అన్నవరం సత్యన్నారాయణ స్వామి దేవస్థానం ప్రసాదం కథ ఏమిటి? అంత రుచి ఎలా వస్తుంది?

వీడియో క్యాప్షన్, అన్నవరం ప్రసాదానికి ప్రత్యేకమైన రుచి ఎలా వస్తుంది, దీనిలో ఏమేం వేస్తారు?

సహజంగా ఆలయాల్లో ప్రసాదంగా పులిహార, దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం ఆలయం దానికి పూర్తిగా భిన్నం.

అన్నవరం పేరు చెప్పగానే అత్యధికులకు సత్యన్నారాయణ వ్రతాలు గుర్తుకొస్తాయి. ఆ తర్వాత కొత్త జంటలతో కళకళలాడే పెళ్లి మండపాలు కనిపిస్తాయి.

అవన్నీ ఎంత ఫేమస్ గా చెబుతారో అన్నవరం దేవస్థానం వారు విక్రయించే ప్రసాదం కూడా అంతే ప్రముఖంగా చెబుతుంటారు. ఆ ప్రసాదం రుచికోసం చాలామంది అర్రులు చాస్తుంటారు. దానిని ఆస్వాదించడానికి ప్రాధాన్యతనిస్తారు.

గోధుమ నూకతో తయారుచేసే అన్నవరం ప్రసాదం వెనుక అసలు కారణాలు మాత్రం అధికారులకు సైతం పూర్తి స్పష్టత లేదు.

అన్నవరం వీర వెంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానం గోధుమ నూక ప్రసాదం

సంప్రదాయంగా వస్తోంది, అందరికీ నచ్చుతోంది కాబట్టి ఈ ప్రసాదం కొనసాగిస్తున్నట్టు అన్నవరం దేవస్థానం పరిపాలనా అధికారి వేండ్ర త్రినాధరావు బీబీసీకి తెలిపారు.

అన్నవరం వీరవెంకట సత్యన్నారాయణ స్వామి దేవస్థానంలో రెండు రకాల ప్రసాదం ప్రధానంగా ఉంటుంది. అందులో అందరికీ తెలిసింది గోధుమ నూకతో చేసిన ప్రసాదం కాగా రెండోది బంగీ ప్రసాదం అని పిలుస్తారు. ఇది రవ్వతో చేసి వ్రతం ఆచరించే వారికి అందిస్తారు. అత్యధికులు మాత్రం గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరిస్తారు.

ఇటీవల ప్రసాదం కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రసాదం తయారీ యూనిట్ సామర్థ్యం పెంచారు. అంతా మ్యానువల్ పద్ధతిలో కాకుండా సెమీ ఆటోమేటిగ్ గా మార్చేశారు. దాని ఫలితంగా కొంత సులువుగా ప్రసాదం తయారీ సాగుతోందని వంట నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)