ఒమిక్రాన్‌ వేరియంట్‌తో కరోనా సునామీ వస్తోంది - డబ్ల్యూహెచ్‌ఓ

బ్యాంకాక్‌లోని కరోనా పరీక్ష కేంద్రం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బ్యాంకాక్‌లోని కరోనా పరీక్ష కేంద్రం

డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కలయికతో ప్రమాదకర సునామీలా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ పేర్కొన్నారు.

యూఎస్‌తో పాటు యూరప్ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడంతో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

యూరప్‌లో ఫ్రాన్స్ దేశం వరుసగా రెండో రోజూ అత్యధిక కేసులను నమోదు చేసింది. ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,08,000 కేసులు నమోదయ్యాయి. యూరప్‌లో ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం.

జాన్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం, అమెరికా గత ఏడు రోజుల్లో రికార్డు స్థాయిలో రోజుకు సగటున 2,65,427 కేసులను నివేదించింది.

డెన్మార్క్, పోర్చుగల్, యూకే, ఆస్ట్రేలియాలు కూడా కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టించాయి.

పోలాండ్‌లో బుధవారం 794 కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించాయి. అక్కడ ఫోర్త్‌వేవ్‌లో నమోదైన మరణాల్లో ఇదే అత్యధిక సంఖ్య. ఇందులో మూడొంతుల కన్నా ఎక్కువ మంది టీకా తీసుకోనివారే.

చాలా స్వల్ప సమయంలో అనేక దేశాలపై ఆధిపత్యం చెలాయించిన ఒమిక్రాన్ వేరియంట్... డెల్టాతో పోలిస్తే తక్కువ తీవ్రమైనది, కానీ అత్యంత వేగంగా వ్యాప్తి చెందగలదని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని అడ్డుకున్న గ్రామస్థులు

ఈ వేరియంట్‌తో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని నమ్ముతున్నారు. దీని గురించి ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలీవియర్ వెరాన్ మాట్లాడుతూ... 'ఒమిక్రాన్ విషయానికొస్తే ఇక దీన్ని సాధారణ అల అని చెప్పను. ఇది బీభత్సమైన అల' అని వ్యాఖ్యానించారు.

ఇది రెండు వేరియంట్ల వల్ల కలిగిన 'ట్విన్ త్రెట్' అని డాక్టర్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. కేసుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని పేర్కొన్నారు.

''ఇప్పటికే అలసిపోయిన ఆరోగ్య కార్యకర్తలపై కరోనా తీవ్ర ఒత్తిడిని పెంచుతూనే ఉంది'' అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ అన్నారు.

ప్రస్తుత సమయంలో ప్రతీరోజూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

జనాభా సంఖ్య, వ్యాక్సినేషన్ రేటును బట్టి అమెరికాలో జనవరి చివరి నాటికి ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచీ పేర్కొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోసుగా పలు సంపన్న దేశాలు ఇప్పటికే బూస్టర్ డోస్‌లను ప్రవేశపెట్టాయి. యూకేలో 12 ఏళ్లు పైబడిన వారిలో 57 శాతం మంది మూడు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: 'కరోనా వ్యాక్సీన్ వద్దు బాబో' అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, తరువాత ఏమైందంటే...

ధనిక దేశాల, భారీ స్థాయి బూస్టర్ డోస్ ప్రచారాల వల్ల మహమ్మారి మరింత కాలం కొనసాగే అవకాశం ఉంటుందని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. ''బూస్టర్ డోస్ కోసం తపిస్తూ పేద, తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన దేశాలకు టీకాల సరఫరాను పక్కకు మళ్లిస్తే, వైరస్ మరింతగా మ్యుటేట్ చెంది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది'' అని ఆయన హెచ్చరించారు.

2022 మధ్య నాటికి 70 శాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలనే ప్రచారానికి అండగా నిలుస్తామని ప్రతీ ఒక్కరూ కొత్త సంవత్సరం సందర్భంగా తీర్మానించుకోవాలని ఆయన కోరారు.

దాదాపు 100 దేశాలు, తమ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సిన్ అందించాలనే అసలు లక్ష్యానికి ఇంకా చేరుకోలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

మంగళవారం ప్రచురితమైన డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం, డిసెంబర్ 26కు ముందు వారంలో యూరప్ వ్యాప్తంగా అన్ని రకాల కోవిడ్ కేసులు 57 శాతం, అమెరికాలో 30 శాతం పెరిగినట్లు తెలిసింది.

ఈ సంఖ్య మరింతగా పెరుగుతున్నట్లుగానే అనిపిస్తోంది. బుధవారం కొత్త రికార్డులు నమోదయ్యాయి.

  • ఫ్రాన్స్‌లో 2,08,000 కేసులు నమోదయ్యాయి. 53 మంది ఐసీయూలో ఉండగా, 184 మంది మరణించారు.
  • యూకేలో 1,83,037 కొత్త కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి.
  • ఇటలీలో రోజూవారీ కేసుల సంఖ్యలో పెరుగుదల మంగళవారం 78,313 ఉండగా, బుధవారం నాటికి 98,020కి చేరింది.
  • డెన్మార్క్‌లో రికార్డు స్థాయిలో 23,228 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 1205 మంది గతంలో కూడా కోవిడ్ బారిన పడ్డారు.
  • పోర్చుగల్‌లో 28,867 కేసులు వచ్చాయి. మంగళవారం ఈ సంఖ్య 17,172గా ఉంది.
  • ఆస్ట్రేలియాలో మంగళవారం రికార్డు స్థాయిలో 11,300 కొత్త కేసులు రాగా, బుధవారం ఈ రికార్డు బద్దలైంది. కొత్తగా 18,241 కేసులు వెలుగు చూశాయి.
  • గ్రీస్‌లో కూడా 28,828 కేసులు నమోదయ్యాయి.

క్రిస్మస్ కారణంగా రిపోర్టుల్లో జాప్యం కారణంగా కూడా కొన్ని కేసులు ఈ గణాంకాల్లో చేర్చలేకపోయుండొచ్చని అధికారులు హెచ్చరించారు.

రికార్డు స్థాయిలో ఇన్‌ఫెక్షన్లు పెరగడం వల్ల అత్యవసర సర్వీసులకు సిబ్బంది కొరత ఏర్పడుతోంది.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు

బ్రిటన్‌లో, ఈ వారం ప్రారంభంలో మూడొంతుల ఫైరింజన్లు అందుబాటులో లేకుండా పోయాయని ఫైర్ బ్రిగేడ్స్ యూనియన్ చెప్పింది. పాజిటివ్‌గా తేలిన సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని పేర్కొంది.

గత రెండు వారాలుగా, ప్రతీ లక్ష మందిలో 1360 కరోనా కేసులను గుర్తిస్తోన్న స్పెయిన్ బుధవారం ఐసోలేషన్ వ్యవధిని 10 రోజుల నుంచి 7 రోజులకు తగ్గించింది. సిబ్బంది కొరతను తీర్చడానికే ఇలా చేసినట్లు పేర్కొంది.

యూఎస్ కూడా ఇప్పటికే ఈ వ్యవధిని తగ్గించింది. రెండు రోజులు నెగెటివ్ ఫలితం వస్తే, ఒక వారం తర్వాత వారు ఐసోలేషన్‌ నుంచి బయటకు వెళ్లవచ్చని యూకే పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)