అమెరికా - చైనా: నువ్వెంతంటే నువ్వెంత అనుకున్న అగ్ర దేశాలు... అలాస్కా అత్యున్నత స్థాయి సమావేశంలో మాటల యుద్ధం

అమెరికా, చైనా ప్రతినిధుల చర్చలు

ఫొటో సోర్స్, Reuters

అమెరికా, చైనా అధికారులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రపంచ మీడియా ముందు గంటకు పైగా ఒకరినొకరు విమర్శలు, ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

జో బైడెన్ ప్రభుత్వానికి - చైనా ప్రభుత్వానికి మధ్య మొట్టమొదటి ఉన్నత స్థాయి చర్చలు అలాస్కాలోని ఆంకరేజ్ నగరంలో శుక్రవారం జరిగాయి.

ఈ సందర్భంగా.. ''చైనా మీద దాడి చేయాల''ని వివిధ దేశాలను అమెరికా రెచ్చగొడుతోందని చైనా అధికారులు ఆరోపించగా.. గొప్పలు ప్రదర్శించుకోవటానికి చైనా ప్రాధాన్యం ఇస్తోందని అమెరికా అధికారులు ఎద్దేవా చేశారు.

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పటికన్నా ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయి.

షిన్‌జియాంగ్‌లో వీగర్ ముస్లింల పట్ల చైనా వ్యవహారం వంటి వివాదాస్పద విషయాలను లేవనెత్తుతామని అమెరికా ప్రతిన బూనింది.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకిన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్‌లు.. చైనా సీనియర్ విదేశాంగశాఖ అధికారి యాంగ్ జీచి, విదేశాంగ మంత్రి వాంగ్ యిల మధ్య ఈ వాగ్వాదం నడిచింది.

అయితే.. ఆ తర్వాత ఆంతరంగికంగా జరిగిన చర్చలు ''బలమైన అంశాల మీద, సీరియస్‌గా, నేరుగా'' జరిగాయని అమెరికా అధికారి ఒకరు చెప్పారు.

ఈ ఆంతరంగిక చర్చలు ప్రారంభం కావటానికి ముందు.. బ్లింకెన్ ప్రారంభ ప్రకటనలో ''షిన్‌జియాంగ్, హాంగ్ కాంగ్, తైవాన్‌లలో చైనా చర్యలు, అమెరికా మీద సైబర్ దాడులు, మా మిత్రదేశాలపై ఆర్థిక నిర్బంధం సహా అమెరికాకు గల తీవ్ర ఆందోళనలను చర్చిస్తాం'' అని నిర్మొహమాటంగా చెప్పారు.

జేక్ సల్లివన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చైనాతో అమెరికా ఘర్షణ కోరుకోవటం లేదని జేక్ సల్లివన్ (కుడివైపు వ్యక్తి) చెప్పారు

''ఈ చర్యలు ప్రతి ఒక్కటీ అంతర్జాతీయ సుస్థిరతను కాపాడే నియమాల ఆధారిత క్రమానికి చేటు చేస్తున్నాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

దీనికి యాంగ్ ప్రతిస్పందిస్తూ.. అమెరికా తన సైనిక బలాన్ని, ఆర్థిక ఆధిపత్యాన్ని ఇతర దేశాలను అణచివయటానికి ఉపయోగిస్తోందని ఆరోపించారు.

''సాధారణ వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవటానికి, చైనా మీద దాడి చేసేలా కొన్ని దేశాలను రెచ్చగొట్టటానికి అమెరికా తన కుహనా జాతీయ భద్రత భావనలను దుర్వినియోగం చేస్తోంది'' అని పేర్కొన్నారు.

అమెరికాలో మానవ హక్కులు అత్యంత దిగజారి ఉన్నాయని, నల్లజాతి అమెరికన్లను ''ఊచకోత కోస్తున్నార''ని కూడా ఆయన ఆరోపించారు.

దీనికి సల్లివన్ ఎదురు దాడి చేస్తూ.. చైనాతో ఘర్షణను అమెరికా కోరుకోవటం లేదన్నారు. అయితే.. ''మా సిద్ధాంతాలు, మా ప్రజలు, మా మిత్రుల కోసం మేం ఎల్లప్పుడూ నిలబడతాం'' అని చెప్పారు.

ప్రపంచ మీడియా ముందు ఇరు పక్షాలూ పరస్పరం గంట సేపటికి పైగా ఇలా మాటలతో దాడి చేసుకున్నాయి. మూడు విడతలుగా జరగాల్సిన చర్చల ప్రారంభానికి ముందు ఇది జరిగింది.

మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో గత జూన్‌లో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారి చర్చలు జరిగాయి. ఆ తర్వాత అమెరికా, చైనాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగటం ఇదే తొలిసారి.

line

అసాధారణ వాగ్వాదం: విశ్లేషణ

బార్బరా ప్లెట్ ఉషర్, అమెరికాలో విదేశాంగ శాఖ విలేకరి

ఈ రెండు దేశాల మధ్య దౌత్య చర్చల సందర్భగా పరస్పరం బహిరంగంగా ఈ స్థాయి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవటం అసాధారణం. దౌత్యనీతికి దూరం. ప్రత్యేకించి కొత్త నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా-అమెరికా సంబంధాలను సమీక్షించటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినపుడు ఇలా జరగటం ఆశ్చర్యం కలిగించే అంశం.

దీనికి ముందు కూడా బైడెన్ బృందం చైనాను బహిరంగంగా విమర్శించటంలో నిర్మొహమాటంగానే వ్యవహరిస్తోంది. కాబట్టి ఏం జరగవచ్చుననేది చైనా వారు ముందే ఊహించి.. ఎదురు దాడి చేయటానికి వారు సంసిద్ధమై వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ముఖ్యంగా చర్చలు ప్రారంభం కావటానికి ఒక రోజు ముందు అమెరికా తమ మీద ఆంక్షలు విధించటం పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారు. హాంగ్ కాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల వాదుల మీద చైనా విరుచుకుపడటానికి స్పందిస్తూ అమెరికా ఈ ఆంక్షలు విధించింది.

ఆందోళనకరమైన అంశాలపై తాము కఠినంగా వ్యవహరిస్తామని.. అయితే ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చైనాతో కలిసి పనిచేస్తామని బైడెన్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినప్పటికీ.. రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రజాస్వామ్యానికి, అధికార స్వామ్యానికి మధ్య భౌగోళిక రాజకీయ పోటీగా అభివర్ణించింది.

మరోవైపు.. తమ జాతీయ సార్వభౌమత్వం, భద్రతకు సంబంధించిన అంశాలపై తాము రాజీపడబోమని చైనా స్పష్టంచేసింది. ఇరు పక్షాల మధ్య సానుకూలమైన సహకారానికి వీలుకల్పించే అంశాలను గుర్తిస్తారా లేదా అనేది ఈ సంబంధం ఎలా ముందుకు వెళుతుందనేదానికి కొలబద్ద అవుతుంది.

line

సమావేశం ప్రారంభానికి ముందు ఇరు పక్షాలూ రెండు నిమిషాల సేపు ప్రారంభ ప్రకటన చేయాలనే ప్రొటోకాల్‌ను చైనా ఉల్లంఘించిందని ఆ తర్వాత అమెరికా ప్రతినిధి బృందం ఆరోపించింది.

''చైనా ప్రతినిధి బృందం గొప్పలు ప్రదర్శించటం మీద, చర్చల్లో సారం కన్నా కానీ జనం ముందు నాటకీయంగా వ్యవహరించటం మీద దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది'' అని వ్యాఖ్యానించింది. అయితే చర్చలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని చెప్పింది.

చైనా అధికారులు తమ ప్రభుత్వ మీడియా ద్వారా ప్రకటన చేస్తూ.. ప్రారంభ ప్రకటన విషయంలో సమయ పరిమితిని దాటిపోవటం ద్వారా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించింది అమెరికానేనని, చైనా కాదని ప్రత్యారోపణ చేసింది. చైనా అంతర్గత, విదేశీ విధానాల మీద అమెరికా నిరాధార దాడి చేస్తోందనీ వారు నిందించారు.

అయితే.. ''చైనా - అమెరికాల మధ్య గతంలో గల తీవ్ర ఇబ్బందులు కొనసాగరాదు'' అని యాంగ్ వ్యాఖ్యానించటం సానుకూల అంశం.

''21వ శతాబ్దపు అతిపెద్ద భౌగోళికరాజకీయ సవాలు''గా బైడెన్ అభివర్ణించిన అంశంపై ఆయన ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోందో చాటిచెప్పటానికి ఈ చర్చలు మొదటి అవకాశమని బీబీసీ ప్రతినిధి బార్బరా ప్లెట్ ఉషర్ పేర్కొన్నారు.

ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అట్టడుగు స్థాయికి దిగజారిన నేపథ్యంలో.. వాటిని పునరుద్ధరించాలని చైనా కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ''నిర్మాణాత్మక చర్చల''ను పునఃప్రారంభించటానికి చైనా సుముఖంగా ఉందని వాంగ్ ఉద్ఘాటించారు.

యాంగ్ జీచి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా తన తరహా ప్రజాస్వామ్యాన్ని విస్తరించటం ఆపాలని యాంగ్ జీచి (మధ్య వ్యక్తి) వ్యాఖ్యానించారు

చైనా, అమెరికాల మధ్య విభేదాలేమిటి?

రెండు దేశాల మధ్య విభేదాలు చాలానే ఉన్నాయి.

ఉదాహరణకు వాణిజ్యం ఒకటి. చైనా అన్యాయమైన విధానాలన అవలంబిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వటం, మేధో సంపత్తి హక్కులను దొంగిలించటం, తన కరెన్సీ విలువను తక్కువ స్థాయిలో ఉంచటం, వాణిజ్యానికి అవరోధాలు పెట్టటం వంటి అంశాలను ప్రస్తావిస్తోంది.

ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువుల మీద విధించిన భారీ వాణిజ్య సుంకాలను తొలగించాలని చైనా కోరుతోంది. హువే వంటి విజయవంతమైన చైనా టెక్ కంపెనీలను అమెరికా ''అణచివేస్తోంద''ని కూడా చైనా ఆరోపణ.

మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కూడా వివాదాస్పద అంశాలు. చైనాలోని షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ జనాభా నిర్మూలనకు చైనా పాల్పడుతోందని, హాంగ్ కాంగ్‌లో ప్రజాస్వామిక హక్కులను చైనా కొత్త భద్రతా చట్టాలతో కాలరాస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

అయితే అవి తమ అంతర్గత వ్యవహారాలని, అందులో జోక్యం చేసుకోవటం అమెరికా ఆపాలని చైనా చెప్తోంది. చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ మీద ''అమెరికా విషం చిమ్ముతోంద''ని కూడా మండిపడుతోంది.

అలాగే చైనా తన పరిధిలోని ప్రాంతంగా పరిగణిస్తున్న దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళ ఆక్రమణకు పాల్పడుతోందని కూడా చైనా ఆరోపిస్తోంది. దీనికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)