చైనా: 'పెళ్లి వయసు 18 ఏళ్లకు తగ్గించాలి... యువతను పిల్లల్ని కనేందుకు ఒత్తిడి చేయాలి'

చైనా, కమ్యూనిస్ట్‌ పార్టీ, వివాహ వయసు, సెలబ్రిటీలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చైనాలో స్త్రీ, పురుషుల వివాహ వయసును 18సంవత్సరాలకు తగ్గించాలనే ప్రతిపాదనలు వచ్చాయి
    • రచయిత, కెరీ అలెన్‌
    • హోదా, బీబీసీ మోనిటరింగ్‌

ఇటీవల చైనాలో జరిగిన అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశాలలో ప్రజల మానసిక ఆరోగ్యం, జెండర్ వహించే పాత్ర, సెలెబ్రిటీలులాంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

ప్రతి సంవత్సరం వారం రోజులపాటు జరిగే ఈ సమావేశాలలో దేశంలోని సామాజిక విధానాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రవేశపెడతారు.

ఇందులో సాధారణ అంశాలతోపాటు, వింత గొలిపే, వివాదాస్పద నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని దేశంలో తీవ్రమైన చర్చకు తెర లేపే అంశాలు కూడా చర్చకు వస్తుంటాయి.

చైనాలో ప్రభుత్వానికి సలహాలిచ్చే అత్యున్నత సంఘం సీపీపీసీసీ సమావేశం గత మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మహిళలు, పురుషులు ఎలా ఉండాలి, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటి అన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఆన్‌లైన్‌లో కూడా పెద్ద చర్చే జరిగింది.

యువతపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడం, దేశ విద్యా విధానంలో తీసుకు రావల్సిన మార్పులు, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆరోగ్య రంగానికి సంబంధించిన విధానాల గురించి ఈ సమావేశాల్లో ప్రతిపాదనలు వచ్చాయి.

చైనా వివాదాలు, కమ్యూనిస్టు పార్టీ. వివాహ వయసు, చైనా మహిళలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, చైనాలో విధాన నిర్ణయాల పై చర్చించేందుకు ప్రతి ఏడాది కొన్ని వేల మంది సమావేశమవుతారు.

సంప్రదాయ పాత్రల్లో మహిళలు

ప్రతి సంవత్సరం ఈ సమావేశాల్లో కొన్ని వేల ప్రతిపాదనలు వస్తాయి. కానీ, ఈ సంవత్సరం మహిళలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విధానాల ప్రస్తావనపై ఆన్‌లైన్‌లో తీవ్రమైన చర్చ జరిగింది.

చైనాలో స్త్రీ, పురుషుల వివాహ వయసును 18 సంవత్సరాలకు తగ్గించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. స్కూలు పాఠ్యాంశాలలో ప్రేమ, పెళ్ళికి సంబంధించిన అంశాలను చేర్చడం లాంటి ప్రతిపాదనల పట్ల చాలా మంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది అమ్మాయిలు స్కూల్ మానేసిన వెంటనే తొందరగా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనేలా ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలా ఉందని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

అలాగే, మెటర్నిటీ లీవ్‌ ( ప్రసూతి సెలవు) సమయాన్ని పొడిగించాలని, కుటుంబ నియంత్రణ విధానాల సడలింపు గురించి వచ్చిన ప్రతిపాదనలకు కూడా ఆన్‌లైన్‌లో వ్యతిరేకత ఎదురయింది.

అవివాహిత చైనీస్ మహిళలు ఇప్పటికే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వివక్షకు గురవుతున్నారని , అలాంటి ప్రతిపాదనలు విధానాలుగా మారితే అవి మహిళలను తిరిగి సంప్రదాయ పాత్రలోకి నెట్టేస్తాయని చాలా మంది భావిస్తున్నారు.

చైనాలో తగ్గిపోతున్న వివాహాలు, జననాల రేటు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. చైనాలో చాలా మంది అమ్మాయిలు వృత్తిపరంగా ఎదగాలని కోరుకుంటున్నారు.

కానీ, చైనాలో ఒకే బిడ్డ ఉండాలనే నిషేధ సమయంలో పుట్టిన వారిపై తల్లి తండ్రులిద్దరినీ చూసుకునే బాధ్యతతోపాటు పిల్లల్ని కనాలనే ఒత్తిడి కూడా పెంచుతున్నట్లుగా ఉందని ఎక్కువమంది వాదిస్తున్నారు.

అలీబాబా, చైనా, సెలబ్రిటీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెలబ్రిటీ అభిమాన సంఘాలపై కూడా ఈ సమావేశాలలో చర్చ జరిగింది.

లింగ వివక్ష ప్రతిపాదనలు

అబ్బాయిల కోసం ప్రత్యేక విద్యా విధానం ఉండాలంటూ ఈ సమావేశాలలో వచ్చిన ప్రతిపాదనలు వివాదాస్పదంగా మారాయి.

ప్రాథమిక పాఠశాలల్లో మహిళా టీచర్లు ఎక్కువగా ఉండటంతో ప్రైమరీ, సెకండరీ స్కూళ్లలో ఉండే పురుషులు, మహిళా టీచర్ల సంఖ్యలో మధ్య సమతుల్యతను తీసుకుని రావాలనే ప్రతిపాదనలు వచ్చాయి.

పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదన జెండర్ కి సంబంధించినది కానప్పటికీ విద్యార్థులకు వారి లైంగికత ఆధారంగా విద్యను ఇవ్వాలని కొంత మంది చట్ట సభ సభ్యులు ప్రతిపాదించారు.

అబ్బాయిలలో మగవాడి గుణాలను పెంచాలని, వారు పిరికిగా, మౌనంగా ఉంటున్నారని, మంచి మార్గదర్శకులుగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

లైంగిక దాడిపై అవగాహన పెంచేలా స్కూల్ పాఠ్యాంశాలను చేర్చాలనే ప్రతిపాదనకు చాలా వ్యతిరేకత ఎదురయింది.

ఈ ప్రతిపాదనకు కొంత మంది మద్దతు తెలిపినప్పటికీ కొంత మంది మాత్రం అమ్మాయిలను సంరక్షించే ఈ ప్రతిపాదన అబ్బాయిలను వేరు చేసి వారిని తప్పు చేసినవారిలా చూపిస్తుందని అభిప్రాయపడ్డారు.

అబ్బాయిలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు సరిపోవని కొంత మంది అభిప్రాయపడ్డారు.

ఇద్దరు మగవారు ఒకరి పై ఒకరు పరస్పరం చేసుకునే లైంగిక దాడులు చట్ట విరుద్ధమని చైనా 2015లో నిబంధనలు ప్రకటించింది.

చైనా, కమ్యూనిస్ట్‌ పార్టీ, వివాహ వయసు, సెలబ్రిటీలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రాథమిక పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదన చేశారు

యువతపై భారం

యువతపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి చేసే ప్రయత్నాల పట్ల చాలా మంది సానుకూలంగా స్పందించారు.

అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న వారికి డిస్కౌంట్లు ఇవ్వడం, చైనాలో అమలులో ఉన్న 996 వర్క్ సంస్కృతి పై పర్యవేక్షణ ఉండాలనే ప్రతిపాదనలకు ఆన్‌లైన్‌లో బాగా మద్దతు లభించింది.

అయితే, ఈ సమావేశంలో చాలాసార్లు అసాధారణమైన ప్రతిపాదనలపై జరిగిన చర్చకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది.

చైనాలో వివాదాస్పదమైన సోషల్ క్రెడిట్ విధాన వ్యవస్థలో జంతు సంక్షేమం గురించి అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జంతు హింసను అరికట్టేందుకు, పెంపుడు జంతువులను రోడ్ల పై వదిలేసిన వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి.

దీని చైనాలో ప్రముఖ సోషల్ మీడియా వేదిక వీబోలో చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనలకు ప్రశంసలు అందాయి.

ఇక సెలబ్రిటీల గురించి కూడా ఈ సమావేశాలలో చర్చకు వచ్చింది. మాదక ద్రవ్యాల కేసుల్లో ఉన్న సెలబ్రిటీలకు జీవిత కాలం నిషేధం విధించాలని వచ్చిన ప్రతిపాదనకు కూడా మద్దతు లభించింది.

చైనాలో సెలబ్రిటీ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీ అభిమాన సంస్థలు తమ కార్యకలాపాల గురించి పౌర నిర్వాహక శాఖలకు జవాబుదారీగా ఉండాలని వచ్చిన ప్రతిపాదన గురించి కూడా చర్చ నడిచింది.

స్టార్‌ల అభిమాన సంఘాలకున్న ప్రాముఖ్యత, ఎక్కువ మందిని ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నవి కాబట్టి వాటిని స్వచ్చంద సంస్థల జాబితాలో చేర్చాలని ఈ సమావేశానికి హాజరైన ఒక సభ్యుడు వాదించారు.

ఇవి కూడా చట్టాన్ని అనుసరించే తమ కార్యకలాపాలను చేపట్టాలని, వార్షిక తనిఖీలు జరగాలని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)