ఆంధ్రా యూనివర్సీటిలో 2,663 తాళపత్ర గ్రంథాలు.. వీటిలో ఏం రాసి ఉంది?

వీడియో క్యాప్షన్, ఆంధ్రా యూనివర్సీటిలో 2,663 తాళపత్ర గ్రంథాలు.. వీటిలో ఏముంది?

భారతదశంలో కథలు, కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇలా ఏదైనా పూర్వపు రోజుల్లో తాళపత్ర గ్రంథాలపైనే రాసేవారు. ఎంతో అపూర్వమైన విజ్ఞాన సంపద తాళపత్ర గ్రంథాల్లో ఉంది. అందుకే తాళపత్ర గ్రంథాలు భారతదేశానికి చెందిన విలువైన జాతీయ సంపదగా పేర్కొంటారు. అయితే ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు. దొరికిన వాటిలో కూడా చాలా శిధిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటిలో కూడా వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు తాళపత్ర గ్రంథా సంపదనంతా డిజిటలైజేషన్ చేస్తున్నారు.

1927 లో స్థాపించిన ఏయూ లైబ్రరీ పేరు డాక్టర్ వీఎస్ కృష్ణా లైబ్రరీ. దీనిలో 5 లక్షల 30 వేల వరకు ఎన్నో రంగాలకు సంబంధించిన పుస్తకాలున్నాయి.

వీటితో పాటు విలువైన, అరుదైన తాళపత్రగ్రంథాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రత్యేకమైన విభాగంలో భద్రపరుస్తున్నారు. వీటిని నిత్యం సంరక్షిస్తూ...పాడవకుండా అనేక చర్యలు చేపడుతున్నారు.

వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు దాదాపు 90 ఏళ్ల కిందటే ఏయూలో తాళపత్ర గ్రంథ విభాగం పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇందులో మొత్తం 2,663 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.

అప్పట్లో బొబ్బిలి సంస్థానం 220, విశాఖకు ఆర్ష గ్రంథాలయ ప్రతినిధి ఎంబార్‌ 1368, తుమ్మపాలకు చెందిన ఈమని వెంకటేశ్వర్లు 119, నందిపల్లికి చెందిన నిష్టల రమణయ్య 66, గవరవరానికి చెందిన అన్నపూర్ణయ్య 40 తాళపత్ర గ్రంథాలు ఏయూ లైబ్రెరీకి బహుకరించారని, వీటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి కొన్ని తాళపత్రగ్రంథాలను కొనుగోలు కూడా చేశామని ఏయూ అధికారులు తెలిపారు.

ఆంధ్రా యూనివర్సీటిలో తాళపత్ర గ్రంధాలు

ఇంత అపురూపమైన తాళపత్ర జ్ఞాన సంపదను చూసేందుకు ప్రత్యేక అనుమతితోనూ, ప్రదర్శన సమయాల్లో ఏయూ లైబ్రరీకి సందర్శకులు కూడా వస్తుంటారు.

''నేను జ్యోతిష్యశాస్ర్తం అధ్యయనం చేస్తుంటాను. దానికి సంబంధించిన కేరళ సంప్రదాయమైన జ్యోతిష్య గ్రంథం ఒకటి ఇక్కడ తాళపత్రాల్లో కనిపించింది. నాకు చాలా సంతోషం కలిగింది. అలాగే పరాశర మహర్షిచే చెప్పబడిన ధర్మశాస్ర గ్రంథం పరాశర ధర్మ స్మృతి ఒకటి ఉంది. తాళపత్ర గ్రంధాలలో రామాయణం, మహాభారతం, భాగవతం, కుహలాయనందం వంటి గ్రంథాలు ఉన్నాయి, చాలా అరుదైనటువంటి ఈ గ్రంథాలు ఇప్పుడు ఎక్కడా లభ్యమవడం లేదు. అటువంటి గ్రంథాలు ఇక్కడ ఉండం చాలా అదృష్టంగా భావించవచ్చు'' అని వి. లక్ష్మీ గణపతి శర్మ అనే సందర్శకుడు ఒకరు బీబీసీతో చెప్పారు.

ఏయూలో ఎంతో విలువైన, అరుదైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 17, 18 శతాబ్ధాలకు చెందిన అనేక సాహిత్య, శాస్త్ర విజ్ఞానం ఈ గ్రంథాల్లో ఉంది.

వీటిలో ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, వ్యాకరణం, అలంకారశాస్త్రం, ఆధ్యాత్మిక స్తోత్రాలు, వ్రత కథలు, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ...ఎన్నో తాళపత్రాల రూపంలో ఉన్నాయి.

వీటిని చూస్తున్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని స్వయంగా చూడటం ఆనందంగా కొందరు ఉందని చెప్పారు.

''నాటకాలు, సినిమాల్లో చూసిన ఈ తాళపత్రగ్రంథాలు, మొదటిసారి చూడటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళంలో ఉన్న గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తెలుగులో ఎందరో మహానీయులు రచించిన తాళపత్రాలు చూడటం చాలా ఆనందకరంగా ఉంది. ఇందులో జీవిత పాఠాలకు సంబంధించిన విషయాలతో పాటు రామాయణం, భారతం, భాగవతాల గురించి ఉన్నాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటివి ఇప్పుడు మనం వచ్చాయి అనుకున్నటి వంటివి మన పూర్వీకులు ఎప్పుడో వేల సంవత్సరాలు క్రితం తాళపత్రాల్లో రచించి పెట్టారు'' అని వల్లివేణి అనే విద్యార్థిని బీబీసీతో చెప్పారు.

కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులు, తోలు వస్తువులు, రాతి స్థంభాలుపై ఆ తర్వాత తాటిఆకులపై భారతీయ సాహిత్యం, సంగీత, చిత్రలేఖనం, విద్య, వైద్య, ఖగోళ శాస్త్ర విషయాలను లిఖించేవారు.

ఇలా వివిధ రూపాల్లో చేసిన రచనల ఏయూలో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో తాళపత్రాలనే ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం సంస్కృతం, తెలుగు, ఒరియా, తమిళం. కన్నడ, మరాఠీ, మళయాళం మొదలైన భాషలలో తాళపత్ర గ్రంథాలు లభిస్తున్నాయి. వీటిలో కొన్ని ఏయూలో ఉన్నాయి.

''పూర్వకాలంలో జంతువుల చర్మం మీద ముద్రణ చేసేవారు. దాని తర్వాత తాళపత్ర గ్రంథాలపై రాసేవారు. దాని తర్వాత వివిధ రాత పద్ధతులతో గ్రంథాలు రచించేవారు. బంగారు వన్నె అద్దిన పుస్తకాలను మొదటి సారి చూస్తున్నాను. ఇది అద్భుతం. చతుర్వేద బుక్స్ కూడా ఉన్నాయి. సంహితాలు, వేదాలు, పురాణాలు చూసి చాలా ఆనందిస్తున్నా'' అని సావిత్రి అనే ఉపాధ్యాయురాలు బీబీసీకి చెప్పారు.

తాళపత్రాల రూపంలో ఉన్న విలువైన గ్రంథాలను సరిగా భద్రపరచగలిగితే 500 నుంచి 600 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంచవచ్చునని ఏయూ లైబ్రెరీయన్ వెంకటేశ్వరావు చెప్పారు.

తొలి రోజుల్లో తాటి ఆకుల్ని పేడ, వేపాకురసంలో వేసి ఉడకబెట్టిన అనంతరం ఆకులను అందంగా కత్తిరించి రచనలకు వాడేవారని తెలిపారు. అటువంటి తాళపత్రాలు ఏయూలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని...ఇక్కడ దాదాపు ఏడు భాషాల్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని చెప్పారు.

ఈ తాళపత్రాలు శిధిలావస్థకు చేరకుండా రక్షించడానికి ప్రత్యేకంగా తాళపత్ర గ్రంథ విభాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తాళపత్రాలు మరింత కాలం భద్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. భావి తరాలకు వీటి గొప్పతనం తెలియజేయాలనే లక్ష్యంతో వీటిని డిజిటలైజేషన్ చేస్తున్నామని తెలిపారు.

‘‘మా వద్ద ఉన్న అన్ని తాళపత్రగ్రంధాలు డిజీటలీకరణ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. డిసెంబర్ ల్లో అది ప్రారంభమవుతుంది. దానికి అంతా రెడీ అవుతోంది. ఆ తాళపత్ర గ్రంధాలను, వాటికి సంబంధించిన కాటన్ బాక్సులలో, ఆ రోజుల్లో తయారు చేసినవాటిలో భద్రపరచడం జరిగింది. ఈ గ్రంధాలన్ని అలాగే లైబ్రరీలో ఉండకుండా...అందులో ఉన్న జ్ఞానాన్ని ఇతరులకి తెలియ చేయాలనే కాన్సెప్ట్‌తో...డిజిటలీకరణ స్టార్ట్ చేశాం. ధర్మశాస్త్రం, న్యాయశస్త్రం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, వ్యాకరణం, అలంకరణ శాస్త్రం, ఆధ్మాత్మిక సూత్రాలు, వ్రతకథలు.. ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కొన్ని శిధిలస్థితికి చేరడంతో...వాటిని ఎవరు రాశారన్న విషయం గుర్తించలేకపోయాం. మరిన్ని ఇలా పాడవకుండా ఉండానికి డిజిటైలేజేషన్ చేస్తున్నాం'' అని ఏయూ లైబ్రెరీయన్ ప్రొఫెసర్ పి. వెంకటేశ్వర్లు బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)