ది నైన్: శవాల దిబ్బలో దాక్కుని నాజీ డెత్ మార్చ్ నుంచి తప్పించుకున్న తొమ్మిది మంది మహిళలు

హెలెన్ పోడ్లియాస్కీ

ఫొటో సోర్స్, MARTINE FOURCAUT

ఫొటో క్యాప్షన్, హెలెన్ పోడ్లియాస్కీ
    • రచయిత, లూసీ వాలిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్వెన్ స్ట్రాస్ వాళ్ల అమ్మమ్మ 1945లో నాజీ డెత్ మార్చ్ నుంచి తప్పించుకున్నారు. ఈ సంగతి వినగానే ఆ సంఘటన పూర్తి వివరాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గ్వెన్‌కు కలిగింది.

దాంతో, వీరి అడుగుజాడలను వెతుక్కుంటూ చరిత్రలోకి వెళ్లారామె. 75 సంవత్సరాల క్రితం ఆ మహిళలు చేసిన సాహసాన్ని అందరూ గుర్తించేలా చేశారు.

గ్వెన్ ఈ విషయాలన్నింటినీ ఎలా వెలికితీశారో చూద్దాం.

హెలెన్ పోడ్లియాస్కీగెస్టాపో చేతికి చిక్కినప్పుడు..

అది 2002వ సంవత్సరం. ఓ సెలవు రోజు మధ్యాహ్నం గ్వెన్ స్ట్రాస్, వాళ్ల అమ్మమ్మ హెలెన్ పోడ్లియాస్కీతో కలిసి భోజనం చేస్తున్నారు. అప్పటికి హెలెన్ పోడ్లియాస్కీకి 83 ఏళ్లు.

గ్వెన్ వాళ్ల నాన్నకు హెలెన్ మేనత్త. ఆమె ఫ్రెంచ్ పౌరురాలు. అమెరికన్ రచయిత గ్వెన్ ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు.

భోజన సమయంలో వాళ్లిద్దరూ హెలెన్ గతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. హెలెన్ ఫ్రెంచ్ రెసిస్టెన్స్‌లో పనిచేశారన్న సంగతి గ్వెన్‌కు తెలుసు. కానీ, పూర్తి వివరాలు తెలీవు.

నాజీ డెత్ మార్చ్

ఫొటో సోర్స్, SWEDISH RED CROSS

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ ఆక్రమణకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో పలు సంస్థలు సంయుక్తంగా పోరాడాయి. ఈ సమూహం చేసిన పోరాటాన్ని 'ది ఫ్రెంచ్ రెసిస్టెన్స్‌' అంటారు. ఫ్రెంచ్ ప్రతిఘటన అని చెప్పుకోవచ్చు.

ఆ సమయంలో హెలెన్‌ను గెస్టాపో బంధించింది. ఆమెను అనేక రకాలుగా హింసించి జర్మనీలోని నిర్బంధ శిబిరానికి పంపించారు.

'గెహైం స్టాట్స్‌పోలిజై' (Geheime Staatspolizei)ను క్లుప్తంగా గెస్టాపో అంటారు. ఇది నాజీ జర్మనీ, జర్మన్ ఆక్రమిత ఐరోపాలో అధికారిక రహస్య పోలీసు శాఖ.

నాజీ వ్యతిరేక శక్తులు ఆ ప్రాంతాన్ని సమీపిస్తుండడంతో నిర్బంధ శిబిరాలను ఖాళీ చేయించి, అందులో ఉన్నవారిని మైళ్ల దూరం నడిపించారు. దాన్నే 'నాజీ డెత్ మార్చ్' అంటారు. అలా నడిచిన వాళ్లల్లో హెలెన్ కూడా ఉన్నారు.

"అప్పుడు నేను, మరికొంతమంది మహిళల సహా తప్పించుకున్నాను" అంటూ హెలెన్ చెప్పుకొచ్చారు.

"మా అమ్మమ్మ కథ విని చాలా ఆశ్చర్యపోయాను. అప్పట్లో నాజీల చేతి నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లెందరో తమ కథలను ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. సొంత కుటుంబానికి కూడా చెప్పుకోలేదు. మా అమ్మమ్మ జీవితపు ఆఖరు దశలో ఉన్నారు. అందుకే, ఆనాటి సంఘటనల గురించి పెదవి విప్పేందుకు సిద్ధపడ్డారని భావిస్తున్నా. సొంత కుటుంబంతో చెప్పడం కన్నా కొంచెం దూరం బంధువులతో చెప్పడం కొంత సౌకర్యంగా ఉంటుంది" అని గ్వెన్ అన్నారు.

నాజీ డెత్ మార్చ్

ది నైన్.. తప్పించుకున్న తొమ్మిది మంది మహిళలు

ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో రెసిస్టెన్స్‌కు ఏజెంట్ (ఏజెంట్ డి లైజన్‌)గా పనిచేస్తూ దొరికారు హెలెన్. అప్పటికి ఆమె వయసు 24 ఏళ్లు.

ఆమె మారు పేరు క్రిస్టీన్. హెలెన్‌కు జర్మన్‌ సహా అయిదు భాషలు వచ్చు. అంతే కాకుండా, మంచి అర్హతలున్న ఇంజనీర్.

"రెసిస్టెన్స్‌లో ఉన్నత స్థాయిలో పనిచేసేవారు. ఇతర ఏజెంట్లను కాంటాక్ట్ చేస్తూ, పారాచూట్ ద్వారా పంపే వస్తువులను పర్యవేక్షిస్తూ ఓ ఏడాదికి పైగా పనిచేశారు. ఆమె చాలా తెలివైన వ్యక్తి" అని గ్వెన్ తెలిపారు.

యుద్ధం ఆఖరి రోజుల్లో 1944లో హెలెన్‌ను అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్‌లో రెసిస్టెన్స్ నెట్‌వర్క్ మొత్తాన్ని విచ్ఛన్నం చేయమని నాజీలు ఒత్తిడి తెచ్చారు. దాంతో రహస్య పోలీసులు ఈ గ్రూపు సభ్యులను మూలమూలలా వెతికి పట్టుకున్నారు. హెలెన్‌తో పాటు మరో ఎనిమిది మంది మహిళలు దొరికిపోయారు. వారిలో హెలెన్ స్కూలు ఫ్రెండు కూడా ఉన్నారు.

ఆమె సుజానే మౌడెట్. సుజానే ఆశావాది, దయగల వ్యక్తి, ఉదార స్వభావం కలవారని గ్వెన్ చెప్పారు.

సుజానే 22 ఏళ్ల వయస్సులో తోటి రెసిస్టెన్స్ సభ్యుడు రెనే మౌడెట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఒక నెలకు ఈ జంట పట్టుబడ్డారు. ఫ్రెంచ్ యువకులు తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు వీరిని అరెస్టు చేశారు.

"మరొక వ్యక్తి నికోల్ క్లారెన్స్. పారిస్‌లో ఏజెంట్లందరికీ ఇన్ ఛార్జ్."

1944 ఆగస్టులో పారిస్ విముక్తికి మూడు వారాల ముందు ఆమెను అరెస్టు చేశారు. ఆమెను కూడా నిర్బంధ శిబిరానికి తరలించారు. నగరం నుంచి శిబిరానికి వెళ్లిన చివరి బండిలో ఆమెను తరలించారు.

పారిస్ నుంచి తరలించిన చివరి ఖైదీల్లో జాక్వెలిన్ ఆబెరీ డు బౌలీ (జాకీ) కూడా ఒకరు. 29 ఏళ్ల జాకీ ఆ గుంపులో అందరికన్నా వయసులో పెద్దవారు. యుద్ధంలో ఆమె తన భర్తను కోల్పోయారు. రెసిస్టెన్స్‌లో కీలకమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లో ఆమె ఒక భాగమని గ్వెన్ తెలిపారు.

జాకీ వాళ్ల నాన్న నావికుడిగా పనిచేసేవారు. అందుకే ఆమె తన అత్త, మామయ్యల దగ్గర పెరిగారు. ఆమె చాలా కేరింగ్‌గా ఉంటారని, విధేయత గల వ్యక్తి అని గ్వెన్ చెప్పారు.

మాడెలోన్ వెర్‌స్టిజ్నెన్ (లోన్), గిల్లెమెట్ డేండెల్స్ (గుయిగుయి)లను అరెస్టు చేసినప్పుడు వారికి వరుసగా 27, 23 సంవత్సరాలు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఉన్నత స్థాయి డచ్ కుటుంబాల నుంచి వచ్చినవారు.

"డచ్ నెట్‌వర్క్‌లో జాయిన్ అవ్వడానికి పారిస్ వచ్చారు. వచ్చిన వెంటనే పట్టుబడ్డారు. గుయిగుయి మంచి అథ్లెట్. నిర్మలమైన, మృదువైన స్వభావం ఆమెది. లోన్ కొంచం కరకు మనిషి. అన్నిట్లోనూ నేను ఉండాలి అనుకుంటారామె."

రెనీ లెబోన్ చాటేనాయ్ (జింకా) మరొక "అద్భుతమైన మహిళ, సాహసి" అని గ్వెన్ అన్నారు.

నాజీ డెత్ మార్చ్

జింకా, తన భర్తతో కలిసి బ్రిటిష్ ఎయిర్‌మెన్ ఇంగ్లండ్‌కు తప్పించుకునేందుకు సహాయం చేసే నెట్‌వర్క్‌లో పనిచేసేవారు.

పోలీసులు జింకాను నిర్బంధించినప్పుడు ఆమెకు 29 ఏళ్లు. జైల్లో ఉన్నప్పుడు ఆమె ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు ఫ్రాన్స్ అని పేరు పెట్టారు. పుట్టిన తరువాత 18 రోజులు మాత్రమే ఆ పాప తన తల్లి దగ్గర ఉంది. తరువాత, జింకాను జర్మనీకి తరలించారు. తన పాప కోసం తాను ఎలాగైనా బతికి తీరాలని ఆమె తీర్మానించుకున్నారు.

22 ఏళ్ల వైవోన్ లే గిల్లౌ (మెనా) పారిస్‌లో డచ్ నెట్‌వర్క్‌లో పనిచేసేవారు. ఆ సమయంలోనే ఓ డచ్ యువకుడితో ప్రేమలో పడ్డారు. అదే వయసులో ఆమెను అరెస్ట్ చేశారు.

తప్పించుకున్న తొమ్మిది మంది మహిళలలో అందరికన్నా చిన్నవారు జోసెఫిన్ బోర్దానవా (జోసీ). అరెస్ట్ అయినప్పుడు ఆమెకు కేవలం 20 సంవత్సరాలు. స్పెయిన్‌కు చెందిన జోసీ అద్భుతంగా పాడతారని గ్వెన్ తెలిపారు.

ఈ తొమ్మిది మందినీ ఉత్తర జర్మనీలోని మహిళల నిర్బంధ శిబిరం రావెన్స్‌బ్రూక్‌కు బదిలీ చేశారు. ఆ తరువాత లీప్‌జిగ్‌లోని లేబర్ క్యాంపులో ఆయుధాలు తయారు చేయడానికి పంపించారు. అక్కడే వీరి మధ్య స్నేహం బలపడింది.

వీడియో క్యాప్షన్, ఈమె హిట్లర్ నుంచి ఎలా తప్పించుకున్నారు?

'జైల్లో ఉన్నా సైనికులమే'

ఆ శిబిరంలో పరిస్థితులు భయానకంగా ఉండేవి. ఆకలితో అలమటించేవారు. వారిని దారుణంగా హింసించేవారు. బట్టలు విప్పి నగ్నంగా మంచులో నిలబెట్టి తనిఖీ చేసేవారు.

అలాంటి పరిస్థితుల్లో పెంచుకున్న స్నేహమే వారిని కాపాడింది. వాళ్ల శిబిరంలో ఒక సంప్రదాయాన్ని పాటించేవారు. ప్రతి ఒక్కరూ తమ వాటా సూప్‌లోంచి ఒక స్పూన్ సూప్‌ను ఒక గిన్నెలో పోసేవారు. అలా సేకరించిన సూప్‌ను ఆరోజు ఎవరికి ఎక్కువ అవసరమో వారికి అందించేవారు.

ఆకలి భయంకరంగా ఉండేది. కానీ, ఆహారం గురించి వాళ్లు మాట్లాడుకుంటూ ఉండేవారని, అది వారికి జీవితం మీద ఆశ కలిగించేదని గ్వెన్ తెలిపారు.

రోజూ రాత్రి పూట రకరకాల ఆహార పదార్థాలు, వాటి తయారీ గురించి నికోల్ చెప్పేవారు. ఆఫీసు నుంచి రహస్యంగా దొంగిలించి తీసుకొచ్చి కాగితం ముక్కలపై ఈ రెసిపీలన్నింటినీ రాసేవారు. అలా ఓ రెసిపీ పుస్తకం తయారైంది. దాన్ని తన పరుపు కింద దాచిపెట్టేవారు.

హెలెన్ ఈ విషయాలన్నీ చెబుతూ, తాము జైల్లో ఉన్నా సైనికులమేనని అన్నారు. ఈ మహిళలంతా కలిసి పంజెర్‌ఫాస్ట్ అనే ఆయుధానికి అవసరమైన షెల్స్ తయారీని విధ్వంసం చేశారు.

2008లో హెలెన్, లాన్

ఫొటో సోర్స్, JETSKE SPANJER & ANGE WIEBERDINK

నిర్బంధ శిబిరం నుంచి ఎలా తప్పించుకున్నారంటే..

1945 ఏప్రిల్‌లో నాజీ వ్యతిరేక మిత్రరాజ్యాలు ఫ్యాక్టరీపై చాలాసార్లు బాంబు దాడి చేశాయి. దాంతో, నాజీలు ఆ శిబిరాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆకలితో అలమటిస్తూ అలిసిపోయి ఉన్న 5,000 మంది మహిళలను నడిపించడం ప్రారంభించారు. వారి పాదాలు రక్తాలు కారుతూ బొబ్బలెక్కి ఉన్నాయి. ఒంటిపై సన్నని వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. అలా వారిని తూర్పు జర్మనీ గ్రామీణ ప్రాంతాలలో మైళ్ల దూరం నడిపించారు.

ఈ నడక చాలా ప్రమాదకరమని ఆ మహిళలు గ్రహించారు.

"వాళ్లకు తప్పించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. లేకపోతే ఆకలికి చచ్చిపోతారు లేదా చంపేస్తారు. అవకాశం కోసం ఎదురుచూశారు. గుంపులో కాస్త గందరగోళం ఏర్పడింది. అదే అదనుగా ఒక పెద్ద గుంటలోకి దూకేశారు. కళ్లు మూసుకుని చనిపోయినట్లు నటించారు. ఆ గుంటలో చాలా మృతదేహాలు ఉన్నాయి. వాటి మధ్యలో వీరిని గుర్తించలేదు. మార్చ్ ముందుకు వెళ్లిపోయింది" అని గ్వెన్ వివరించారు.

తరువాత 10 రోజుల వరకూ ఈ మహిళలు అమెరికన్ సైనికుల కోసం వెతికారు. జాకీ డిఫ్తీరియా బారినపడ్డారు. జింకాకు క్షయవ్యాధి వచ్చింది. నికోల్ న్యుమోనియా నుంచి కోలుకుంటున్నారు. హెలెన్‌కు దీర్ఘకాలిక తుంటి నొప్పి. విరిగిన ఎముకలు, ఆకలి వారిని తీవ్రంగా బాధించాయి. కానీ, స్వేచ్ఛా గాలులు పీల్చడమే వారి అంతిమ లక్ష్యం.

వాళ్లు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారో, ఏ మార్గంలో తప్పించుకున్నారో తెలుసుకోవడానికి చాలా శ్రమపడాల్సి వచ్చిందని, జర్మనీకి మూడుసార్లు వెళ్లాల్సి వచ్చిందని గ్వెన్ తెలిపారు.

"వాళ్లు తప్పించుకునే దిశలో ఒక్కొక్క రోజూ చాల నెమ్మదిగా గడిచింది. పెద్దగా పురోగతి ఉండేది కాదు. అయినా కూడా పట్టు వీడక వాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదంతా తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను."

"ఒక్కొసారి కేవలం అయిదు లేదా ఆరు కిలోమీటర్లు మాత్రమే ముందుకు వెళ్లగలిగేవారు. వాళ్లు ఆకలితో ఉన్నారు. తినడానికి తిండి కావాలి, పడుకోవడానికి భద్రమైన స్థలం కావాలి. కాబట్టి, గ్రామాల్లోకి వెళ్లి స్థానికులతో మాట్లాడక తప్పలేదు. కానీ, అది చాలా ప్రమాదకరం. మళ్లీ పట్టుబడవచ్చు. లేదా గ్రామస్థులే వారిని చంపేయవచ్చు. ఊళ్లోకి వెళ్లినప్పుడల్లా వాళ్లు భయపడేవారు" అని గ్వెన్ వివరించారు.

నికోలా రెసిపీ పుస్తకం

ఫొటో సోర్స్, DROITS RÉSERVÉS

ఫొటో క్యాప్షన్, నికోలా రెసిపీ పుస్తకం

హెలెన్‌కు, లోన్‌కు జర్మన్ తెలుసు కాబట్టి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి పడుకోవడానికి కాస్త చోటిమ్మని అడిగేవారు. ఆహారం అడిగి తినేవారు.

"అయితే, అంతా బాగానే ఉన్నట్లు వాళ్లు నటించేవారు. భయాన్ని దాచిపెట్టి ఏమీ జరగనట్టు మామూలుగా వెళ్లి గ్రామస్థులను సహాయం అడిగేవారు."

అలా మెల్లగా ముందుకు కదులుతూ వారు సాహసయాత్ర చేశారు. చిట్టచివరికి జర్మనీలోని సాక్సోనీలో ముల్డే నదికి అవతలి వైపున ఫ్రంట్ లైన్ అమెరికన్ సైనికులు ఉన్నారని వారికి తెలిసింది. ఇక అదే ఆఖరు అడ్డంకి. అది దాటిపోతే స్వేచ్ఛ పొందినట్లే.

ఈ తొమ్మిది మంది మహిళల గురించి సైనిక దస్తావేజుల నుంచి, వారిలో కొందరు రాసుకున్న స్వీయగాథల నుంచి, లోన్ కథపై పరిశోధనలు జరిపిన ఫిల్మ్‌మేకర్స్ నుంచి, ఆ మహిళల కుటుంబాలతో మాట్లాడి సమాచారం సేకరించారు గ్వెన్.

"ఇవన్నీ తెలిశాక, ముల్డే నది మీద వంతెనపై నిల్చుని ఆ నదిని చూస్తుంటే చాలా బాధ కలిగింది. మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించింది" అని గ్వెన్ అన్నారు.

తప్పించుకునే మార్గంలో ఆ నదిని దాటడమే వారికి అత్యంత కష్టమైన, బాధాకరమైన క్షణం.

నదిని దాటేసరికి వారు పూర్తిగా అలిసిపోయారు. ఇక ముందుకు వెళ్లలేమేమోనని వారిలో కొందరు భయపడ్డారు. జాకీకి ఊపిరి అందలేదు. కానీ, ఎవరూ వెనక్కు ఉండిపోవడానికి వీల్లేదని వారు నిశ్చయించుకున్నారు. ఇంతలో వారి వైపుకు ఒక జీపు వచ్చింది. అందులోంచి ఇద్దరు అమెరికన్ సైనికులు బయటకు దూకి, వారిని రక్షించారు.

2019 లో లెబాన్ చాటెనీ

ఫొటో సోర్స్, FRANCE LEBON CHÂTENAY DUBROEUCQ

యుద్ధం తరువాత ఆ మహిళలు మామూలు జీవితానికి తిరిగి రావడానికి ఎంత కష్టపడ్డారో తన పరిశోధనలో తెలిసిందని గ్వెన్ వెల్లడించారు.

"వారిని నిస్సత్తువ ఆవహించింది. పరిస్థితి ఘోరంగా ఉంది. శిబిరంలో ఉన్న మహిళగా ఒక రకమైన అవమానం, ఒంటరితనం కూడా వారిని చుట్టుముట్టాయి."

"వాళ్లు చాలా ట్రామాకు గురయ్యారు. ఎవరూ వారితో మాట్లాడక, వారు ఎవరితోనూ తమ బాధలు చెప్పుకోలేక అవస్థ పడ్డారు. వాళ్లను యుద్ధంలో పోరాడిన సైనికులుగా ఎవరూ గుర్తించలేదు. వారు పడ్డ కష్టానికి గుర్తింపు లేదు."

వాళ్లు యువతులు కావడంతో యుద్ధం తరువాత పెదవి విప్పవద్దని, తమ కథలను ఎవరితోనూ చెప్పుకోవద్దని తరచూ వారికి చెప్పేవారు. అలా వారి సాహసం గుర్తింపునకు నోచుకోకుండా చరిత్రలో కలిసిపోయిందని గ్వెన్ అన్నారు.

కొంతమంది మహిళలు తమ గతాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ, గుయిగుయి, మెనా లాంటివాళ్లు మాత్రం జీవితాంతం తమ స్నేహాన్ని కొనసాగించారు.

"మా అమ్మమ్మ తన కథ నాకు చెప్పిన తరువాత, మళ్లీ స్నేహితులందరూ కలుసుకున్నారు. అప్పటికి వారంతా చాలా పెద్దవాళ్లయిపోయారు."

ప్రాణాలతో బయటపడిన తరువాత జింకా తన పాప ఫ్రాన్స్ కోసం మూడేళ్లు వెతికారు.

వీడియో క్యాప్షన్, హోలోకాస్ట్

"చాల విచిత్రంగా, యాదృచ్చికంగా నేను ఫ్రాన్స్‌ను కలిశాను. మా ఇంటికి ఫ్రాన్స్ ఇల్లు దగ్గరే. ఆమెను చూడ్డానికి వాళ్లింటికి వెళ్లాను. '70 ఏళ్ల తరువాత నా తల్లి గురించి నాకివన్నీ తెలిశాయి' అని ఆమె నాతో అన్నారు" అని గ్వెన్ చెప్పారు.

యుద్ధం తరువాత ఫ్రాన్స్ తన తల్లి జింకా దగ్గరకు వచ్చేశారు. కానీ, అప్పటికే జింకా ఆరోగ్యం బాగా పాడైపోయింది. క్షయ వ్యాధికి చికిత్సతో పాటు పలు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్ ఆలనాపాలనా చూసుకోలేక ఆమెను ఇతర కుటుంబ సభ్యుల దగ్గరకు పంపేవారు.

1978లో జింకా మరణించారు. కానీ, ఫ్రాన్స్‌కు జింకా గత జీవితం గురించి ఏమీ తెలీదు.

"తన తల్లికి తానేంత ముఖ్యమో ఫ్రాన్స్‌కు తెలీదు. తన పాప కోసమే జింకా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారని ఆమెకు తెలీదు."

2012లో హెలెన్ కన్నుమూశారు. జీవితపు చివరి దశలో కూడా హెలెన్ అప్పటి రోజులను తలుచుకుని భయపడేవారని గ్వెన్ తన పుస్తకంలో రాశారు.

"మహిళలు కూడా యుద్ధ భారాన్ని మోశారు. ఎన్నో రకాల గాయాలను భరించారు. వారి సాహసాన్ని, త్యాగాలను ప్రపంచం గుర్తించాలి" అంటారు గ్వెన్.

అంతే కాకుండా, వాళ్లంతా ఎంతో దయాగా, సహానుభూతితో ఒకరికొకరు అండగా నిలబడ్డారు. దాన్ని కూడా మనం గుర్తించాలని గ్వెన్ అన్నారు.

తన అమ్మమ్మ కథతో గ్వెన్ 'ది నైన్' అనే పుస్తకం రాశారు.

పిక్చర్ క్రెడిట్స్: హెలెన్ పోడ్లియాస్కీ: మార్టిన్ ఫోర్‌కాట్ సౌజన్యం; సుజానే మౌడెట్ (జాజా): ఆమె కుటుంబం సౌజన్యం; నికోల్ క్లారెన్స్: అన్ని డ్రాయిట్స్ రిజర్వ్స్; జాక్వెలిన్ ఆబెరీ డు బౌలీ (జాకీ): మిచెల్ లెవీ సౌజన్యం; మాడెలాన్ వెర్‌స్టిజ్నెన్ (లోన్): ప్యాట్రిసియా ఎలిసబెత్ ఫ్రెడెరిక్ వెన్‌సింక్, వ్లాదిమిర్ ష్రెయిబర్ సౌజన్యం; రెనీ లెబోన్ చాటేనే (జింకా): ఫ్రాన్స్ లెబోన్ చాటేనే డుబ్రోయుక్ సౌజన్యం; వైవోన్నే లే గిల్లౌ (మెనా): జీన్-లూయిస్ లెప్లాట్రే సౌజన్యం: జోసెఫిన్ బోర్డనావా (జోసీ): ఆమె కుటుంబం, లెస్ అమిస్ డి లా ఫోండేషన్ పోర్ లా మెమోయిర్ డి లా డిపోర్టేషన్ డి ఎల్'అల్లియర్ సౌజన్యంతో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)