భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీర్థయాత్రలు.. సత్సంబంధాలకు కొత్త ప్రయత్నమా

2016లో కరాచీలోని ఆలయంలో పూజలు జరుపుతున్న హిందువులు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, ASIF HASSAN/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2016లో కరాచీలోని ఆలయంలో పూజలు జరుపుతున్న హిందువులు (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, వాత్సల్య రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి ఇరు దేశాల ప్రభుత్వాలూ సహకరిస్తున్నాయని కౌన్సిల్ పేర్కొంది.

తొలి ప్రయత్నంగా, నూతన సంవత్సరంలో భారత్, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన హిందూ యాత్రికులు పాకిస్తాన్‌లోని 100 సంవత్సరాల పురాతన శ్రీపరమహంస మహారాజ్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు జరిపించారు.

ఈ బృందంలో మొత్తం 173 మంది భక్తులు ఉన్నారు. వీరిలో అయిదారుగురు అమెరికన్లు ఉన్నారు. కొందరు స్పెయిన్ నుంచి, కొందరు దుబాయి నుంచి వచ్చారు. భారతదేశం నుంచి సుమారు 160 మంది ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌లో ఉన్న హిందూ, సిక్కు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.

ఇది ఒక కొత్త ఆలోచన అని, ఈ చొరవ వల్ల 74 సంవత్సరాల తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ రమేష్ కుమార్ వక్వానీ అన్నారు.

డాక్టర్ రమేష్ అక్కడి పార్లమెంటు సభ్యుడు. 2002 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

"ఇటీవల ప్రారంభమైన ఈ యాత్రలను ఒక ఆనవాయితీగా మార్చేందుకు నేను స్వయంగా భారతదేశానికి వచ్చి యాత్రికులను ఖ్వాజా నిజాముద్దీన్, అజ్మీర్ షరీఫ్‌ల దర్శనం చేయిస్తాను. ప్రతి నెలా ఇటువంటి మతపరమైన తీర్థయాత్రలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది రెండు దేశాల ప్రజలను మరింత దగ్గర చేస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని అంతం చేయడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

టెరీ గ్రామంలోని శ్రీ పరమహంస జీ మహారాజ్ ఆలయం
ఫొటో క్యాప్షన్, టెరీ గ్రామంలోని శ్రీ పరమహంస జీ మహారాజ్ ఆలయం

దీనికి ప్రభుత్వాలు అనుమతించాయా?

ఇది కేవలం పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ తీసుకుంటున్న చొరవేనా? లేక రెండు దేశాల ప్రభుత్వాలకూ ఇందులో పాత్ర ఉందా?

"మీరు దీనిని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ చొరవని అనొచ్చు. దీని కోసం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో కౌన్సిల్ జతకట్టింది. ఇప్పుడు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. రెండు దేశాల ప్రభుత్వాల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. రెండు ప్రభుత్వాలూ దీనికి సమ్మతి తెలిపాయి. అందుకే యాత్రికులకు వీసాలు మంజూరు చేస్తున్నారు. భద్రత కల్పిస్తున్నారు" అని డాక్టర్ రమేష్ చెప్పారు.

హిందూ యాత్రికుల బృందం సోమవారం పాకిస్తాన్ పార్లమెంటు స్పీకర్‌ ఆహ్వానం మేరకు ఆయన్ను కలవనుంది. అలాగే ప్రధాన న్యాయమూర్తిని కలుస్తుంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన మహాత్మా పరమ నిత్యానంద అనే భక్తుడు కూడా ఈ యాత్రికుల బృందంలో ఉన్నారు.

"మేం టెరీ సాహెబ్‌ను దర్శించుకుని తిరిగి వస్తున్నాం. మాకు ప్రతిచోటా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ మంచి ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడా సహకరిస్తున్నారు" అని ఆయన తెలిపారు.

ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లాలో టెరీ గ్రామంలో నిర్మించిన ఈ ఆలయాన్ని 2020 డిసెంబర్‌లో అతివాద ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన గుంపు ధ్వంసం చేసి తగలబెట్టింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

"పాకిస్తాన్ ప్రభుత్వం మాకు ఆసరాగా నిలిచింది. మందిరాన్ని పునర్నిర్మించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవతో ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాం. అందుకే టెరీ ఆలయం నుంచే తీర్థయాత్రలు ప్రారంభిస్తున్నాం" అని డాక్టర్ రమేష్ వివరించారు.

ఇక్కడ శ్రీ పరమహంస జీ మహారాజ్ సమాధి ఉంది
ఫొటో క్యాప్షన్, ఇక్కడ శ్రీ పరమహంస జీ మహారాజ్ సమాధి ఉంది

'తమ మతాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది"

గత ఏడాది దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ టెరీ ఆలయానికి విచ్చేశారు.

తమ మతాన్ని కాపాడుకునే హక్కు ప్రతి మనిషికీ ఉందని ఆయన అన్నారు.

అంతకుముందు 2017 ప్రారంభంలో, పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మియా సాకిబ్ నిసార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కటాసరాజ్ ఆలయం అధ్వాన్నమైన పరిస్థితిని సుమోటోగా స్వీకరించి విచారించింది.

కటాసరాజ్ ఆలయంలో రాముడు, శివుడు, హనుమంతుడు విగ్రహాలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది.

ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అక్కడ విగ్రహాలు లేకపోతే పాకిస్తాన్ హిందువుల గురించి వారేమనుకుంటారని కోర్టు నిలదీసింది.

ఇది సుమారు 100 సంవత్సరాల పురాతన ఆలయం. దీన్ని ధ్వంసం చేసిన సంఘటనను జస్టిస్ అహ్మద్ సుమోటాగా స్వీకరించి ఆలయ మరమ్మతులకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా, భారత, పాకిస్తాన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు దాదాపుగా నిలిచిపోయాయి.

ఇటీవలే ఇరు దేశాల ప్రభుత్వాలూ సిక్కు యాత్రికుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాయి. గత ఏడాది నవంబర్‌లో ఈ కారిడార్‌ను ప్రారంభించిన తర్వాత, అనేక మంది భారతీయ సిక్కులు గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా కర్తార్‌పూర్ కారిడార్ మూసివేశారు. దాదాపు 20 నెలల తరువాత మళ్లీ తెరిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)