కల్వకుంట్ల హిమాన్షు బాడీషేమింగ్.. ‘అమిత్ షా గురించి, మోదీ కుటుంబం గురించి ఇలాగే మాట్లాడొచ్చా?’ - కేటీఆర్ ఆగ్రహం

ఫొటో సోర్స్, twitter/mkstalin
సోషల్ మీడియా సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందని, బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
''వాక్ స్వాతంత్రం ఉందని.. భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం సరికాదన్నారు.
తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కొన్ని సమయాల్లో తాను ప్రజాజీవితంలో ఉండడం సరైనదేనా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.
జర్నలిజం ముసుగులో అర్థం పర్థం లేని విషయాలు బయట పెట్టే చెత్త యూట్యూబ్ ఛానల్స్... పిల్లలను లాగడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీజేపీ నేతలకు నేర్పిన సంస్కారం ఇదేనా?.... రాజకీయాల్లోకి నా కుమారుడిని లాగడం, శరీరాకృతి గురించి వ్యాఖ్యలు చేయడం సరైనదేనా'' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాగే మోదీ, అమిత్ షా కుటుంబాలను లాగితే ఊరుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
'మిమ్మల్ని విమర్శించడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు, మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని మీకు తెలుసు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మనం చేయగలిగింది సున్నితంగా, బాధ్యతగా ఉండటమే' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
మంత్రి కేటీఆర్, కొడుకు హిమాన్షుపై ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారని, బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఎప్పటికీ ఈ మట్టి బిడ్డనే: సీజేఐ హోదాలో తొలిసారి సొంత ఊరికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ
''కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు.. దీనికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాను'.. అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నట్లు ‘ సాక్షి ’తెలిపింది.
''సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం ఆయన విచ్చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు.
పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆత్మీయ సత్కారం జరిగింది.
సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని అన్నారు.
గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానని చెప్పినట్లు'' సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ గుడ్ బై చెప్పినట్లు 'వెలుగు' తెలిపింది.
''1998 లో భారత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ 2016 మార్చిలో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి భారత జట్టులో స్థానం దక్కలేదు.
'నా ఇంటర్నేషనల్ క్రికెట్ వీడ్కోలు చెబుతున్నా.. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అద్భుతంగా ,చిరస్మరణీయంగా మారడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ' హర్భజన్ ట్వీట్ చేశాడు.
41 ఏళ్ల హర్భజన్ 103 టెస్టులు ఆడి 417 వికెట్లు, 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో25 వికెట్లు తీశాడు. మూడు ఫార్మట్లలో 3570 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై, కోల్‌కతా, చెన్నై తరపున ఆడి 150 వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, TELANGANA IPR/FB
ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులందరూ పాస్
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ ప్రకటించినట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.
'' విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 35 శాతం మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు.
బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు మార్కులు పెంచుకోవాలంటే త్వరలో నిర్వహించే సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చని చెప్పారు.
ఇలా పాస్ చేయడం ఈ ఒక్కసారికే పరిమితమని స్పష్టం చేశారు. ఇదే మొదటిసారి, చివరిసారి అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.
గత అక్టోబర్‌లో నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,59,242 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,24,012 మంది పాసయ్యారు. 2,25,230 మంది ఫెయిల్ అయ్యారు.
తాజా ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా 35 శాతం మార్కులతో పాస్ కానున్నట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?
- కోవిడ్ -19తో మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా... ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా?
- చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?
- శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








