చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?

- రచయిత, డేవిడ్ బ్రౌన్
- హోదా, బీబీసీ న్యూస్
చైనా విపరీతంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోంది. మిసైల్ టెక్నాలజీ, అణ్వస్త్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...తదితర రంగాలలో వేగంగా ముందుకు సాగుతోంది.
చైనా కదలికలను పశ్చిమ దేశాలు సీరియస్‌గా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈ చర్యలన్నీ సైనిక శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమతుల్యతను మార్చే అవకాశం ఉంది.
2035 నాటికి అత్యాధునిక సైనిక శక్తిగా మారాలని అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చైనా సైన్యాన్ని ఆదేశించారు. వరల్డ్ క్లాస్ సైనిక సంపత్తిగా మారి, 2049నాటికి యుద్ధాలు చేసి గెలిచేలా సిద్ధం కావాలని సూచించారు.
ఇది చాలా పెద్ద సవాలే అయినా, ఆ దేశం ఆ దిశగా పని చేసుకుంటూ పోతోంది.
భారీగా రక్షణ రంగ ఖర్చులు
రక్షణ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని అంతర్జాతీయ నిపుణులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అందించే సమాచారంలో కూడా స్థిరత్వం ఉండటం లేదని అంటున్నారు.
రక్షణ ఖర్చులను చైనా ప్రకటిస్తున్నప్పటికీ, చెబుతున్నబడ్జెట్‌కన్నా ఎక్కువే ఉంటుందని పశ్చిమ దేశాల సందేహం. అమెరికా తప్ప మిగతా ఏ దేశంతో పోల్చినా చైనా రక్షణ వ్యయం ఎక్కువేనని నిపుణులు భావిస్తున్నారు.

పోగుపడనున్న అణునిల్వలు
ఈ దశాబ్దం చివరి నాటికి చైనా అణు నిల్వలు నాలుగు రెట్లు పెంచుతుందని యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఈ ఏడాది నవంబర్‌లో అంచనా వేసింది. 2030నాటికి చైనా దగ్గర కనీసం 1,000 వార్‌హెడ్‌లు ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
అయితే, ఈ అంచనాలను చైనా ప్రభుత్వ మీడియా తప్పుబట్టింది. ఇది పక్షపాతంతో కూడుకున్నా, నిరాధారపూరిత అంచనా అని పేర్కొంది. అవసరమైన మేరకే తమ వద్ద అణ్వస్త్రాలున్నాయని స్పష్టం చేసింది.
అయితే, ఇటీవలి సంవత్సరాలలో చైనా తన వార్‌హెడ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు, ప్రపంచ అణు నిల్వల వార్షిక అంచనాలను ప్రచురించే నిపుణులు వెల్లడించారు.
అమెరికా దగ్గరున్న 5,550 వార్‌హెడ్‌లతో పోల్చుకుంటే చైనా దగ్గర ఉన్నవి తక్కువే. కానీ, చైనా వాటిని పెంచుకుంటున్న తీరును చూసి పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
"చైనా అణ్వాయుధాలు అత్యంత ముఖ్యమైన సమస్య" అని లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన వీర్లే నౌవెన్స్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, GREG BAKER/AFP VIA GETTY IMAGES
హైపర్సోనిక్ ఆయుధాల భవిష్యత్తు
హైపర్సోనిక్ క్షిపణులు ధ్వని కంటే ఐదురెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులంత వేగవంతమైనవి కాకపోయినా, వాటిని గుర్తించడం చాలా కష్టం. పైగా అవి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పని చేయకుండా చేస్తాయి.
'' మనం చాలా వెనకబడ్డాం అని చైనీయులు అర్ధం చేసుకున్నారు. అందుకే ఇతర దేశాలకంటే అత్యాధునిక ఆయుధాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు'' అని లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జెనో లియోని అన్నారు.
"హైపర్‌సోనిక్ క్షిపణులను డెవలప్ చేయడం అలాంటి ప్రయత్నాల్లో ఒకటి"అని లియోని వ్యాఖ్యానించారు.
హైపర్‌సోనిక్ మిసైళ్లను పరీక్షించారన్న వాదనను చైనా తిరస్కరించింది. అయితే, గత వేసవిలో చేసిన రెండు రాకెట్ ప్రయోగాలు, ఆ ఆయుధాలను సాధించే ప్రయత్నంలో భాగమని పాశ్చాత్య నిపుణులు భావిస్తున్నారు.
అయితే, చైనా ఎలాంటి ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుందో స్పష్టంగా తెలియదు. ఇందులో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి:
1. హైపర్సోనిక్ గ్లైడ్ మిసైళ్లు భూ వాతావరణంలోనే ఉంటాయి
2. ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబర్‌మెంట్ సిస్టమ్స్ (FOBS) లక్ష్యం వైపు వేగంగా వెళ్లడానికి తక్కువ ఎత్తులోనే ఎగురుతాయి
FOBSలు విన్యాసాలు చేయగల వ్యోమనౌక నుండి హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించి, రెండు వ్యవస్థలను ఒకే చోట పని చేయించడంలో చైనా విజయం సాధించే అవకాశం ఉంది.
హైపర్‌సోనిక్ క్షిపణులు తమంతట తాముగా గేమ్-ఛేంజర్‌లు కాకపోయినా, అవి కొన్ని లక్ష్యాలను ప్రమాదంలో పడేస్తాయని డాక్టర్ లియోని చెప్పారు.
"ఈ హైపర్సోనిక్ క్షిపణులు విమాన వాహక నౌకలను రక్షించే ప్రయత్నాలను అడ్డుకుంటాయి"అని లియోనీ చెప్పారు.
అయితే, మిలిటరీ స్పేస్ టెక్నాలజీకి ఫైనాన్సింగ్‌ను వీలైనంత పెంచడానికి ప్రయత్నిస్తున్న కొందరు పాశ్చాత్య దేశాల అధికారులు, చైనా ఆయుధాలతో కలిగే ప్రమాదాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని లియోని అనుమానిస్తున్నారు.
''ప్రమాదం ఉంది. కానీ, దాన్ని అతిశయంగా చెబుతున్నారు'' అన్నారాయన.

కృత్రిమ మేధస్సు, సైబర్ దాడులు
చైనా ఇప్పుడు మేధో యుద్ధం లేదా, అంతరాయం కలిగించే టెక్నాలజీ(disruptive technologies)ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని యు.ఎస్.డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ అభిప్రాయపడింది.
"సివిల్-మిలిటరీ ఫ్యూజన్" ద్వారా, ఈ టెక్నాలజీని సాధించేందుకు ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం ఇవ్వాలని చైనా అకాడెమీ ఆఫ్ మిలిటరీ సైన్స్‌కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
చైనా ఇప్పటికే మిలిటరీ రోబోటిక్స్, మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్‌తో పాటు, మానవరహిత విమానాలు, నౌకలలో కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇటీవలి నిపుణుల అంచనా ప్రకారం, చైనా ఇప్పటికే విదేశాలలో పెద్ద ఎత్తున సైబర్-ఆపరేషన్లను నిర్వహించింది.
జూలైలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ సర్వర్‌లను లక్ష్యంగా చేసుకుని భారీ సైబర్ ఎటాక్ చేసిందని అమెరికా, బ్రిటన్, యూరోపియన్‌లు ఆరోపించాయి.
ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా కనీసం 30,000 సంస్థలు ప్రభావితమయ్యానని, వ్యక్తిగత సమాచారం, మేధో సంపత్తిని స్వాధీనం చేసుకోవడంతో సహా పెద్ద ఎత్తున గూఢచర్యం కోసం చైనా ఈ పని చేసిందని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా నౌకాదళం: ప్రపంచంలోనే అతి పెద్దది, కానీ....
ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళంగా చైనా అమెరికాను అధిగమించింది. అయితే నౌకల సంఖ్య ఒక్కటే ముఖ్యం కాదని, సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు చాలా అంశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ట్రెండ్స్‌ను పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుందని వారు అంటున్నారు.
ప్రస్తుతానికి, అమెరికా నౌకాదళం ప్రపంచంలోనే అతి శక్తివంతమైనా, సమర్ధవంతమైన నౌకాదళంగా గుర్తింపు పొందింది.
చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు ఉండగా, అమెరికా దగ్గర అలాంటివి 11 ఉన్నాయి. అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, భారీ యుద్ధనౌకలు అమెరికా సొంతం.
అయితే, చైనా తన నౌకా దళాన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది.
సముద్రంపై ఎదురవుతున్న సమస్యలకు చెక్ చెప్పడానికి తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకోవడం చైనాకు అత్యావశ్యకమని భావిస్తున్నానని బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాజీ సీనియర్ కల్నల్ జౌ బో అన్నారు.
''మాకున్న అతి పెద్ద సమస్య ఏంటంటే, చైనా జలాల్లోకి వచ్చి మరీ అమెరికా రెచ్చగొడుతోంది'' అని ఆయన పేర్కొన్నారు.
2020-2040 మధ్య కాలంలో చైనా నౌకాదళంలోని నౌకల సంఖ్య 40శాతం పెరుగుతుందని అమెరికా నౌకాదళం అంచనా వేస్తోంది.

భవిష్యత్తు అగమ్యగోచరం
కేవలం ఘర్షణ కాకుండా, భయపెట్టే దిశగా చైనా అడుగులు వేస్తోందా? ''యుద్ధం లేకుండానే గెలవాలి'' అన్న విధానాన్ని చైనా ఇప్పటికీ నమ్ముతోందని డాక్టర్ లియోని అన్నారు.
అయితే, భవిష్యత్తులో చైనా తన వ్యూహాన్ని మార్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
''పూర్తిగా ఆధునీకరించిన నౌకాదళ శక్తిగా మారడం ఒక చిన్న విషయం మాత్రమే'' అని లియోనీ వ్యాఖ్యానించారు.
అయితే, పాశ్చాత్య దేశాల భయాలు నిరాధారమైనవని సీనియర్ కల్నల్ జౌ స్పష్టం చేశారు.
"అమెరికా లాగా ప్రపంచానికి పోలీస్‌లా వ్యవహరించాలని చైనాకు లేదు. బలమైన దేశంగా మారినప్పటికీ, చైనా తన ప్రాథమిక విధానాలను కొనసాగిస్తుంది" అని ఆయన చెప్పారు.
1979లో వియత్నాంతో యుద్ధం తర్వాత మళ్లీ చైనా యుద్ధం చేయలేదు. దాని సైనిక సామర్థ్యాలలో చాలా వరకు పరీక్షించుకోలేదు. ఇదే విధానాన్ని కొనసాగాలని ఇటు చైనాలో, అటు పాశ్చాత్య దేశాలలో కోరుకుంటున్నారు.
( గ్రాఫిక్స్: సాండ్రా రోడ్రిగ్జ్ చిల్లిడా, జాయ్ రోక్సాస్, సీన్ విల్మట్)
ఇవి కూడా చదవండి:
- సినిమా టికెట్ల వివాదం: నటుడు నాని ఎందుకలా స్పందించారు? మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారు?
- కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












