జుగాడ్ జీప్: 'లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్. ఆనంద్ మహీంద్రాకు దీన్ని ఇవ్వలేను.. కొత్తది తయారు చేసి ఇస్తా'

జుగాడ్ జీపుతో దత్తాత్రేయ

ఫొటో సోర్స్, SARFARAJ MUSASNADI

ఫొటో క్యాప్షన్, జుగాడ్ జీపుతో దత్తాత్రేయ
    • రచయిత, సర్ఫరాజ్ ముసా సనదీ
    • హోదా, బీబీసీ మరాఠీ, సంగ్లీ

దత్తాత్రేయ లోహర్, కొన్ని నెలల క్రితం జుగాడ్ జీపును తయారు చేశారు. తమ గ్రామంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తాను తయారు చేసిన జీపు గురించి చర్చ జరుగుతుందని అప్పుడు ఆయన అనుకోలేదు.

బైక్ తరహాలో కిక్ కొట్టడం ద్వారా ఆ జీపు నడుస్తోన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో చాలా మంది చూశారు.

ఈ వీడియో, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టికి కూడా వచ్చింది. డిసెంబర్ 21న తన ట్విట్టర్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా ఆ వాహనానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది.

ఆ జీపును తమకు ఇస్తే, ఎక్స్ఛేంజ్ కింద మహీంద్రా బొలెరో వాహనాన్ని ఇస్తానని దత్తాత్రేయకు ఆయన ఆఫర్ కూడా ఇచ్చారు.

అప్పటినుంచి దత్తాత్రేయ తయారు చేసిన జీపును చూడటానికి చాలా మంది దేవ్‌రాష్ట్రే గ్రామానికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో బీబీసీ మరాఠీ కూడా అక్కడికి వెళ్లి 'జుగాడ్ మ్యాన్' దత్తాత్రేయతో మాట్లాడింది.

వీడియో క్యాప్షన్, జుగాడ్ జీప్: దీనిని ఆనంద్ మహీంద్రాకు ఇవ్వలేం. కావాలంటే మరొకటి తయారు చేసిస్తాం

'ఈ జుగాడ్ జీపు స్ఫూర్తినిస్తుంది'

''నిజం చెప్పాలంటే, వాహనం తయారీలో పాటించే ఎలాంటి నియమాలు కూడా ఈ జీపులో లేవు. కానీ పట్టుదల, సృజనాత్మకత, తక్కువ వనరులతో ఎక్కువ ప్రయోజనాన్ని రాబట్టే వ్యక్తుల తెలివిని నేను ప్రశంసించకుండా ఉండలేను. ఇక జీపుకున్న ఫ్రంట్ గ్రిల్ గురించి అయితే చెప్పక్కర్లేదు'' అని మహీంద్రా ట్వీట్ చేశారు.

వీడియోలో కనిపిస్తోన్న జీపు ఫ్రంట్ గ్రిల్ సరిగ్గా 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ జీప్ మోడల్‌ను పోలి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరుసటి రోజు, డిసెంబర్ 22న ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. ''నిబంధనలకు లోబడి లేనందుకు స్థానిక అధికారులు, ఆ జీపును ఉపయోగించకుండా వారిని అడ్డుకుంటారు. కాబట్టి దాన్ని నాకు ఇస్తే, ప్రతిగా బొలెరో వాహనాన్ని వారికి ఇస్తాను. 'రీసోర్స్‌ఫుల్‌నెస్'.. అంటే తక్కువ వనరులను ఉపయోగించి ఎక్కువ సృష్టించడం. దీన్నుంచి స్ఫూర్తి పొందేందుకు, ఆ జీపును మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో భద్రంగా ఉంచుతాం'' అని ఆయన ట్వీట్ చేశారు.

జుగాడ్ జీపుతో దత్తాత్రేయ కుటుంబం

ఫొటో సోర్స్, SARFARAJ MUSASNADI

ఫొటో క్యాప్షన్, జుగాడ్ ఆవిష్కరణల్లో భారత్ చాంపియన్ అని ఆనంద్ మహీంద్ర గర్విస్తున్నారు

మా ఇంటి లక్ష్మీని ఎలా ఇవ్వాలి?

దేవ్‌రాష్ట్రే గ్రామం సంగ్లీ జిల్లా కడెగావ్ తాలూకాలో ఉంది. మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చౌహాన్ కూడా ఇదే గ్రామానికి చెందినవారు. యశ్వంత్‌రావు చౌహాన్ తమ గ్రామానికి చెందిన వారు కావడం దత్తాత్రేయ గర్వంగా భావిస్తారు.

మహీంద్రా ఇచ్చిన బొలెరో వాహనం ఆఫర్ గురించి దత్తాత్రేయను బీబీసీ అడిగింది.

ఆయన ఇచ్చిన ఆఫర్‌ను ఒప్పుకోవాలో లేక తిరస్కరించాలో అనే విషయంలో వారి కుటుంబం సందిగ్ధంలో పడింది.

''వారికి నా వాహనం నచ్చడం సంతోషంగా ఉంది. కానీ కొత్త కారును ఉపయోగించే పరిస్థితుల్లో నేను లేను. దానికి పన్నులు చెల్లించే స్థోమత నాకు లేదు'' అని దత్తాత్రేయ అన్నారు.

జుగాడ్ జీప్

ఫొటో సోర్స్, SARFARAJ MUSASNADI

దత్తాత్రేయ భార్య రాణి కూడా ఆ జీపు పట్ల మమకారం చూపించారు. ఆ వాహనమే తమ ఇంటి లక్ష్మీదేవి అని, దాన్ని ఎవరికీ ఇవ్వడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేశారు.

''ఆ జీపు వచ్చిన తర్వాత నుంచే మా జీవితాల్లో మంచి జరుగుతోంది. కావాలంటే వారికోసం మేం మరొకటి తయారు చేస్తాం. అప్పుడు సంతోషంగా కొత్త కారును మళ్లీ ఆఫర్ చేస్తే స్వీకరిస్తాం. కానీ ఈ జీపును మాత్రం ఎక్స్ఛేంజ్ కోసం ఇవ్వలేం'' అని ఆమె అన్నారు.

బైక్ ఇంజిన్, ఆటోరిక్షా టైర్లు

ఈ జుగాడ్ జీపు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

కమ్మరి పని చేసే కుటుంబంలో దత్తాత్రేయ జన్మించారు. వారి కుటుంబంలో వస్తువులు తయారు చేసే నైపుణ్యం ఉంది. అయితే దత్తాత్రేయ మాత్రం వారసత్వంగా వచ్చిన పనిని స్వీకరించలేదు. ఆయన ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా ఆయన విండ్‌మిల్ మెషీన్‌ను తయారు చేశారు.

వర్క్‌షాప్‌లో పోగైన తుక్కు పదార్థాలు, విడి భాగాలతో మూడేళ్లలో ఆయన ఈ జీపును తయారు చేశారు. ఇందులో బైక్‌ ఇంజిన్‌తో పాటు ఆటోరిక్షా టైర్లు, జీపు బానెట్‌ను ఉపయోగించినట్లు ఆయన చెప్పారు.

ఈ జుగాడ్ జీపు రోడ్డు మీదుగా వెళ్తుంటే లోపల కూర్చున్నవారు కూడా కనిపిస్తుంటారని, దాన్ని చూసి ఆశ్చర్యం కలుగుతోందని గ్రామస్థులు అంటున్నారు.

జుగాడ్ జీప్

ఫొటో సోర్స్, SARFARAJ MUSASNADI

జీపుకు మొత్తం 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అయిందని దత్తాత్రేయ చెప్పారు.

''నేను సంపాదించే దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఈ జీపును తయారు చేశాను. మా గ్రామంలోనే నాకు ఒక చిన్న వర్క్‌షాప్ ఉంది. నేను కలుపు తీయడం, సానబెట్టడం లాంటి పనులతో పాటు వెల్డింగ్ వర్క్ కూడా చేస్తాను. ఆ జీపుపైన ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావని అందరూ అడిగేవారు'' అని దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.

దత్తాత్రేయకు భార్యతో పాటు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ''మనందరం కూర్చొని వెళ్లడానికి ఒక వాహనం కావాలని నా కూతుర్లు అడిగారు. కానీ వాహనం కొనే స్థోమత లేదని నాకు తెలుసు. అందుకే నేనే జీపును తయారు చేస్తానని వారికి చెప్పాను'' అని దత్తాత్రేయ తెలిపారు. అందుకే తమ కుటుంబానికి సరిపోయే స్థాయిలో నానో జీపును తయారు చేశానని అన్నారు.

తన పిల్లల కోరికే అయినప్పటికీ, దాన్ని పూర్తి చేయడానికి దత్తాత్రేయ పట్టుదలను ప్రదర్శించారు.

జుగాడ్ జీప్ ఫీచర్లు

జీపుకు స్టార్టర్ లేదు కాబట్టి కిక్ కొడుతూ దాన్ని స్టార్ట్ చేయాలి. మరో విశేషమేంటంటే... దాని స్టీరింగ్‌ను వారి ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాప్‌లోనే అమర్చారు.

సాధారణంగా భారత్‌లో వాహనాలన్నింటికీ స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. కానీ దత్తాత్రేయ తయారు చేసిన జీపులో మాత్రం దాన్ని ఎడమ వైపుకు అమర్చారు. ఎందుకంటే దత్తాత్రేయ ఎడమ చేయి బలహీనంగా ఉండటంతో సులువుగా నడిపేందుకు వీలుగా తనకు అనువుగా జీపును డిజైన్ చేసుకున్నారు.

జుగాడ్ జీప్

ఫొటో సోర్స్, SARFARAJ MUSASNADI

మహీంద్రా జీపుతో పోల్చితే జుగాడ్ జీపు పరిమాణం చిన్నగా, ఆర్డినరీ రిక్షాలా ఉంటుంది. అందులో ఒకేసారి ఐదుగురు కూర్చోవచ్చు. అది జుగాడ్ జీపే అయినప్పటికీ, దాని వేగం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పెట్రోల్ కోసం 5 లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. లీటర్ పెట్రోల్‌కు 40 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తోంది. గంటకు 40 కి.మీ వేగంతో ఈ జీపు ప్రయాణిస్తుంది.

జీపుకు ఇంకా రంగులు వేయాల్సి ఉందని దత్తాత్రేయ చెప్పారు. గత మూడు నెలలుగా ఇంటి పనులు, కుటుంబం కోసం జీపును వాడుతున్నట్లు తెలిపారు.

జుగాడ్ జీపు కారణంగా ప్రతీరోజూ వందలాది ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దాన్ని చూసేందుకు చాలా మంది వస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొత్త కారు కంటే కూడా తమ భవిష్యత్ భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరముందని దత్తాత్రేయ, రాణి లోహర్ భావిస్తున్నారు.

కాగా, ఈ జీపులో ప్రయాణించేందుకు అవసరమైన అనుమతులు ఇప్పటి వరకు లేవు.

వీడియో క్యాప్షన్, 60, 70ల నాటి రోల్స్ రాయిస్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)