చైనా: బహిరంగంగా అవమానిస్తే ప్రజల్లో మార్పు వస్తుందా? కరోనా నిబంధనలు అతిక్రమించినవారిని వీధుల్లో ఊరేగించాలా

ఫొటో సోర్స్, ZHENGGUAN VIDEO
పబ్లిక్ షేమింగ్ అనేది ఒక రకమైన శిక్ష. ఏదైనా తప్పు చేసిన లేదా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిని అందరి ముందు, బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం దీని ఉద్దేశం.
ఇలా చేయడాన్ని తప్పు చేసిన వ్యక్తికి వేసే శిక్షగా భావిస్తారు.
అయితే పబ్లిక్ షేమింగ్ చేయడం ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందా?
కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలపై నిబంధనలు విధించాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు నియమాలు రూపొందించాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తోన్న వారిపై జరిమానాలు విధిస్తున్నాయి. కానీ కొన్నిచోట్ల మాత్రం వ్యక్తులు చేసిన నేరాలకు పబ్లిక్ షేమింగ్ లాంటి విధానాలను అనుసరిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని వారు నమ్ముతున్నారు.
''ప్రజలు మాట వినేటట్లు చేయడానికి నియమాలను ఉల్లంఘించిన వారిని శిక్షించడం ఒక మార్గం. అయితే, అదొక్కటే పరిస్థితులు చక్కబడటానికి చేతిలో ఉన్న ఆయుధం కాకూడదు'' అని సిడ్నీ యూనివర్సిటీలో మోరల్ ఫిలాసఫర్‌గా పనిచేస్తోన్న డాక్టర్ హన్నా టిర్ని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఇప్పుడు ఇదంతా ఎందుకు?
దక్షిణ చైనా పోలీసులు పబ్లిక్ షేమింగ్‌కు పాల్పడినట్లు కెమెరాల్లో రికార్డయింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నలుగురిని బహిరంగ ప్రదేశాల్లో ఊరేగించడం ఆ వీడియోల్లో కనిపించింది.
కరోనా కారణంగా చైనా సరిహద్దులు మూసివేశారు. కానీ, కొందరు అక్రమంగా ప్రజలను సరిహద్దు దాటించడం, ఇతర దేశాల నుంచి తేవడం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణలతో ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గ్వాంగ్జీ ప్రావిన్సులోని జింగ్సీ నగర వీధుల్లో వారిని ఊరేగించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి.
డిసెంబర్ 28న ఈ ఘటన జరిగింది. హజ్మత్ సూట్లతో పాటు ఫేస్ షీల్డ్‌లను ధరించిన నలుగురు... చేతిలో తమ పేరు, వివరాలు, పొటోతో కూడిన ప్లకార్డులను పట్టుకొని వీధుల్లో పోలీసులతో నడుస్తోన్న వీడియో బయటకొచ్చింది. ఈ ఊరేగింపును ఆ వీధిలోని ప్రజలంతా చూశారు.
పబ్లిక్ షేమింగ్‌పై స్పందనలేంటి?
చైనా పోలీసులు తీసుకున్న క్రమశిక్షణ చర్య... సరిహద్దు సంబంధిత నేరాలను నిరోధించిందని, కరోనా నియంత్రణను పాటించడాన్ని ప్రోత్సహించిందని ప్రభుత్వ అధీనంలోని వార్తా సంస్థ గ్వాంగ్జీ డైలీ పేర్కొంది.
పోలీసుల ఊరేగింపుపై చైనా సామాజిక మాధ్యమం వీబోలో భిన్న స్పందనలు కనిపించాయి.
వందల ఏళ్ల క్రితం నాటి 'బహిరంగ అవమానాలు' కాన్సెప్ట్‌ను తాజా ఘటన గుర్తు చేసిందని కొందరు పేర్కొన్నారు. సరిహద్దుల్లో కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలను మరికొందరు సూచించారు.
''వాళ్లను వీధుల్లో ఊరేగించడం కన్నా, ఆ చర్యకు మద్దతు పలుకుతూ వస్తోన్న సందేశాలు చూస్తుంటే భయంగా ఉందని'' ఒక యూజర్ రాసుకొచ్చారు.
'' ఈ చర్య చట్టబద్ధమైన పాలన స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. ఇలా మరోసారి జరగకూడదు'' అని 'బీజింగ్ న్యూస్' పేర్కొంది.
జింగ్సీ సిటీ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో, స్థానిక ప్రభుత్వం ఈ చర్యను సమర్థించుకున్నాయి. 'ఇది తప్పు జరిగిన ప్రదేశంలోనే తీసుకున్న క్రమశిక్షణ చర్య. అనుచితమైనదేమీ కాదు' అని చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా?
సాంస్కృతిక ఉద్యమ కాలంలో చైనాలో 'పబ్లిక్ షేమింగ్' అనేది తరచుగా జరిగేది. కానీ ప్రస్తుతం మాత్రం ఇది చాలా అరుదుగా జరుగుతోంది.
2006లో దాదాపు 100 మంది సెక్స్ వర్కర్లు, వారికి చెందిన కొంతమంది క్లయింట్లను పసుపు రంగు జైలు దుస్తుల్లో వీధుల్లో ఊరేగించారు.
మరణ శిక్ష పడిన ఖైదీల ఊరేగింపును 2007లో చైనా అధికారులు నిషేధించారు.
ప్రస్తుతం భారత్‌లో కరోనా వ్యాప్తి, పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ క్రిస్మస్ పండగ, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.
విహార యాత్రలకు వెళ్లే వారితో విమానాలు నిండుగా ప్రయాణిస్తున్నాయి. గోవా లాంటి ప్రదేశాల్లో హోటళ్లు 90 శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తున్నాయి. ప్రతీరోజు దాదాపు 90 విమానాలు అక్కడికి వెళ్తున్నాయి.
''ఏడాది కాలంగా ప్రజలు ఎలాంటి వేడుకలు జరుపుకోలేదు. ఈ ఏడాది పుట్టినరోజు, వివాహ దినోత్సవాలు, విహార యాత్రలు చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఆక్యుపెన్సీ పరంగా చూస్తే, మేం కరోనా రాకముందు నాటి పరిస్థితులను అందుకున్నాం'' అని గోవాలోని ప్రముఖ రవాణా సంస్థ అధిపతి అయిన నీలేశ్ షా, రాయిటర్స్‌తో చెప్పారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆంక్షల్లో సడలింపులు లభించడంతో, డిసెంబర్‌లో 10 లక్షలకు పైగా టూరిస్టులు గోవాకు వచ్చారని ఆయన అంచనా వేశారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో, రాష్ట్రాలు కరోనా నియంత్రణ చర్యలపై పట్టు సడలించకూడదని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
''న్యూ ఇయర్ వేడుకలు, పండగల దృష్ట్యా మళ్లీ పరిస్థితులు కఠినం కావొచ్చు'' అని మహమ్మారిపై మోదీ ప్రభుత్వానికి సలహాలు అందించే సీనియర్ ప్రభుత్వ అధికారి వినోద్ కుమార్ పాల్ అన్నారు.
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి
తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్... థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. న్యూ ఇయర్ వేడుకలతో పాటు పార్టీలకు అనుమతించారు.
రాబోయే రోజుల్లో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
''ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టీకా తీసుకుంటే కొత్త వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సంక్రాంతితో థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్య పెంచబోతున్నాం. గత రెండు రోజుల నుంచి కోవిడ్ పాజిటివిటి రేటు పెరుగుతోంది. గతంలో ఉన్న కోవిడ్ చికిత్సనే ఇప్పుడు కూడా అందిస్తాం. ఎలాంటి మార్పులు లేవు. థర్డ్ వేవ్, కోవిడ్‌కు అంతం అని చెప్పుకోవచ్చు'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














