హౌరా రైల్వే స్టేషన్‌: 90 ఏళ్ల కిందట భారత్‌లో జరిగిన ఒక దారుణ బయో మర్డర్ కుట్ర

అమరేంద్ర చంద్ర పాండే
ఫొటో క్యాప్షన్, అమరేంద్ర చంద్ర పాండే
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది నవంబర్ 26, 1933. నేటి పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా (అప్పట్లో కలకత్తా) నగరంలోని హౌరా రైల్వేస్టేషన్‌. మధ్యాహ్నం పూట ప్రయాణికులతో రద్దీగా ఉంది. జమీందారీ కుటుంబానికి చెందిన యువకుడొకరు స్టేషన్‌లోకి అడుగు పెడుతున్నారు. ఆయన పేరు అమరేంద్ర చంద్ర పాండే.

ఆయన అలా స్టేషన్‌లోకి వస్తుండగానే కుడి చేతి మీద ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడంలో పక్కకు తిరిగి చూశారు. ఖాదీ దుస్తులు వేసుకుని తన పక్కనుంచే వెళ్లిన ఓ వ్యక్తి వడివడిగా నడుచుకుంటూ జనంలో కలిసిపోయాడు. కుడి చేతి మీద ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడంతోపాటు నొప్పిగా అనిపించింది.

అమరేంద్ర ప్రస్తుత జార్ఖండ్‌ రాష్ట్రంలో ఉన్న పాకూర్‌ జిల్లాలోని తన ఎస్టేట్‌కు వెళ్లేందుకు హౌరా స్టేషన్‌కు వచ్చారు.

"నన్నెవరో సూదితో గుచ్చారు" అని పెద్దగా అరిచారు అమరేంద్ర. పక్కనే ఉన్న ఆయన బంధవులు, స్నేహితులు వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళదామని, బ్లడ్ టెస్ట్ చేయించడం మంచిదని సూచించారు. ఆయన డాక్టర్ దగ్గరకు వెళదామని అనుకుంటున్న సమయంలోనే ఆయన సవతి సోదరుడు బినోయేంద్ర అక్కడ ఎంట్రీ ఇచ్చారు.

డాక్టర్‌ వద్దకు వెళదామనుకుంటున్న తమ్ముడి ప్రయత్నాలకు అడ్డుతగిలారు. ఇంత చిన్న విషయానికి ఆసుపత్రి దాకా వెళ్లడం అవసరమా అని సర్ది చెప్పారు. రైలుకు ఆలస్యమవుతుందని చెప్పి పంపించి వేశారు.

పాకూర్‌లోని తన ఎస్టేట్‌కు వెళ్లిన అమరేంద్ర జ్వరం రావడంతో, మూడు రోజుల తర్వాత తిరిగి కలకత్తా వచ్చారు. ఆయన్ను పరీక్షించిన వైద్యుడొకరు ఆయన చేతి మీద సూదిలాంటి వస్తువుతో ఏర్పడిన ఒక చిన్న గాయాన్ని పరిశీలించి, ఇది హైపోడెర్మిక్ సూది (ఇంజెక్షన్లు చేసే సూది) వల్ల ఏర్పడ్డ గాయంలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత కొద్దిరోజులపాటు అమరేంద్ర తీవ్రజ్వరంతో బాధపడ్డారు. ఆయన పొట్ట ఉబ్బిపోయింది. ఆయన ఊపిరితిత్తుల వరకు ఇన్‌ఫెక్షన్‌ పాకినట్లు తేలింది. డిసెంబర్‌ 3వ తేదీన అమరేంద్ర కోమాలోకి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం చనిపోయారు.

అమరేంద్ర న్యుమోనియాతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కానీ, ఆయన మరణం తర్వాత వచ్చిన ల్యాబ్ రిపోర్టులు, రక్తంలో ప్లేగుకు కారణమయ్యే ప్రాణాంతక బ్యాక్టీరియా ‘యెర్సినియా పెస్టిస్’ ఉందని తేల్చాయి.

అమరేంద్ర హత్య పథకం అమలైన హౌరా రైల్వే స్టేషన్

ఫొటో సోర్స్, EASTERN RAILWAY

ఫొటో క్యాప్షన్, అమరేంద్ర హత్య పథకం అమలైన హౌరా రైల్వే స్టేషన్

ప్లేగ్ వ్యాధి ఎలా సోకింది?

ఎలుకలు, ఈగలు ద్వారా వ్యాపించే ప్లేగు 1896-1918 సంవత్సరాల మధ్య భారత ఉపఖండంలో దాదాపు కోటీ ఇరవై లక్షలమంది మరణానికి కారణమైంది. 1929-1938 మధ్య కాలంలో ప్లేగు మరణాలు 50 లక్షలకు తగ్గాయి. అమరేంద్ర మరణానికి ముందు మూడేళ్ల కాలంలో కలకత్తా నగరంలో ఒక్క ప్లేగు కేసు కూడా నమోదు కాలేదు. కానీ, అమరేంద్ర రక్తంలో ప్లేగు బ్యాక్టీరియా లక్షణాలు కనిపించాయి.

ఒక సంపన్న జమీందార్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అప్పట్లో దేశంలోనూ, దేశం వెలుపలా సంచలనంగా మారింది. దీనిని "ఆధునిక ప్రపంచ చరిత్రలో వ్యక్తిగత బయోటెర్రరిజం తొలి కేసులలో ఒకటి" అని కొందరు అభివర్ణించారు.

అప్పట్లో వార్తా పత్రికలు కూడా ఈ కేసును ప్రముఖంగా కవర్‌ చేశాయి. Murder with germs పేరుతో టైమ్‌ మ్యాగజీన్ ఒక కథనం ప్రచురించింది. సింగపూర్‌కు చెందిన స్ట్రైయిట్స్‌ టైమ్స్‌ పత్రిక దీనిని "Punctured arm mystery" అని పేరుతో ఈ వ్యవహారాన్ని ప్రచురించింది.

కలకత్తా పోలీసుల పరిశోధనలు ఈ కుట్రకు అక్కడికి సుమారు 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబేలోని ఓ ప్రయోగశాలలో మూలాలు ఉన్నట్లు అనుమానించాయి. ఓ లేబరేటరీ నుంచి ప్రాణాంతకమైన ప్లేగ్‌ బ్యాక్టీరియాను హంతకులు సేకరించినట్లు గుర్తించారు.

ఈ హత్యకు కారణం పాకూర్‌ జమీందారి వారసుల మధ్య వారసత్వ కలహాలే కారణం.

తండ్రి మరణంతో ఆయన వారసత్వం గురించి అమరేంద్రకు, ఆయన సవతి సోదరులకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ వివాదాలే అమరేంద్ర హత్యకు దారి తీసి ఉంటాయని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.

పత్రికా కథనాలలో ఒకదాని ప్రకారం, "అమరేంద్ర క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. పెద్ద చదువులు చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవాడు. స్థానికులలో చాలామంది ఆయనను బాగా ఇష్ట పడేవారు. అందుకు విరుద్ధంగా ఆయన సవతి సోదరులు తాగుడు, వ్యభిచారానికి బానిసలై విచ్చలవిడి జీవితం గడపుతుండేవారు"

1930లలో ప్లేగ్ వ్యాధి కారణంగా లక్షలమంది భారతీయులు మరణించారు.

ఫొటో సోర్స్, CULTURE CLUB/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1930లలో ప్లేగ్ వ్యాధి కారణంగా లక్షలమంది భారతీయులు మరణించారు.

బలపడిన అనుమానాలు

ఈ కేసుకు సంబంధించిన కోర్టు పత్రాల ప్రకారం, 1932 నుంచే బెనోయేంద్ర సన్నిహితుడు, వైద్యుడు కూడా అయిన డాక్టర్ తారానాథ్ భట్టాచార్య, మెడికల్ లేబరేటరీల నుంచి ప్లేగ్‌ బ్యాక్టీరియాను తెప్పించి అమరేంద్రను చంపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే, అంతకు ముందు కూడా అమరేంద్రను చంపడానికి బెనోయేంద్ర ప్రయత్నించారని చెబుతారు. కానీ, దానికి సరైన ఆధారాలు లేవు.

అమరేంద్ర, బెనోయేంద్ర ఓసారి ఒక హిల్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, బెనోయేంద్ర అమరేంద్రకు ఒక కళ్లజోడు ఇచ్చారని, తర్వాత దాన్ని గట్టిగా నొక్కి ముఖం మీదనే పగలగొట్టేందుకు ప్రయత్నించారని, దీంతో అమరేంద్రకు గాయాలయ్యాయని అప్పటి బ్రిటీష్ ఆరోగ్య అధికారి డీపీ లాంబెర్ట్ ఓ నివేదికలో పేర్కొన్నారు.

అమరేంద్ర అస్వస్థతకు గురికావడం, టెటనస్‌ సోకినట్లు తేలడంతో ఈ కళ్లద్దాలకు అనుమానాస్పద బ్యాక్టీరియ ఉండి ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. వెంటనే యాంటీ టెటనస్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడంతో అమరేంద్ర కోలుకున్నారు.

అయితే, చికిత్స జరుగుతున్న సమయంలో డాక్టర్లను మార్చాలని బెనోయేంద్ర తీవ్రంగా ప్రయత్నించినా అది కుదర లేదని డాక్టర్‌ లాంబెర్ట్‌ పేర్కొన్నారు.

తర్వాత సంవత్సరాలలో కూడా అమరేంద్రను చంపేందకు బెనోయేంద్ర ప్రయత్నాలు సాగించినట్లు చెబుతారు. ఓ పక్క ఎస్టేట్‌ను ఆక్రమించుకునేందుకు బెనోయేంద్ర ప్రయత్నాలు చేస్తుండగానే, అతని డాక్టర్‌ మిత్రుడు తారానాథ్‌ భట్టాచార్య ప్లేగ్‌ బ్యాక్టీరియా ను సంపాదించడానికి కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారు.

వీడియో క్యాప్షన్, భయపెడుతున్న బ్యుబోనిక్ ప్లేగు
హంతకులు ప్లేగ్ బ్యాక్టీరియాను సేకరించడానికి ప్రయత్నించిన హాఫ్‌కిన్ లేబరేటరీ భవనం

ఫొటో సోర్స్, WELLCOME TRUST

ఫొటో క్యాప్షన్, హంతకులు ప్లేగ్ బ్యాక్టీరియాను సేకరించడానికి ప్రయత్నించిన హాఫ్‌కిన్ లేబరేటరీ భవనం

కొనసాగిన కుట్రలు

1932 మే నెలలో భట్టాచార్య బాంబేలోని హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ను సంప్రదించారు. భారతదేశంలో ప్లేగ్‌ బ్యాక్టీరియా భద్రపరిచిన ప్రయోగశాల అది. అయితే, బెంగాల్ సర్జన్-జనరల్ అనుమతి లేనిదే ల్యాబ్ నుంచి ఏదీ ఇవ్వలేమని లేబరేటరీ డైరక్టర్‌ స్పష్టం చేశారు.

అదే నెలలో, భట్టాచార్య కోల్‌కతాలోని ఒక వైద్యుడిని సంప్రదించి, తాను ప్లేగు వ్యాధికి మందు కనిపెట్టానని, బ్యాక్టీరియా పై పరీక్షించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ డాక్టర్ తన లేబరేటరీలో పరీక్షలు చేసుకునేందుకు భట్టాచార్యకు అనుమతి ఇచ్చారని కోర్టు రికార్డులు పేర్కొంటున్నాయి.

అయితే, హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ నుండి పొందిన బ్యాక్టీరియపై మాత్రం ప్రయోగానికి సదరు డాక్టర్ అంగీకరించలేదు. డాక్టర్‌ లాంబెర్ట్ ప్రకారం, బ్యాక్టీరియాను పెంచడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో తారానాథ్ భట్టాచార్య ప్రయత్నాలు ఆగిపోయాయి.

1933 లో భట్టాచార్య తిరిగి ఆ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి, ప్లేగ్‌ మందును బాంబేలో ప్రయోగాలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా హాఫ్‌కిన్‌ లేబరేటరీలో లేఖ రాయాలని కోరారు.

అదే సంవత్సరం వేసవిలో బెనోయేంద్ర బాంబే వెళ్లి అక్కడ భట్టాచార్యను కలిశారు. ప్లేగ్‌ బ్యాక్టీరియాను అక్రమంగా బైటికి తీసుకురావడానికి ఇద్దరు వెటర్నరీ సర్జన్లకు లంచం ఇచ్చేందుకు బెనోయేంద్ర ప్రయత్నించారు.

వారిని నమ్మించేందుకు మార్కెట్‌ నుంచి ఎలుకలను కొనుక్కుని వచ్చి, తాము నిజంగా పరీక్షలు చేస్తున్నామని ఆ ఇద్దరు సర్జన్లతో నమ్మబలికారు.

దీనితో నమ్మకం కుదిరిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆర్థర్ రోడ్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్‌కు వారిని తీసుకువెళ్లారు. అక్కడ కూడా ప్లేగ్‌ బ్యాక్టీరియాను భద్రపరిచి ఉంచేవారు.

తన డాక్టర్‌ మిత్రుడు ప్లేగ్‌ వ్యాధికి మందును కనుగొన్నాడనీ, ప్రయోగాలు చేయడానికి అవసరమైన ప్లేగ్‌ బ్యాక్టీరియను ఇవ్వాల్సిందిగా అక్కడి అధికారులను బెనోయేంద్ర కోరినట్లు కోర్టు పత్రాలలో ఉంది. భట్టాచార్య ల్యాబ్‌లో ప్రయోగాలు చేశాడనటానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.

ప్రయోగశాలలో ప్రవేశం లభించిన ఐదు రోజుల తర్వాత, భట్టాచార్య అకస్మాత్తుగా తన పనిని ముగించుకుని, బెనోయేంద్రతో కలిసి కలకత్తాకు తిరిగి వచ్చారు.

ఎలుకలు ఈగల ద్వారా ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలుకలు ఈగల ద్వారా ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తుంది

బైటపడిన నేరం

హత్య జరిగిన మూడు నెలల తర్వాత, 1934 ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారులు బెనోయేంద్ర ట్రావెల్‌ టిక్కెట్లు, బాంబేలో అతని హోటల్ బిల్లులు, హోటల్ రిజిస్టర్‌లో అతని చేతితో రాసిన ఎంట్రీలు, ల్యాబ్‌కు అతను పంపిన లేఖలు, ఎలుకలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదులను ట్రాక్ చేశారు.

తొమ్మిది నెలలపాటు విచారణ జరిగింది. ఎలుకను కుట్టిన ఈగ అమరేంద్రను కుట్టడం వల్ల ఆయనకు ప్లేగ్‌ వ్యాధి సోకిందని బెనోయేంద్ర తరఫు లాయర్లు వాదించారు.

అయితే, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న బెనోయేంద్ర, తారానాథ్‌ భట్టాచార్యలు బాంబే వెళ్లి అక్కడ ప్లేగ్‌ వ్యాధి బ్యాక్టీరియాను దొంగిలించారని, దానిని హత్య జరిగిన నవంబర్‌ 26, 1933 వరకు కలకత్తాలో దాచారని సాక్ష్యాధారాల ద్వారా రుజువైంది.

బెనోయేంద్ర, భట్టాచార్యలు కిరాయి హంతకుడితో అమరేంద్రను చంపడానికి కుట్ర పన్నారని నమ్మిన ట్రయల్ కోర్టు ఇద్దరికీ మరణశిక్ష విధించింది.

కానీ, 1936 జనవరిలో, కలకత్తా హైకోర్టు, ఈ శిక్షలను యావజ్జీవంగా మార్చింది. సాక్ష్యాలు లేకపోవడంతో ఈ హత్య కేసులో అరెస్టయిన మరో ఇద్దరు వైద్యులను నిర్దోషులుగా విడుదల చేశారు. " బహుశా ఈ కేసు నేర చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనది" అని దీనిని విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, కరోనా నాలుగో వేవ్.. దేశానికే అవమానకర రీతిలో వ్యాక్సీన్లు వేయించుకోని ప్రజలు
1890లలో ప్లేగ్ వ్యాధి వ్యాపించిన సమయంలో ఓ బెంగాలీ గ్రామం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1890లలో ప్లేగ్ వ్యాధి వ్యాపించిన సమయంలో ఓ బెంగాలీ గ్రామం

అత్యాధునిక హత్య

ఈ హత్య ఘటనపై రాసిన "ది ప్రిన్స్ అండ్ ది పాయిజనర్" అనే పుస్తకంపై పరిశోధిస్తున్న అమెరికన్ జర్నలిస్ట్ డాన్ మోరిసన్ బెనోయేంద్ర గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

"బెనోయేంద్ర అత్యాధునిక కాలపు మనిషి. ఆయన తన తెలివితో అప్పటికి భారతదేశం మీద అధికారం చెలాయిస్తున్న విక్టోరియన్‌ సంస్థలను కూడా మోసం చేయడానికి ప్రయత్నించాడు" అని నాతో అన్నారు.

రైల్వే స్టేషన్‌లో జరిగిన హత్య పూర్తిగా ఆధునిక హత్య అని మోరిసన్‌ అభిప్రాయపడ్డారు.

క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ధం నుంచే బయో వెపన్స్‌ (జీవాయుధాలు)ను వాడుతున్నట్లు చరిత్ర ఆధారాలున్నాయి. కానీ అమరేంద్ర హత్య ఇందుకు పూర్తిగా భిన్నం. ఇది ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌, తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్‌ పై 2017లో కౌలాలంపూర్ ఎయిర్‌ పోర్టులో జరిపిన హత్యకూ, దీనికీ పోలిక ఉంది.

ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కిమ్ జోంగ్ నామ్ ముఖం పై ప్రాణాంతక నర్వ్‌ ఏజెంట్‌ను రుద్దారు. దీంతో ఆయన కాసేపటికే మరణించారు.

దాదాపు చరిత్ర మర్చిపోయిన ఈ హౌరా రైల్వే స్టేషన్ మర్డర్‌ ప్లాట్‌లో యువ జమీందారును చంపిన వ్యక్తి ఎవరు, అతను వాడిన హైపోడెర్మిక్‌ సూది ఎక్కడుంది అన్నది మాత్రం తేలలేదు.

వీడియో క్యాప్షన్, కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)