌ పోలీసుల గురించి ఓ కార్యక్రమంలో డిమిత్రియెవ్ పాల్గొన్నారు.

స్టాలిన్ కాలంలో అరాచకాలకు బలైన వారి కోసం అనధికారికంగా స్మారక స్తూపం నిర్మించడంపై పుతిన్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో ఆయన పై కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లారు.

రష్యా మాజీ పాలకుడు జోసెఫ్ స్టాలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా మాజీ పాలకుడు జోసెఫ్ స్టాలిన్

కేసులలో ఇరికించారా?

డిమిత్రియెవ్‌ కు శిక్ష పడిన కేసులో దాదాపు ఐదేళ్లుగా విచారణ కొనసాగుతోంది. మొదటిసారి డిసెంబర్ 2016లో అరెస్టు చేశారు. మొదటిసారి మైనర్ బాలిక న్యూడ్‌ ఫొటోలు కంప్యూటర్‌లో ఉన్నాయన్న ఆరోపణలపై కేసు పెట్టారు.

మరుసటి సంవత్సరం గన్ స్పేర్‌పార్ట్స్ దాచారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. మొదటి కేసులో ఆయనపై ఆరోపణలు రుజువు కాలేదు. కానీ, రెండో కేసు బలంగా ఉంది.

అయితే, డిమిత్రియెవ్‌ను అక్రమ కేసులతో నిర్బంధించారని, ప్రత్యర్ధులను అక్రమంగా అరెస్టు చేయడం పుతిన్ ప్రభుత్వానికి అలవాటేనని రష్యాలోని పుతిన్ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్లాదిమిర్ పుతిన్

స్టాలిన్ ఇమేజ్‌ని కాపాడే ప్రయత్నాలు

అధికారంలోకి వచ్చినప్పటి నుండి, స్టాలిన్ ఇమేజ్‌ను పెంచడానికి పుతిన్ ప్రయత్నిస్తూ వచ్చారు.

ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా పుతిన్‌కు పేరుంది.

సోవియట్ యూనియన్ పతనాన్ని 20వ శతాబ్దపు దారుణమైన విషాదంగా ఇటీవల పుతిన్ అభివర్ణించారు.

రష్యాలో చాలాచోట్ల ఇప్పుడు స్టాలిన్‌ స్మారక చిహ్నాలు వెలుస్తున్నాయి.

గత యేడాది రష్యా బెస్ట్ లీడర్స్ జాబితా కోసం జరిపిన సర్వేలో జోసెఫ్ స్టాలిన్ మొదటి స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)